Menu

మా సినిమాలు:బాపు- చివరి భాగం

’సీతమ్మ పెళ్ళి’ తర్వాత తీసిన ’బుల్లెట్’ తుస్సుమంది.

రేలంగి గారు చక్రపాణి దగ్గరకెళ్ళి “నాకెందుకు విజయాలో వేషం ఇవ్వలేదు? నేను రమణారెడ్డిలా కామెడీ విలన్ చెయ్యలేననా” అన్నారట. చక్రపాణిగారు – నువు చెయ్యగలవు గానీ జనం చూడద్దూ” అన్నారు. అలాగా – నువ్వు బులెట్టు బాగానే తీశావు – గానీ ఫలానా లాటి సినిమాలు మీనించి expect చేసే జనం చూడద్దూ!

’జాకీ’ రేసుల్లో సరిగ్గా పరిగెట్టలేదు.

బాలుగారి సంగీతం “అలా మండిపడకే జాబిలీ” గుర్తుందా!

“కళ్యాణ తాంబూలం” పండలేదు. కానీ ఊటీలో తీసిన కొన్ని దృశ్యాలు చూసి ఒక ఎన్నారై ఇవి ఏ దేశంలో తీశారు అని అడిగారు. బయట మేం చేసిన సినిమాల్లో హరికృష్ణ గారు అన్ని విధాలా గొప్ప నిర్మాత.

ఆ తరువాత ’పెళ్ళిపుస్తకం’. రావి కొండలరావు గారు మిస్సమ్మ కథ తిరగేసి ఇచ్చారు. నంది అవార్డే కాక జనం కూడా రివార్డిచ్చారు. చాలా గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ – కొత్తనటి దివ్యవాణి.

కొంతభాగం మా మిత్రులు NCL రాజుగారి తోటలో తీశాం. రమణగారు అక్కడ చక్రాలు లేని రైలుపెట్టి ఉండడం చూసి గుమ్మడిగారి పాత్రకి చక్కని సీను రాశారు. సినిమాలో “అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటరు” అన్న డైలాగు చాలా ఇష్టం.

ఆరుద్రగారి “శ్రీరస్తు శుభమస్తు” పాట షూటింగుకి మా ఆర్టువారు కళ్యాణమండపం అద్దె, డెకొరేషన్సు, జూనియర్సు, వార కాస్ట్యూమ్సు లెక్కేసి పొడుగాటి జాబితా తెచ్చారు. వద్దనుకుని ఓ తమాషా చేశాం. ఓ గదిలో నాలుగిటుకలూ పుల్లలూ, కాస్తమంట, ముగ్గులు, నాలుగు అరటి పిలకలు, నాలుగు మామిడి రెమ్మలు, ఓ కొబ్బరి బొండాం, మంగళ సూత్రం, పుపు కలిపిన బియ్యం ఓ పళ్ళెం, రెండు కర్రలకి పూలదండలు అమర్చుకుని Tight Close shots తో ఓ పూటలో పాట ముగించేశాం. హీరో హీరోయిన్లు తప్ప జూనియర్సు లేరు. అక్షింతల వేసన చేతులు కూడా మా యూనిట్ వాళ్లవే!

క్లైమాక్సు రాసుకుని రమణగారు పద్మాలయ స్టూడియోస్ లో పెద్ద ఫ్లోరు బుక్ చేశారు. వేరే షూటింగులో ఉన్న సమయంలో క్రాంతి కుమార్ గారు ‘’సీతారామయ్య గారి మనుమరాలు’ (What a picture!) కి రెండు నెలలు అదే ఫ్లోర్ అడిగారని తెలిసింది. పద్మాలయ హనుమంతరావుగారు “చూస్తే ఇది పెద్ద గిరాకీ – కానీ రమణ గారికి మాటిచ్చాశానే” అని ఇరకాటంలో పడ్డారని తెలిసింది. రమణగారు వెంటనే తనంతటతనే ఆ ఫ్లోరు అక్కరలేదని కబురు చేసి NCL రాజు గారి తోటలో చక్రాలు లేని రైలు పెట్టి కీ పాయింటుగా పెట్టుకుని ….అంతా తిరగరాసి షూటింగు పూర్తి చేశారు.

1992 లో యన్.టి.రామారావు గారు పిలిచి ‘లవకుశ ‘ తీద్దామన్నారు. ‘మీకు మీరే పోటీ అవుతారు. పైగా పుల్లయ్యగారి లవకుశని మించి తీయడం అసాధ్యం’ అన్నాము. శ్రీనాధకవి జీవితం తీయమన్నారు. “శ్రీనాధుడు దివ్యంగా భోగాలనుభవించి చివరి రోజుల్లో చితికిపోయాడు. తోటరాముడు రాజైతే జనం చూస్తారు గానీ వుల్టా అయితే రిస్కు కదా” అని రమణగారన్నా కూడా – యన్.టి.ఆర్. లాభనష్టాలు నాకక్కరలేదు. ఆ పాత్ర నటించాలనుంది అంతే అన్నారు. కొంచెం వయసు కనిపించినా అనితరసాధ్యంగా పోషించారు. ప్రీవ్యూ వేసినప్పుడు కవిత వాసన ఎరగని ఒక ఇల్లాలు “ఆ రోజులు అంత వైభవంగా వుండేవన్న మాట” అన్నారు. కానీ సినిమా రిలీజయితే బాగుందా లేదా అని చూడ్డానికి కూడా జనం రాలేదు. యన్.టి.ఆర్ గారికి మాత్రం నచ్చింది. కౌగిలించుకుని భిజం తట్టారు. “కమర్షియల్ గా …అంత బా…” అని నసిగితే “అది మనకనవసరం బ్రదర్” అన్నారు.

రాముణ్ణి నమ్ముకుంటే అందరికీ మంచే జరుగుతుంది. ఇరవై ఏళ్ళ క్రితం తీసిన ఆయన కథ “సంపూర్ణ రామాయణం” వట్టిపోని పాడి ఆవు. అయిదేళ్ళకోసారి అమ్మి లాభం పొందేవాళ్ళం. ఆ మధ్య మా పార్ట్నర్స్ లో ఒకరు మాకు చెప్పకుండా రామాయణం సినిమాని మరో అయిదేళ్ళకి అమ్మేసి జేబులో వేసుకున్నాడు. రమణగారు ఆయన్ని నిలేస్తే – “అవును. తిన్నాను. ఏం జేస్తావ్? కోర్టుకెడితే వెళ్ళు. సివిలు కేసు హియరింగు కొచ్చేసరికి నువ్వైనా వుండవు. నేనైనా వుండను. ఈ లోగా మరిన్ని మాట్లు అమ్ముకుంటాను” అని హామీ ఇచ్చారు. అంటే – రాముడు పాపం ఆయనకు అవసరమైన సొమ్ము జతపరిచాడు. మాకు కోర్టు వ్యవహారాల గురించి జ్ఞానమూ ప్రసాదించాడు.

1993లో నాకిష్టమయిన ‘మిస్టర్ పెళ్ళాం’ తీశాం. నా అభిమాన దర్శకుడు విశ్వనాథ గారు ” ఆ రాజేంద్రప్రసాద్ బాగా చేస్తాడండీ” అని మెచ్చుకున్న సినిమా. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. ఆమనికి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. నంది అవార్డుల ఫంక్షన్ కి వచ్చినపుడు గౌని మోద్రన్ హైర్ స్టైల్ లిప్ స్టిక్లతో వచ్చిన ఆమెని చూసి జ్యూరీలో ఒకరైన వాణిశ్రీ గారు  – నువ్వు తెలుగు ఇల్లాలిగా వేషం పండించావని అవార్డి ఇస్తే ఇదేం వేషం తల్లీ” అని మందలించింది.

దీంట్లో ముఖ్యాంశం స్త్రీని కూడా పురుషులు తమతో సమానంగా చూడాలి అని. చివర బుద్ధి తెచ్చుకుని మొగాళ్ళందరూ వంగి పెళ్లాల కాళ్ళు పట్టుకుని కళ్ళకద్దుకుని – లాగేస్తారు. శిష్యా – ఇది అనంతం అంటూ.

ఆ తరవాత ‘రాంబంటు’. జీతం కూడా దక్కలేదు.

దేవుడు మేలు చేసి ఇప్పటి దాకా లాస్టుది ‘రాధా గోపాళం’ . మొగుడూ పెళ్ళాం సమానం కానీ మొగుడు కాస్త ఎక్కువ సమానం అన్నది ఇతివృత్తం –  చాలా సరదా అయిన సినిమా. సరదాగా ఉండే శృంగారం ముగుడూ పెళ్ళాల మధ్యే అయినా పిల్లలున్న బ్రహ్మచారులు కొందరు కోప్పడ్డారు.
అవండీ 75 సంవత్సరాల తెలుగు చిత్ర యజ్ఞంలో మేము వ్రేల్చిన సమిధలు.

‘మేము ‘ అంటే …..

ఓ జమీందారీ గ్రామంలో ఓ రైతుకి ఒకే ఆవుండేదిట. నీదగ్గర పాడి ఎంత అని అడిగితే దొరగారివీ నావీ కలిపి వందా అనేవాట్ట. ‘మేమూ అంటే 99 ఆవులూ రమణ గారివి.

బాపు రమణ ల స్కెచ్-అన్వర్

బాపు రమణ ల స్కెచ్-అన్వర్

రమణ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ…నవతరంగం పాఠకులు, సభ్యులు మరియు రచయుతలు.

11 Comments
  1. pappu October 30, 2008 / Reply
  2. Sree October 30, 2008 / Reply
  3. Arvindrishi November 13, 2008 / Reply
  4. KRISHNA November 16, 2008 / Reply
  5. రానారె January 28, 2009 / Reply
  6. రానారె January 28, 2009 / Reply
  7. vinay April 14, 2009 / Reply
  8. Vasu November 7, 2009 / Reply
  9. Sandeep March 4, 2011 / Reply
  10. Bhanu Dvakar August 7, 2015 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *