Menu

మా సినిమాలు:బాపు- ఆరవ భాగం

నెక్స్ట్! ’రాజాధిరాజు’. తెల్లారకుండానే Bangalore palace కి బాబా నేనూ వెళ్ళిపోయేవాళ్లం. చెట్లలోంచి ఉదయసూర్య కిరణాలు వస్తూంటే షూట్ చెయ్యాలని మా అత్రుత. స్టాఫ్ గానీ నటులు గానీ ఎవరూ వచ్చేవారు కాదు. కానీ చివర రిజల్ట్ చక్కగా వచ్చింది. డెవిల్ గా నూతన్ ప్రసాద్ అద్భుతంగా పోషించారు. సుమలత మొదటి సినిమా. దాంట్లో నా అభిమాన డ్యాన్స్ మాస్టర్ సీనుగారు ఒక పాటచేస్తూ అమ్మాయిలను పడుకోబెట్టి ఒక మూమెంట్ ఇప్పించారు. లాంగ్ షాట్ లో చూస్తుంటే సముద్ర కెరటాలు ఊగుతున్నట్టుగా కనబడ్డాయి. ఇప్పటికీ మర్చిపోలేను. భక్తురాలిగా నటించిన శారదగారు తెల్లగౌనుతో సెట్ లోకి వస్తుంటే ఆకాశం నుంచి angel దిగివచ్చినంతగా వెలుగు నిండిపోయేది!

నిర్మాత అశక్తత కారణంగా టైటిల్స్ – నా వద్దనున్న old Christian Biblical paintings మీద superimpose చేయించి ’star wars’ theme music యధాతధంగా దింపేశాను. మన దేశంలో కాపీరైట్ కన్నా ’రైట్ టు కాపీ’ వుంది కనుక.

నా దగ్గరున్న Fantasy locations పుస్తకాలలోంచి నల్లగా ఉండే చోట్ల మాస్క్ చేసి – నూతన్ ప్రసాదూ, విజయచందరూ అక్కడ నడుస్తూన్నట్టు కెమెరామన్ లోక్ సింగ్ మాయాజాలం చేశాడు.

ఇండియన్ సినిమాలు విదేశీ ఫెస్టివల్స్ ఎంపిక చేసే జ్యూరీ చైర్మన్ శ్యాం బెనగల్ గారు, సినిమాని one of the very beautiful films I have seen అని మెచ్చుకున్నారు. కానీ సినిమా ఫెస్టివల్స్ కీ నోచుకోలేదు ప్రేక్షకులు చూడ్డానికీ నోచుకోలేదు. Dethroning of God by the Devil అనే కిరస్తానీ ఇతివృత్తం కనుక ఓ ప్రేక్షకుడన్నట్టు “వైరైటీ గా ఉందిరా –  కానీ అర్థమై చావలేదు”.

తరువాత ’వంశవృక్షం’. కన్నడ కవి బైరప్పగారి గొప్ప నవల. కానీ ప్రేక్షక మహాశయులు so what అన్నారు. హిందీ నటుడు అనిల్ కపూర్ మొదటి చిత్రం. జ్యోతి కుమారుడుగా కుర్రాడు కావలసి వచ్చాడు. షూటింగ్ చూడ్డానికి వచ్చిన గుంపులో ఓ పెద్ద కళ్ల కుర్రాడు కనిపించాడు. మధు అతని పేరు. అతని చేత ఆ వేషం వేయించాం. బాగా నప్పింది. సోమయాజులు గారు ఇహ చెప్పనక్కర్లేదు.

మావగారు సాంప్రదాయం, వంశగౌరవం నమ్మినవాడు. మొగుడు పోయిన కోడలు రోజూ లాంచీలో వెళ్ళి రాజమండ్రి కాలేజీలో చదువుకుంటుంది.తిరిగి వచ్చేటప్పుడు మావగారు మనవడితో లాంచీ రేవుకి వెళ్ళి ఇంటికి తీసుకు రావడం అలవాటు.

యవ్వనంలో ఉన్న కోడలు -ఓ నాడు తను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఉత్తరం రాసిపెట్టి కాలేజీకి వెళ్ళిపోతుంది.

సాయంత్రం మావగారు లాంచీరేవు వద్ద వేచివుంటాడు, పక్కన పనిమనిషి మనవణ్ణి ఎత్తుకుని లాంతరు పట్టుకుని ఉంటుంది. లాంచీలి వచ్చివెడతాయి. కోడలు రాదు. (విధవావివాహం) మళ్ళీ పెళ్లి చేసుకునుంటుందని పెద్దాయన్ ఖరారు చేసుకుంటాడు. ఆఖరి లాంచీ వెళ్ళిపోతుంది. మనవడు “తాతగారూ – అమ్మ రాలేదేం” అనడుగుతాడు. పెద్దాయన (సోమయాజులు గారు) “చీకటి పడింది కదమ్మా దారి తప్పివుంటుంది” అంటాడు. ఇది సినిమాలో ఇంటర్వెల్ కార్డు ముందు రమణగారి డైలాగు.

’రాధా కళ్యాణం’ తమిళ జీనియస్ భాగ్యరాజా చిత్రం రీమేక్. రాధిక లాంటి గొప్ప నటితో పనిచేసే అవకాశం కలిగింది. చాలాబాగా ఆడింది.

ఆపై ’త్యాగయ్య’. నలభై ఐదు పైగా స్వామి వారి కీర్తనల మకుటాల అధారంగా రమణగారు అద్భుతమైన సీన్లు కల్పించారు. కె.ఆర్.విజయ గారు త్యాగయ్య భార్యగా నటించింది. ఎంతో గొప్పగా నటిమ్చినా సోమయాజులుగారిని ప్రొటీన్ రిచ్ త్యాగయ్య అనేశారు జనం.

1982 లో పదిహేనేళ్ల తరువాత కృష్ణ గారితో పనిచేశా. ’కృష్ణావతారం’. శ్రీదేవిది చిన్న వేషం. మీతో పని చేసే అవకాశం రాకరాక వస్తే ఇదేమిటండీ అని బాధపడింది. కృష్ణగారిది గొప్ప sense of humour. మా డ్యాన్సు డైరెక్టరు సీనుగారితో “పాపం బాపుగారు సాక్షి తరువాత పదిహేనేళ్ళయింది కదా – నటనలో ఇంప్రూవ్ అయుంటానని అనుకుని రెండో టేక్ అడుగుతున్నాడు. ఏం మారలేదని హామీ ఇవ్వండి” అని పకపకానవ్వారట.

నేనేప్పుడు openings కి వెళ్ళను. భయం. దీనికి మాత్రం వెళ్ళా. సినిమాలో ఒక పాత్ర కష్ణగారిని ’ఒరే వెధవా’ అని తిడతాడు. హాలంతా గోలగోల చేసేసింది. అదీ కృష్ణగారి super stardom” సినిమా అవగానే ఒకాయన వచ్చి షేక్ హ్యాండిచ్చి ’congrats గొప్ ఫ్లాప్ తీశారు’ అని మెచ్చుకున్నాడు. కానీ సినిమా బాగా ఆడింది. లాభాలొచ్చాయి. చాలా అప్పులు తీర్చగలిగాము.

Cost పదిహేడు లక్షలు.

’ఏది ధర్మం ఏది న్యాయం’ ఇన్సాఫ్ కా తరాజూ అన్న హిందీ చిత్రానికి రీమేక్. కేసు ఓడిపోయింది.

లాభాల్లో చూస్తే తమిళ మహాకవి శ్రీ కణ్ణదాసన్ మా ఆఫీసుని పావనం చేశారు. కె.వి.మహదేవన్ గారు త్యాగయ్య కీర్తన ’వరదరాజ నిన్నే కోరి వచ్చితిరా’ వింటూ మురిసిపోయి అదే వరసలో ఓ పాట కట్టారు.

1982 లో అన్నపూర్ణ మధుసూధనరావుగారు – శ్రీ కె.వి, శ్రీ ఆదుర్తి పనిచేసిన అన్నపూర్ణ సంస్థ వారికి ఒక సినిమా చెయ్యమని పిలిచిన రోజు నాకు చాలా గొప్పరోజు. సినిమా ’పెళ్ళీడు పిల్లలు’. మహానుభావులు శ్రీశ్రీ, ఆత్రేయ, యం.యస్,విశ్వనాధన్ గార్లతో పనిచేసే అదృష్టం కలిగింది. మధుసూధనరావుగారు ఇచ్చిన సౌకర్యాలూ చూపిన ప్రేమా మరిచిపోలేను. ఎటొచ్చీ మాన్యులు శ్రీ ఆత్రేఉఅ శ్రీ యం.యస్.విశ్వనాధన్ – డైరెక్టరుగా నేను చిన్న సూచన యిస్తే గసురుకున్నారు. అదో చేదు జ్ఞాపకంగా మిగలిపోయింది. పూజ్యులు తిరుమల రామచంద్రగారు అంటూండేవారు “నువ్వెంత గొప్పవాడివైనా నీ మేలూ, కీడూ, నీ గొప్పా నీ మాటలపై ఆధారపడి వుంటుంది. కనుక ఎలాటి పొరబాటూ లేకండా ఎంతో ఆలోచించి మాట్లాడాలి”

సూర్యకాంతమ్మ గారి తరువాత అంతటి తెలుగుతనం మాటవరస కలిగిన రమాప్రభతో మొదటిసారి పని చేశాను.

1984 లో ఇద్దరు సినీ మహానుభావులతో పని చేశా –  ఇళయరాజా – చిరంజీవి. చిత్రం ’మంత్రిగారి వియ్యంకుడు’. చిరంజీవిగారు దీంట్లో ఫైట్లు కూడా డ్యాన్సులంత సొగసుగా చేశారు. అప్పుడప్పుడే వస్తున్న English song graphics వాడిన కొన్ని పాటల్ని ఇప్పటికీ ఆయన ప్రస్తావిస్తారు. ’ఎందరో మహానుభావులు’ శ్రీ రాగం కీర్తనలో స్వర ప్రస్తావన భాగాలతో ఇళయరాజా గారు మంచి పాట చేశారు – “దోస్తీ జబర్ దస్తీ”

నా అభిమాన దర్శకుడు మహేంద్రన్ తీసిన ’ముళ్లుం మలరుం’ అనే దానికి రీమేక్ ’సీతమ్మ పెళ్లి’. రజనీకాంత్ గారి వేషాన్ని మోహన్ బాబు గారు అంత అద్భుతంగానూ పోషించారు. నాలుగు రోజుల షూటింగు అయిన తరువాత ఆయనున్న హోటల్కి వెళ్లి “అయ్యా ఎంత గొప్పగా చేస్తున్నారంటే ప్రతీషాటుకీ మీ వద్దకొచ్చి చెప్పలేను. అందువల్ల మోహన్ బాబూ – పిక్చరంతటికీ ఇవే నా జోహార్లు” అని చెప్పాను. యస్.పి.బాలుగారి సంగీతం అంతకన్నా బావుంటుంది. కానీ జనం సీతమ్మ పెళ్ళికి రాలేదు. తమాషా ఏంటంటే ఇదే మిధున్ చక్రవర్తి పద్మినీ కొల్హాపురీతో హిందీలో ప్యారీ బెహనా అని తీస్తే పెద్ద హిట్టయింది. తన్వి అనే అమ్మాయి మొదటి చిత్రం. ఆమె old Hindi star ఉషాకిరణ్ కుమార్తె. సినిమా జరుగుతూంటే ఆమే మా కెమెరామన్ బాబా అజ్మీ మనసులిచ్చిపుచ్చుకున్నారు. అమ్మాయి వాళ్ళు మహారాష్ట్ర బ్రామ్మలు. తురకబ్బాయితో పెళ్లికొప్పుకోలే. మతం మార్చుకోమన్నారు. బాబా నాన్సెన్స్ అన్నాడు. బాబా తండ్రి మహాకవి కైఫీ ఆజ్మీ “నాయనా నీకు నిజంగా ఆ అమ్మాయు కావాలంటే వాళ్ళు కోరినట్టు పేరు మార్చుకో. మతం మారినంత మాత్రాన మనుషులు మారరు” అన్నారట.

–ఇంకా వుంది

5 Comments
  1. సుజాత October 18, 2008 /
  2. Phani Pradeep October 19, 2008 /