Menu

మా సినిమాలు:బాపు-ఐదో భాగం

తరువాత సినిమా స్నేహం. మా సినిమాలకి పాతికకి పైగా సంగీతం ఇచ్చిన కె.వి.మహదేవన్ గారికి ఈ సినిమాల్లో (ఆరుద్ర రచనలు) పాటలు, “పోనీరా పోనీరా! పోయింది పొల్లు మిగిలింది చాలు, సరే సరే ఓరన్నా” మహా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారి మొదటి చిత్రం.

ఒక పాత్రికేయుడు (పేరు కనుక్కోకపోవడం నా తప్పిదం) మా గురించి రాస్తూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అంటే “మేం తీసాం మొర్రో” అంటారు వాళ్లు అని అతి చమక్ గా రాశారు.

రాజమండ్రీ బొమ్మూరు వద్ద షూటింగ్ చేస్తున్నపుడు సగం రోజులు మబ్బు కమ్మేసి సన్ లైట్ వుండేది కాదు. ఇషానార్య మాత్రం శాటిన్ గుడ్డ రిఫ్లెక్టర్ గా వాడి ఝామ్మని షూటింగ్ జరిపేశాడు. సన్ లైట్ లేనందువల్ల షూటింగ్ ఆపేసిన మరో ఫిల్మ్ యూనిట్ మా లొకేషన్ కొచ్చి ఇషాన్ పనితనం ఆశ్చర్యంతో చూసేవారు.

ఔట్ డోర్ లొకేషన్స్ లో చెత్త చెదారం ఎక్కువై డ్రాబ్ గా కనిపిస్తుంటే చెక్కలు బద్దీలుగా కోయించి, తెల్ల పెయింట్ వేసిస్ దడిలా అటు ఇటూ వుంచితే అందంగా కనిపించేది.

రావు గోపాలరావుగారు హలంతో అన్న రమణగారి డైలాగు నాకు చాలా ఇష్టం. హలం విసుగ్గా “ఆబోతోడా – నీకూ నాకూ ఏట్రా సంబంధం” అంటే రావు గారు ’నీ మొగుడొదిలేశాడు నా పెల్లాం లేచిపోయింది అది సాల్దేటి” అంటాడు.

ప్రేక్షకులతో మాత్రం స్నేహం కుదరలేదు.

ఇహ మనవూరి పాండవులు. మాతృక పుట్టన్నగారి కన్నడ సినిమా అయినా రమణగారు కథనం బాగా మార్చి కృష్ణుడి పాత్ర ప్రవేశపెట్టారు. కృష్ణంరాజు గారు ఆ పాత్రకి అద్భుతంగా సరిపోయారు. ఇదే సినిమా “హం పాంచ్” పేరిట హిందీలో తీసినపుడు ఆ వేషం వేసిన సంజీవ్ కపూర్ అంతటివాడు “I can never replace that telugu boy with his smiling eyes” అనేవారు. ఆరుద్రగారి “సిత్రాలు సేయరా శివుడో శివుడా నువు మందేసి పాడరా నరుడా నరుడా” పాట గుర్తుందా?

నిర్మాత జయకృష్ణగారొచ్చి – “అర్జునుడి వేషానికి ఓ కుర్రాడొచ్చాడు చూడండి. మొగాడికి అంత పెద్ద కన్నుండదు” అన్నారు. ఆ వచ్చిన వాడు చిరంజీవి! పాండవులు ఆయన రెండో చిత్రం. తదుపరి గొప్ప మళయాళీ తార అయిన గీత మొదటి సినిమా.

మొదటి రోజు షూటింగులో బాలు మహేంద్ర గారు షాట్ కి పన్నెండు రిఫ్లెక్టర్స్ వరసగా పెట్టారు. నేను హడలిపోయాను. నిర్మాత జయకృష్ణ గారు నా మొహం చూసి బాలుగారి వద్దకెళ్ళి ’బాపు గారిది ఇషాన్ ఆర్య స్టైలు. కంగారు పడుతున్నాడు రిఫ్లెక్టర్స్ చూసి’ అనగానే మళ్ళీ ఆ సినిమాకు రెఫ్లెక్టర్ వాడలేదు.

రమణగారు లొకేషన్ చూసి మరీ స్క్రిప్ట్ రాస్తారు. రాజమండ్రి పరిసరాల్లో షూటింగు. కొండమీద కృష్ణుడి ఆలయం కింద క్షేత్రపాలకుడు శివుని గుడి. ఎదర నంది విగ్రహం. అది చూసి రావుగోపాలరావు గారితో వస్తున్న అల్లు రామలింగయ్య గారు (కన్నప్ప) “దొరగారూ ఈ విగ్రహం ఇక్కడటండీ! అమ్మమ్మా – తమ పెరట్లో ఉండాల్సింది కదండీ”

రావు: కన్నప్పా! మునగ చెట్టెంకిచ్చేస్తున్నావు పడితే నీ మీదే పడతాను. పచ్చడయిపోతావు.

అల్లు: అంతటి భాగ్యమా!

భాగ్యం తన మీ అంతటి వాడు పడడమా – చట్టి విరిగేట్టు దొరగారు పడడమా!

యస్.పి.బాలు గారి కంఠ తో కృష్ణంరాజుగారు పాడిన “పిచ్చి గాలి అరవకే” పాట గుర్తుందా? – ఒక్క గిటార్ మటుకే వాయిద్యం – (ఆరుద్ర గారి పాట మామ సంగీతం గుండె కదిలించి వేస్తాయి)

దుష్టుణ్ణి చంపితే అది వాడి హింసకు పరిష్కారం కాదు. వాడి కడుపున ఇంకో దుష్టుడు పుట్టుకొస్తాడు. హింసలు పడుతున్న ప్రజలంతా మేలుకుని ప్రతిఘటించడమే సరయిన మార్గం. ఇది అనంతం అన్నదే సినిమా థీమ్.

హీరో హీరోయిన్లు గానీ, ప్రేమ పాటలుగానీ, సో కాల్డ్ మషాలా లు గానీ లేకపోయినా ప్రేక్షకులు హర్షించారంటే కథ చెప్పిన తీరూ డైలాగులునూ.

ఇది హిందీలో ’హం పాంచ్’ పేరిట బోనీ కపూర్ తీశారు. పాటలు మాత్రం చేసిన లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, యస్.పి.బాలూ గారు చేసిన రీ-రికార్డింగ్ మహామెచ్చుకున్నారు.

మేకప్ లేకుండా వాణిశ్రీ గారు నటిమ్చిన చిత్రం ’గోరంత దీపం’ నాకూ రమణ గారికీ అత్యంత ఇష్టమయిన చిత్రం. The one and only వాణిశ్రీ గారు ఎన్నెన్ని చినచిన్న సొగసులూ nuances చూపించిందో! అయినా చెయికాలింది.

గోరంత దీపం మద్రాసు వద్ద ఎన్నూరులో సముద్రం back waters మీదే రైలు బ్రిడ్జి పక్కగా ఉన్న తోటలో తీసినా – మా సినిమాలన్నీ గోదారి మీదే తీసివున్నాం కాబట్టి పోదురూ అది గోదారే అన్నారు ప్రేక్షకులు.

ఇషానార్య Low key master! సూర్యరశ్మిలో శరీరం మీద చక్కని గులాబీ రంగు పూతపడేలా ఎక్స్పోజర్ ఇచ్చుకునేవాడు. అందువల్ల మేకప్ అవసరం లేదనేవాడు.

15 సెకండ్లు, అరనిమిషం వుండే కవితలు గజల్స్ టైపులో అక్కడక్కడ ప్రవేశ పెట్టాం. ఇది కొత్త ప్రయోగమే – పండలేదు గానీ.

కాస్ట్ 12 లక్షలు.

“తూర్పు వెళ్ళే రైలు” poet director భారతీ రాజా సినిమా రీమేక్. ఆ సినిమాలో ఇళయరాజాగారి సంగీతం అనుకరించకుండా యస్-పి.బాలు గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. కొత్తమ్మాయి జ్యోతి క్లోజ్ షాట్ కి కెమ్రా కొంచెం ఎత్తుగా వుంచి తలవంచి పైకి చూడమ్మా అంటే “అబ్బా – కళ్ళు నొప్పెడుతున్నాయండీ” అనేది. తెరమీద చూసి “బాగానే ఉందండీ” అని అప్రూవ్ చేసింది.

కొన్ని సీన్ల కోసం మూడు కంపార్టుమెంత్లు ఒక ఇంజను రెండు రోజులు అద్దెకి తీసుకుని ధవలేశ్వరం పక్క కడియం స్టేషన్ లో షూటింగ్ చేశాం. నడుస్తున్న రైలుపెట్టె వెనక జ్యోతి పరిగెడుతూ సుద్ద ముక్కతో ప్రేమలేఖ రాయాలి. ఆమె వెనకాలే ట్రాలీ మీద కెమెరాతో ఇషానార్య రైలు వేగం అందుకోలేక జ్యోతి తుళ్లి బోర్లపడింది. క్షణంలో ట్రాలీ ఆమె మీదనుంచి వెళ్ళిపోను. ఇషానార్య కాలు అడ్డం పెట్టి ట్రాలీ ఆపాడు. సడన్ గా ఆగినందువల్ల కిందపడి పచ్చడయిపోవలసిన కెమెరాని ఒడుపుగా పట్టుకుని ట్రాలీ మీంచి దూకేశాడు.

ఆ తరువాత కలియుగ రావణాసురుడు. ముందు ’ఒంటి తల రావణుడు’ అని పేరు పెడదామనుకున్నాం (అనగా ఒక తల అని) ప్రొడ్యూసరుగారు “ఒంటి తల – గుర్రం తల ఏవిటండీ” అన్నాడు. మాకా అర్థం అస్సలు తట్టలేదు. ఈ సినిమా చూడాలని జనానికీ తట్టలేదు.

నా అభిమాన తార శారదగారితో పనిచేయాలని 1967 సాక్షి సినిమానుంచి ప్రయత్నిస్తున్న ఆశ యిన్నాళ్ళకి నెరవేరింది.

దీనికి ముందర బాలూ మహేంద్ర గారు కెమెరా లోకేషన్ చింతపల్లి ఫోరెస్ట్. అనివార్య కారణాల వల్ల ఆయన వెళ్ళిపోతే బాబా ఆజ్మీ గారు వచ్చి పూర్తి చేశారు. బాలూ మహేంద్ర తీసిన రష్ చూసినపుడు బాబాతో ’ఏవయ్యా ఆయన తీసిన దృశ్యాలకీ అదే అడవిలో నువు తీసిన దృశ్యాలకీ ఇంత తేడా  వచ్చిందేవిటీ” అని అడిగితే – అతను “Balu Mahendra is the great Balu mahendra! I am only Baba Azmi” అన్నాడు. అదీ అతని సంస్కారం.

మరో పిట్ట కథ: శంకరాభరణం ఎనభై మూడో మాటూ చూడ్డానికి థియేటరుకెళ్లినపుడు ఇంటర్వెల్ లో ఇద్దరు కాన్వెంటు పాపలు పరుగున వచ్చి బుల్లి ముఖమల్ అట్టపుస్తకం ఇచ్చిఆటోగ్రాఫ్ అడిగారు. పెన్ను లేదమ్మా అన్నా. ఓ పాప బ్యాగ్ లోంచి కాంపస్ బాక్సు తీసి అందులోంచి పెన్సిలు తీసిచ్చింది. నేను సంతకం పెడుతూంటే చూసి “మీరు విశ్వనాథ్ గారు కారా” అనడిగింది. కాదమ్మా అన్నా. ఆటోగ్రాఫ్ పుస్తకం లాక్కుని ఫ్రెండుని “ఒసే – బాక్సులో లబ్బరుంటుంది – ఇలాతే” అంది.

ఔట్ డోర్ కెమెరా యూనిట్లు (యల్.వి.ప్రసాద్ గారి పెద్దబ్బాయి) ఆనంద్ బాబు గారి వద్దే తీసుకునే వాళ్ళం. మేమంటే ఆయనకు ఎంత ఇష్టమంటే – చివరగా వాళ్ళ ఆఫీసు నుంచి వచ్చే బిల్లులో రేట్లు కొట్టేసి తగ్గించేసేవారు. అందువల్ల మాకు తక్కువ బడ్జెట్ లో సినిమా తీస్తారన్న మంచి పేరొచ్చేది!

–ఇంకా వుంది

7 Comments
  1. చదువరి October 9, 2008 /
  2. శంకర్ October 9, 2008 /