Menu

మా సినిమాలు:బాపు-నాలుగో భాగం

ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు accident లో మరణించాడు. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చేశారు. “బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం” అన్నారు. సినిమా చివర కోతిగా ఆయన నటన పోలినది చాలా చాలా అరుదు.

సినిమాలో కోతి సప్లయి చేసిన వాడితో థామస్ అనే కుర్రాడు అసిస్టెంటుగా వచ్చాడు. కోతికి వేషం లేనపుడు అతను కెమెరా అసిస్టెంట్ల వెనక తిరిగి నానా ప్రశ్నలూ వేసేవాడు. సినిమా అవగానే ఇషానార్యతో బొంబాయి వెళ్ళిపోయాడు. మూడేళ్లలో ఇండిపెండెంట్ కెమరామాన్ అయిపోయాడు.

ఇషానార్య గొప్ప మనిషి కూడా. నేనెరిగిన చాలా పెద్ద కెమెరామాన్లు Exposure పెడుతున్నపుడూ అప్పుడూ అసిస్టెంట్లని దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఇషాన్ అలా కాదు. ప్రతీ అసిస్టెంటునీ తలోరకం పని స్వయంగా చేయమని పురమాయించేవాడు. తప్పులు దిద్దేవాడు. ఒప్పులు పొగిడేవాడు. Cinematographer’s Manual పుస్తకం చూపిస్తూ Exposures దగ్గరనించి అన్నీ వాళ్లకి నేర్పేవాడు. కెమెరామాన్ పని actual shooting సగమే! మిగతా సగం డెవలపింగ్ లాబొరేటరీలో – అనేవాడు.

యన్.టి.రామారావు గారు ముత్యాలముగ్గుని ఎంతమెచ్చుకున్నారో! ’అర్థరాత్రి ముహూర్తాలూ-కునుకుతూ కొబ్బరి చిప్పల్లో సిగరెట్ దులుపుతూ టీలు తాగుతూ పెళ్ళికొచ్చిన కుర్రాళ్ల పేకాటలూ….విరిగిన ఇటుక గోడల మధ్య పెరట్లో తెల్లటి పక్కమీద శోభనం – చూస్తే మా పాత రోజులు గుర్తుకొస్తున్నాయ్’ అన్నారు.

బాలనాగమ్మలో బాలవర్థిరాజులా చిన్న ఫైటు పెడితే రెండొందల రోజులాడుతుంది అని కూడా అన్నారు.

ఫైటు లేకుండా ముత్యాల ముగ్గు రోజు తక్కువ ఏడాదిపాటు ఆడింది.

Best regional film గా National award ఇచ్చారు. నేను ఢిల్లీ వెళ్లినపుడు award commitee జూరీ సభ్యుడొకరు ’Your own people are your enemies. When we decided to award your picture as the best picture, the telugu member vehemently argued against our decision saying – “the AP Govt has already given it an award – so another from the centre will be redundant”

ముత్యాలముగ్గు స్క్రిప్టు, రమణగారు ఒక పక్క finance arrange చేస్తూ ఒక పక్క ప్రొడక్షన్ చూసుకుంటూ మధ్యలో తీరిక దొరికినపుడు రాశారు! Cost of production పన్నెండున్నర లక్షలు. పావలా ఆరణాలు టికట్లున్న రోజుల్లో మొదటి రిలీజు ఇరవై నాలుగోవారానికి రెండు కోట్లు వసూలు చేసింది.

1976 లో మహనీయుడు చక్రపాణి గారికి అసిస్టెంట్గా చరిత్రాత్మకమైన విజయా సంస్థలో పనిచేసేఆదృష్టం కలిగింది. సినిమా “రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్”. సంభాషణలు పాలగుమ్మి పద్మరాజుగారు. లంచ్ అవర్ లో భోజనాలవగానే వారి కాలం నాటి కబుర్లు చెప్పేవారు. సంగీతం పెండ్యాల గారు. “ఆకాశపందిట్లో” పాట Fx కనుక మార్కస్ బార్ట్లే గారు తీశారు.

చక్రపాణి గారి legendary common sense కి ఉదాహరణలు.

ఓ రోజు షూటింగులో నా సహదర్శకుడు(దరిమిలా నిర్మాత) మురారి నా చెవిలో ఏదో చెబుతుంటే చక్రపాణిగారు -ఏవిటని అడిగారు. సీన్లో హీరో కృష్ణగారి వెనక మేడమెట్లున్నాయి. వాటికున్న బానిష్టర్ల మధ్య చిన్నచిన్న గంటల్లో – రెండు మూడు లేవని మురారి అంటున్నాడు అన్నా. చక్రపాణిగారు “సర్లే! అయి జూత్తే నీ హీరోని చూసినట్టే” అన్నారు. అంటే నీ కథనంలో బిగువు లేకపోతే అలాటి అనవసర విషయాలపై దృష్టిపోతుందని.

“మునుపు సింగిల్ ప్రొజెక్టర్లుండేవి. రీలు మార్చినప్పుడల్లా లైట్లేసేవారు. జనం ఒంటేలుకి కాఫీ సిగరెట్లకీ వెళ్లేవారు. డబల్ ప్రొజెక్టర్లొచ్చి తరవాత ఎలా? పాటలు పెట్తారు, పాటరాగానే లేచి ఒంటేలుకీ సిగరెట్లకీ వెళ్లేందుకు వీలుగా” అనేవారు.

“నాగేశ్వర్రావూ జమునా వుంటే చివరకి వాళ్లేలాగా పెళ్లి చేసుకుంటారని జనానికి తెలుసు. అందుకని – ఈడు ప్రేమగా చూడ్డం – అది సిగ్గుపడి రెప్పలాడించడం ఇయన్నీ వద్దు ఓ పాట పెట్టెయ్. హాయిగా జనం బైటకెళ్లొస్తారు. త్వరగా కథకొచ్చెయ్ ఎంత మాత్రమూ విసిగించవద్దు అనేవారు.

“ఓ పాత్ర గయ్యాళి అంటే సూర్యకాంతమ్మని పెట్టెయ్. మళ్లీ పాత్ర స్వభావం అదీ ఎస్టాబ్లిష్ చెయ్యడం ఫుటేజీ వేస్టు!”

ఒక రోజు ఒక స్టారు “బాపుగారూ – స్క్రిప్టోమాటిలా ఇవ్వండీ” అన్నాడు. చక్రపాణిగారు విని ఇవ్వకు బాపూ – ఆడు చదివాడంటే పాత్రలో దూరి కశ్మలం చేసేస్తాడు. ఇదిగో నువ్వు ఏ షాటు కా షాటు బాపు ఏం చెప్పమంటాడో అజ్జెప్పు చాలు” అన్నారు. వారికి తన సినిమా ఎంత శ్రద్ధంటే ఓ మారు “బాపూ షాటు తీశెయ్. బాత్ రూంకి వెళ్లొస్తా” అని వెళ్లొచ్చారు.

“షాట్ తీసేశావా?”

“తీశాసార్”

“ఏం నేనొచ్చేదాకా ఆగలేవా”

తరువాత భక్త కన్నప్ప. సత్యంగారు సంగీతం. మధ్యమావతి అనే అందమైన రాగాన్ని థీమ్ గా తీసుకుని రీరికార్డింగ్ అద్భుతంగా చేశారు – సీనూ మూడ్ లకి తగినట్లుగా అదే రాగం రకరకాల వాయిద్యాలు మారుస్తూ చేశారు. రీరికార్డింగ్ కి ప్రసాద్ స్టూడియో రామనాధన్ గారికి నేషనల్ అవార్డు ఇచ్చారు.

వాణిశ్రీ గారితో పని చెయ్యడం ప్రథమం. మొదటి రోజు షూటింగు మధ్యమావతిలో – “ఆకాశం దించాలా” అన్నపాట – దించాలా అనగానే చిన్న మ్యూజిక్ బిట్ లో నడుం చమక్ మని వంచింది. ముగ్ధుణ్ణయిపోయా.

ఊటీలో ఒక హిందీ సినిమా ఔట్ డోర్ షూటింగ్ చేస్తున్నా. లోకేషన్ చూడ్డానికి తమిళ సినిమాని గొప్ప మలుపు తిప్పిన దిగ్దర్శుకుడు శ్రీధర్ గారు అటెడుతూ – కనుక్కుని – నా దగ్గరకొచ్చి ’మీ భక్త కన్నప్ప చూశానండీ – చాలా బావుంది’ అని మెచ్చుకున్నారు. ఆ రోజంతా నేలకి రెండంగుళాల ఎత్తులో నడిచా.

తరువాత సీతా కళ్యాణం. సంగీత రూపకంలా తీశాము. ఆంధ్ర ప్రేక్షకులు వద్దన్నారు గానీ లండన్ మరియు చికాగో చలనచిత్రోత్సవాల్లో చూపించారు. రాముడి కండువాపట్టుకుని ప్రధమంగా విదేశాలకి నేనూ వెళ్లాను. మన పౌరాణిక ఆహార్యం, ఆభరణాలూ నటీనటుల అందం ఫోటోల్లో చూసి ఒక ఆటకి టికెట్లన్నీ అమ్ముడయిపోయాయి. ఒక ఇండియన్ ఎంట్రీ టైముకి రాకపోతే ఆ ఖాళీలో పబ్లిక్ డిమాండ్ మీద రెండోమారు సీతాకళ్యాణమే వేశారు. విదేశాల్లో చూపించతగ్గ ట్రిక్ వర్క్ స్టాండర్డ్ లేకపోయినా చాలామందిని ఆలరించింది. థియేటర్ వద్ద నించున్న నా వద్దకు ఒకావిడ వచ్చి ఇంగ్లాండ్ మ్యాప్ చూపుతూ వేలు పై భాగంలో వుంచి-“I came all the way from here to see your film” అంది.

రవికాంత్ నగాయిచ్ గారు కెమెరాలో చేసిన మాయాజాలం అనితరసాధ్యం. గంగ ఆకాశం నించి శివుని తలమీదపడే దృశ్యం బోర్డు మీద రాసే చాక్ పొడిని పైనించి బస్తాలతో పోయించి స్లో మోషన్ లో తీశారు. నిజమైన జలపాతం లాగే వుంది!

మనవాళ్ల ప్రశంసలు:- పాటలు ప్రధానంగా వస్తూంటాయి. వెనక పాత్రలు మాట్లాడుతున్నా పెదాలు కదులుతూ వుంటాయి గానీ డైలాగులు వినిపించవు. మా వూరు నరసాపురంలో ప్రేక్షకులు ’సౌండు సౌండు’ అని అరిచారట. సత్యజిత్ రాయ్ గారు ఢిల్లీలో చూసి బావుందీ లేదూ చెప్పలేదు కాని క్లుప్తంగా రెండే పాయింట్లు చెప్పారు. “The carpet on which sita sat is arabic design. There were no crotons in those times.” సీతమ్మ వారు పాటపాడిన తోటలో ఓ ప్రక్క క్రోటను మొక్కలు కనిపించాయి ఆయనకి. అంత “నిశ్శితంగా” చూశారాయన. ఆయన్ని కలుసుకున్నప్పుడు ఆయనతో కలిసి తీయించుకున్న ఫోటోకి “The long and short of Indian cinema” అని పేరెట్టాను.

అవార్డ్స్ ఫంక్షన్స్ కి ఢిల్లీ వెళ్లినపుడు మరో తమిళ దిగ్దర్శ్సకుడు కె.బాలచందర్ గారు భుజం మీద చెయ్యివేసి, “నేను గుడికెళ్లను. పూజలు చెయ్యను. నాస్తికుణ్ణనే చెప్పాలి. కానీ మీ సీతా కళ్యాణం చూసిన తర్వాత వారం రోజులు అవే దృశ్యాలు కళ్లకి కనిపిస్తూనే ఉన్నాయి” అని మెచ్చుకున్నారు.

కాస్ట్ పధ్నాలుగు లక్షలు.

-ఇంకా వుంది

7 Comments
  1. vijaya kranthi October 3, 2008 /
  2. Srinivas October 4, 2008 /
  3. చదువరి October 10, 2008 /
  4. సూర్య October 26, 2008 /
  5. Venkat April 25, 2009 /