Menu

మా సినిమాలు:బాపు-మూడవ భాగం

సంపూర్ణ రామాయణం తరువాత అక్కినేని గారితో అందాలరాముడు తీశాము. గోదారి మీద ఒక సాదా లాంచీ, ఒక గొప్పవాడి లగ్జరీ లాంచీ కలిపి లాగే ఒక మోటారు బోటు. భద్రాచల ప్రయాణం- పంటు అనబడే ఒక పెద్ద చెక్క ప్లాట్‍ఫాం మీద, మా ఫ్రెండు సీతారాముడు ఆ లగ్జరీ లాంచి కట్టాడు.

డబ్బుని నమ్మిన ధనవంతుడికీ అప్యాయత, సంఘీభావం కలిగిన మధ్య తరగతి కటుంబాలకీ సంఘర్షణ. బస్సుల్లో ఎక్కినపుడు హోటల్లో మెక్కినప్పుడు ఈ కులాలూ మతాలూ మడీ ఏవయ్యాయి! పుట్టెడు డబ్బు పట్టెడన్నం కొనలేదు అనే విషయాలు సరదాగా చెప్పే క్లాసిక్.

గిద్దెడు పాల కోసం డీలక్సు బోటు ఎక్కిన కుర్రాణ్ణి విలన్ నాగభూషణం గారు గోదాట్లోకి తోసేస్తాడు. అక్కినేని గారు గోదాట్లో దూకి రక్షిస్తారు. కుర్రాణ్ణి పట్టుకొని పంటు వద్దకు ఈదుకు రావాలి. పంటు పదిహేనడుగుల దూరంలో ఉందిగానీ వడి హెచ్చినందువల్ల ఇంకా దూరమైంది. అక్కినేని గారికి దమ్మయిపోయింది. లాంచీ ఇంజన్లు ఆపేసినా ఆయన నలభై అడుగులు పైగా ఈదాల్సి వచ్చింది. ఎలాగైతేనేం ఆయన దగ్గరకు వచ్చి పంటు పైకి ఎగబాకగానే సిబ్బంది పైకి లాగేశారు. ఈదడంలో దమ్ము అయిపోయినా కెమెరా ఆపేదాకా ఎక్కడా శ్రమ గానీ ఆయాసంగానీ కనబడనీయలేదు. అదీ ఆయన కార్యదీక్ష! తరవాత చెకప్ చేయించుకోగా స్వల్పంగా హార్టు ట్రబుల్ ఉందని గ్రహించారు.

చిన్న పిట్టకథ. చమటలు పట్టిన పెద్దాయన్ని డాక్టరు చెక్ చేసి, “కంగారు లేదు. మైల్డ్ హార్ట్ అటాక్,” అన్నారట. పెద్దాయన, “మైల్డ్ హార్టటాక్ ఏమిటయ్యా స్లయిట్లీ ప్రెగ్నెంట్ లాగ,” అన్నారట.

ఆ సమయంలో కరెంటు కోత వలన స్టూడియోలలో నెలకి పదిరోజులకే కరెంటు సరిపోయేది. హీరో ఉండే ఇళ్ళ కాలనీ ఇండోరు సెట్టు! అక్కినేనిగారు 20 రోజులు కాల్ షీట్లు ఇచ్చారు. అపుడు మద్రాసు శోభనాచల స్టూడియో వెనక ఖాలీస్థలంలో కళ భాస్కరరాజు గారు మధ్యతరగతి ఇళ్ళ పంచవటి కాలనీ ఔట్ డోర్ సెట్ అద్భుతంగా వేశారు. జనరేటర్ల సహాయంతో సన్‍లైట్ తో మ్యాచ్ అయ్యే ARC and BRUTE లైట్లు తెప్పించారు కెమెరా వి.ఆర్.స్వామిగారు. ఆ లొకేషన్ లో అన్ని సీన్లూ, అబ్బోసి చిన్నమ్మా…,ఎదగడానికెందుకురా తొందరా….అన్న ఆరుద్ర గారి రెండు పాటలు, అక్కినేని గారి విలువైన కాల్షీట్లు వృధా కాకుండా పూర్తి చేసేశాము.

ఇండోర్ సీన్లు ARC and BRUTE తో ఔట్‍డోర్ లో తీసేస్తున్నారష అనే సంచలనం కలిగి ప్రొడ్యూసర్లు షూటింగు చూడ్డానికి వచ్చారు.

గోదాి గట్టున పాపికొండల ఇవతల దేవీపట్నం వద్ద అన్ని వందలమందికీ కరెంటుతో సహా అన్ని సౌకర్యాలతోటీ గుడిసెల కాంప్ కట్టించారు రమణగారు. అక్కినేని గారు కూడా మాతోపాటే కామన్ డైనింగ్ గుడిసెలో భోంచేసేవారు. సినిమాల నూతన్ ప్రసాద్ ని పరిచయం చేశాం. ఖర్చు పధ్నాలుగు లక్షలు.

ఫస్ట్ రిలీజ్ నిరాశ కలిగించినా రెండో రిలీజ్ నుంచి హౌస్‍ఫుల్స్ తో ఆడింది.

నాకు బడే గులాం ఆలీఖాన్, మహదీ హసన్ల పాటలు మహా ఇష్టం. సినిమాలో మధ్యతరగతి వాళ్ళుండే పంచవటి కాలనీలోకి హీరోయిన్ వస్తుంది. సమయం మధ్యాహ్నం. కాలనీ టాప్ యాంగిల్ లాంగ్ షాట్- దూరంగా రేడియో సంగీతం వినబడుతూ ఉంటుంది. ఏవిటో తెలుసా, పైన చెప్పిన ఇద్దరు గంధర్వుల పాటలు.

రమణ గారు స్క్రిప్ట్ ఇచ్చిన తరువాత చిన్నచిన్న బొమ్మలతో స్టోరీ బోర్డ్ షాట్ డివిజన్ తో చేసుకుని నంబర్లేసుకుని మొత్తం స్క్రిప్ట్ మరలా రాసుకుంటాను. ఈ హోమ్‍వర్క్ వల్ల (సెట్ లో అవసరం కొద్దీ చిన్న మార్పులు తప్పితే) చాలా సులువవుతాయి. అసిస్టెంటు డైరెక్టరుకి ఓ కాపీ ఇస్తా. ఒకప్పుడు స్టార్ కాంబినేషన్ జరక్కపోతే అవైలబుల్ స్టార్స్ తో సోలో వర్క్ జరుపుకోవచ్చు. హిందీ సినిమా ప్రేమ్ ప్రతిజ్ఞకి కాల్షీట్ ట్రబుల్ వచ్చి ఒకే సెట్ బొంబాయిలోనూ, ఊటీలో రెండు మార్లూ వేశారు. షాట్ నెంబర్లన్నీ ఉన్నాయి. కనుక ఇబ్బంది లేకుండా సీన్ పూర్తి చేశాం. షూటింగ్ తరువాత ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ చివర అన్నీ మిక్సింగ్ దాకా నేను స్వయంగా చూసుకొనే అలవాటు. అనేక ట్రాక్స్ లేని రోజుల్లో నా కలెక్షన్ లోని సౌండ్ ఎఫెక్ట్స్ ఆడియో కాసెట్ లోంచి డైరెక్ట్ గా మాగ్నెటిక్ ఫిల్మ్ లోకి మిక్స్ చేసకొనేవాడిని. మిక్సింగ్ అయిపోయిన తరువాత మొత్తం సౌండ్ ట్రాక్ ఆడియో కాసెట్లోకి ఎక్కించుకొనేవాడిని.

తదుపరి శ్రీరామాంజనేయ యుద్ధం. ప్రొడ్యూసరుగారి ఆజ్ఞలననుసరించి నాటక ఫక్కీలో, పద్యాలతో దోస్తీ హిందీ సినిమా పాతల వరసలతో సాగుతుంది.

1975 లో ముత్యాల ముగ్గు వేశాం.రద్దీగా ఉండే వీధుల్లోనూ అక్కడా షూటింగ్ చేస్తే జనమంతా ఆగి కెమెరాని చూస్తూ ఉంటారు. లైట్లు లేకుండా, కెమెరా కనబడకుండా మేకప్పులు లేని నటుల్ని ముందే రిహార్సు చేయించి జనంలోకి వదిలేస్తే తీసే సాహసికుడైన కెమెరామన్ కావాలి. కొన్ని కొకాకోలా యాడ్ ఫిల్మ్ చూశా. ఎవు తీశారా అని కనుక్కుంటే ఇషాన్ ఆర్య అని తెలిసింది. అందాల రాముడికి అతన్ని పిలిపిద్దామా అంటే- గొప్ప ఇమేజ్ ఉన్ సూపర్ స్టార్ అక్కినేని గారి వద్ద ఎక్స్పెరిమెంట్స్ తగని రమణగారు మందలించారు.

ఆ మధ్యే గరంహవా అనే హిందీ సినిమా నేషనల్ అవార్డు పొందినది విడుదలైంది. దానికి కెమెరా ఇషాన్ ఆర్య. ముత్యాల ముగ్గు లో స్టార్లు లేరుకదా ఇషాన్ ని రప్పిద్దామా అని ఆడిగా.రమణగారు సరేనన్నారు.

ముత్యాలముగ్గు కెమెరామెన్ గా ఇషాన్ ఆర్యకు ఆలిండియా బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు ఇచ్చారు. ఔట్ డోర్ లో అండులోనూ మేకప్పులు లేని నటుల మొహాలు మాడ్చేసే రిఫ్లెక్టర్స్ అస్సలు వాడేవాడు కాదు. అతని రిఫ్లెక్టర్ తెల్లటి సిల్కు గుడ్డ. మొదటి రోజు క్లోజ్ షాట్ పెట్టినప్పుడు ఇది చూసి రావుగోపాలరావు గారు, ’నవాబు గారు మెత్తటి సిలుకుగుడ్డే వాడతారా! మాకు ఆ తగరం మొహం మాడిస్తే గానీ ఆనదు మరి,’ అన్నారు నవ్వుతూ.

తెలుగు చలనచిత్ర చరిత్రలో ముత్యాలముగ్గు సినిమా, రావుగోపాలరావు గారి పాత్ర, డైలాగులూ మైలురాళ్ళు. ఆ డైలాగులు షోలే సినిమా గబ్బర్ సింగ్ డైలాగు రికార్డులకి ధీటుగా అమ్మాయి. ముత్యాల ముగ్గు డైలాగులు ఎన్ని సినిమాలు అనుకరించాయో మీకు తెలుసు. ఒకాయన కనిపించి, “నిన్న భోయనాల దగ్గర మావాడు ఆవకాయ కలుపుకొని, ’నాన్నా చూడు కంచంలో మడ్డరు జరిగినట్టు లేదూ,’ అన్నాడండోయ్,” అన్నాడు. గోపాలరావుగారితో, ’కామెడీ యాక్సను మాత్రం చెయ్యద్దండి. కాంట్రాక్టులు దుష్టమైనవి అయినా అది మీ వృత్తి. కామెడీ డైలాగుల్లో ఉంటుంది. మీరు మాత్రం చాలా సీరియస్ గా ఉండాలి,’ అని జాగర్తపడ్డాం.

రావుగోపాలరావుగారి ఇల్లుగా సారథీ స్టూడియోలో ఒక సెట్టు ఎన్నుకున్నాం. రేపు షూటింగనగా ఇవాళ-వారు వీల్లేదన్నారు. ఆ దిగులుతో రాక్ కాజిల్ అనే హోటల్ (బండల మధ్య మలచిన బిల్డింగు) టెర్రస్ మీదకెళ్ళి బీరు ఆర్డరు చేశాం. ఆ పరిసరాలు చూసి, అరె ఇదే బ్రహ్మాండంగా ఉందే అనుకుని వెంటనే కిందకెళ్ళి ప్రొప్రైటరుతో మాట్లాడి మర్నాటినుంచి షూటింగు మొదలెట్టాం. అద్దె ఎంతంటే, మా హోటల్లో కొన్ని రూమ్స్ తీసుకోండి ఉండేందుకు-మీరు వాడుతున్న అగరొత్తు బ్రాండు పేకెట్లు కొన్నివ్వండి అన్నాడు. మర్డరు జరిగిన ఆకాశం, కలాపోసన డవిలాగు, మాడా సీను, సినారెగారి ఎంతటి రసికుడివో….పాట-మొత్తం కంట్రాక్టరు ఇల్లంతా అక్కడే!

శోభనం నాడు భర్త భార్యని, ’ఇంతకుముందు నువ్వెవరినేనా ప్రేమించావా,’ అని అడిగితే, ఆమె ’ప్రేమంటే నాకు తెలీదు. కన్నెపిల్ల మనసు అద్దంలాంటిది. చాలామంది కనిపిస్తుంటారు. పెళ్ళవగానే అది మొగుడిబొమ్మతో పటంగా మారిపోతుంది అని మా అమ్మమ్మ అనేది,’ అంటుంది. నాకు చాలా ఇష్టమైన డైలాగు.

రమణగారు తమ సినిమాల్లో స్త్రీ పాత్రలెప్పుడూ గ్లోరిఫై చేస్తారు. అంటే విజయశాంతి బ్రాండు కాదు. దైనందిన జీవితశాంతి. అనుమానం వచ్చి మొగుడు పొమ్మంటే అమ్మాయి ఏడవదు. పుట్టింటికెళ్ళదు. పల్లెటూరొచ్చి ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ ధైర్యంగా పిల్లలిద్దర్నీ పోషించుకుంటుంది.అటు భర్త జమీందారీ కుటుంబం దెబ్బతింటుంది. ఏడేళ్ తరువాత మావగారు వెతుక్కుంటూ వచ్చి,’అబ్బాయికి నచ్చ చెబుతాను నువ్వు తిరిగిరా. నీవు లేకుండా వెళ్ళను,’ అంటాడు. అమ్మాయి, ’నేను రాను ఆయన్నే రమ్మనండి. సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. మీరు వెళ్ళకపోతే ఇక్కడే ఉండండి. నాకు ముగ్గురు పిల్లలనుకుంటాను. మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు గానీ ఏడేళ్ళుగా నేను పడ్డ క్షోభని ఎప్పుడేనా ఆలోచించారా?’ అంటుంది.

ఇది చెప్పేముందు మావగారికి భోజనం పెట్టి పెరట్లో పక్కవేసి వరండాలో స్తంభానికానుకుని నించుని అనలేక అనలేక, “ఆ..ఆ…ఆయన బావున్నారా,” అంటుంది.

ఆవిడ నించోవడం-మెల్లిగా తనకి అన్యాయం చేసిన భర్త కుశలం అడగడం ఎక్కడిదో గుర్తుందా? లవకుశ అనే చిత్రరాజంలోది. రాముడు వదిలేసిన సీత వాల్మీకి ఆశ్రమంలో ఇద్దరు పిల్లల్నీ పెంచుకుంటోంది. రాముడు తలపెట్టిన యాగానికి మంత్రి వాల్మీకికి ఆహ్వానం తెస్తాడు.

సీత (అంజలీదేవి) ని చసి తెల్లబోతాడు. ఆవిడ ఇలాగే నించుని అనలేక అనలేక, “ఆ…ఆయన బావున్నారా,” అని అడుగుతుంది. ఆ షాట్ సి.పుల్లయ్య గారికి నా హోమేజ్.

–ఇంకావుంది

5 Comments
  1. Srinivas September 26, 2008 /
  2. శంకర్ September 26, 2008 /
  3. essemCHELLURU September 27, 2008 /