Menu

మా సినిమాలు:బాపు-రెండవ భాగం

బుద్ధిమంతుడు: మూడో సినిమా- పాము నోట్లోంచి బయటపడి నిచ్చెనెక్కాం. శ్రీ అక్కినేని నటించిన బుద్ధిమంతుడు (డబుల్ రోల్) చాలా గొప్ప కథ. పూజారికి దేవుడు కనిపించి, ’మానవా నీకెంత అహంకారమయ్యా, మానవాకారం మించిన అందం లేదనే కదా నాక్కూడా కళ్ళూ, ముక్కూ పెట్టావు. అయినా  అసలు నేనున్నానో లేదో. కేవలం నీ భ్రమేనేమో,’ అంటాడు. పూజారి, ’మా తమ్ముడు అన్ని కులాల వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడయ్యా అప్రాచ్యుడు,’ అని ఫిర్యాదు చేస్తే కృష్ణుడు, ‘మరి గొల్లవాణ్ణి- నేను ఎంగిలి చేసిన ప్రసాదం తింటున్నావేం,’ అంటాడు.

గుడి గోపురం పైన మహిమ జరగడం చూసి అన్న పూజారి దణ్ణం పెడుతూంటే నాస్తికుడు తమ్ముడు, ’దేవుడు లేడన్నయ్యా. అది నే చేసినదే,’ అంటే అన్న, ’ఓరి అమాయకుడా! దేవుడెప్పుడూ మనిషి రూపంలోనే వచ్చి మనకి మంచి చేస్తాడు,’ అంటాడు. ఈ సినిమాలో అక్కినేనిగారికి చాలా ఇష్టం. ఇదీ గోదారి దగ్గర పులిదిండి, ర్యాలి గ్రామాల్లో తీశాం.

రమణగారి స్క్రిప్టులో ఒక శాంపిల్. విలన్ శేషాద్రి (నాగభూషణం) చేసిన అన్యాయానికి కోపించి ఎక్కడో ఉన్న అక్కినేని ’శేషాద్రీ,’ అని గర్జిస్తాడు. కట్. ఇంట్లో ఉన్న శేషాద్రి ఉలిక్కిపడతాడు. కట్. ఎదురుగా లో యాంగిల్లో అక్కినేని పులిలా నుంచుని ఉంటాడు.

ఇంకో సీన్. ఉత్తుత్తి స్కూల్లో మేష్టార్లకి జీతాలు ఇచ్చినట్టు రశీదుల మీద పాలేర్ల చేత సంతకాల బదులు వేలిముద్రలు వేయిస్తాడు అమ్యామ్యా అల్లు రామలింగయ్య.

సినిమాకి ఆరున్నర లక్షలయ్యింది.

రమణగారు సూర్యకాంతమ్మగారి ఇంటికెళ్ళి పారితోషకం ఇవ్వబోతే ఆవిడ, “ఇప్పుడిప్పుడే మీరు రంగంలోకి అడుగుపెట్టారు. నిలదొక్కుకుని వృద్ధిలోకి రండి. అప్పుడు తీసుకొంటా నా ఫీజు,” అన్నారు. మద్రాసులో షూటింగు జరిగినప్పుడల్లా తమ ఇంటి నుంచి కారియరు తెప్పించుకునేవారు. అది మూడడగుల ఎత్తుండేది. అందులో పులిహోర, చక్కెర పొంగలి, ఆవడలు, గుత్తొంకాయ కూర మొదలైన భక్షణాలు మాకు రోజూ విందే! షూటింగు ఆఖరి రోజు మొత్తం ప్రొడక్షను సిబ్బందికి రిస్టువాచీ మొదలు బేటరీ లైటు వరకూ ప్రతివారికీ ఏదో ఒక గిఫ్టు ఇచ్చేవారు.

తరువాత తీసినది బాలరాజు కథ చాలా బాగా ఆడింది. ఖర్చు రెండు లోపు. సూర్యకాంతమ్మ గారి వేషం పిల్లలకోడి. నా పిల్లల్ని నేనే తెచ్చుకుంటా ఎవర్నీ బుక్ చెయ్యొద్దని తను పెంచుకొని చదువులు చెప్పిస్తున్న (ఆవిడకి పిల్లల్లేరు) పిల్లలందర్నీ తీసుకొచ్చింది. ఒకే రకం బట్టలు తనే కుట్టించింది. పిల్లలకు ఏ ఇబ్బందీ లేకుండా శెలవరోజున షూటింగ్ ఏర్పాటు చేశారు రమణగారు. ఒక సీనులో ఓ పాప తప్పిపోతుంది. తల్లి (సూర్యకాంతమ్మ) హృదయవిదారకంగా ఏడ్చి పాప కనపడగానే ’చెప్పకుండా ఎక్కడికెళ్ళావే,’ అని చావగొడుతుంది.

డాన్సరు గ్రూపులో హలం అనే అమ్మాయి శ్రద్ధ, చలాకీతనం నాట్యం సొగసు చూస్తే ముచ్చటేసింది. వీలైనప్పుడల్లా ఆమెకు వేషం ఇచ్చేవాళ్ళం. ముత్యాలముగ్గు లో ఆఫీసరు గారి భార్య. రావుగోపాలరావు గారు చిరాగ్గా, “ఆరి దగ్గర కెల్లావేం? ఆరెవరో తెలుసా సోమరాజు గారు,” అంటే ఈమె, “సోమరాజో కామరాజో నాకేందెల్సు! నాల్రోజులోసోట డూటీ ఎయ్యవ్,” అని విసుక్కుంటుంది.

సూర్యకాంతమ్మ గారు మేము సాటి టెక్నీషియన్లమని ఈ సినిమాకీ డబ్బు తీసుకోలేదు. ఆవిడ కారు తలుపుల అద్దాలకి సన్ ఫిల్టర్ ఫిల్ము వేయించుకోబోతుందని తెలిసి రమణ గారు ఓ నీలం అంబాసిడర్ కారు అద్దాలకి ఫిలుములతికించి ఆవిడకి పంపారు.

ఇంటి గౌరవం:తరువాత ఇంటి గౌరవం అనే సినిమా. ఒక నటుణ్ణి, ’కెమెరా చూడకుండా డైలాగు చెప్పు స్వామీ,’ అన్నాను. అతను ’సరే’ అన్నాడు. రష్ చూస్తే మొహం అటు తిప్పి ఉంది గానీ కంటిగుడ్లు మాత్రం కెమెరానే చూస్తున్నాయి. ఇహ సినిమా ఎలా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

సంపూర్ణ రామాయణం:ఆ తరువాత సంపూర్ణ రామాయణం. రచయితలు ఆరుద్రగారు కమ్యూనిస్టు, రమణగారు ఆస్సెగాడు. దర్శకుడు బాపు కార్టూనిస్టు, తీసేది పౌరాణికం అని నలుగురూమెచ్చుకొన్నారు.సినిమా మొత్తానికి 18 లక్షలు ఖర్చవుతే గుండెలు బాదుకున్నారు.

ఎన్టీయార్ లేని రాముడేవిట్రా అని మొదటి వారం అసలు జనం రాలేదు. చూడబోయే సాహసికుల్ని గదిలో గొళ్ళెం పెట్టేశారు. అయినా రాముడు నవ్వాడు. రెండో వారం అందుకొంది. అన్ని చోట్లా శతదినోత్సవాలే. ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారి థియేటర్ లో ప్రత్యేకం షో వేయించుకొని చూసి భుజం తట్టారు.

చూపు ఆనని పెద్దవారు సినిమా హాళ్ళలో తెరకి దగ్గరగా కుర్చీలు వేయించుకొని చూశారు. శ్రీ రామ పట్టాభిషేకం వచ్చేసరికి హాలంతా చెప్పులిప్పేసి లేచి నుంచుని చూశేవారు.

ఆ తరువాత ఏ హాలు ఓపెన్ చేసినా మా రామాయణం మొమ్ముదటరా వేయించుకొనేవారు.

మన వివాహ శుభలేఖల్లో జానక్యా: కమలామలాంజలి పుటే అని ఉండే శ్లోకం శ్రీ సీతారామ కళ్యాణం తలంబ్రాల ఘట్టంలో ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు సీత తలంబ్రాలకై తీసింది. తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి. కెంపులనుకున్నవి, రామయ్య మైచాయ సీకగా నీలమ్ములైనాయి. ఇన్ని రంగులు చూసి ఇంతి తెల్లబోయింది. ఇనకులుడు చిరునవ్వు నవ్వాడు అని ఆరుద్ర ఇంపైన తెలుగులో రాశారు.

యస్.వి.రంగారావుగారితో పని చేసే అదృష్టం కలిగింది. ఓ మారు, ’సార్ మీ ముఖం మీద మేకప్ ఉందిగానీ ఒంటి మీద లేదండీ,’ అన్నా. ఆయన, ’రంగారావుని మొహం చూస్తారు గానీ బాడీ చూడర్రా,’ అన్నారు. అది ఆయనకే చెల్లింది. యుద్ధంలో రాముడు, ’అలసిపోయావు నేడు పోయి రేపు రమ్ము,’ అనగానే రావణుడు ఇంటికెళ్ళి మనస్తాపం చెందే సొలిలకీ… పద్యంతో మొదలై డైలాగులోకి కరిగిపోతుంది. మాధవపెద్ది సత్యంగారి పద్యానికీ తన వచనానికీ తేడా తెలీకుండా దగ్గరుండి రికార్డ్ చేయించుకున్నారు.

కాస్ట్యూమ్ పితామహుడు వాలిగారు ఈకలు, ప్లాస్టిక్ తాళ్ళు మొదలగు వాటితో ఖర్చు లేకుండా ఆశ్చర్యకరమైన దుస్తులు, నగలు తయారుచేసేవారు. రావణుని చెవులకు కోడిగుడ్డు డోల్లలతోటి ఆభరణాలు చేశారు. వేసుకోనన్నారు. వాలిగారు చేశారండీ అనేసరికి వెంటనే తగిలించుకొన్నారు. యస్.వి.ఆర్ గారి రాజు పేద సినిమాలో వాలిగారు గోనెపట్టను రంగులో ముంచి చొక్కా కుట్టారట. యస్.వి.ఆర్ గారు నేను వేసుకోను గుచ్చుకొంటుంది అన్నారట. వాలిగారు ఫర్వాలేదు వేసుకో, లోపల సిల్కు లైనింగ్ ఇచ్చా అన్నారట! వాలిగారి గొప్పతనం అది!

రావణ సభలో హనుమంతుడు తోక సింహాసనం కట్టి కింద నుంచి మీద కెగిరి కూచోవాలి. మామూలుగా- స్టంట్ మేన్ చేత పై నుంచి కిందకి దూకించి కెమెరాలో రివర్స్ తీస్తాం. డ్యూప్ వచ్చాడు. పదిహేనడుగులు దూకి కింద రెండు కాళ్లమీద నిలుచునే ఆనుకోగలవా అని అడిగాము. నవ్వుతూ తలూపాడు. స్టార్ట్ అన్నాం. అతను దూకి ముద్దలా పడి మూర్చపోయాడు. హడలిపోయి ఆస్పత్రికి తరలించాం. ప్రమాదం జరగలేదు. కానీ వాకబు చేస్తే- అతను స్టంట్ మేన్ కాదు. బెజవాడ నుంచి వేషం కోసం వచ్చాట్ట. ఇలాంటి స్టంట్ చెయ్యాలంటే స్పాట్ ఇన్సూరెన్స్ కి కొన్ని వేలు ఖర్చవుతుందని ప్రొడక్షన్ మేనేజరు పాపం అతన్ని రూ.250 కి కుదిర్చాడు. ప్రొడక్షన్ డ్రైవర్ ఇంకో మేధావి ఉండేవాడు. సెట్లోకి బత్తాయి పళ్ళు తీసుకు రమ్మంటే తక్కువ ఖర్చుతో నిమ్మకాయలు తెచ్చి పైగా, “లాంగ్ షాట్ లో ఏవేనా ఒకేలా కనబడతాయి,” అన్నాడు. ఇలా ఆదా చేసినందువల్లనే మొత్తం సినిమా 18 లక్షల్లో తీయగలిగాం.

ఫుల్ ఫ్లోర్ సెట్టు వేశాం. కరెంటు కట్టు అమల్లో వుంది. లైటింగు సగం వరకే అయింది. స్టార్ కాల్షీట్లు సరిపడా లేవు. స్టోరీ బోర్డు వేసుకొని షాట్స్ అన్నీ నంబర్లేసి ఉన్నాయి కనుక కెమెరా కె.యస్.ప్రసాద్ గారితో, “ఇటు షూటింగ్ మొదలుపెడతాను. అటు లైటింగు ఆపద్దని, ” పని మొదలెట్టా.ఆరోజే మన ప్రధాని ఇందిరమ్మ గారు బంగ్లా దేశం విముక్తికి సైన్యం పంపింది. ఒక స్టార్ ని షాట్ రెడీ సార్ అని పిలిస్తే- స్తా వస్తా అని ట్రాన్సిస్టర్ రేడియో చెవికి అతికించుకొన్నాడు. కామెంటరీ ఆయనకొక్కముక్క అర్థం కాని బెంగాలీ భాషలోనైనా సరే! ఈ లోగా ఇంకో తార – ’ఈ పాటికి మా అబ్బాయి లేచుంటాడు పలకరించి వస్తా లేకపోతే ఏడుస్తాడు,’ అంది. (ఆవిడ వెళ్ళి వస్తే గంటన్నర వృధా అయిపోతుంది) మహా టెన్షన్ లో ఉన్న రమణగారు, “అమ్మా మీరు వెళ్ళకపోతే మీ పిల్లాడు ఏడుస్తాడు. వెడితే మా పిల్లలు చాలా ఏళ్ళు ఏడుస్తారు,” అన్నారు.

రీ రికార్డింగ్ ప్రతి సన్నివేశానికీ తగిన మకుటంతో ఉన్న త్యాగరాజ స్వామి కీర్తనలు వీణలో పలికించాం. ఉదా: రాముడు వనవాసం వెడుతూ తల్లివద్ద సెలవు తీసుకొంటుంటే, ’నన్ను విడిచి కదలకురా రామయ్య రామ,’ విభీషణ శరణాగతి సీన్ వెనక, ’సరససామదానభేద దండ చతుర,’ ఇలాగ.

కె.వి.మహదేవన్ గారి సహాయకుడు పుహళేంది గారు హనుమ లంక కెడుతూ రాములవారి ముద్రిక తీసుకెళ్ళే సీను చూసి, “ఒకడు రాజ్యం లాక్కొన్నాడు. ఒకడూ చెప్పులు లాక్కొన్నాడు. మరొకడు భార్యని ఎత్తుకెళ్ళాడు.బుల్లి ఉంగరం మిగిలితే అది కూడా పోతోంది- పాపం రామయ్య,” అన్నారు.

రామ కథ ఎంత గొప్పదంటే రాముడికి కళ్యాణ స్నానం చేయించే సీనులో ముగ్గురు తల్లులూ రాముని శిరసున తైలం ఉంచడానికి ఒకరికొకరు పోటీపడ్డారు. కౌసల్య, కైక, సుమిత్రల్లా కాదు- హేమలత, జమున, శ్రీ రంజనిల్లాగ!

అల్లు రామలింగయ్య గారికి మేవంటే తగని వాత్సల్యం. ఆయన లేనిదే సినిమా తీసేవాళ్లం కాదు. “మరి నాకు రామాయణంలో వేషం ఇవ్వలేదేం?” అని నిలదీశారు. ఒక మంచి వేషమే అనుకొన్నాం గానీ పొట్టిగా ఉంటారని మానుకొన్నాం. “ఏమిటా వేషం? ఎవరిది?” అన్నారు కుతూహలంగా. “శ్రీ రాముడు,” అన్నాం.

రవికాంత్ నగాయిచ్ గారు కెమెరాలో తీసిన మాయాజాలం అనితర సాధ్యం. గంగ ఆకాశం నుంచి శివుని తల మీద పడే దృశ్యం బోర్డు మీద రాసే చాక్ పొడిని పై నుంచి బస్తాలో పోయించి స్లో మోషన్ లో తీశారు. నిజమైన జలపాతం లాగే ఉంది!

అప్పుడే నెలకొల్పిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (SIFDA) బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు.

…..ఇంకా వుంది.

8 Comments
  1. శంకర్ September 14, 2008 /
  2. Srinivas September 16, 2008 /
  3. Cine Valley September 20, 2008 /
  4. Jayaram September 22, 2008 /
  5. TV Durga Rao October 10, 2008 /
  6. Vasu November 7, 2009 /