Menu

వీడని జీవితపు మిస్టీరియస్ ముడి “లా ‘వెంచూర”

ఇటలీ దర్శకుడు మైకలాంజిలో ఆంటోనిని వివాదాస్పదుడిని, ప్రసిద్ధుడ్ని చేసిన సినిమా లా’వెంచూర. ఈ సినిమాకి పూర్వం ఆయన ఐదు పూర్తి స్థాయి చలనచిత్రాలను నిర్మించాడు.అయితే ఈ సినిమాకి పూర్వం తీసిన సినిమాలు అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులనీ సంతృప్తిపరచలేదు. ఇలాంటి దశలో ఆయన ఆరో సినిమాగా నిర్మించిన L’avventura నిర్మాణ దశలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ సినిమా మొదటగా ఫ్రాన్స్ లోని కాన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.

ఏవో స్పర్థల కారణంగా భర్తనుంచి విడిపోయిన అన్నా. ఒంటరితనాన్ని భరించలేదు. అది ఆమె అంతరంగికం. కానీ పైకి దాన్ని అంగీకరించదు. ‘తోడు ఖచ్చితంగా అవసరమా’ అని తనను ఎంతగానో ప్రేమించే తండ్రితో తన ప్రాణ స్నేహితురాలు క్లాండీతోనూ వాదిస్తుంది. ఆమెను ఇష్టపడుతున్నట్లుగా ఆమెలో నమ్మకాన్ని కలిగిస్తాడు శాంట్రో. కానీ, శాంట్రో అతి సామాన్యమైన మగవాడు. స్త్రీకి – దేహం ఒక నెపం మాత్రమే (బహుశా ఒక ఆయుధం కూడా అయితే కావచ్చు). అంతరంగ సముద్రంలోని కల్లోల్లాల్ని జోకొట్టి, లాలించి, ధైర్యాన్నిచ్చే, ఆకాశమంత ఎడదను పరిచి భద్రతను, భరోసాను ఇచ్చే ధీరుడికై వెదుకుతుంది. అటువంటి ధీరుడు కాడు శాంట్రో. ఆమెను పెళ్ళి చేసుకుంటాననే ప్రాథమిక ప్రమాణాన్ని కూడా చేయలేడు. వీరంతా కలిసి సముద్రం మీద బోటులో షికారు చేస్తూ ఒక ద్వీపాన్ని చేరుకుంటారు. అంతకుముందు సముద్రం లో ఈదుతూ షార్క్ చేప బారిన పడుతున్నాననీ, రక్షించమని అబద్ధం చెబుతుంది. ఆ షార్క్ మరేమి కాదు- అది ఒంటరి బతుకులో పొంచిఉన్న భీతి! దాని నుంచి తన ప్రియుడు తనను రక్షించాలి. రక్షిస్తాడు. ఆ ఒట్టొట్టి భయం నుంచి రక్షిస్తాడు గానీ, ద్వీపంలో వీరికి దొరికిన ఏకాంతంలో, తనను సహగామిగా చేసుకుంటానని శాంట్రో వాగ్దానం చేయలేకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది అన్నా. ఇక ఆమె తెర వెనుకకు తప్పుకుంటుంది. ఆమె ద్వీపంనుంచి పారిపోయిందో, జీవితం నుంచే పారిపోయిందో ప్రేక్షకుడి ఊహకే వదిలేస్తాడు దర్శకుడు. అన్నాను వెదికే ప్రయత్నంతో సినిమా మిగతా భాగం నడుస్తుంది.

ఈ వెదుకులాట కూడా నెపమే. శాంట్రోకి నెపం కావడంలో ఆశ్చర్యం లేదు. అన్నా ప్రాణ స్నేహితురాలు, అన్నాను చూడకుండా నిలువలేని క్లాండీకి కూడా అది నెపం కావడమే ఆశ్చర్యం (బహుశా ఆశ్చర్యం కాదేమో). అన్నా కనిపించాలని ఎంతో ఆరాటపడిన ఆమె, ఆమె కనిపిస్తుందేమోనని ఉద్వేగపడుతుంది. కనిపించకూడదని కోరుకుంటుంది. అందుకు కారణం – ప్రాథమిక సంఘర్షణలను దాటుకుని శాంట్రో ప్రేమలో ఆమె పడటమే. వారు చేసిన ప్రయాణాలు, ఒరికొకరు చేసుకున్న ప్రమాణాలు – వారిని నిజంగానే దగ్గర చేశాయా అన్నదే మరో ప్రశ్న. దర్శకుడు జవాబివ్వకుండా వదిలేసిన ప్రశ్న. అన్నా అదృశ్యమైన మర్నాటినుంచే మరో స్త్రీ (క్లాండీ) కై ఆరాటపడడం, క్లాండీతో ఉంటూనే ఓ వేశ్యను కలవడం…ఇదంతా శాంట్రోకే అర్థం కాని ఒక మాయాజాలం. వేశ్యతో కలిసినప్పుడు క్లాండీ చూడకపోతే, బహుశా ఏ మాయాజాలాన్ని గుర్తించక, దానికి తనను వశ్యుడిని చేసిన తన అశక్తతను కూడా గుర్తించలేక, చివరి సన్ని వేశంలోలా కన్నీరై వ్యక్తమయ్యేవాడు కాదేమో. అది అతని పశ్చాత్తాపమో, మోసమో బహుశా ఆమెకు తెలుసు/తెలియదు; ఆమె అతన్ను నమ్మింది/నమ్మలేదు; అతనిని తనలోకి పొదుపుకొని ఓదార్పునివ్వడానికై ఆమె రాజీపడింది/క్షమ చూపింది. ఏది సత్యం? ఏదసత్యం? సంజాయిషీ దర్శకుడు ఇవ్వలేదు. సమాధానాన్ని మనమే వెదుక్కోవాలి. అసాధారణమైన, అభద్రమైన, ’బ..హు..శా..’ ప్రమాదకరమైన వాతావరణంలోకి అనివార్యంగా నెట్టబడిన ఇటువంటి మషుల బతుకుయాతననే తన ’ఎడ్వంచర్’ గా దర్శకుడు భావించాడేమో అనిపిస్తుంది ఈ మిస్టీరియస్ సినిమా చూశాక.

ప్రపంచ సినిమా ప్రేమికులందరూ మళ్ళీ మళ్ళీ చూసి తీరాల్సిన సినిమా ఇది.

–నరేష్ నున్నా

4 Comments
  1. chakri March 11, 2011 /
  2. naresh nunna March 12, 2011 /
  3. చక్రధర్ March 13, 2011 /