Menu

Brief Encounter

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ అనే ఈ అద్భుతమయిన సినిమా కాన్సెప్టు 1945 లో వచ్చిందంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యమనిపిస్తుంది.
మామూలుగా పెళ్ళి అనేది ప్రేమ జీవితానికి ముగింపు. ఆ తరువాత ప్రేమ అంటే మన భాగస్వామితోనే. కానీ పెళ్ళి తరువాత మీ భాగస్వాములతో కాక వేరొకరితో ప్రేమలో పడితే ??

ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించే అద్భుతమయిన సినిమా “బ్రీఫ్ ఎన్‌కౌంటర్”.

లారా అనే ఒక మామూలు గృహిణి ఎంతో ఆనందమయిన జీవితం గడుపుతుంటుంది. మంచి భర్త, ఇద్దరు పిల్లలు.

ప్రతీ గురువారం “మిల్ఫర్డు”కి వెళ్ళి షాపింగు చేసి సినిమాలు చూడడం అలవాటు.

అలాంటి ఆమెకి ఒకరోజు అక్కడి రిఫ్రెష్‌మెంటు రూములో అలెక్ అనే ఒక డాక్టరు అనుకోకుండా పరిచయమవుతాడు. ఇద్దరూ ఒకరి పట్ల ఇంకొకరు ఆకర్షితులవుతారు.

ప్రతీ గురువారం అక్కడ కలిసి తిరుగుతుంటారు. కానీ లారా అలెక్ ని కలిసిన ప్రతీ సారీ సంఘర్షణకి లోనవుతుంటుంది. తను తప్పు చేస్తుందా‌ ? తన భర్తకీ, పిల్లలకీ ద్రోహం చేస్తుందా అని అనుక్షణం ఆలోచిస్తుంటుంది. అలాగని అలెక్‌ని వదులుకోవడానికీ ఇష్టపడదు. మరి చివరికి ఏం జరిగిందనేదే కథ….

మొరాలిటీ ప్రకారం ఆలోచిస్తే మన భాగస్వామికి కట్టుబడి ఉండాలి. వారినే ప్రేమించాలి. కానీ ఆకర్షణ, ప్రేమ అనేవి సమయం, సందర్భం అనుసరించి వచ్చేవా అంటే సమాధానం చెప్పడం‌కష్టమే. అలాంటి విషయాన్ని ఏ జడ్జ్‌మెంటూ లేకుండా ఈ సినిమాలో చూపడం నాకు నచ్చింది.

అలాగే సినిమాలో ఆ పెళ్ళి తరువాత ప్రేమలో పడటానికి ఇంకేవో కారణాలు కూడా చూపించడు దర్శకుడు. అంటే వైవాహిక జీవితం బాగోలేకనో, భర్తతో గొడవపడో, భర్త మంచివాడో లాంటి కారణాలు ఏవీ చూపించడు. ఇద్దరు చక్కని పిల్లలు, మంచి భర్త ఉన్న గృహిణి ఇంకొకరితో ప్రేమలో పడుతుంది అంతే.

ఈ సినిమాలో ప్రతీ సన్నివేశంలోనూ దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. చిక్కని స్క్రిప్టు ఉన్న కథ. తీయడంలోనూ ఒక భిన్నమైన శైలి. మానసిక సంఘర్షణ చూపించాల్సిన ప్రతీ సీనునూ అద్భుతంగా పండించాడు దర్శకుడు.

అదీ కాక కథ నేరేటీవ్ గా సాగుతుంది. లారా తన అనుభవం చెబుతున్నట్టుగా నడుస్తుంది సినిమా. కాబట్టి దర్శకుడు ఇంకా సమర్థవంతంగా చెప్పగలిగాడని నాకు అనిపిస్తుంది.

ఇందులో నటీనటుల నటన సినిమాని ఇంకో స్థాయికి తీసుకు వెళుతుంది. చక్కని ప్రదర్శనలు ఇచ్చారు.

కొన్ని సన్నివేశాలు అద్భుతంగా కుదిరాయి. (warning: maybe spoilers)

  • సినిమా మొదట్లో స్నేహితురాలు డాలీ గురించి లారా ఆలోచనలు సాగడం
  • అలెక్ వద్దకి వెళ్ళాలా వద్దా అని అప్పటిదాకా సంశయించిన లారా, అతని దగ్గరకి వెళ్ళిన తరువాత ఎలాంటి అపరాధ భావం లేకుండా ఆనందంగా గడపడం
  • గదిలో తన భర్త ఎదురుగానే ఉన్నా ఎక్కడో దూరంగా ఉన్నట్లు ఫీలవడం
  • అపరాధ భావన, సంతోషానికి మధ్య కొట్టుమిట్టాడే సన్నివేశాలు
  • సినిమా చివరలో లారా ఆత్మహత్య చేసుకోవాలనుకునే సన్నివేశం
  • సినిమా ఆఖరులో లారా భర్త “Come back to me” అనే సన్నివేశం

కానీ కొన్ని సన్నివేశాలు అర్థాంతరంగా ముగిసాయని కూడా అనిపించాయి. ఉదా: అలెక్ స్నేహితుడి అపార్టుమెంటులో లారా, అలెక్ సన్నిహితమవుతున్న సమయంలో అతని స్నేహితుడు వచ్చే సన్నివేశం. రొమాన్సు పాళ్ళని తగ్గించడానికి సన్నివేశం టోన్ డౌన్ చెయ్యబడిందేమో అని అనిపించింది.

డయిలాగులు కూడా బాగా కుదిరాయి. ఒకచోట అలెక్‌తో తన అనుబంధం గురించి ఆలోచిస్తూ నేను గిల్టీగా ఫీలవాలి కానీ నేను అలా ఫీలవట్లేదు అని అర్థం వచ్చే డయిలాగు సన్నివేశం పరంగా అద్భుతంగా ఉంటుంది.

సినిమాలో డయిలాగుల కన్నా మోనోలాగులే ఎక్కువ ? (లారా ఆలోచనలోనే సినిమా అంతా సాగుతుంది కాబట్టి). అది కూడా సినిమాలో ఒక రకమయిన ఎక్స్‌పరిమెంటే. కానీ చాలా చక్కగా కుదిరింది. ఎందుకంటే లారా పాయింట్ ఆఫ్ వ్యూని దర్శకుడు చూపించగలిగాడు. ఆలోచనలు, అపరాధ భావనలు, సంతోష సమయాలు అన్నీ.

ఈ సినిమా కాన్సెప్టుని మూలంగా తీసుకుని ఇంకా ఎన్నో సినిమాలు వచ్చాయి అని నాకు అనిపించింది. ఆంగ్లంలో “Unfaithful”, హిందీలో “Murder” మొదలయినవి. కానీ ఈ సినిమా టచ్ చేసినట్టు మిగతావేవీ మనల్ని టచ్ చెయ్యవు. దానికి ఒక కారణం మిగతావి శృంగార ఆధారితం, ఈ సినిమా రొమాన్స్ ఆధారితం కావడం కావచ్చు.

డేవిడ్ లీన్ సృష్టి అయిన ఈ సినిమాని మాత్రం చూడాల్సిందే !

–ప్రవీణ్ గార్లపాటి

5 Comments
  1. venkat November 13, 2008 /
  2. ceenu November 14, 2008 /