Menu

where is my grandpa – సంపూర్ణ ఆనందం

ప్రేమ.. ప్రపంచంలో ప్రతివాళ్ళూ అంగలార్చేది ప్రేమకోసమే.  మంచి పండులో  తియ్యదనం ఎలా దాగుంటుందో…మంచి హృదయంలో ప్రేమ ఆలా దాగుంటుంది.  వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషికీ తన మనుషుల ..సాటి మనుషుల ప్రేమ కావాలి… కావాలని కోరుకుంటారు. ఏ మనిషి ‘ప్రేమ’ అక్కరలేదంటాదు చెప్పండి ??

ప్రేమ అనేది ప్యూర్ బ్లిస్..సంపూర్ణ ఆనందం.
ప్రేమకోసమే పొత్తిళ్లలోని బిడ్డ కాసేపు తల్లి స్పర్శ ..పలకరింపు లేకుంటే ఏడుపు అందుకుంటుంది. తల్లిదండ్రుల ప్రేమ నిరంతరం కోరుకుంటారు పిల్లలు. ఈ స్కూలూ చదువుల వల్లా..వాళ్ళు సరిగ్గా చదవటం లేదు..రేప్పొద్దున ఏమై పోతారో అన్న బెంగవల్లా, అతిగారభం చేస్తే చెడిపోతారు అనే భయం వల్లా చాలమంది తల్లిదండ్రులు ప్రేమని నొక్కిపట్టి పిల్లలని పెంచుతారు కానీ ఆ భయాలేని లేని వాళ్ళ పిల్లలుమాత్రం కమ్మని ప్రేమని ఆనందించగలుగుతారు. యుక్త వయస్సు రాగానే అవతలివ్యక్తి స్నేహం ..ఆకర్షణా. ప్రేమా కావాలని కోరుకుంటారు. చదువవగానే ఉద్యోగమూ సంపాదించుకొని పెళ్ళి చేసుకొని తమ భాగస్వామిద్వారా ప్రేమని పొందుతారు. కానీ వృద్దాప్యంలో తమ పిల్లల, పిల్లలపిల్లల ప్రేమకావాలనీ..ప్రేమించాలనీ ఉంటుంది.కానీ ప్రేమకి నోచుకుంటున్న వృద్దులు తక్కువనే చెప్పాలి.

కథలోకి వెళితే….
జాన్ ఎనమిదేళ్ల పిల్లవాడు. స్కూళ్లొ చదువుతుంటాడు. స్కూల్లో చివరి రోజు ,మరునాటి నించీ వేసవి సెలవులు మొదలవుతాయి. తన అప్త మిత్రుడిని అడుగుతాడు ఏం చేయబోతున్నావ్ అని.. తాను, తన తల్లితో పాటు తాతయ్యని చూడటానికి వెళుతున్నాననీ అంటాడు. జాన్ ఇంటికొస్తాడు. మరునాడు సెలవు..రోజువారీ లేచినట్టే పెందళాడే లేస్తాడు. కానీ సెలవులని గుర్తొచ్చి మళ్ళీ పడుకుంటాడు. ఇంట్లో అప్పటికే నాన్న..అమ్మా తమ ఆఫీసులకి వెళ్ళిపోయింటారు. ప్రతి వేసవి సెలవులకి ఇలాగే ఉంటుంది చాలా బోరింగ్ గా.. ఏదో సమ్మర్ క్యాంపులో చేరిపిస్తారు కానీ స్కూల్లాగే చాలా బోరింగ్ . కాసేపుటీవీ..కాసేపు గేమ్సూ ..కాసేపు కిటికీలోంచి పట్టణాన్ని చూస్తూ కాలం గడుపుతాడు. సాయంత్రం వాళ్ళ అమ్మ వస్తుంది. ఆమె పనుల్లొ మునిగిపోతుంది. జాన్ ఆమె వెనకాల తిరుగుతూ అడుగుతాడు.. తాతయ్య లేడా తనకి అని..

అలా రోజూ నిద్రలోనూ కలవరించేసరికి.. తల్లిదండ్రులు సమంతా ..థామస్ లు అతన్ని తాతయ్య దగ్గరికి తీసుకువెళదామని పట్టణం చివర ఉన్న ఓల్డ్ ఏజ్ హోం కి వెళతారు. ఆశ్చర్యకరంగా అక్కడ తాతయ్య ఉండడు.  ఎప్పుడో తాతయ్య మీదగ్గరికే వెళుతున్నా అని వెళ్ళిపోయాడని చెపుతారు. ఓల్డేజ్ హోం లో చేర్పించిన తన తండ్రి కనపడక పోయే సరికి థామస్ కి చిరాకుగా ఉంటుంది. ఇంటికొచ్చాక  తన తండ్రిని తనకి కాకుండ చేసావని సమంతాని తిడతాడు థామస్. భర్తలిద్దరూ ఒకరినొకరు కాసేపు ఆడిపోసుకుంటారు.
మరునాడు ఆఫీసుకు సెలవు పెట్టి థామస్ జాన్  తో కలిసి  స్వంత ఊరికి బయలుదేరుతారు. అలా ప్రయాణంలో జాన్ వేసే ప్రశ్నలూ ..మాటలతో ..థామస్ తన తండ్రి ప్రేమని రియలైజ్ అయ్యి కంటతడి పెడతాడు. తండ్రి ఊళ్ళో ఉండాలని ప్రార్థన కూడా చేస్తాడు. ఊళ్ళో కూడా తండ్రి ఉండడు.

ఆ రాత్రి తమ పాత ఇంట్లో గడుపుతారు. ఎన్నో జ్ఞాపకాలు..అవన్నీ కొడుకుతో పంచుకుంటాడు. మరునాడు ఉదయం జాన్ తన తాతయ్య గురించి ఊళ్ళో అందరినీ ఆరా తీస్తాడు. ఎవరికీ తమకి తెలియదని అంటారు. అందరూ థామస్ ని తిట్టినంత పని చేస్తారు తండ్రిని తనదగ్గర ఉంచుకోనందుకు .. ఒకానొక సమయంలో  తాతయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడుగుతాడు జాన్ థామస్ ని.   గుర్తుకు తెచ్చుకొని ‘సామ్యూల్ అంకుల్’  అని చెపుతాడు. వెంటనే ఏదో గుర్తొచ్చినవాడిలా జాన్ తో బయలుదేరి మరో ఊరు చేరుకుంటారు.
అది సామ్యూల్ వాళ్ల ఊరు. అక్కడ సామ్యూల్ తన పంటపొలంలో పని చేస్తుంటాడు. వీళ్ల రాకని గమనించి వస్తాడు. థామస్ తనని తాను పరిచయం చేసుకుంటాడు ..జాన్ ని పరిచయం చేస్తాడు. శామ్యూల్ తన మిత్రుడు జాకబ్ గురించి తనకేమీ తెలియదని చెపుతాడు. ఇహ దిగాలుగా వెనక్కి వెళుతుంటే.. అక్కడ గేదెలని శుభ్రం చేయటంలో నిమగ్నమైన జాకబ్ ( తాతయ్య) కనిపిస్తాడు.

ఒక్కసారి థామస్ కళ్లలో నీళ్ళు తిరుగుతాయి. నాన్నా అని కౌగిలించుకుంటాడు. జాకబ్ మాత్రం ఎప్పటిలాగే తలనిమురుతాడు. ఇది గమనిస్తున్న జాన్ కి అర్థమయిపోతుంది ..తనే తన తాతాయ్య అని.
జాన్ కి ఇప్పుడు ఇద్దరు తాతయ్యలు…జాకబ్,,,సామ్యూల్.  🙂

సెలవులు అయిపోతాయి.. థామస్,సమంతాలు జాన్ ని తీసుకెళ్ళటానికి city నుండి వస్తారు. జాకబ్ ని కూడా తమతో రమ్మంటారు. థామస్ తన ఆప్త మిత్రుడు సామ్యూల్ వైపు చూసి వాళ్లని సాగనంపుతాడు. జాన్ మరుసటి సెలవులకి తమ పట్టణానికి ఇద్దరూ రావాలని ప్రామిస్ చేయించుకొని కానీ కదలడు.

సున్నితమైన కథా..భావోద్వేగాలని చక్కగా పండించారు నటీనటులు.  ముఖ్యంగా థామస్ డొరెట్ చలాకీగా కనిపిస్తూనే అమాయకంగా భలే నటించాడు. తాతయ్యగా నటించిన సీమొర్ కాసెల్ తన నవ్వుతో ఇలాంటి తాతయ్య కావాలి అనిపించేస్తాడు. డారిస్ కొంజీ కెమెరా ఎప్పటిలాగే మాజికల్ విజువల్స్ ని కళ్లకి కడతాయి. బ్రిటీష్ కంపోజర్ రాచల్ పోర్ట్మన్ సంగీతం గురించి చెప్పనే అక్కరలేదు. ప్రతి ధ్వనీ లోతైన భావాన్ని కలిగి మనసుకు హత్తుకుంటుంది. ప్రతిసారీ సోదరుడితో కలిసి దర్శకత్వం వహించే దర్శకుడు లుక్ దర్దెన్ మొదటిసారి తానొక్కడే దర్శకత్వం వహించిన సినిమా ఇది. జీవితంలోని, మనుషుల మనసుల్లోని సున్నితత్వం..భావోద్వేగాలని తెరమీదకి హత్తుకునేలా లాగేసాడు.

మన గుండెల్లోని భావోద్వేగాలని తట్టిలేపే … ఒక మిస్ కాకూడని సినిమా ఇది.