Menu

ఈ మనుషులున్నారే…

అప్పుడే వెళ్ళిపోయావా
ఇక, పనేమీ లేనట్టు
నటించే వీలు లేనట్టు

‘చిత్రం’గా మమ్మల్ని పలకరించి
‘నువ్వు-నేను’ అనే తేడా లేకుండా
అందరి ‘మనసంతా నువ్వే’ అయ్యి
…ఇంకా ఏదో అవ్వబోతున్నావనుకుంటుంటే
ఇలా అయ్యిందేంటి?
నీకేదో దిష్టి తగిలింది
పడరాని వారి దృష్టి పడింది
Most vulnerable face మాత్రమే అనుకున్నాం
Most vulnerable heart కూడానా?!
నీకేం తక్కువయ్యింది-
శోభ ,స్మిత ,ఫటాఫట్ జయలక్ష్మి,జియా ఖాన్ ……
ఆడవాళ్ళు కాబట్టి తట్టుకోలేక పోయారనుకున్నాం
నీకేమయింది ..
ఈ మధ్యనేగా ‘జై శ్రీరామ్’ అంటూ
సిక్స్ ప్యాక్ కండలు చూపించావ్
అదంతా ఒట్టి బూటకమేనా ? బూడిదేనా ?
ముక్కు పచ్చలారకుండానే
ముప్పైల్లోకొచ్చి
నీలో నువ్వు ముడుచుకుపోయావా?
హిట్లూ, సిల్వర్ జూబ్లీలు
ఫ్లాపులు, ఫెయిల్యూర్లు ….. ఇవన్నీ చూసేసాక
ఇక ఏమీ లేదనుకున్నావా?

అగ్రతారగా వెలగాలంటే
అగ్రకులంలో పుట్టాలనుకుని చనిపోయావా?
సినీ వారసుల కొత్త, చెత్త చిత్రాల కోసం
చిత్తుగా తాగి, మత్తుగా ఊగే
వెర్రి ఫ్లెక్సీలు చూసి
చిర్రెత్తు కొచ్చిందా?!
ప్రతి శుక్రవారం
ఒక తార పతనం, ఒక తార ఉత్థానం
ఒక తార మరణం, ఒక తార జననం
సినిమా వాళ్లకిది మామూలేగా!
కానీ ప్రతీ శుక్రవారం
పదే పదే పతనం
తట్టుకోలేకపోయావు కదూ!

నీ మనసుతో ఆడుకున్న వాళ్ళు
నిన్ను ఆశల పల్లకీలో ఊరేగించి
ఆనక పడదోసిన వాళ్ళు బాగానే ఉన్నారు,! ఉంటారు!

నీకేమైంది ?
ఒక ఇల్లు పొతే ఇంకో ఇల్లు కట్టుకోవాలి?
ఏం – అద్దె కొంపలో కొన్నాళ్ళు ..
ఆపుకోవాలి కన్నీళ్లు…
నీ డేట్ల కోసం నిర్మాతల ఎదురు చూపులు
నీ సరసన ఛాన్స్ కోసం నాయికల వాలు చూపులు
లేకపోతేనేం…… మేం లేమూ?
నిన్ను గుర్తు చేసుకోటానికి!
ఖాళీగా ఉంటే పలకరించే వాళ్ళు లేరనీ
సిన్మాల్లేకపోతే పట్టించుకునేవాళ్ళు లేరనీ
వెళ్ళిపోయావా?!
అర్థం కాని వేదనతో
అడ్రస్ లేని శత్రువుతో
పోరాడలేక వెళ్ళిపోయావా?!
నీ కులపోల్లెవరూ నిర్మాతలు లేరని
ఫిల్మీ ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదనీ
నీతో పదే పదే సిన్మాల్తీసీ
నిన్ను ప్రేక్షకులపై రుద్దే స్థాయి
రక్త బంధువులు లేరని అలిగావా ?

సోకాల్డ్ స్టార్ల సిన్మాలెంత
చెత్తగా ఉన్నా 3/5 రేటింగిచ్చే
తెలివైన సినిమా విమర్శక జీవులు
నీలాంటి సన్న, చిన్న హీరోల
సిన్మాలపై తమ ప్రతాపమంతా
చూపిస్తుంటే కుదేలై కుమిలిపోయావా?
పెద్దోళ్ళ కోసమో, వాళ్ళ పిల్లల కోసమో
కలాల్ని, గళాల్ని అంకితం చేసే
వంకర మనుషుల్ని చూసి
వెగటుతో వెళ్ళిపోయావా?

ఉదయకిరణా!
రణహృదయా!
వ్రణహృదయా!
నీది …. కాదు ఆత్మహత్య!
తెలుగు సిన్మా మార్కెట్ చేస్తున్న నిరంతర హత్య!!!!

–శివుడు

3 Comments
  1. Mamatha January 7, 2014 /
  2. Kathe Mallesh Yadav January 7, 2014 /
  3. WB January 9, 2014 /