Menu

Tokyo Story

ఇది నా కథ. మీ కథ. మనందరి కథ!

జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే; అసలు అలాంటి ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాసే. కురసావా రూపొందించిన “ఇకిరు”, మిజొగుచి రూపొందించిన “శాంశో దయు” చిత్రాలను ఈ శీర్షికలో పరిచయం చేయడం జరిగింది. ఓజు దర్శకత్వంలో వచ్చిన “టోక్యో స్టోరీ” అనే అపూర్వమైన సినిమా గురించి ఈ వారం తెలుసుకుందాం.

షుకిచీ వయసు డెబ్భై పైనే. అతని భార్య టోమీ కి కూడా వయసు డెబ్భైకి దగ్గరపడుతోంది. వారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అందరినీ కష్టపడి పెంచి పెద్ద చేశారు; బాగా చదివించారు. పెద్ద కొడుకు డాక్టర్ గా టోక్యో నగరంలో స్థిరపడ్డాడు. రెండో కొడుకు సైన్యంలో పని చేస్తూ చనిపోయాడు. కోడలు టోక్యోలో ఉద్యోగం చేస్తోంది. మూడో కొడూకు ఒసాకా నగరంలో పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు కి పెళ్ళయింది. అల్లుడు టోక్యోలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు ఇంట్లోనే ఒక చిన్న బ్యూటీ పార్లర్ నడుపుతోంది. చిన్న కూతురుకి ఇంకా పెళ్లి కాలేదు. స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. కొడుకూ కూతుళ్ళను చూసి చాలా రోజులవడంతో ఆ వృద్ధ దంపతులిద్దరూ టోక్యో నగరానికి వెళ్దామనుకున్నారు. మధ్యలో ఒసాకా నగరంలో చిన్న కొడుకుని చూసి టోక్యో లో కొడుకు, కూతుళ్ళ ఇళ్లలో కొన్నాళ్ళు గడిపి తిరిగిరావాలనుకున్నారు.

ఆ వృద్ధదంపతులిద్దరూ టోక్యో నగరం చేరుకోవడం, అక్కడ తమ పిల్లల ఇళ్లల్లో కొన్ని రోజులు గడిపి తమ ఊరికి తిరిగిరావడమే “టోక్యో స్టోరీ” సినిమా యొక్క ముఖ్య కథ. చెప్పుకోవడానికి గొప్ప కథేమీ కాదు. కానీ గొప్ప కథలు గొప్ప పుస్తకాలవుతాయేమో కానీ గొప్ప సినిమా కావడానికి గొప్ప కథ అవసరం లేదు. ఎందుకంటే సినిమా అంటే కేవలం కథ మాత్రమే కాదు. సినిమా అంటే ఎన్నో కళలు కలగలిపిన ఉత్తమ కళ. ఆ కళలన్నీ సమపాళ్లలో కుదిరితే సాధారణ కథ సైతం అద్భుత కళాఖండంలా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా అలాంటిదే!

*****

షుకిచీ మరియు టోమీలు తమ ప్రయాణానికి సన్నాహమవుతూ తమ సామాన్లు సర్దుకునే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. చిన్న కూతురు తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పి స్కూల్ కి వెళ్లిపోతుంది. ఈ లోగా పక్కింటావిడ వచ్చి “టోక్యో వెళ్తున్నారంట కదా!” అని పలకరిస్తుంది. తము ఊర్లో లేనప్పుడు ఇళ్లు కాస్తా చూస్తుండమని ఆమె కి చెప్తారు.

ఆ తర్వాత సన్నివేశం టోక్యో కి మారుతుంది. పెద్ద కొడుకు కొయిచీ ఇంటికి చేరుకుంటారు ఆ వృద్ధ దంపతులు. కూతురు, కోడలు కూడా అక్కడికి చేరుకుంటారు. అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు. నాన్నమ్మ, తాతల రాకతో తన స్టడీ రూం ఆక్రమించబడడంతో చిర్రుబుర్రుమంటుంటాడు పెద్ద మనవడు. చిన్న మనవడిని మొట్టమొదటి సారిగా చూసుకుని మురిసిపోతారు ఆ వృద్ధ దంపతులు. ఈ లోగా ఆడాళ్లంతా వంటింట్లోకి చేరి వంట చేయడం మొదలుపెడ్తారు. తండ్రీ కొడుకులు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటారు. రాత్రవగానే అందరూ భోజనం చేసి మరికొంతసేపు కబుర్లు చెప్పుకుంటారు. బాగా పొద్దు పోయాక కూతురు, కోడలు వారి వారి ఇళ్ళకు బయల్దేరుతారు. రాత్రి పడుకునే ముందు ఆ దంపతులు తమ కొడుకు గురించి మాట్లాడుకుంటూ, వారనుకున్నట్టుగా కొడుకు నగరంలో పెద్ద డాక్టర్ కాదనీ, చిన్న హాస్పిటల్ నడుపుకుంటూ నగర శివార్లలో జీవిస్తున్నాడనీ నిజం తెలుసుకుని కొంచెం నిరాశ తో నిద్రకు ఉపక్రమిస్తారు.

tokyo-2

టోక్యో లో ఉన్నన్నాళ్లూ ఎవరి ఉద్యోగాలతో వారు బిజీగా ఉండడంతో దాదాపు అన్ని రోజులూ ఇరుకు ఇంట్లోనే ఉంటూ ఇబ్బందికి గురవుతారు ఆ దంపతులు. ఎప్పటికప్పుడు తమ తల్లిదండ్రులను నగరం చూపిద్దామని కొడుకు అనుకుంటాడు కానీ హాస్పిటల్ పనుల కారణంగా అతనికి కుదరదు. ఒక రోజు కోడలు తన ఆఫీస్ కి శెలవు పెట్టి వారిద్దరినీ టోక్యో నగరం లోని అన్ని ప్రదేశాలకు తీసుకెళ్తుంది. కొడుకు పోయినా కోడలు తమ మీద చూపిస్తున్న ప్రేమకు ముగ్ధులవుతారు ఆ దంపతులిద్దరూ.

అంత దూరం నుంచి వచ్చిన తల్లిదండ్రులకు ఏమీ చెయ్యలేకపోతున్నామనే దిగులుతో కొడుకూ, కూతుళ్లు దగ్గర్లో ఉన్న ఒక పర్యాటక ప్రాంతానికి పంపిస్తారు. యువతీ యువకులతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఒక రోజు కంటే ఎక్కువ ఉండలేక కూతురు ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఆ దంపతులు. అసలే ఇరుకు ఇంట్లో బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ కష్టాలు పడుతున్న కూతురు షిగే , వారిపై చిరాకు పడుతుంది. ఆ దంపతులిద్దరూ కోడలు ఇంటికి బయల్దేరుతారు. ఒక్క గది అపార్ట్మెంట్ లో ఉంటున్న కోడలు కి ఇబ్బంది లేకుండా తన భార్యను మాత్రం అక్కడ ఉండమని, తన చిన్ననాటి స్నేహుతుడి ఇంటికి బయల్దేరుతాడు షుకిచీ.

*****

రెండున్నర గంటలపాటు నడిచే ఈ సినిమాలో మొత్తం కలిపితే ఒక ఇరవై కి మంచి సన్నివేశాలు ఉండవు. ఒక్కో సన్నివేశం దాదాపు పది నిమిషాల పాటు ఉంటుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఓజు తనదైన ప్రత్యేక శైలిలో రూపొందించారు. ఏ ఒక్క సన్నివేశం తీసివేసినా సినిమా వెలితిగానే అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో కీలకమైన సన్నివేశం గా ఎన్నుకోవాల్సివస్తే అది షుకిచీ బార్ లో స్నేహితులతో మందు తాగే సన్నివేశమే అవుతుంది.

tokyo-3

భార్యను కోడలు ఇంట్లో వదిలి స్నేహితుడి ఇంటికి బయల్దేరుతాడు షుకిచో. అక్కడ మరో స్నేహితుడు కూడా కలుస్తాడు. అందరూ కలిసి మందు తాగుతారు. ఇంట్లో ఉన్న మందు అయిపోవడంతో అందరూ కలిసి ఒక బార్ కి వెళ్తారు. బార్ లో మందు తాగుతూ తమ చిన్నన్నాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. మాటల్లో తమ పిల్లల గురించి చర్చ మొదలవుతుంది. ఎవరికి వారు తమ పిల్లల గురించి చెప్పుకుంటూ బాధ పడతారు. వారి మాటలని బట్టి షుకిచో కి ఒక విషయం అర్థమవుతుంది. తన పరిస్థితి కూడా వారందరిలానే ఉండడమే కాకుండా, ఒక విధంగా తన పిల్లలు మిగతావారి పిల్లలకంటే కాస్తా మెరుగైన పరిస్థితిలో ఉన్నారని అనుకుంటాడు. అలా మాట్లాడుకుంటూ అర్థరాత్రి దాటేవరకూ చిత్తుగా తాగి మత్తులోపడిపోతారు. వారంతా బార్ లో కదల్లేని పరిస్థితిలో ఉండగా పోలీసులు పట్టుకుని కూతురు షిగే ఇంటికి తీసుకు రావడంతో ఈ సన్నివేశం ముగుస్తుంది.

చాలా సాదా సీదాగా నడిచే ఈ సన్నివేశంలోనే కాదు, సినిమా మొత్తాన్ని దర్శకుడు ఓజు చిత్రీకరించిన తీరు ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఒక్క సన్నివేశంలో తప్పితే మరెక్కడా కెమెరా కదలదు. ప్రతి సన్నివేశంలో కూడా కెమెరా నిలకడగా ఉంటుంది. కేవలం పాత్రలు మాత్రమే ఫ్రేము నుంచి బయటకు, లోపలకు కదుల్తుంటారు. అంతే కాదు దాదాపు అన్ని సన్నివేశాలలో కెమెరా భూమికి మూడడుగుల ఎత్తులో పెట్టబడి ఉంటుంది. అందుకు ఒక కారణం ఉంది. అప్పట్లో జపనీయుల ఇళ్లల్లో దాదాపుగా అందరూ నేలమీదే కూర్చునే వారు. కాబట్టి ఈ సినిమాలో కెమెరా, నేలమీద కూర్చుని జరుగుతున్నదంతా చూస్తున్న ప్రేక్షకుడిలా వ్యవహరిస్తుంది. కాబట్టే ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడు పాత్రలతో పాటు అదే గదిలో కూర్చుని చూస్తున్నట్టుగా అనుభూతి చెందుతాడు.

*****

టోక్యో పర్యటన ముగించుకుని తమ ఊరికి బయల్దేరుతారు ఆ దంపతులిద్దరూ. వారు ఊరు చేరుకున్నట్టుగా కొడుకుకి ఉత్తరం అందుతుంది. మార్గమధ్యంలో తల్లి కి ఆరోగ్యం క్షీణించిందని ఉత్తరంలో చదివి బాధపడుతుండగా, అమ్మ చావుబతుకుల్లో ఉందని, అర్జెంటుగా బయల్దేరి రావాలని టెలిగ్రాం అందుతుంది. అందరూ కలిసి తమ ఊరికి బయల్దేరుతారు. వారు అక్కడికి చేరుకున్న తర్వాత రోజే ఆమె మరణిస్తుంది. అంతిమ క్రియలు పూర్తి చేసి హడావుడిగా తిరిగి టోక్యో వెళ్ళిపోతారు అందరూ. కోడలు నొరికో మాత్రం కొన్ని రోజులు ఉండి అన్ని పనులూ చక్కబెట్టి తిరిగి వెళ్తుంది. ఆమె తిరిగి వెళ్తుండగా ఆమెను మరో పెళ్ళి చేసుకోమని సలహా ఇస్తాడు షుకిచో. ఆమె కూడా వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిన షుకిచో ఏదో ఆలోచిస్తూ కూర్చోవడంతో సినిమా ముగుస్తుంది.

tokyo-4

ముందే చెప్పుకున్నట్టు ఈ సినిమా కథ గొప్ప కథేమీ కాదు. ప్రతి రోజూ, ప్రతి పట్టణంలో, ఏదో ఒక మూల, ఎవరో ఒకరి ఇంట్లో జరిగే కథే ఇది. బ్రతుకు తెరువు కోసం నగరానికి తరలి వచ్చిన తమ పిల్లలను చూడడానికి పల్లెటూరినుంచి వచ్చిన ఒక అమ్మ-నాన్న ల కథ ఇది. ఏ రైల్వే స్టేషన్ కి వెళ్లినా, బస్ స్టాండ్ కి వెళ్లినా మీకు ఇలాంటి తల్లిదండ్రులు కనిపిస్తారు. అయితే ఓజు ఈ సినిమా లో సన్నివేశాల్ని చిత్రీకరించిన విధానం అపూర్వం. ఒక వేళ ఆ తల్లిదండ్రులతో పాటు మనం కూడా కొన్ని రోజులు గడిపే అవకాశం దొరికితే ఎలా ఉంటుందో, ఈ సినిమా చూస్తే అలాంటి అనుభవం మనకి కలిగిస్తాడు దర్శకుడు ఓజు.

జీవితంలో ఒకే ఒక్క సినిమా చూసే అవకాశం మిగిలిఉంటే, నేను “టోక్యో స్టోరీ” నే ఎన్నుకుంటాను. ఈ సినిమా చూస్తే మీరు కూడా నాతో అంగీకరిస్తారు. ఎందుకంటే దీన్ని కేవలం సినిమాగా మాత్రమే చూడలేము; మన చుట్టూ, మన చెంతన, మన లోలోపల ఉన్న జీవితాన్ని యధాతథంగా చిత్రీకరించిన సినిమా ఇది. ముఖ్యంగా ఉన్నతమైన జీవితం కోసం నగరానికి తరలివచ్చిన వారికి, ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఈ సినిమా తమ జీవితాలను గుర్తుకు తెప్పిస్తుంది. కావడానికి ఇది జపాన్ కి చెందిన సినిమా అయినప్పటికీ ఈ సినిమాలోని పాత్రలు, పరిస్థుతులు విశ్వజనీనమనవి. అందుకే ఈ సినిమా చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవడమే కాదు, గడిచిపోయిన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంలా, భావితరాలకు అందమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది.