Menu

తోడికోడళ్ళు

ఇది ముగ్గురు తోడికోడళ్ల కథ. అన్నపూర్ణ (కన్నాంబ) , అనసూయ (సూర్యకాంతం ), సుశీల (సావిత్రి). పెద్ద కోడలు అన్నపూర్ణ మాట కటువైనా మనసు మాత్రం నవనీతం లాంటిది. ఆమె భర్త కుటుంబరావు (ఎస్.వి.రంగారావు) మంచి పేరున్న వకీలు. కోర్టు విషయాలు తప్ప ఇంటి విషయాలు పట్టించుకోడు. పైగా ఇంటివిషయాలంటే మతిమరుపు కూడా. రెండో కోడలు అనసూయ అసూయాపరురాలు. ఆమె భర్త రమణయ్య ( రేలంగి) పేకాట రాయుడు, కులాసాగా తిరగడం,ఎప్పుడూ డబ్బు తగలేయడమే . మూడో కోడలు సుశీల మొత్తం ఇంటిని తన చేతులమీదుగా నడిపిస్తుంది . ఇంట్లో ఆమె మాటకు తిరుగు ఉండదు. ఆమె భర్త సత్యం (ఎ.ఎన్.ఆర్). అన్యాయాన్ని సహించడు. రమణయ్య దంపతులు స్వంత ఊర్లో వ్యవసాయం చేస్తుంటారు. ఒకసారి పండక్కి బస్తీకి వచ్చిన అనసూయ , అక్కడ సుశీలకు దక్కుతున్న గౌరవం, పెత్తనం చూసి ఓర్వలేక, తాము ఊర్లో కష్టపడుతుంటే బస్తీలో మిగతా కుటుంబ సభ్యులు అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అందుకే తన భర్తను వ్యవసాయం వదిలి బస్తీలోనే ఉండి వ్యాపారం చేయమంటుంది. పిల్లల మధ్య చిన్న చిన్న తగాదాలు పెట్టితే అవి పెద్దవై కుటుంబంలో చిచ్చు ఏర్పడుతుంది. దానితో రభస జరిగి సుశీల దంపతులు తమ కొడుకుతో కలిసి పల్లెకు పోయి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటారు.సుశీల కొడుకంటే అన్నపూర్ణకు చాలా ప్రేమ. పిల్లవాడు దూరం అయ్యాడన్న చింత ఆవిడను బాధిస్తుంది. కాని అనసూయ కుట్రల వల్ల కుటుంబంలో కల్లోలం ఇంకా పెరుగుతుంది. బస్తీ షోకులతో పాటు రమణయ్య ఒక స్త్రీ మోజులో పడి మొత్తం డబ్బు గుల్ల చేస్తాడు. రమణయ్య అప్పు చేయడం కోసం అన్నగారి పేరు మీద దొంగ నోటు రాస్తాడు. దానిని విడిపించుకోవడానికి సుశీల తన నగలన్నీ ఇస్తుంది. చివరకు కుటుంబరావుకు నిజం తెలిసి రమణయ్యను, అనసూయను నిలదీస్తాడు. ఎట్టకేలకు మనస్పర్ధలన్నీ తొలగి అందరు ఒకటవుతారు.

ఇది అన్నపూర్ణ పతాకం మీద వచ్చిన రెండో చిత్రం “తోడికోడళ్ళు”. 1957 లో విడుదల అయింది. శరత్ నవల “నిష్కృతి” ఆధారంగానిర్మించబడింది.

నిర్మాత : దుక్కిపాటి మధుసూదన్ రావు
దర్శకుడు : ఆదుర్తిసుబ్బారావు
ముఖ్య తారాగణం : ఎస్.వి. రంగారావు, కన్నాంబ, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం, జగ్గయ్య, రాజసులోచన మొదలైన వారు.
సంగీతం :మాస్టర్ వేణు
పాటలు : తాపి ధర్మారావు, శ్రీ శ్రీ, ఆత్రేయ, కొసరాజు.

తోడి కోడళ్ళు చిత్రం తెలుగు , తమిళంలో ఒకేసారి నిర్మించబడింది. మంచి కథ, సహజమైన నటన, మనోహరమైన పాటలు, సంగీతం మొదలైనవన్ని ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమాలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. గాయని సుశీల ఈ చిత్రంలో మొదటిసారిగా సావిత్రి కి పాటలు పాడారు. ఇందులోని పాటలన్నీ బహు పసందుగా వీనుల విందుగా ఉన్నాయి. ఉమ్మడి కుటుంబం నుండి వేరు పడ్దాక సుశీల పాడే ” కలకాలమీ కలత నిలిచేది కాదు ” అనే పాటను తాతాజీ(తాపి ధర్మారావు) రాసారు. వ్యవసాయం చేస్తు సత్యం పాడే ” నలుగురు కలసి,పొరుపులు మరచి ” రమణయ్యను కవ్విస్తూ నవనీతం పాడే “పొద్దైనా తిరగకముందే “పాటలను శ్రీ శ్రీ రాసారు. పిల్లలందరు కలసి గాలిపటాలు ఎగరేస్తూ పాడే ” గాలిపటం గాలిపటం ” ,”ఆడుతు పాడుతు పని చేస్తుంటే” , “టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ” , శ్రీరస్తు శుభమస్తు ” పాటలను కొసరాజు రాసారు. భావుకుడు అయిన సత్యం ఒకరోజు కారులొ వెళ్ళే అమ్మాయిని చూసి పాడే ” కారులో షికారు కెళ్ళే” పాటను ఆత్రేయ రాసారు. ఈ పాట సినిమాకు రాసింది కాదు. ఆత్రేయగారు రోజు సాయంత్రం మెరీనా బీచ్‍కి వెళ్లినపుడు అదే సమయానికి అక్కడికి కార్లలో వచ్చే క్వీన్ మేరీస్ విద్యార్థినులను చూసి రాసుకున్న పాట అని ఆయనే చెప్పుకొచ్చారు.

ఇంకో పాట
ఆడుతు పాడుతు పని చేస్తుంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే
ఎదురేమున్నది . మనకు
కొదవేమున్నది

ఈ పాటను నాయికా నాయకులు సావిత్రి, , నాగేశ్వర రావు పట్నవాసం వదిలి పల్లెటూరిలో వ్యవసాయం చేస్తూ కూడా కలిసి మెలిసి పని చేస్తూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. పొలానికి నీళ్ళు పెట్టేందుకు ఇద్దరు కలిసి గూడ వేస్తూ పాడే ఈ పాట ఎంతో పేరు పొందింది. అందరు హాయిగా పాడుకున్నారు. ఆ పాటలోని అర్ధాన్ని కూడా తమ జీవితానికి అన్వయించుకుంటారు ఇప్పటికీ. జానపద సాహిత్యానికి “కొస” రాజైన రాఘవయ్య చౌదరి రాసిన ఈ పాట , మాస్టర్ వేణు గారి సంగీతంతో ఘంటసాల, సుశీలల గాన మాధుర్యంతో చాలా ప్రసిద్ధికెక్కింది. ముఖ్యంగా భార్యా భర్తల సరస శృంగారం, చమత్కారం కనిపిస్తుంది ఈ పాటలొ. అందునా వయ్యారంగా సావిత్రి, , చిలిపిగా నవ్వుతూ అక్కినేని లయ తప్పకుండా పాటకు తగ్గట్టు గూడ వేసారు. అలగే ఇంకో పాట “టౌను పక్క కెళ్ళొద్దురో డింగరీ ” ఇది ఒక సినిమా పాటగానే కాకుండా నిజజీవితంలో కూడా మనకు వర్తిస్తుంది అని చెప్పొచ్చు. అందులో పట్నవాసం మోజులో పల్లెలు వదిలి వెళ్ళే కుర్రకారుకు .

తోడికోడళ్ళు సినిమా చూస్తున్నంతసేపు అది మనకు తెలిసిన వారింట్లో జరిగింది కదా అనిపిస్తుంది. అంత వాస్తవికంగా నిర్మించారు. ఆరోగ్యం అంతగా బాగుండని పెద్ద కోడలు. కోపంతో నాలుగు మాటలన్న తర్వాత బాధపడి, “ఏం నేను ప్రేమతో ఆమాత్రం అనకూడదా? ” అనే అమాయకత్వం కలది. రెండో కోడలు మాత్రం గయ్యాళి, అసూయాపరురాలు. పల్లెలో తాము మాత్రమే కష్టపడుతున్నాము. పట్నంలో ఉన్నవారు హాయిగా ఉన్నారు అని , ఓర్వలేని తనంతో భర్తను ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇల్లాల్ల్లు ప్రతీ ఉమ్మడికుంటుంబంలో ఉంటారేమో. ఎలాగూ పెద్దన్నయ్య సంపాదిస్తున్నాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నాడు అన్న ధీమాతో, చిన్న కొడుకు సత్యం చదువు పూర్తయినా కులాసాగా కవితలు రాస్తూ ఉంటాడు. అతని భార్య చదువుకున్నది కాబట్టి ఇంటి బాధ్యత తన చేతుల్లోకి తీసుకుని ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. పిల్లల చదువులు, భొజనం, క్రమశిక్షణ విషయంలో కాస్త కఠినంగా ఉంటుంది . పనివాళ్ళను అభిమానంతో వాళ్ళకు కావలసినవి సమకూరుస్తుంది. అందుకే ఇంట్లో అందరు ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఇది రెండో కోడలుకు సయించదు. తాము మాత్రమే చాకిరి చేస్తుంటే సుశీల మహారాణీలా పెత్తనం చెలాయిస్తుంది అనే అక్కసుతో పిల్లల మధ్య పోట్లాటలు పెడుతుంది. పెద్ద కోడలుకు చాడీలు చెప్తుంది. చివరకు అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలై అవి తీవ్రమై సత్యం దంపతులు పల్లెకు , అనసూయ దంపతులు పట్నానికి చేరతారు. యోగ్యులైన సత్యం, సుశీల దంపతులు పల్లెలో కూడా సంతోషంగా ఉంటారు. చివరకు ఇంటి పెద్దాయన జోక్యం చేసుకుని అందరినీ మందలించి పరిస్తితులు చక్కదిద్దుతాడు. ఎప్పటికైనా ఈర్ష్య, అసూయలతో జీవితం బాగుపడదు. అందరు కలిసి మెలసి ఉండాలనే ఒక మంచి నినాదం ఇచ్చారు నిర్మాత , దర్శకులు ఈ చిత్రంతో. ఎన్ని సార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందీ సినిమా. అంత అందమైన చిత్రీకరణ, మధురమైన సంగీతం, పాటలు. దేనికదే సాటిలేనిది అని చెప్పవచ్చు.

వందరోజులు ఆడిన తోడికోడళ్ళు సినిమాకు ఆ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి యోగ్యతా పత్రం లభించింది.

–జ్యోతి వలబోజు

6 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 25, 2008 /
  2. pappu November 12, 2008 /
  3. SKJ December 22, 2008 /
  4. రమేష్ పంచకర్ల January 17, 2009 /
  5. ఆచారం షణ్ముఖాచారి January 4, 2017 /