Menu

తెనాలి రామకృష్ణ

కత్తులును ఘంటములు కదనుతొక్కినవచట, అంగళ్ళ రతనాలనమ్మినారట అచట,
నాటి రాయల కీర్తి నేటికిని తలపోయు తుంగభద్రా నదీ సోయమాలికలందు
ఆడవే జలకమ్ము లాడవే…

అంటూ విజయనగర సామ్రాజ్య ప్రాభవాన్ని వర్ణిస్తారు డా.సి నా రె గారు.అలా..తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, అష్టదిగ్గజాల వైశిష్ట్యాన్ని, భువనవిజయపు ప్రాభవ వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఈ సినిమాలో.

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స

అంటూ తెలుగు భాష ప్రాశస్త్యాన్ని విశదీకరిస్తూ తనకి ఆ భాష ఎందుకంత ఇష్టమో చెపుతాడు రాయలు తన ప్రియతమ మహారాణి అడిగిన చిన్న సందేహానికి. తాను స్వతహాగా కవి అయిఉండీ, తన కవికుల పక్షపాతాన్ని అష్టదిగ్గజాల రూపంలో నెలకొల్పి నేల నలుచెరగులా తనకు తానే సాటి అనిపించుకుంటాడు. అంగార్థగజబలాల సాయంతో,అప్పాజీ రాజకీయ చతురతతో భువనవిజయ కీర్తి ప్రతిష్టలని ఇనుమడింప జేస్తాడు రాయలు.

తెలుగు సంస్కృత భాషల వ్యాప్తికి కృషిలో భాగంగా తన ఆస్థానంలో అష్టదిగ్గజాలనే కవులకి స్థానం కల్పించి భువనవిజయానికి వన్నె తెస్తాడు రాయలు.ఆ అష్టదిగ్గజాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. వారిలో రామలింగడు ఇంకా ప్రత్యేకం. నేను నియోగి బిడ్డను ఎందుకు వినియోగించినా వినియోగపడతానంటూనే చెప్పుకుంటాడు తన పరిచయవాక్యాలలో రాయల సభలో కొలువుకు వచ్చినప్పుడు. తండ్రి గార్లపాటి రామన్నమంత్రి , రాయల ముఖ్యమంత్రి తిమ్మరసు అప్పాజీ సహాధ్యాయులు కావటం వల్ల అప్పాజీకి కొంచం అభిమానం ఎక్కువే రామలింగడంటే, సంగీత సాహిత్యాలలో, శిష్టా వ్యాకరణ జ్యోతిష మీమాన్సాదులలో నయితేనేమి, సంస్కృతాంధ్రాల్లో నయితేనేమి జగన్మాత అనుగ్రహం పొందినవాడవడం వల్ల భువనవిజయానికి ఒక ప్రత్యేకతగా వికటకవి గా ప్రసిద్ధి చెందుతాడు.

నటీనటులంతా అగ్రతాంబూలనికి అర్హులే,తెరవెనుక కళాకారుల సమిష్టి కృషి కి ఇదొక నిదర్శనం. రాయలుగా రామారావు, రామలింగడిగా అక్కినేని, తిమ్మరుసుగా నాగయ్య ల నటన నభూతో:న భవిష్యతి:.

ఓ ప్రత్యేక గూఢచార నర్తకి పాత్రలో డా.భానుమతి ఆవిడ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సినిమాలో సంధ్య (తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రిణి జయలలిత తల్లి) రాయల భార్య గా నటించారు.

ముక్కామల, వంగర, మిక్కిలినేని,జమున,మాస్టర్ వెంకటేశ్వర్, బాలసరస్వతి ఎవరికి వారు తమ పాత్రలకి ప్రాణం పోసారు.

విక్రం ప్రొడుక్షన్స్ బేనర్ పై “సి.కె వెంకటరామయ్య గారు” రచించిన నాటకం అధారంగా నిర్మించిన ఈ చిత్రానికి మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య, సంగీతం హిట్ పెయిర్ విశ్వనాథన్-రామమూర్తి, గాయనీ గాయకులు ఘంటసాల,మాధవపెద్ది,లీల,ఆర్.బాలసరస్వతి,సుశీల,కోమల,నిర్మాత-దర్శకుడు బి.ఎస్.రంగా.

అసలు కృష్ణదేవరాయలు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఉంటే ఇలాగే మాత్రం ఉండాలనిపించారు ఎన్.టీ.ఆర్ అతని స్ఫురద్రూపంతో.అలాగే రామలింగడుగా అక్కినేని కూడా ఎన్ టీ ఆర్ తో పోటీపడి నటించారు.మిగతా పాత్రలన్నీ బంగారానికి వన్నె దిద్దినట్టే.

ప్రధమార్థమంతా రామలింగడి చతురోక్తులతో పాండిత్య ప్రకర్షలతో నడిపించి ద్వితీయార్థం రాజకీయ చాతుర్యము,గూఢచర్యము,లౌక్యం, రాజభక్తి, దేశాభిమానములతో మిళితం చేసి నడుస్తుంది కధ.

ప్రత్యేకంగా చెప్పుకో వలసినవి సముద్రాల వారి సంభాషణలే ఈ చిత్రానికి వెన్నెముకా, గుండెకాయ, ఆయువుపట్టూ అన్నీకూడా.

మచ్చుకు కొన్ని

రామలింగడు తాతాచార్యుల వారి ద్వారా రాయల సభలోకి అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నించినప్పుడు వంగరతో చెప్పించిన సంభాషణల్లో వ్యంగ్యంగా “ఈ కాలంలో కవిత్వమూ వైద్యమూ రానివాడెవడ్లే,రిక్త హస్తాలతో వచ్చింది మమ్మల్ని రక్షించడానికా,అయినా పెద్దలనూ పూజ్యులనూ దర్శనం చేసుకోడానికి ఎలా రావాలో తెలియనివాడివి సభా ప్రవేశం చేసి కవిత్వం అల్లుతావేం కవిత్వం,నీ టక్కులు నా దగ్గర సాగవు అంటూ మెడ బట్టి గెంటేస్తాడు(అన్యాపదేశంగా కాలం ఏదయినా టక్కులు ఎంత అవసరమో తెలియచేస్తూ).

ఆ సంఘటన తర్వాత రాయలవారి సభలో ఎదురయిన ఒక సంఘటనలో తన సమయస్పూర్తి ప్రదర్శించి ఏనుగుల పంపకాన్ని చేసి రాయలవారిని మెప్పించి కొలువులో స్థానం సంపాదిస్తాడు.అదే సభలో

“మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా”

అంటూ నంది తిమ్మన్న మీద ఆసువుగా చెప్పిన పద్యం లోని గగనధుని నాకధుని తో పదమార్పిడి చేసి కూర్చి రాయల్ని మెప్పించి ఇంకా రసవత్తరంగా ఉంటుంది ప్రభూ మీ మార్పు నా నేర్పుకు ఘనత కలిగించిది మహారాజకవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నాడు అందుకోండి అంటూ అతడిచ్చిన సరస్వతీ ప్రసాదాన్ని(తలపాగా గా కట్టుకున్న మధుపర్కం)ని స్వీకరించి రాయలతన్ని తన కవి దిగ్గజాల్లో ఒకడిగా చేర్చుకుంటాడు.

రాయల వారి గురువు తాతాచార్యులవారికి ఈ రామలింగడు ఏకుకుమేకయి ఉంటే ఏమి చెయ్యాలో తెలియక భట్టుమూర్తి కి సలహా ఇచ్చి ఓ భటుని తో “కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్” అనే పదాన్నిచ్చి రామలింగడ్ని సమస్యా పూరణం అడిగించమంటాడు.అప్పుడు ఆ భటుడు అడిగిన పై ప్రశ్నకు సమాధానంగా రామలింగడి పూరణం చిత్తగించండి

“గంజాయి త్రావి తురకల
సంజాతము చేసికల్లు చవి గొన్నావా
లంజల కొడకా ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్”

అని పూరించి చెంపలేయిస్తాడు అందరిముందూ ఆ భటుణ్ణి, అన్యాపదేశంగా వాడ్ని తనమీద ప్రయోగించిన వారెవ్వరో తెలుసన్న సూచన ఇస్తూనే….

ఆ భటుడు చెంపలేసుకుంటె హరి హరీ అంటూ ఆ తిట్లు అందరూ భాగం పంచుకుంటారు.

ఆ తర్వాత అదే సమస్య ని రాయలు కొలువులో రామలింగడ్ని పూరించమని అడగ్గా అక్కడి పూరణం గమనించండి

రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వు పాలైరకటా
సంజయ విధినేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

నీ బుద్ధికి రెండు పక్కలా పదునే రామకృష్ణయ్యా అంటూ చమత్కరించి సత్కరిస్తారు రాయలవారు మరొఖ్ఖసారి.

అలా మరోసారి సహస్రఘంట కవి అన్నతను వచ్చి పట్టిన ఘంటం ఆపకుండా రాత రాస్తాను,పరుల కవిత్వంలో తప్పులు పడతాను అని సవాల్ చేస్తె అతన్ని

“త్పవ్వట బాబా తలపై
పువ్వట జాబిల్లి వల్వ బూచట చేదే
బువ్వట చూడగను లుళు
కవ్వట యరయంగ నట్టి హరునకు జేజే”

అనే మొదటి అక్షరాన్నే రాయలేని పద్యాన్నిచ్చి ఓడించి విజయనగరాస్థాన గౌరవాన్ని దక్కించి సత్కారాన్ని పొందుతాడు.

మరోసారి కాశీ నించి వచ్చిన ఇంకో వ్యాకరణ పండితుడ్ని ఓడించడానికి అతనితో తలపడాలని కబురొస్తే ఈసారి తాతాచార్యులవారు అప్పనా ఏమి విన్నావో అప్పగించంటే వంగర చిన్నపిల్లడిలా తమరు రేపా కాశీ పండితుడ్ని వాగ్యుద్ధంలో ఢీకొంటారనిన్నీ,అతని మాడు వాయగొడతరనిన్నీ అంటూ చెప్పగానే అతన్ని నీ మొహం అనిన్నీ అని చీత్కరించి..

అప్పన్నా నీ బుద్ధిలో దద్ధోజనం పసే గానీ పులిహోర ప్రభావం రవ్వంత కూడా కనపడ్లేదని అప్పన్నని రెచ్చగొట్టి ఎదటి బలం తెలియకుండా ఎదిరిస్తే జయాపజయాలు ఎవరివో అందువల్ల ఆ కాశీ పండితుడి మీదకి రామలింగడ్ని ఎరవేసి ఫలితం రాబట్టాలని పధకం వేసి రామకృష్నునితో మాట్లాడి ఆ కాశీ పండితుని మీదకి ఉసిగొల్పమంటాడు. అలాగే అని బయల్దేరి రామలింగడింటికి వెళ్ళి ప్రయత్నించి ఒప్పిస్తాడు.

తరవాత రోజు సభలో ఆ పండితుడు తన పాండిత్యం ప్రదర్శిస్తూ కొండవీటి సీమ లో అనవేమారెడ్డిని వర్ణిస్తూ చెప్పిన “రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలప నన్నయ వేమ ధరణి పతికి, భావ భవ భోగ సత్కళాభావములను” అంటూండగా అందుకుని దాని అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్యా చెపుతా ఈలోగా మీరూ ఈ పద్యాన్ని గురించి కొంచం ఆలోచించండి అంటూ రామలింగడు చదివిన పద్యము తెలియని వారుండరు,అసలు ఈ పద్యం(?)వినగానే రామలింగడే గుర్తొస్తాడు అనడంలో ఔచిత్యం లేదు

“మేక తోకకు మేక తోకకు మేక తోకా మేక మేక తోక” అంటూ తిక మక పెట్టి ఆ పండితుడ్ని వెళ్ళగొడతాడు.ఇలా అన్ని వేళలా భువనవిజయపు వైభవాన్ని మిగిలిన కవి దిగ్గజాలతో కలిసి నిలబెడుతూ, బహమనీ సుల్తానుల కుట్రల్నీ,కుతంత్రాలనీ అప్పాజీ సహాయంతో ఛేదించి,బాబర్ చక్రవర్తిని తన వాక్పటిమతో మెప్పించి అతని గజబలాన్ని బహమనీ సుల్తానులకి సాయమివ్వకుండా ఆపించి రక్తపుబొట్టు చిందకుండా విజయనగర సామ్రాజ్యానికి విజయాన్ని సాధించిపెడతాడు చివరగా…

ఏ వయసు వారయినా ఈ సినిమాని చూసి ఆనందించవచ్చు అదీ ఈ చిత్రం ప్రత్యేకత. ఈ చిత్రాన్ని చూసి ఆనందించ లేకపోయానని ఎవరన్నా అంటే ఆ వ్యక్తిలో ఏదో లోపం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఏ డాక్టర్ సలహా లేకుండా. (ఇది నా అభిప్రాయం మాత్రమే)

ప్రతి ఇంటి లైబ్రరీ/కలక్షన్లో తప్పక ఉండవలసిన చిత్రం ఇది…

–శ్రీనివాస్ పప్పు

18 Comments
 1. chaitanya February 25, 2009 /
 2. మురళి February 25, 2009 /
 3. Bhaskar Ramaraju February 25, 2009 /
 4. కొత్తపాళీ February 25, 2009 /
 5. Madhu February 25, 2009 /
 6. T K Venugopal February 25, 2009 /
 7. అసంఖ్య February 25, 2009 /
 8. sreenivas pappu February 25, 2009 /
 9. కొత్తపాళీ February 26, 2009 /
 10. chaitanya February 26, 2009 /
 11. sreenivas pappu February 26, 2009 /
  • chaitanya February 27, 2009 /
  • chaitanya February 27, 2009 /
 12. Sastri February 27, 2009 /
 13. శ్రీ లక్ష్మీ కళ March 1, 2009 /
 14. learner March 6, 2009 /
 15. కొత్తపాళీ January 8, 2010 /