Menu

ఆలోచింపజేసే తాత్విక పద్యం ‘Ship of Theseus’

యెన్నో రోజులు ఎదురు చూసాక, చివరికి ‘షిప్ ఆఫ్ థీసియస్’ చూసే అవకాశం దొరికింది. ఆ సినిమా దర్శకుడే సినిమాని ఆన్ లైన్ లో ఉంచి అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. చాలా గొప్ప, అభినందనీయమైన విషయం అది. కీర్తీ , లాభాపేక్షా లేకుండా తన సినిమాని ఓపెన్ సోర్స్ పద్దతిలో ఆన్ లైన్ లో ఉంచి దాన్ని యెవరికి తోచినట్టుగా యెడిట్ చేసుకుని మరో కొత్త “షిప్ ఆఫ్ థీసియస్” తయారు చేయమనడం ద్వారా ఆనంద్ గాంధీ తాను తెరకెక్కించిన “షిప్ ఆఫ్ థీసియస్” విరోధాభాసకు సార్థకత సాధించినట్టే!

లైట్లు ఆర్పేసినాక టీవీ తెర మీద చిన్న అక్షరాలతో టైటిల్స్ పడ్డంతో పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయి సినిమాని చూడ్డం మొదలుపెట్టాం. సినిమాలోకి ఒక 5 నిమిషాలు గడవగానే ఒక రకమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాను. ఒక్కో ఫ్రేమ్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక పద్యం చదువుతున్నట్టు – కవితా పాదాలు అలా ఝుమ్మంటూ నాదం చేస్తూ చుట్టూ తిరుగుతున్నట్టు! మెల్లగా నాకు నేనే ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోయి లీనమవుతున్నట్టు – కరిగి పోతున్నట్టు – అంతరంగమంతా తీవ్రమైన అలజడి అలలు రేపుతూ ఒడ్డుని చరుస్తున్నా, బహిరంగంగా ఒక నిశ్చల సమాధిలోనున్నట్టు ఒక విరోధాభాస! సినిమా కథ గురించీ వస్తువు గురించీ ఇప్పటికే చాల మంది చాల చోట్ల రాసారు కాబట్టి మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదనుకుంటా! సినిమాలోని మూడు ప్రధాన పాత్రల కథలూ ముఖ్యంగా ప్రస్తావించిన విషయాలు – ప్రాణం, జీవితం, అస్తిత్వం, మృత్యువూ – అస్తిత్వానికీ ప్రపంచానికీ ఉన్న సంబంధం – ప్రపంచాన్ని మనదైన శరీరం ద్వారా విని, చూసి, మన ఉనికిలోకి, మన అనుభవం లోకి తెచ్చుకుని మన జ్ఞానం లో భాగమైన సమస్త చరాచర వస్తు ప్రపంచాన్ని మనదిగా చేసుకుని మనం గడిపే ప్రతి క్షణం మన జీవితమైతే యితర అన్ని ప్రాణులకూ ఆ జీవితం అంతేనా ! మన ఉనికే వాటికీనా? అనేకానేక తాత్విక ప్రశ్నలు – మృత్యువు వల్ల యేమి జరుగుతుంది – మృత్యువంటే యేమిటి? మృత్యువు తర్వాత జీవితమేమిటి? జీవి సంగతేమిటి –ఆత్మ ఉందా? దాని ఉనికి యేమిటి? మతపరమైన నియమాలకూ, నిబంధనలకూ, ఆచారాలకూ అతీతంగా మానవ సమాజ నీతి సాధ్యమా? అట్లా పాపభీతి లేకుండా, మన కార్యాచరణకు బాధ్యత వహించకుండా , నీతులు పాటించగలమా? మనం చేసే పనుల పరిణామమే మన ప్రపంచగమనమా? దేవుడూ, ఆత్మా యేవీ లేవని నమ్మడం సుఖవాదమూ, విధ్వంసకవాదమూనా (hedonism and nihilism)? కోటానుకోట్ల సూక్ష్మ జీవరాశులకు ఆలవాలమైన మన శరీరం అనుక్షణం ఆ జీవరాశులపై హింస జరపకుండా మనగలగడం సాధ్యమా? మనుగడకోసం మానవుడు లేదా ఇతర యే పశుపక్ష్యాదులే గానీ చెట్టు చేమలే గానీ హింస జరుపకుండా బ్రతుకగలవా? మన శరీరంలో ఒక బాగాన్ని replace చేస్తే మనం మనంగానే మిగుల్తామా? లేక అది మరెవరోనా? యిట్లా అనేకానేక తాత్విక ప్రశ్నలు వేస్తూ , వాటిని అతి జాగ్రత్తగా ఒక్కో ఫ్రేం లో అత్యంత కవితాత్మకంగా తెరకెక్కించిన కావ్యం ఈ సినిమా.

1

నిజానికి సినిమా లోని మూడు కథలకూ అవయవ మార్పిడి జరిగిందన్న యేకసూత్రతా , అవయవ మార్పిడి జరిగింతర్వాత ఆయా మనుషులు వారుగా మిగిలారా అనే విరోధాభాస తప్ప similarities తక్కువ. మొదటి కథ లోని ఫొటోగ్రాఫర్ అమ్మాయి ఆలియా కమల్ తనకు చూపు లేనప్పుడు కేవలం తన శబ్ద ప్రపంచాన్ని కెమెరా లో బంధించి దృశ్యమానం చెయ్య గల గొప్ప intuitive ప్రతిభ కలిగి ఉంటుంది. యెవరైనా , చివరికి తన ప్రియుడైనా తనని patronize చెయ్య జూస్తే యే మాత్రం సహించనిది. ఆ అమ్మాయి కి వేరే వాళ్ళ కంటి కార్నియా గ్రాఫ్ట్ తో చూపు రావడం వల్ల తనకు ఇంతకు ముందు కేవలం శ్రవణంతో ఉనికిలోకి వచ్చిన బాహ్య ప్రపంచం ఇప్పుడు దృష్టి ద్వారా కూడా అనుభవం లోకి రావడం వల్ల కలిగిన ఘర్షణ, వైరుధ్యమూ, కోల్పోయిన అంతర్దృష్టి – అద్భుతంగా చిత్రీకరించి ప్రతిపలిస్తాడు దర్శకుడు, తనకు వచ్చిన చూపు మరెవరిదో అనీ , అది తన అంతర్దృష్టి ని ఇంకెవరితోనో replace చేసిందనే ఘర్షణను ప్రదానంగా ఆ అమ్మాయి చాలా గొప్పగా ప్రతిఫలించింది. అత్యంత ప్రతిభావంతమైన నటన, దర్శకుని ప్రతిభా, కెమెరా పనితనం ఆ అమ్మాయి ఘర్షణని తాత్విక కవిత్వ స్థాయికి తీసికెళ్లాయి. ఆమె చూపు లేనప్పుడు దృశ్యాన్ని ఊహించే తీరు, కేవలం శబ్దం తోనే ప్రపంచాన్ని దృశ్యమానం చేసే పద్దతిని దర్శకుడు అద్భుతంగా చిత్రించాడు. ముఖ్యంగా శబ్దాన్ని వాడుకున్న పద్దతి, జాగా (space) లను వాడుకున్న తీరు సినిమా చూసాక చాలా రోజుల వరకూ వెంటాడుతాయి. ఆమెకు చూపు వచ్చినాక ఆమెను మూసిన జాగా లోంచి ఆకాశంలోకి తీసికెళ్ళడం చాల కవిత్మాత్మకంగా ఉంది. ఆమె తాను ఇంక గతం లోలా ఫొటో లు తియ్యలేనని తెలిసాక పడే ఘర్షణ, ప్రేరణనిచ్చే కొత్త జాగా ల కోసం పడే తపన, ధ్వనీ, దృశ్యమూ కలగలిసిన అద్భుత ప్రకృతి సౌందర్యం మధ్య ధ్యాన స్థితి లో నిమగ్నమవడం ఆమె పరిస్థితిని తాత్వికంగా symbolize చేసాడు దర్శకుడు.

2

యింక రెండో కథ పూర్తిగా ‘ship of theseus’ విరోధాభాసను ప్రతిఫలించిందని చెప్పలేము. కానీ , చాలా subtle గా, మానవ శరీరమే ఆలవాలంగా బతికే కోటానుకోట్ల జీవుల పై మనిషి తనకు తెలియకుండా , తన నియంత్రణలో లేకుండా, చేసే హింస ను గుర్తించి, ఆ హింస చేయకుండా మనిషికి మనుగడ లేదని, నిజానికి ప్రపంచంలో యే ప్రాణీ మరో ప్రాణిని యేదో రకంగా హింసించకుండా (తనకి తెలియకుండానే) మనలేదని ఇది ప్రకృతి లోని సహజ వైరుధ్యమని తాత్వికంగా, కవిత్మాత్మకంగా చెప్పాడు. తాత్వికంగా గొప్పనైనది కవిత్మాత్మకం కూడా అవుతుంది అని నిరూపించాడు కూడా! అహింస, అణకువా, వినయమూ తన జీవిత విధానంగా మలుచుకున్న మైత్రేయ అనే జైన భిక్షువు, తమ మందులని పరీక్షించడానికి పశువులని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసే మందుల కంపెనీలు చేసే జీవహింసకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతుంటాడు. అతనికి చార్వాక అనే జూనియర్ వకీలు సాయం చేస్తూ ఉంటాడు. చాల symbolic గా అతనికి చార్వాక అని పేరు పెట్టి, భారతీయ తత్వశాస్త్రంలో ఒక ముఖ్యమైన తాత్విక చింతనూ, చర్చనూ అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. చార్వాక భారతీయ తత్వ్తశాస్త్రం లో భౌతిక వాద తాత్విక చింతనా వ్యవస్థ . లోకాయత అని కూడా సుప్రసిద్దం. . మైత్రేయ కొంత హేతువుతో కూడుకున్నా ఆచరణ సాధ్యం కాని అనేక సూత్రాలను బోధించే జైనభిక్షువు. ఒక సారి చార్వాక ను సుఖవాది (hedonist) అనీ, విధ్వంసవాది (nihilist) అనీ అంటాడు కూడా! కానీ ప్రకృతిని భౌతికంగా చూసి అర్థం చేసుకుని ఆ ప్రాకృతిక సూత్రాలని భౌతికనియమాలకు లోబడే పాటించాలని ప్రకృతిలో ప్రతీది చలనంలోనూ ఘర్షణలోనూ ఉంటుందనీ, ఆ ఘర్షణా దానివల్ల కలిగే హింసా అనివార్యమనీ చార్వాక వాదిస్తాడు. అందులో భాగంగానే చీమ శరీరాన్ని ఆక్రమించుకునే ఫంగస్ గురించి చెప్తాడు. నైతికసూత్రాలని మతపరం చేయకుండా మతాచారాలు చేయకుండా కూడా పాటించవచ్చని, ఈ విశ్వమూ, మనం బతికే ఈ ప్రపంచమూ దానికొక సృష్టికర్తా , లయకారకుడూ అంటూ లేకుండా law of causality పై ఆధారపడి నడుస్తున్నదని మనం చేసే పనులకూ వాటి పరిణామాలకూ మనమే పూర్తి బాధ్యత వహించాలనీ , ఐతే వీలయినంతవరకు హింసనూ, వేదననూ, దుఃఖాన్నీ అరికట్టాలనీ మైత్రేయ వాదన. తనకు వచ్చిన ప్రాణాంతకమైన కాలేయ సంబంధమైన జబ్బు (liver cirrhosis) కు మందులను, తాను వ్యతిరేకంగా పోరాడుతున్న మందుల కంపెనీల నుండే తీసుకోవడం ఇష్టం లేక మైత్రేయ ఆత్మ త్యాగం చేసుకోవడానికి పూనుకుంటాడు. అయితే ఈ క్రమంలో అనేక తాత్విక సంభాషణలు చర్చలు జరుగుతాయి. నిజానికి అటువంటి చర్చలని తెరకెక్కించడం చాలా కష్టం. ముఖ్యంగా చూసిందాన్ని, చదివిందాన్ని మరుక్షణం మర్చిపోయే ఈ ఆధునికానంతర తరానికి అటువంటి సుదీర్ఘ చర్చలు కొంత విసుగు తెప్పిస్తాయి కూడా! ఈ క్రమంలో , మైత్రేయ కథలో దర్శకుడు కెమెరాను, locations ను, అద్భుతంగా వాడుకున్నాడు. ప్రకృతికీ మనిషికీ మధ్య, మనిషికీ మనిషికి మధ్య, మనిషికీ ఇతర ప్రాణులకూ మధ్య జరిగే అనివార్యమైన ఘర్షణా, ఐక్యతలను ఒక్కో frame లో చాలా గొప్పగా దృశ్యమానం చేసాడు. రెండు పొడుగాటి నీటి పైపులమధ్య నుండి మైత్రేయ నడిచి రావడం, గాలిమరల మధ్య నడవడం, జాజి రంగు భవంతిలో ని జాగాలను ఆకాశంలోని నీలానికి మేఘాల బరువులేని తనానికి అనుసంధానం చేసి ఒక్కో జాగా లోంచి ఒక్కో సంభాషణను చిత్రీకరించడం, మైత్రేయలో జ్ఞానోదయం కలుగుతున్నపుడు పచ్చని పైర్లపైనుండి గాలులు వీయడం (గతం లో కురుసోవా లాంటి గొప్ప దర్శకులు ఈ metaphor ని వాడుకున్నా) చాలా కవితాత్మకంగా metaphorical గా సాగుతుంది మైత్రేయ కథనం. ఆయన వేగంగా చెప్పులు లేకుండా నడుస్తున్నపుడు ఆయనని follow చేస్తూ తీసిన tracking shots చాలా గొప్పగా ఉన్నయి. ఆత్మ త్యాగానికి పూనుకున్న ఆయన క్షీణిస్తున్న శరీరాన్ని clinical examination చేస్తూ తీసిన దృశ్యాలు కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాయి. తాను నమ్ముకున్న దానికోసం అంత త్యాగం చేయగల వాళ్ళని చూస్తే హిమవన్నగం లాంటి వారి వ్యక్తిత్వానికి జోహార్లు చెప్పాలనిపిస్తుంది. బహుశా బిటిష్ దర్శకుడు Steve McQueen తీసిన Hunger, Shame (tracking shots లో) ప్రభావముందా అనిపించినా సందర్భం వేరు కాబట్టి స్వయంగా ప్రతిభా వంతుడైన దర్శకుడు ఆయా ప్రభావాలను స్వంతం చేసుకున్నాడు. ఉనికీ, అస్తిత్వమూ, జీవితమూ, హింసా, వేదనా లాంటి మౌలికమైన తాత్విక ప్రశ్నల గురించి మైత్రేయ చార్వాక పాత్రల ద్వారా చర్చ చేయడం ఒక గొప్ప సాహసమే! అదీ దృశ్యమానం చేస్తూ metaphorical గా చేయడం యింకా సాహసం.

3

యింక మూడో కథలో మూత్రపిండ మార్పిడి జరిగిన, డబ్బు సంపాదించడం తప్ప మరో యావ లేని నవీన్ ముంబాయి లో ఒక స్టాక్ బ్రోకర్. సామాజిక చైతన్యం కలిగిన కార్యకర్త ఐన తన అమ్మమ్మ మాటలతో ప్రభావితమౌతాడు. సమాజం పట్ల తనకు బాధ్యత ఉండాలని, మనం అన్ని సార్లూ పూర్తి విజయం సాధించలేకపోయినా మనం చేసే కార్యాల వల్ల కొన్ని సార్లు కొంతమందైన పాక్షికంగానైనా బాగుపడితే చాలని ఆమె చెప్తుంది. మూత్రపిండం దోపిడీ చేయబడ్డ శంకర్ అనే construction worker గురించి తెలుసుకుని అతనిది తనకు మార్పిడి జరగలేదని నిర్ధారించుకుని, అతనినుండి మూత్రపిండం దొంగిలించిన వారిని వెతుక్కుంటూ స్టాక్ హోమ్ దాకా వెళతాడు. అక్కడ శంకర్ మూత్రపిండం అమర్చిన వ్యక్తిని కలిసి ఆయనచే తప్పు తెలుసుకునేటట్టు చేసి తద్వారా శంకర్ కు న్యాయం చేయాలని చూస్తాడు. అయితే శంకర్ నుండి మూత్రపిండం సంగ్రహించిన వారు శంకర్ కు పెద్ద యెత్తున డబ్బు ముట్తజెప్తారు. దానితో తృప్తి చెందిన శంకర్ ఇంకా పోరాడడానికి సిద్దమవడు. విరమించుకుంటాడు. తాను గెలిచానా ఓడానా అనే మీమాంసలో నవీన్ అమ్మమ్మతో విషయం చెపితే ‘కొన్ని అంతే – పూర్తి విజయం సాధించడం కానీ, పూర్తవడం కానీ జరగకపోవచ్చు – యెంత మంచి జరిగితే అంతే అనుకోవాలి’ అనంటుందావిడ. మీమాంసలో పడ్డ్ నవీన్ ని సముద్రపుటొడ్డున మూడు శిల్పాల్లాంటి రాళ్ళ చెంత కూర్చో బెట్టి ఒక గొప్ప metaphor చిత్రిస్తాడు దర్శకుడు.

అయితే సినిమా చివర గురించి చెప్పడం అంత సమంజసం కాదు కానీ చివర్న గ్రీకు తత్వవేత్త ప్లేటో తన “రిపబ్లిక్” లో చెప్పిన గుహ రూపకాన్ని ఒక అద్భుతమైన చిహ్నంగా ఉపయోగిస్తాడు. ప్లేటో గుహ రూపకం (allegory) లో చాలా మంది బందీలు గుహ గోడలకు అభిముఖంగా బంధించబడి అన్ని వస్తువులనూ వాస్తవాలుగా కాకుండా గుహ గోడలమీద నీడలుగానే చూస్తారు. అయితే వారిని బంధవిముక్తుల్ని చేసి నీడలు వాస్తవం కాదనీ, వాస్తవాన్ని వాస్తవంగానే చూసి గ్రహిస్తేనే తత్వవేత్త గుహ నుంచి బంధ విముక్తుడవుతాడనీ చెప్తాడు ప్లేటో . ఈరూపకాన్ని చిత్రీకరిస్తూ సినిమాలోని ముగ్గురు ప్రదాన పాత్రలు యెట్లా వాస్తవాన్ని వాస్తవంగా చూసి, గుర్తించి తెలుసుకున్నారో చాలా symbolic గానూ metaphorical గానూ చిత్రీకరిస్తాడు దర్శకుడు.

సినిమా అనేక కళల సమ్మేళనం. సాహిత్యం, ఫొటొగ్రఫీ, సంగీతం, చిత్రలేఖనం,, నటన, కూర్పు – ఇట్లా అనేక కళల సమ్మిళిత సమాహారమే సినిమా! దర్శకుడు అన్ని కళ్లల్లోనూ నిష్ణాతుడై ఉండాల్సిన అవసరం లేదు గానీ ప్రవేశం మాత్రం కలిగి ఉండాలి! ఉంటేనే సినిమా అద్భుతంగా తీయగలుగుతాడు. అట్లా అన్ని రంగాల్లో ప్రవేశముండి సినిమాలు తీసిన దర్శకులు భారతీయ సినిమా రంగం లో తక్కువ! అట్లే సినిమాను ఒక స్థలసంబంధమైన, కాలసంబంధమైన (spatial and temporal art) కళ గా గుర్తించి అర్థం చేసుకున్న ఫిల్మ్ మేకర్స్ మనకు తక్కువే అని చెప్పాలి. ఈ సినిమా లో అన్ని కళలూ అద్భుతంగా పండడం వల్ల సినిమా గొప్ప aesthetic సౌందర్యాన్ని సంతరించుకుంది. సంగీతాన్ని ఎంత వాడాలో అంతే వాడుకోవడం, శబ్దాన్నీ అవసరమైనంతగా వాడుకోవడం, అవసరమైన చోట శబ్దం కన్నా నిశ్శబ్దానికి ప్రాదాన్యత ఇవ్వడం చాలా చక్కగా చేసారు. అన్నింటి కంటే నాకు నచ్చింది సినిమాలో spatial and temporal నిర్మాణం. స్థలాన్ని అద్భుతంగా వాడుకున్నాడు దర్శకుడు. పాత్రల మానసికావస్థ చూపడం కోసం ఇరుకు స్థలాల్ని వాడుకోవడం, పాత్రల మానసిక భౌతిక వికాసాన్ని చూపడం కోసం ఇరుకు లోంచి విశాలత్వం లోకి ప్రయాణించడం చేసాడు. అట్లే మైత్రేయ ఎపిసోడ్ లో దాదాపు ప్రతి ఫ్రేం లో సమాంతర రేఖలని వాడుకున్నాడు. ఫ్రేం స్థలాన్ని అడ్డంగా నిలువుగా విభజించే సమాంతర రేఖలను చిత్రీకరించాడు. అవి నీటి పైపులు కావచ్చు, గాలి మరలు కావచ్చు, వర్షం పడుతున్న ముంబాయి రోడ్లు కావచ్చు, జైన ఆశ్రమం కావచ్చు, జాజు రంగు భవంతి కావచ్చు. ఆ నిలువు అడ్డం సమాంతర రేఖలు కలుసుకునే చోట యేర్పడ్డ జాగాల్లోంచి పాత్రలు తమ సంభాషణలను చేస్తారు. లేదా దర్శకుడు మనల్ని పలకరిస్తాడు. చిత్రాన్ని ఒక గొప్ప తాత్విక స్థాయి కి ఇటువంటి చిత్రీకరణ తీసుకెళ్ళింది. నవీన్ కథ లో ఎక్కువగా ఇరుకైన సందులని. యేటవాలు మెట్లనీ వాడుకుని ఆయా సన్నివేశాలని చిత్రీకరించాడు. ఇక కాలసంబంధిత చిత్రీకరణ (temporal picturization) కొస్తే సినిమా లో పాత్రలతో కెమెరా నిరంతరం నడుస్తూ ఉంటుంది. మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మైత్రేయ తో ట్రాకింగ్ షాట్ లో కెమెరా తో పాటు మనమూ పరిగెత్తుతాం. సినిమా లో కెమెరా నిశ్చలంగా ఉన్నది చాలా కొద్ది సార్లే! అంటే సినిమా కాలంలో మనని భాగం చేసాడు దర్శకుడూ, చాయాగ్రాహకుడూ! ఎక్కడా నిలువ నీయరు. పాత్రల మానసికావస్థలతో, కాలంలో స్థలంలో వాటి అనిశ్చితి తో మనల్ని యేకం చేస్తాడు. అప్పుడు మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే కాదు. ఆలియా తో ఫొటోలు తీస్తాము, మైత్రేయతో దేశమంతా సంచారం చేస్తాం, నవీన్ తో మనకు తెలియని ఇరుకు సందుల్లో ప్రయాణిస్తాం. ఒక ప్రతిభావంతుడైన దర్శకుడు సాధించిన గొప్ప సినిమా సౌందర్య భాషా వ్యాకరణం ఇది. ప్రభావాలు లేవని కాదు కానీ ప్రభావాలని స్వంతం చేసుకుని కొత్తదనాన్ని ప్రతిఫలించడంలో దర్శకుడు అతని బృందం సఫలీకృతమైంది.

సినిమా ఆద్యంతమూ కెమెరా పనితనమూ, యెంచుకున్న స్థానాలూ, వాటిన metaphorical గా చిత్రీకరించిన పద్దతీ , అద్భుతం. కెమెరా మేన్ పంకజ్ కుమార్ నైపుణ్యమూ ప్రతిభా చిత్రం లో ప్రతి ఫ్రేం లో కనబడుతుంది. అట్లే ప్రతి నటుడూ చాలా గొప్పగా నటిస్తున్నట్టు కాక పాత్రల్లో లెనమయ్యారు. ఫోటోగ్రాఫర్ పాత్రలో ఐదా అల్ – కషీఫ్, మైత్రేయ పాత్రలో నీరజ్ కబి గొప్ప కంతి గల వర్ఛస్సు తో కనబడ్డారు. అద్భుతంగా చేసారు. స్టాక్ బ్రోకర్ గా సోహుమ్ షా కూడా చాలా బాగ చేసాడు. . ఈ మధ్య కాలంలో యింత గొప్పగా చిత్రీకరించిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అట్లే సినిమా మొత్తమూ కూడా దర్శకుని (అతని టీమ్ ) ప్రతిభనూ, జ్ఞానాన్నీ, తాత్విక చింతనా . లోతైన ఆలోచనలూ ప్రతి ఫ్రేం లో కనబడ్డాయి. ఈ రోజుల్లో, కొత్తగా తీస్తున స్వత్రంత్ర ఫిల్మ్ మేకర్స్ కూడా రొడ్డకొట్టుడు కథలతో, అరిగిపోయిన themes తో పాడిందే పాటరా అంటూ సినిమాలు తీసి ప్రేక్షకులమీద సంధిస్తున్న సందర్భంలో యిట్లా కొత్తగా ఫ్రెష్ గా ఒక జ్ఞానాన్నిచ్చే వెలుగు లాగా, చల్లని మలయమారుతంలాగా ఇట్లాంటి సినిమా రావడం చాల గొప్ప విషయం.

అయితే సినిమాలో లోటుపాట్లు లేవని కాదు. చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. మైత్రేయకూ చార్వాకునికీ సంభాషణలు చాలా పొడుగ్గా ఉండి, కొన్ని సార్లు శ్రద్దగా వింటే కానీ అర్థం కాకుండా ఉన్న పరిస్తితి. అట్లే మైత్రేయకూ, నవీన్ కూ ‘ship of thesesus’ విరోధాబాస యెట్లా అన్వయించగలమో స్పష్టత లేదు. నవీన్ అమ్మమ్మ యెందుకు ఆసుపత్రిలో చేరుతుందో స్పష్టంగా లేదు. అట్లే మైత్రేయ పాత్రనూ, నవీన్ పాత్రనూ బాగా వృద్ధి చేయడంలో అంత శ్రద్ద చూపలేదనిపించింది. మైత్రేయ మందుల కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని ఆత్మ త్యాగం ద్వారా కాకుండా ఇంకా హేతుబద్దమైన పద్దతుల్లో చేస్తే ఆ పాత్ర బాగా పరిణతి చెందేదనిపిస్తుంది. ఒక సారి మాటల ప్రస్తావనల్లో మైత్రేయను మందుల కంపెనీ వాళ్ళు బెదిరించారని తెలుస్తుందంతే ! అట్లే డబ్బు యావ తప్ప మరొకటి లేని నవీన్ నర్స్ రానప్పుడు అమ్మమ్మకు అంత సేవ చేయడం, ఆమెతో అంతగా వాదించినతను హటాత్తుగా శంకర్ కోసం స్టాక్ హోమ్ దాకా పోవడమూ కొంత ఆశ్చర్యమనిపిస్తాయి.

యేది యేమైనప్పటికీ ‘Ship of Theseus’ సినిమా హృదయం కన్నా బుద్ధికి సంబంధించిన సినిమా (రెండింటికీ మూలం మెదడే అయినా వాటి వాటి జాగాలు వేర్వేరు కాబట్టి) . దర్శకుడు అత్యంత ప్రతిభావంతుడూ బాగా చదువుకున్న వాడూ (erudite). సినిమా భాష పట్ల వ్యాకరణం పట్ల, గొప్ప అవగాహన కలిగి ఉన్న వాడు. తాను చెప్పదల్చుకున్నది అద్భుతంగా దృశ్యంగా మలచ గలడు. తెర మీద అద్భుతమైన ఉత్ప్రేక్షలు సృష్టించగలడు. తాత్వికంగా ఉన్నత స్థాయిలో ఆలోచనలు చేసి మనని ఆలోచింపచేయగలడూ! ఈ సినిమా అతని ప్రతిభకు తార్కాణం. ఇంకా అతని నుండి గొప్ప సినిమాలు ఎన్నో రావాలని ఆకాంక్ష!

–నారాయణ స్వామి వెంకటయోగి