Menu

సీతారామయ్య గారి మనవరాలు

సాంకేతిక పరిజ్ఞానం అంతగా పెరగక పోవడం కూడా అప్పుడప్పుడు మంచి సినిమాలు రావడానికి కారణం అవుతుందేమో. ఇప్పుడు ఉన్నట్టుగా పల్లెటూళ్ళలో కూడా టెలిఫోన్ లు, ప్రతి మూడో మనిషి దగ్గర మొబైల్ ఫోన్లు పదిహేడేళ్ళ క్రితం ఉండి ఉంటే మనమంతా ”సీతారామయ్య గారి మనవరాలు’ అనే ‘తెలుగు’ సినిమాను మిస్ అయ్యేవాళ్ళం కదా! ఆర్ద్రత నిండిన కథ, కథనం, పాత్రోచిత నటన, కథనానికి ప్రాణం పోసే సంగీతం ఈ సినిమా ని క్లాసిక్ గా మార్చాయి. నా స్నేహితుల్లో కొందరు దీనిని ‘చివరి తెలుగు సినిమా’ అని అంటుంటారు. కథగా చెప్పాలంటే ఇది మూడు లైన్ల కథ. ఇచ్చిన మాటకీ ప్రాణం ఇచ్చే తండ్రికి, ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయలేని కొడుక్కి మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్. ఫలితంగా ఆ కొడుకు కుటుంబానికి దూరం అవడం తిరిగి తన కూతురి ద్వారా కుటుంబాన్ని కలుసుకోవాలనుకోవడం. క్రాంతి కుమార్ దర్శకత్వం, కీరవాణి సంగీతం, నాగేశ్వర రావు , రోహిణి హట్టంగడి, మీనా ల నటన ఈ సాధారణ కథ ఓ అసాధారణ సినిమా గా రూపు దిద్దుకోడానికి తోడ్పడ్డాయి.

‘మానస’ రాసిన ‘నవ్వినా కన్నీళ్ళే’ నవల ఆధారంగా (ఈ నవల ఎక్కడ దొరుకుతుందో ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు) ఈ సినిమా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను అందుకుంది. అంతకు మించి, ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ ‘మంచి సినిమా’ భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తించింది. కథాస్థలం గోదావరి తీరంలోని ‘సీతారాంపురం’ అనే గ్రామం. ఆ ఊరి పెద్ద సీతారామయ్య (అక్కినేని), ఆయన భార్య జానకమ్మ (రోహిణి హట్టంగడి) కొడుకు శ్రీనివాస మూర్తి (రాజా). ‘మా సీతారాంపురం గ్రామానికి విచ్చేసిన మీకందరికీ స్వాగతం’ అనే బాలు వ్యాఖ్యానంతో సినిమా ప్రారంభమవుతుంది. ముందే చెప్పినట్టు, పెళ్లి విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ బేధం కారణంగా కొడుకు తను ప్రేమించిన సుమతిని పెళ్లి చేసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ఇరవై ఏళ్ళ తరువాత అతని కూతురు సీత (మీనా) తన మేనత్త కూతురి పెళ్లికి సీతారాంపురం రావడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. మనవరాలి పట్ల మనసులో ఎంతొ ప్రేమ ఉన్నా దానిని వ్యక్తం చేయని తాతగారు, మనవరాలి లో తన కొడుకుని చూసుకుని మురిసిపోయే బామ్మ, సీత రాకతో ఆస్తిలో తనకి వాటా రాదేమోనని బెంగ పడే ఇంటి అల్లుడు (తనికెళ్ళ భరణి) ఆమెకి తన కొడుకునిచ్చి పెళ్లి చేయడం ద్వారా సీతారామయ్య ఆస్తి ని సొంతం చేసుకోవాలనుకునే అతని వియ్యంకుడు వీరభద్రయ్య (కోట) ల ప్రయత్నాలతో కథ సాగుతూ ఉంటుంది.

అమెరికా నుంచి శ్రీనివాస మూర్తి ఫ్రెండ్ (మురళి మోహన్) రావడం తో సీత తల్లితండ్రులు ఓ ప్రమాదం లో చనిపోయరనే విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ నిజాన్ని సీత తన తాతయ్యకి ఎలా చెప్పిందన్నది చిత్రం ముగింపు. ఇది తెలుగుదనం ఉన్నకథ. నేపధ్యం గోదావరి ప్రాంతం కావడం తో అక్కడి భాష, సంస్కృతులను సినిమా లో ఉపయోగించారు. బరువైన పాత్రల్లో నటించడం అక్కినేని కి కొత్త కాదు. ఈ సినిమాలో ఆయన తొలిసారి విగ్ లేకుండా నటించారు. బాలనటి గా సినిమాల్లోకి వచ్చిన మీనా కి నాయిక గా ఇది తొలి సినిమా. సీనియర్ల తో సమానంగా నటించి ప్రసంసలు అందుకుంది.

నాకు ఈ సినిమా లో బాగా నచిన పాత్ర జానకమ్మ. భర్త, కొడుకు ల మధ్య నలిగిపోయే ఇల్లాలిగా రోహిణి హట్టంగడి నటన అసామాన్యం. ఆమె మాతృ భాష తెలుగు కాకపోయినా, భాషను, పాత్రను బాగా అర్ధం చేసుకుని నటించారు. అమాయకత్వం, ఆపేక్ష కలబోసిన పాత్ర. ముఖ్యంగా ‘మౌన వ్రతం’ సీన్ లో ఆవిడ నటన చూసి తీరాలి. ‘షష్టిపూర్తి’ సీన్ లో నిండు ముత్తైదువ గా చాల సహజం గా కనిపిస్తారు. ఐతే ఆ పాత్రను అర్ధాంతరంగా ముగించారనిపిస్తుంది.

‘సుబ్బరాజు’ అనే ఓ చిన్న పాత్రలో దాసరి కనిపిస్తారు. ఈ పాత్ర పట్ల ఆయన ఇష్టం, తర్వాతి కాలంలో ఆయనచేత ‘సుబ్బరాజు గారి కుటుంబం’ అనే సినిమా తీయించింది. భరణి ది కామెడీ విలనీ కాగా సుధాకర్ ది కమెడియన్ పాత్ర. ‘మాయబజార్’ లో పాట పేరడి కూడా ఉంది అతనిపై. గణేష్ పాత్రో ఈ సినిమాకి తేలిక గా ఉండే పదాలతో బరువైన సంభాషణలు రాసారు. ‘నాన్న మన దగ్గరికి రారు తాతయ్య, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి’ లాంటి సంభాషణలు కదిలిస్తాయి.

క్రాంతి కుమార్ లో ఉన్నమంచి దర్శకుడిని తెలుగు సినిమా పరిశ్రమ సరిగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది ఈ సినిమా చూసాక. మనవరాలి పట్ల పైకి కఠినంగా ఉంటూనే, సీతారామయ్య ఆమె పట్ల ప్రేమని రహస్యంగా ప్రదర్శించే సన్నివేసాలు, మనవరాలు తెచ్చిన వీడియో లో కొడుకుని ఆత్రం గా చూసుకోవడం, జానకమ్మ చనిపోయిన తర్వాత ‘మీ నాన్న వెంటనే రావాలమ్మా సీతా’ అని చెప్పే సన్నివేశం, ఏంచేయాలో తెలియక గోదారి ఒడ్డున సీత పిచ్చిగా పరిగెత్తే సన్నివేశం…ఇలా చాలా సన్నివేశాలను ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసేవిధంగా చిత్రీకరించారు. అలాగే చాలా బరువుగా ఉండే క్లైమాక్స్ సన్నివేసం కూడా.ఈ సినిమాలో సీత డైరీ ని సీతారామయ్య చదివి నిజం తెలుసుకోవడం అనే సీన్ ని ఆ తరువాత చాలా సినిమాల్లో కాపి చేసారు. (ఇంక్లుడింగ్ ‘గోదావరి’). స్ట్రయిట్ నేరేషన్ లో సాగే ఈ సినిమా (మధ్యలో ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్) బాలు వ్యాఖ్యానం తోనే సినిమా ముగుస్తుంది. ఈ సినిమా ను ‘ఉధార్ కి జిందగి’ పేరు తో హిందీ లో తీసారు. తాతయ్య పాత్రను మిదున్ చక్రవర్తి, మనవరాలి గా కాజోల్ నటించారు. ఆ తరువాతి కాలం లో అగ్ర నాయిక గా ఎదిగిన కాజోల్ కి ఇది తొలి చిత్రం. అక్కడ ఈ సినిమా విజయం సాధించలేదు.

తల్లిని తండ్రిని కోల్పోయిన ఓ టీనేజ్ అమ్మాయి ఆ రహస్యాన్ని తన తాతయ్య దగ్గర ఎలా దాచ గలిగిందన్నది అర్ధం కాదు. శ్రీనివాస మూర్తి చనిపోతూ, ‘ఈ వార్త తాతయ్యని బాగా ప్రిపేర్ చేసి చెప్పమ్మా’ అని సీత నుంచి మాట తీసుకుంటాడు. కానీ, సీత అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కథ, కథనాలపట్ల చూపిన శ్రద్ధ, హాస్యం పై చూపలేదని అనిపిస్తుంది. హాస్యం కొన్ని చోట్ల ముతకగా మరికొన్ని చోట్ల పేలవంగా ఉంటుంది. ‘నువ్వు-నేను’ సినిమా తో ‘తెలంగాణా’ శకుంతల గా అందరికి తెలిసిన నటి, ఈ సినిమాలో కోటకి సుబ్మిస్సివ్ భార్య గా హాస్య పాత్ర పోషించింది.

సంగీతాన్ని గురించి చెప్పకుండా ఈ సినిమా గురించి చెప్పడం పూర్తి కాదు. క్రాంతి కుమార్ చేసిన బొమ్మ కి కీరవాణి తన సంగీతం తో ప్రాణం పోసారు. మొత్తం పాటల్లో ‘పూసింది పూసింది పున్నాగ’ పాట అంటే కీరవాణి కి ప్రత్యేకమైన ఇష్టం అనుకుంటా. అదే ట్యూన్ ని కొంచం మార్చి ‘అన్నమయ్య’ లో ‘ఏలే ఏలే మరదలా’ పాట చేసారు. ‘కలికి చిలకల కొలికి’ పాటలో మేనత్త కోడళ్ళ మధ్య అనురాగాన్ని చిత్రించిన తీరు గుర్తుండి పోతుంది. ఇక నా ఛాయస్ ‘బద్దరగిరి రామయ్య…’ విషాద గంభీరంగా సాగుతుందీ పాట/కీర్తన. ‘షష్టిపూర్తి’ పాటలో జిక్కి గొంతు వినిపిస్తుంది ‘ఆ పైన ఏముంది..’ అంటూ. సినిమా తాలూకు మూడ్ ని క్రియేట్ చేయడంలో నేపధ్య సంగీతానిది కీలక పాత్ర. ఒక్కసారి ఈ సినిమా ని mute లో చుడండి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాధాన్యత ఏమిటో అర్ధం అవుతుంది.

ఈ సినిమా సాధించిన విజయం పుణ్యమా అని ఇలాంటి కథ, కథనాలతో ఓ అరడజను సినిమాలు వచ్చాయి అప్పట్లో. కానీ అవేవి పెద్దగా విజయం సాధించలేదు. ఈ సినిమా ప్రభావం గురించి ఒక మాట చెప్పాలి. అంతవరకు ఎవరైనా అమ్మాయి లంగావోణి లో కనిపిస్తే ‘బాపు బొమ్మలా ఉంది’ ఆనేవారు. ఈ సినిమా విడుదలయ్యాక ‘సీతారామయ్య గారి మనవరాలిలా ఉంది’ అనడం మొదలు పెట్టారు. ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది మిగిలి పోయింది అనిపించడం కూడా ఈ సినిమా ప్రత్యేకత అనుకుంటా!

-మురళి

26 Comments
 1. thinkfloyd November 7, 2008 /
 2. venkat November 7, 2008 /
 3. మురళి November 7, 2008 /
 4. మురళి November 7, 2008 /
 5. శంకర్ November 7, 2008 /
 6. kinear November 7, 2008 /
 7. bharaNi November 7, 2008 /
 8. Rani November 7, 2008 /
 9. sriram velamuri November 7, 2008 /
 10. Priya Iyengar November 9, 2008 /
 11. pappu November 9, 2008 /
 12. మురళి November 9, 2008 /
 13. chandru November 11, 2008 /
 14. Sreeram November 14, 2008 /
 15. మురళి November 14, 2008 /
 16. sriram velamuri December 3, 2008 /
 17. balla sudheer chowdary December 8, 2008 /
 18. vinay June 19, 2009 /
 19. ప్రదీప్ January 1, 2010 /