Menu

rosetta – గులాబీ కొమ్మ

సినిమా అంటేనే కథ..అందరినీ ఆకట్టుకునే ఓ కథ. సినిమాగా తీస్తే ..పదిమందీ చూస్తే..చూసి  అహా అనగలిగితే..ఆ  నటీనటులకీ..దర్శకనిర్మాతలకీ డబ్బు,  గొప్ప గుర్తింపు… అదేగా  సినిమా పరమావధి ?!! 

కానీ కొన్ని సినిమాలు అలాకాదు. సమాజంలోని సమస్యని ప్రశ్నిస్తాయి..లోపాలని ఎత్తి చూపుతాయి..ప్రజలకి సమస్యగురించీ…సమస్య తీవ్రతగురించీ అవగాహన కల్పించి ఆలోచింపజేస్తాయి. అలాంటి సినిమాలు అరుదు. అయితే ఈ సినిమా కథ కాదు..సమాజ సమస్యలని ప్రశ్నించే ప్రయత్నమూ కాదు.  కానీ సినిమా తనకి తెలియకుండానే కొన్ని సమస్యలని చెప్పింది. చట్టాన్నే  సవరించగల స్పూర్తి  ప్రభుత్వానికి ఇచ్చింది. మరి  ఆ సినిమాని  గొప్పసినిమా అని చెప్పుకోక తప్పదు కదా..

బతకాలంటే డబ్బుకావాలి.. డబ్బుకావాలంటే పని చేయాలి.. పని చేయాలంటే అర్హత ఉండాలి. ఆ అర్హత సంపాదించుకోవాలంటే తెలివి కావాలి. ఆ తెలివి ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే   చావలేక బతుకుతున్న బీద బిక్కే  యాభై  శాతం ఉంటారు ఏదేశంలో నైనా.

 కథ

రోజెడా అనే టీనేజ్ అమ్మాయి తన ఉద్యోగ శిక్షణాకాలం ముగిసి పని నించి తొలగించబడుతుంది. కానీ ఆఅమ్మాయికి పని కావాలి..డబ్బుకావాలి. దరిద్రంనించి బయటపడాలి.  అందుకే  ఉద్యోగం తీసేయొద్దనీ తాను మానేయననీ గొడవపడుతుంది..చివరికి పోలీసులచే గెంటివేయబడుతుంది. చేసే ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావు.

వదిలేయబడీన  వాహనపు ఇంటిలో నివాసం.. తాగుబోతు తల్లి.. ఆమెకి తాగిస్తూ ‘వాడుకునే’  ఓనరూ ఇవి కాక అప్పుడప్పుడు పేగులు మెలిపెట్టే  కడుపునొప్పీ ఇవీ రోజడా బాధలు. ఉద్యోగాన్వేషణలో బాగంగా  తినుబండారాలు  అమ్మే బడ్డి (బెకరీ) అతనితో చిరుదోస్తీ కుదురుతుంది. ఓ రోజు అతను రోజడా ని వెతుక్కుంటూ వస్తాడు.. ఎందుకొచ్చావ్ అని మీదపడుతుంది. తన యజమాని దగ్గర ఉద్యోగం ఉన్నదని చెపుతాడు. కొంచం ఆనందం. ఉద్యోగం చేసి ఇంటికి రాగానే  తల్లి  చేసే ‘పిచ్చి పనులు’  చూసి భరించలేక రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్ళమని పట్టుబడుతుంది. వచ్చేసరికి ఓ పాత కుట్టుమిషన్ కూడా కొనిస్తా అని ఆశ పెడుతుంది. అమె నావల్ల కాదంటూ ఇల్లొదిలి పారిపోతుంది.

మిత్రుడికి ఆమెతో  స్నేహం పెంపొందిచుకోవాలని  ప్రయత్నం..రోజెడాకి  మాత్రం తనకే తెలియని నిశ్చలత. తన జీవితం బాగా ఉండబోతోంది  అని తనకి తానే చెప్పుకుంటుంది ఆ రాత్రి.  కానీ మరునాడే  ఉద్యోగంనించి తీసివేస్తాడు యజమాని. కోపం కసి పెళ్ళుభుకుతుంది..కానీ ఏం చెయగలదు.??

ఇంటికి వెళుతూ  నీళ్ళగుంటలో తన గాలానికి చేపలు పడ్డాయా లేదా అని చూసుకుంటుంటే.. ఓనర్ వస్తున్నాడేమో అన్న భయంలో గాలం నీళ్లల్లోకి విసుర్తుంది..కానీ మిత్రుడు వస్తాడు. గాలాన్ని నీటిలోంచి తీసే ప్రయత్నంలో మిత్రుడు నీళ్ళల్లో  పడతాడు. బురదలో దిగిపోతుంటే  రక్షించాలా వద్దా అనే కాసేపు తటపటాయించి చివరికి రక్షిస్తుంది.

కొన్ని తినుబండారాలని ఇంట్లో తయ్యారు చేసి యజమాని దుకాణంలోనే దొంగతనంగా అమ్ముతుంటాడు మిత్రుడు. రోజెడాని  వాటిని తయ్యారు చేయమనీ  వాటివల్ల వచ్చే డబ్బులు తీసుకోమని చెపుతాడు. కానీ రోజెడాకి ఈ దొంగపని వద్దంటుంది.ఉద్యోగమే కావాలంటుంది. కాసేపు ఆలోచించి  మిత్రుడు చేస్తున్న దొంగపని  విషయాన్ని యజమానితో చెపుతుంది. దాంతో యజమాని అతన్ని తొలగించి ఆ ఉద్యోగం రోజడాకి ఇస్తాడు. కోపం పెరిగి కసితో ఎందుకిలా చేసావని అటకాయించి నిలదీస్తాడతను.. ఉద్యోగం కోసం చేసానని చెపుతుంది. అతనికి ఈమె ప్రవర్తన అర్థంకాదు.

ఆ పూట ఆనందంగా తృప్తిగా ఉద్యోగం చేసుకుని ఇంటికొస్తుంటే.. తల్లి తాగి పడిపొయి ఉంటుంది. ఆమెని  ఇంట్లొ పరుండబెట్టి ఆలోచనలో పడుతుంది. ఓ నిశ్చయానికొచ్చి ఉద్యోగం మానేస్తున్నానని ఫోన్ చెస్తుంది యజమానికి.

అయిపోయిన గ్యాస్ సిలిండర్ మార్పించుకొని కష్టపడుతూ దాన్ని మోసుకొస్తుంటే మిత్రుడు వస్తాడు…మోయలేక కిందపడి ఏడుస్తూన్న ఆమెని భుజంపట్టి లేవదీస్తాడు.

 పాత్ర స్వభావం.

మన ప్రవర్తన ఎందుకో ఏమిటో మనకి తెలుసు. కానీ ఇతరులకి అర్థంకాకపోవచ్చు. మనకంటూ కొన్ని పద్దతులూ..సిద్దాంతాలు..ఇష్టాలు..నిర్ణయాలూ ఉంటాయి. అవి ఎదుటివాళ్లకి తెలియవు, అర్థం కావు. దాంతో మనం  మొండి ఘటంలాగా..మింగుడుపడని స్వభావంలాగా అనిపిస్తుంది.
కథలో పాత్రలుంటాయి..మామూలుగా అయితే పాత్రలు కథని నడిపిస్తాయి . కానీ కొన్నిసార్లు  పాత్రల స్వభావమే సినిమా అవుతుంది. అవి చేసేపనులూ..ప్రవర్తనా మాత్రమే కథ అవుతుంది. అదుగో ఆ రెండో కోవకి చెందిందే ఈ  సినిమా.

ఈ సినిమాలో కథానాయకి పాత్ర అలాంటిదే. అడుగడుగునా ఆమె మొండితనం..ఆమెతీరు ఇవే కనిపించేవి. అది స్పష్టంగా చెప్పకపోవటంతో మనకి ఓ పట్టాన అర్థం కాదు. ఆమె ఎందుకలా ఉందో..ఎందుకలా ప్రవర్తిస్తుందో మనమే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలితితే అప్పుడు సినిమా గొప్పతనం తెలుస్తుంది.

అలాంటి రోజెడా పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించినందుకు  Emilie dequenne కి కేన్స్ లో ఉత్తమనటి అవార్డు వరించింది.

మొదట్లో చెప్పుకున్నాం కదా. కొన్ని సినిమాలు స్పూర్తినిస్తాయి అని.  బెల్జియం దేశంలో,  కుర్రవాళ్లకి  మామూలు కన్నా తక్కువ జీతాలు ఇవ్వటాన్ని నిషేధిస్తూ, ఇంకా కొన్ని  కొత్త శ్రామిక చట్టాలని అమల్లోకి తెచ్చేవిధంగా స్పూర్తి ఇచ్చీంది ఈ సినిమా  . అంతకంటే ఏం కావాలి ఓ సినిమాకి.. ? అలాంటి సినిమాకి ఆ సంవత్సరపు కేన్స్ సినిమాపండగలో  బంగారు రెమ్మ ( Golden Palm) అవార్డ్ రాకుండా ఉంటూందా !!

చెప్పుకోతగ్గ విషయాలు

  వివిధ సన్నివేషాల్లో కావలసిన మూడ్ ని క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో స్పందన కలిగించటానికి ఏదేని సినిమాకి  నేపథ్య సంగీతం అవసరం. మనం నేపథ్య సంగీతంలేకుండా సినిమా ఊహించుకోలేం.   కానీ ఈ సినిమాలో సహజంగా ఉండే ద్వనులు తప్ప నేపథ్య సంగీతం ఎక్కడా ఉండదు. అయినా ఎక్కడా ఆలోటు కనపడదు.
సినిమా అనగానే ట్రాకు.. క్రేను..జిమ్మీ జిప్పు..మందీ మర్బలం ఇదంతా అవసరం మనకి . అవి లేకుండా సినిమా చేయొచ్చు అనే ఆలోచన కలలో కూడా రాదేమో. కానీ కెమెరా చేత్తో పట్టుకొని సినిమా తీసేసారు. అదే డైనమిక్ సినిమాటోగ్రఫీ .( ఆ పేరు నేనే పెట్టాను..)  ఈ  ‘డైనమిక్ సినిమాటోగ్రఫీ’ వల్ల సినిమాలో కావలసినంత పట్టు వచ్చింది. సాంప్రదాయబద్దమైన సినిమాటోగ్రఫీ చేసుంటే  ఈ సినిమా చాల చప్పగా ఉండేదేమో !!

ఇదే కాక ఇలాంటి కొన్ని గొప్ప సినిమాలు తీసిన దర్శకద్వయం Jean-Pierre Dardenne, Luc Dardenne ల గురించి చెప్పుకోవలసిందే. అయితే  అదంతా మరో వ్యాసరూపంలో తరవాత చెప్పుకుందాం.

నేర్చుకున్నది ??

* ఈ సినిమా చూసాక సినిమా అంటే ఇదీ..ఇలా తీయాలీ..అలా ఉండాలీ అన్న నిర్దేశాలు గట్రా పెద్దగా అవసరం లేకుండా  విషయాన్ని స్పష్టంగా సూటిగా  చూపించి సినిమాతీయొచ్చు అని తెలిసొచ్చింది.