Menu

ప్రేమనగర్

1971 లో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ఒరవడిని ఒక చరిత్రని సృష్టించింది.చిత్ర సీమలో నిర్మాతగా రామానాయుడికి, నవలా నాయకుడిగా అక్కినేని స్థానాన్ని సుస్థిరం చేసింది.అప్పటికి రామానాయుడు నిర్మాతగా తట్టా బుట్టా సర్దుకుని ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా ఆయనే చాలాసార్లు ఉటంకించినట్లు గుర్తు.చిత్రసీమలో అక్కినేని స్థానం అప్పటికి నిలకడగా ఉన్నప్పటికీ ఈ సినిమా తర్వాత తిరుగులేకుండాపోయింది.

అప్పటికి చాలా నవలలు సినిమాలుగా రూపం సంతరించుకున్నప్పటికీ, కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవి గారి ఈ నవల (ప్రేమనగర్)అదే పేరుతో సినిమాగా రూపొందాక నిర్మాతకి ఆర్ధికంగా, నటీనటులందరికీ ప్రత్యేకించి వాణిశ్రీ కి తిరుగులేని కధానాయిక గా నిలపెట్టింది.

ప్రత్యేకించి “మనసు”కవి ఆత్రేయ విశ్వరూపమే చూడొచ్చు(ఆయనా ఒక సీన్లో కనిపిస్తారు డాక్టరికి అక్షర లక్షలు ఫీజ్ ఇచ్చేందుకు). మాటల్లో, పాటల్లో మనసుతో ఏకంగా చెడుగుడే ఆడుకున్నారు ఆత్రేయ. రాసి ప్రేక్షకులని,రాయక నిర్మాతలని ఏడిపిస్తాడని పేరుపడ్డ ఆత్రేయ రాస్తూ ఎంత ఏడుస్తాడో (బహుశా ఒక బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి పడే కష్టం అంత కావచ్చునా?ఏమో?)..

ఇంక మామ మహదేవన్ అయితే అగ్నికి(ఆత్రేయ)ఆజ్యం తోడయినట్లే అనిపిస్తాడు. శిశుర్వేత్తి పశుర్వేతి వేత్తి గానరసం ఫణి: అన్నట్లు, మామ సంగీత స్వరాల ఊయలలో ఆడుకోని రసపిపాసి ఎవరుంటారు?.సేదతీరని సంగీత రసికశిఖామణులెందరుంటారు.

తెరముందూ,వెనుకా కూడా కళాకారులు వారి వారి నైపుణ్యాన్ని ఉత్తమంగా ప్రదర్శించిన చిత్రాలో ఒకటిగా సురేష్ ప్రొడక్షన్స్ వారి “ప్రేమనగర్”ని చెప్పుకోవచ్చు.

ఇంక సినిమా కధ “అంతములేని ఈ భువనమంటపమంతయు పురాతన పాంథశాల” అంటూ దువ్వూరి వారి పద్యంతో మొదలవుతుంది అకాశయానంలో(విమానంలో). నో..నో..పాంథశాల కాదు బ్రదర్ పానశాల అంటూ సర్దుకుంటుండగా ఈలొపులో ఒక ప్రయాణీకుడు (నల్లరామ్మూర్తి) ఎయిర్ హోస్టెస్ (వాణిశ్రీ) లత నుద్దేశించి ఏటి మిస్సూ ఏటా న్యూసెన్సూ (ఈ తాగుబోతు గోలేంటని) అన్నప్పుడు, మన తాగుబోతు హీరో గారి డైలాగు, ఏమిటో ఈ ఇంగ్లీష్ దేన్నయితే మిస్సు కాకూడదో దానే మిస్సు అంటారు,అంటే తెలుగులో తరుణి అని,అనగా తరుణమైనది అని అర్ధం అంటూ వివరిస్తూ ఏమంటారు మిస్ అంటే మీ సీట్లొ మీరు కూర్చోమంటాను అంటే, అఫ్కోర్స్ ఈ విశాలశూన్యం లో నాసీటెక్కడా అని అంటాడు.

(మరి నిజంగా ఎయిర్ హోస్టెస్ అయిన కాంచన ఈ సినిమా హీరోయిన్ గా ఎలా ఉండేదో? బహుశాఆ ఆలోచన రాకపోడం కూడా మనకి ఒక నవలా నాయకి,కళాభినేత్రి దొరకడానికి దోహదపడిందేమో?)

సినిమా మొత్తం-ఆ కనబడే వందల వేలాది ఎకరాలు మనవే అనుకునేటంత భూమి ఉన్న ఇద్దరు జమిందారు సోదరులు,అన్న క్రూరుడు,తమ్ముడు మంచివాడు(తాగుడుతో చెడిపోయినా చెడ్డవాడు మాత్రం కాదు),ఒక పేద ఎయిర్ హోస్టెస్ కుటుంబం,చిన్నా పెద్దా సినిమా కష్టాలు,దొంగతనం,అపార్ధం,సెంటిమెంట్,ప్రేమా-త్యాగం-ఆత్మహత్యా ప్రయత్నం,తప్పు తెల్సుకోడం-పశ్చ్చాత్తాపం,తిరిగి కలుసుకోడం-పెళ్ళి చేసుకోడం-సుఖాంతం..ఇదీ టూకీగా..

ఖో ఖో ఆట లో లాగ,400మీటర్ల రిలే పరుగు పందెం లాగ,గమ్యం చేరడానికి అలసట తెలియకుండా అసలు నగరి చేరే ముందు సేదతీరే విశ్రాంతి గృహం లాగ,ఆద్యంతం మొగవాడి దౌర్బల్యమూ ఆడదాని మనోబలం తూకం వేసుకుంటూ సాగిపోతుంది

ఈ సినిమాకి ఆత్రేయ,మహదేవన్,ఘంటసాల,సుశీల,యల్ ఆర్ ఈశ్వరి,కర్మేంద్రియాలయితే

అక్కినేని,వాణిశ్రీ,యస్ వీ ఆర్,గుమ్మడి,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,శాంతకుమారి,హేమలత మొదలయినవారు జ్ఞానేంద్రియాలుగా చెప్పవచ్చు.

ముఖ్యమయిన సన్నివేశాల్లో కొన్ని డైలాగులు:

ఎవరు వాళ్ళంతా అని అడగ్గానే,  “ఓహ్ వాళ్ళా బొమ్మలు..గాజు బొమ్మలు”(అమ్మాయిలంతా హీరో చుట్టూ చేరినప్పుడు),

పొద్దున్నే పనివాడు పెరుమాళ్ళు వచ్చి నిద్ర లేపి బాబుగారూ లేచినించోండి బాబూ అనగానే “నేను నిలబడలేనంతగా తాగలేదురా”, వాడు దండ వేసి బాబూ మీ పుట్టినరోజు అని చెప్పగానే “అలా గుర్తుపెట్టుకోడానికి మనసు ఉండాలిరా అని,

సెక్రటరీ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వచ్చిన లతని చూసి

“ఏమిటి ఇలా ఆకాశం మీంచి నేల మీదకి ఊడిపడ్డారేం”-“నిలకడకోసం”

“నిలకడకోసం ఏమాత్రం నిలకడలేని నాదగ్గర ఉద్యోగానికా”

అలాగే పంటచేలల్లో పనివాళ్ళని చూపిస్తూ

“వాళ్ళు పాడుకుంటున్నారా?పనిచేస్తున్నారా? పాడుకుంటూ పనిచేస్తున్నారని,

మనం పాడుకోవాలంటే పని ఆపేస్తాము అంటే పాడుకోడం వల్ల వచ్చే ఉల్లాసం పనిలో కష్టాని తెలియనివ్వదని అందుకే పనీ-పాటా అంటారని”,

టీ ఎస్టేట్ దగ్గర జీప్ లో వెళుతూండగా గాలికి ఆమె చీర కొంగు ఎగరగానే దాన్ని దగ్గరగ చుట్టుకుంటుంటే

“ఎగిరేవాటిని బంధించకూడదు – కొన్నిటికి బంధంలోనే అందం ఉందంటారు” అంటూ చక్కిలిగింతలు పెట్టి,

సిగరెట్ వెలిగించేప్పుడు “దీన్నేమంటారు వెలిగించడమా?అంటించడమా?” అంటూ చురుక్కుమనిపించి,

తమ కున్న భూములని సెక్రటరీ లతకి చూపిస్తూ “ఇక్కడనించే మా అధికారం మొదలవుతుంది, అహంకారం విజృంభిస్తుంది” అంటాడు.

లత పనివాడ్ని “మోతీ అంటే కుక్కపిల్లా?” అని అడ్గగానే వాడు “అవును ఒకరకంగా అంతే దానికి విశ్వాసం ఉంటుంది దీనికి ఉండదు” అంటాడు

ఇంక నాయికా నాయకులు ఇద్దరూ వర్షంలో తడిసాక చలిమంట కాగుతూ

“చలిగ ఉందా..ఉహూ.

ఆకలిగా ఉందా..ఉహూ..

మరేంగా ఉందీ..అంటూ,

ఇలాంటి సమయాల్లోనే ఏదో చెప్పాలని,చెప్పలేని మనస్థితి ,

ఏదో చెయ్యాలని,చెయ్యలేని పరిస్థితి

మగవాడి దౌర్బల్యం,ఆడదాని మనోబలం తూకం వేసుకుంటాయి కదూ” అంటూ తేట తేట తెలుగులో చిలకరిస్తాడు. ఎదల అనుభూతుల్లో కిలికించితాలు పెడతాడు.

“నువ్వు మందు తాగొద్దన్నావు కానీ ఈ విషం తాగొద్దని చెప్పలేదుకదా” అంటూ తన ప్రేమ యొక్క విరహాన్ని వ్యక్తం చేస్తూ అక్కినేని కంట్లో చూపించే ఎరుపుని బట్టి ఆయన ఆపాత్రకి ఎంత జీవం పోశారో చెప్పొచ్చు.అప్పుడు ఆ సన్నివేశంలో ఘంటసాల పాట ఆఖరున పలికిన “ఎవరికోసం” అని జీరగా పలికిన పలుకు చాలు ప్రేక్షకుల గుండెల్లో కెలకడానికి.

అప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాచుర్యం పొందిన “ఊ లతా..ఎన్ దుకు చేశావీ పని” అన్న డైలాగు లేకుండా అక్కినేనిని అనుకరించే ఏ మిమిక్రీ కళాకారుడూ ఉండడేమో?

ఇలా ప్రతీ సన్నివేశంలోనూ మనసుతో ముడి పెట్టి,మెలి పెట్టి,నవ్వించి,కవ్వించి,ఇకిలించి,సకిలించి(రాజబాబు హాస్యం),చిత్రం ఆద్యంతమూ తానే అన్ని పాత్రలయి,అన్ని పాత్రలూ తనే అయి తెరవెనుకా ముందూ నడిపించిన ఆత్రేయ గుర్తుగా ఈ సినిమా గుర్తుంటుంది..

కొసమెరుపు:

ఈ సినిమా వచ్చిన కొత్తలో మా అన్నయ్య,అతని స్నేహితులు(అందరూ అక్కినేని అభిమానులే) అమలాపురంలో థియేటర్లలో జేబురుమాళ్ళు, కూల్ డ్రింక్స్ పంచేవారు(అదొక ఆచారంగా,అక్కినేని-ఎన్ టి ఆర్ అభిమానుల మధ్య పోటీగానూ ఉండేది).అప్పుడప్పుడు వీరాభిమానంతో కొట్టుకున్నా చదువులు ఎప్పుడూ పాడుచేసుకున్న వాతావరణం కనిపించలేదు. దానికి తోడు ఏ ఏ థియేటర్లో ఏ వారం ఎంత కలక్షన్లు వచ్చాయో నాలిక చివర ఉండేవి అందరికీ.బహుశా అదికూడా వారి ఎకనామిక్స్ సబ్జెక్ట్ కి ఉపయోగపడిందేమో?

మేము వైజాగు లో నీలమ్మ వేపచెట్టుదగ్గర ఉండేప్పుడు ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో పనిచేసుకుని బతికే ఒక ఆవిడ ఈ సినిమా లోనే డేన్సర్ గా ఒక పాటలో నటించిన టి.జయశ్రీ చెల్లెలు అని చెప్పుకునేవారు ఎంతవరకూ నిజమో?

–పప్పు శ్రీనివాస రావు

8 Comments
  1. Srinivas January 4, 2009 /
  2. krishna rao jallipalli January 4, 2009 /
  3. మురళి January 4, 2009 /
  4. JAYA January 8, 2009 /
  5. JAYA January 8, 2009 /
  6. MayaBazar April 7, 2010 /