Menu

Paris, Texas – కలిసిన దూరాలు.

 తెలియని పయనం ..లేదు గమ్యం.. ఏదీ బ్రతుక్కు అర్థం.

ఉన్నట్టే ఉంటుంది.. మాయమవుతుంది.

మాయమయ్యింది మళ్ళీ వస్తుంది.అప్పుడే ఆనందం…అంతలోనే దుఃఖం ఇస్తుంది

మనసులకి ముడులేస్తూ … విప్పేస్తూ

మనుషులని కలుపుతూ ..విడగొడుతూ  దేవుడో  దయ్యమో అర్థం కానిదే  ‘అది’

ప్రేమించటానికి ఎన్ని కారణాలుంటాయో ..విడిపోవటానికీ అన్నే ఉంటాయి. ప్రేమ అకస్మాత్తుగా వస్తుంది. కాని దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం కష్టమవుతుంది.  ప్రేమ ఎంత త్వరగా ..  బలంగా కలగొచ్చో .. విడిపోవటమూ అంత సులభంగా  జరగొచ్చు. కొన్ని సార్లు ఎంట తీవ్రంగా ప్రేమిస్తామో.. తరవాత ఎందుకు ప్రేమించామా అని భాధపడనూవచ్చు.

అతడో బాటసారి. గమ్యంలేదు. దారిలేదు..  ఒంటరిగా ఎక్కడికో..  ఎత్తు పల్లాలు ఎక్కుతూ దిగుతూ..  చెట్టూ పుట్టా దాటూతూ దాటేస్తూ ..కాళ్లకి తగిలే రాళ్ళూ రప్పలని  లెక్కచేయక  తనకే  తెలియని పయనం .. రోజులు, నెలలు,  సంవత్సరాలుగా !! బక్క చిక్కిన శరీరం..గుంతలు పడి ఏ భావమూ కనపడని కళ్ళు. అతని భాష మౌనం. ఎడారి దారులలో శవంలా సంచరిస్తూన్న ఆ వ్యక్తి దాహంగొని చిట్టచివరికో మధుశాల  కనపడి అందులో దూరి ప్రిజ్లోంచి మంచుముక్కలు నోట్లో వేసుకొని సృహ తప్పి పడిపోతాడు.
 ……………..
 అదో భవనం, అందులో అందమైన అమ్మాయిలు మగవాళ్లకి మాటలతోనూ..శారీరక అందాలు చూపిస్తూ కిక్కెక్కించే  చోటు.  ఒక చిన్న గదిలో ఒక కుర్చీ, ఫోను, ఎదురుగా గాజు ఫలక..అందులోంచి అటువైపు వాళ్ళు కనపడతారు.  కానీ వాళ్ళకి వీళ్లెవరో కనపడరు. ఆ చోటుకి అతడొచ్చాడు. అమెకోసం ఎదురుచూస్తూన్నాడు.  అమె వచ్చింది. పలకరించింది..ఏదో మాట్లాడుతోంది . ఆమె ఎవరోఅతనికి తెలుసు. అమెకి మాత్రం ఇతనెవరో తెలీదు. అతనికి ఆమె కనపడుతోంది. అమెకి ఇతడు కనపడడు. ఇతడు మౌనంగా కిందకు చూస్తూ వింటున్నాడు. ఆమె స్వరం అతనికి ఎదో గుర్తుకు తెస్తోంది. కన్నీళ్లు కారుతున్నాయి.
అమె : ఇక్కడికి రావటం మొదటి సారా ??
అతడు : అవును.
అమె : అందుకే నీకిది వింతగా ఉంటుంది. మీరు నన్నుచూడొచ్చు. నేను మిమ్మల్ని చూడలేను.
అతడామెని చూడటం లేదు.. కిందకి చూస్తూ కుమిలిపోతున్నాడు.
అమె : మీ మొహం కనబడుతోంది.. ఊరికే అన్నాను అని నవ్విందామే అందంగా..
అతడు : కన్నీళ్ళు తుడుచుకొని తనూ చిరునవ్వు నవ్వుతూ ఆమెని చూస్తున్నాడు.

ఆమె మాత్రం తన దోరణిలో ఏదో మాట్లాడుతోంది.
అమె :  పైదుస్తులు విప్పేయమంటారా ?
అతడు : వద్దు వద్దు..

అమె : ఒకే. క్షమించండి.. మీకేం కావాలో నాకర్థం కావటం లేదు.
అతడు : నాకేమీ వద్దు.
అమె : ఇక్కడికెందుకొచ్చారు
అతడు : నీతో మాట్లాడాలి.
                                     ఆమెకేమీ అర్థం కావటంలేదు…
ఒక ఆర్ద్రత నిండిన సన్నివేశం ఇది.  నాలుగేళ్ళుగా  ఘాడంగా  ప్రేమించి  దూరమైన అతడు  మళ్ళీ ఆమెని వెతుకుతూ ఈ గృహంలో ఆమెని చూసి భాధా, ఆనందం రెండూ ఒకే సారి పొందుతున్న క్షణాలివి.  ప్రేమా.. అనురాగం  పెల్లుభుకున్న తరుణమది.

 

మరునాడు మళ్ళీ వచ్చాడు. అతనికి అమె ఎవరో తెలుసు. అమెకి అతనెవరో తెలియదు. అమె అతనికి కనిపిస్తుంది… అమెకి అతడు కనిపించడు. అమెని అతడు నిన్న వచ్చిన అతనే అని కూడా తెలియదు. కొత్తవ్యక్తి అని అనుకుంటుంది.
అతడు : నేనోటి చెప్పాలనుకుంటున్నాను.
అమె : చెప్పు..
అతడు : కొంచం పెద్ద విషయం..
అమె : నేను వింటాను…

అతడు :  నాకో ఇద్దరు వ్యక్తులు తెలుసు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారు. అమె యౌవనవతి. అతడు నడివయస్కుడు, కొంచం మెరటు మనిషి. అమె చాలా అందగత్తె.  ఎట్లా కురిదిందో వాళ్ళిద్దరికీ ప్రేమ కుదిరింది. ఇద్దరూ కలిసున్నారు.. అదో గమ్మత్తైన సాహసంఅనిపించింది ఇద్దరికీ.. ఇద్దరూ ప్రతిదానికీనవ్వుకునేవాళ్ళు. ఆమెని నవ్వించటం అతనికిష్టం. వాళ్ళు దేన్నీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తాము కలిసుండటం కంటే ఏదో గొప్పకాదు.  వాళ్ళెప్పుడు కలిసే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు. అతడామెని చెప్పటానికి వీలుకానంత ఘాడంగా ప్రేమించాడు. అమెని విడిచివెళ్ళలేడు. ఉద్యోగానికైనా విడిచి వెళ్ళాలంటే అదో బాధ అతనికి. అందుకే అతడు ఉద్యోగాన్నే మానేశాడు ప్రతిక్షణం ఆమెతో ఉండాలని.  డబ్బులైపోయాక మరో ఉద్యోగం..మళ్ళీ మానేయటం.. అలాజరుగుతూండేది.

ఆమెకి మెల్లిగా చింత మొదలైంది..బహుశా డబ్బుగురించే అనుకుంటా.. సరిపడా డబ్బులొస్తాయో రావో అనో..లేదా ఎన్నాళ్ళిలా అనో. తెలిదు.ఎందుకంటే డబ్బుసంపాదించి ఆమెని సుఖపెట్టాలని అతనికి  ఉన్నా ఆమెకి దూరంగ ఉండలేక  అతనికి అంతర్మధనం.  ఆమెకి దూరంగా ఉంటే అతనికి పిచ్చెక్కేది.  ప్రేమ ముదిరి  పిచ్చిగా మారింది. ఆమెగురించి ఏదేదో ఆలోచించేవాడు. తను ఉద్యోగానికి వెళ్ళినపుడు ఆమె మరో మరొకరిని కలుస్తూందేమో అని అతనికి అనుమానపు పట్టుకుంది. ఇంటికి రాగానే విరుచుకు పడేవాడు. తిట్టేవాడు..వస్తువులు విసిరేయటం..పగలగొట్టటం మామూలైంది. తాగుడు అలవాటైంది. మధ్యరాత్రిదాక ఇంటికొచ్చేవాడు కాదు. అమెకి అతనిమీద అసూయ..అనుమానం కలుగుతుందేమో అని పరీక్షించేవాడు. కానే ఆమె ఎప్పుడూ అసూయ పడలేదు అనుమానించలేదు కానీ అతని మీద బెంగ పెట్టుకునేది.  అది అతని పిచ్చిని మరింత  పెంచేది. ఎందుకంటె అమెకి అసూయ కలగకుంటే అతన్ని పట్టించుకోలేదన్నమాట..అసూయ లేకుంటే ప్రేమించటం లేదని అతడు అనుకునేవాడు. ఒకనాటి రాత్రి అమె అతనికి చెప్పింది తాను తల్లినికాబోతున్నానని. అప్పటికే ఆమె నాలుగునెలల గర్బవతి . చెప్పే వరకూ అతనికి ఆ విషయం తెలీదు. అకస్మాత్తుగా న్నీ అతడు మారిపోయాడు. తాగుడు మానేసి నిలకడైన ఉద్యోగం చూసుకున్నాడు. తన బిడ్డకి జన్మనివ్వాలని అనుకున్నదంటే  ఆమె తనని ఘాడంగా  ప్రేమిస్తున్నదనే నమ్మకం కలిగిందతనికి.

ఇహ అతడు కుటుంబానికోసం తనని తాను అర్పించుకోవాలనుకున్నాడు. కానీ విచిత్రమైన విషయాలు జరగటం మొదలుపెట్టాయి. అతడు గమనించలేదు కానీ ఇప్పుడు ఆమె మారిపోయింది. బిడ్డపుట్టిన మరునాటినుంచే ఆమెలో చీకాకు మొదలైంది. ప్రతిదానికీ చీకాకు. పుట్టినబిడ్డ తనకన్యాయం చేసాడని తలపోసింది. అతడు అమెకోసం అన్నీకొనేవాడు..షికార్లూ విందులూ వినోదాలకి తీసుకెళ్ళేవాడు . కానీ అమెకవేవీ తృప్తినివ్వలేదు. తాము కలిసిన తొలినాళ్లలో ఎలా ఉండే వారో అలా ప్రేమగా ఉండాలనీ ఓ రెండుసంవత్సరాలు ప్రయత్నించాడు. కానీ అవేవీ పనిచేయవని అతనికి తోచింది. అతడు తాగుడు మళ్ళి మొదలుపెట్టాడు. ఈసారి అమెకి పిచ్చెక్కింది, లేటుగా వస్తే ఆమె అతన్ని అనుమానించటం మొదలుపెట్టింది. పిచ్చికోపంతో ఊగిపోయేది.తనని తల్లిని చేసి  బంధనంలో ఇరికించేసాడని  తిట్టిపోసేది.అన్నీ వదిలి పారిపోవాలని అనిపిస్తోందని చెప్పేది. పారిపోయినట్టు కలలొస్తున్నాయని చెప్పేది.  . ఒంటిమీద సోయి లేకుండా పరిగెత్తేది రోడ్లమీద..పంటపొలాల్లో నదితీరాల్లో… తిరిగినట్టు.. ఏదో నచ్చజెప్పి అతడామిని ఇంటికి తీసుకొచ్చినట్టు కలలొస్తున్నాయని చెప్పేది. అమె కలలని అతడు నమ్మాడు. ఎలాగైనా వాటిని ఆపాలని అనుకునాడు. తనని వదిలేస్తుందేమో అనే భయం పట్టుకుందతనికి. అమెకాలికో గంట కట్టాడతను. ఆమె నిద్రలో లేస్తే తెలుస్తుందని. కానీ ఆమె అందులో సాక్స్  దూర్చి శబ్ధం రాకుండా వెళ్ళేది. ఓ రోజు సాక్స్ జారిపోయి ఆమె పరిగెత్తటం కంటపడింది. ఆమెనిలాక్కొచ్చి ఇంట్లో కట్టేసాడు. కట్టేసి ఒక పక్క ఆమె అరుస్తోంది.  మరో పక్క పిల్లాడూ అరుస్తున్నాడు.  అతనికివేమీ పట్టినట్టు అనిపించటం లేదని ఆశ్చర్యపోయాడు. అతనికి నిద్రపోవాలని ఉన్నది. కానీ మనశ్శాంతి లేదు. మొదటిసారి అతనికి వాళ్ళని వదిలి దూరంగా వెళ్లాలని అనిపించింది. తననెవ్వరూ గుర్తుపట్టని బాష తెలియని  ప్రదేశాలకి పారిపోవాలనిపించింది.

 

ఉదయం లేచేసరికి అతని తన పరుపు మంటల్లో  కాలుతూ కనిపించింది. ఆ మంటల్లోంచి దూకి తన వాళ్లకోసం పరిగెత్తాడు. కానీ వాళ్ళు లేరు. తన చేతులకి నిప్పంటుకొని మండుతోంది.. ఎలాగోలా బయటపడి మంటలార్పుకున్నాడు. పరిగెత్తాడు. వెనక్కి చూడకుండా పరిగెత్తాడు. మంటలవైపు చూడకుండా పరిగెత్తాడు. తెల్లవారిందాకా పరిగెత్తాడు. అలా ప్రతి రాత్రి మొదలుకొని తెల్లవారిందాకా పరిగెత్తేవాడు. అలా అయిదురోజులు పరిగెత్తాడు.. మనిషి జాడలేని ప్రదేశం దొరికేదాకా పరిగెత్తాడు.

కథ చెప్పటం ముగించాడు.

 

అమెకి కథ ఎవరిదో అర్థం మయింది.. అతడేవరో తెలిసిపోయింది.  అమె తప్పేంటో ఆమెకి తెలిసొచ్చింది.  పుత్రవాత్సల్యం పెల్లుభికింది.

అతని తప్పేంటో,  కర్తవ్యం ఎంటో అతనికి తెలుసు కనకనే ఇక్కడిదాకా ఆమెని వెతుక్కుంటూ వచ్చాడు.

ప్రేమ ఉంటే ఇద్దరు వ్యక్తులు కలిసుండటం సులభం, ఆనందం… కానీ  ప్రేమ లేకపోతే ఆ సంసారం నరకం. తీవ్రమైన ఆకర్షణలో పెళ్ళి చేసుకోవటం.. ఆకర్షణ తగ్గగానే తప్పు చేసామా అనే భావనలో  కోపం, కసి కలగటం, తనని ఎదుటివాళ్ళు  వాడుకున్నారని అనిపించటం,  జీవితం సర్వనాశనమైపోయిందనీ తలపోయటం దాదాపు ప్రతి ప్రేమజంటకీ పరిచయమే.  అది ప్రేమవివాహమైనా..పెద్దలు కుదిర్చినదైనా  కొన్నాళ్లకి ప్రతి జంటకీ ఈ వివాహానంతర వెలితి ( post marriage syndrome)  అనుభవమే. .  దాంతో కొందరు ఎవరికి వారై  సంసారం నాశనం చేసుకొని పిల్లలని  తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోని  అనాధలని చేసి తమ జీవితాలనీ..తమని ప్రేమించిన జీవితాలని బలిపెట్టటం అనేది  దేశ ..భాషా బేధాల్లేకుండా సర్వ సాధారణమే.

ఓ సాధారణ కథనే సరళమైన రీతిలోనే అసాధారణంగా తెరకెక్కించారు. అందుకే కేన్స్ లో అందరి మన్ననలూ అందుకొని ఏకగ్రీవంగా  బెస్ట్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకుంది ఈ సినిమా.

 

మిరుమిట్లు ( highlights )

సినిమా  మొదలైన విధానం అది అసలు కథలోకి ప్రవేశించినతీరూ అద్బుతం.  రాబీ ముల్లర్ సినిమాటోగ్రఫీ  మంత్రముగ్దులని చెస్తే ,  RY కూడర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి జీవం పోసింది. ఆ గిటారు శభ్దాలన్నీ లోకంలోని ఒంటరి తనాన్ని .. తెలియని  వేదనని  పలికిస్తూ మనసుకు తాకుతుంది. ఇవి కాక ఆకట్టుకునేవి మాటలు.  పాత్రలు సహజ భావోద్వేగాలతో  సూటిగా  మాట్లాడుతాయి.  ఒంటరిగా చూస్తె సినిమాలో లీనమైపోతాం.. పాత్రతో అనుసంధానింపబడి ఒకానొక దశలో మన  కళ్ళు చెమ్మగిల్లక మానవు.

పారిస్, టెక్సాస్ లోని ఓ ఊరు. అక్కడే తన తల్లిదండ్రులు కలిసారని హీరో అంటాడు. అక్కడ తానో స్థలం కొన్నానని ఓ పోటో చూపిస్తాడు.   భవిష్యత్తులో అక్కడే ఉండాలనుకుంటున్నాననీ చెపుతాడు.  నిజానికి తానెన్నడూ ఆ ప్రదేశాన్ని చూడలేదు.  ఆ ప్రదేశం  గతానికీ .. భవిష్యత్తుకీ, వాస్తవానికీ…  భావనకీ  ప్రతీక  !!

ఎడారిలాంటి భూమి మీద విశాలంగా పరచుకున్న అకాశమే పారిస్,టెక్సాస్.   ఎ  బ్యూటిఫుల్ ఫిల్మ్.