Menu

1:నేనొక్కడినే – కమర్షియల్ తెలుగు సినిమా కీర్తి కిరీటంలో మేలిమి రత్నం

సంక్రాంతి రాకముందే తెలుగులో సినిమా పండగ మొదలైంది. ఈ సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి పెద్ద సినిమాగా “1-నేనొక్కడినే” ఈ రోజు విడుదలైంది. ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో అత్యుత్తమైన ఇద్దరు ముగ్గురు దర్శకుల జాబితాలో చేర్చదగ్గవాడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్, మంచి ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెలుగులో అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమాగా “1-నేనొక్కడినే” పై ప్రేక్షకులు భారీ అంచనాలు కలిగిఉండడం సహజమే! కాంబినేషన్స్,ఎక్స్పెక్టేషన్స్ గురించి పట్టించుకోకుండా కేవలం తను నమ్మిన కథకు పూర్తి న్యాయం చెయ్యడం మాత్రమే తెలిసిన దర్శకుడు సుకుమార్. “1-నేనొక్కడినే” సైతం ఇదే కోవలోకి వస్తుంది.

కథాపరంగా ఇది గొప్ప కథేం కాదు. అన్ని కమర్షియల్ సినిమాల్లోలాగే ఇదొక రివెంజ్ డ్రామా. గౌతమ్ పదేళ్ల వయసులో అతని తల్లి దండ్రులను ఎవరో చంపేయడంతో అనాధ శరణాలంలో పెరుగుతాడు. కానీ గౌతమ్ అనుకుంటున్నట్టుగా అతని తల్లిదండ్రులను ఎవరూ చంపేయలేదని, తల్లిదండ్రులు లేని అనాథ అయిన గౌతం సృష్టించుకున్న ఊహల్లో మాత్రమే అతని తల్లిదండ్రులు, వారిని చంపిన హంతకులు ఉన్నారని అందరి నమ్మకం. అది నిజం కాదని, తన తల్లిదండ్రులని నిజంగానే ముగ్గురు వ్యక్తులు చంపేశారని గౌతం ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. తన నమ్మకం, ఇతరుల అపనమ్మకం మధ్య ఊగిలాడుతూ పెరిగి పెద్దవాడైన గౌతం ఒక రాక్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. కానీ తన తల్లిదండ్రులను చంపిన ఆ ముగ్గురు మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంటారు. అసలు వారు నిజంగా ఉన్నారా? లేక వారు తన ఊహల్లో సృష్టించుకున్న పాత్రలేనా? అని తెలయక సతమతమవుతున్న పరిస్థుతుల్లోనుంచి బయటపడి అసలు నిజమేంటో తెలుసుకోవడమే ఈ సినిమా కథ.

రెగ్యులర్ రివెంజ్ డ్రామా కథే అయినప్పటికీ అరుదైన స్క్రీన్ ప్లే విధానంతో సుకుమార్ ఈ సినిమాని మలిచిన తీరు అపూర్వం. సాధారణ ప్రేక్షకులను వదిలేస్తే, సినిమా రంగం అంటే ఆసక్తి కలిగిన వారికి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ చూసినప్పుడు మనమూ ఇలాంటి సినిమా తియ్యగలిగితే బావుంటుందని చాలా సార్లు అనిపిస్తుంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లు చూసి హిందీ లో తీసిన సూపర్ హీరో సినిమాలు, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి సినిమాల ఇన్స్పిరేషన్ తో చేసిన ధూమ్ సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అప్పుడెప్పుడో వచ్చిన “సాహస ఘట్టం”, “సిటీ పోలీస్” లాంటి కొన్ని సినిమాలను మినహాయిస్తే హాలీవుడ్ తరహా యాక్షన్ థ్రిల్లర్/మిస్టరీ సినిమాలు తెలుగులో రాలేదనే చెప్పాలి. మొట్టమొదటి సారిగా ఒక సూపర్ స్టార్ హీరో ప్రధాన పాత్రలో రూపొందించిన పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ సినిమా “1-నేనొక్కడినే”. ఇలాంటి సినిమా చెయ్యాలనుకోవడమే పెద్ద సాహసమైతే, అలాంటి సినిమాని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా, తెలుగు సినిమా ప్రేక్షకులు ఇలాంటి కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తారో లేదో అన్న అనుమానంతో అనవసరమైన సోకాల్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఇరికించే ప్రయత్నం చెయ్యకుండా, అనుకున్న కథకు పూర్తి న్యాయం చేస్తూ అద్భుతంగా తెరక్కించాడు దర్శకుడు సుకుమార్.

సుకుమార్ డైరెక్షన్ లో నిజానికి అబధ్దానికి మధ్య ఊగిసలాడే గౌతం పాత్రకి జీవం పోశాడు మహేష్ బాబు. ఇది పూర్తిగా “నేనొక్కడినే” అని మహేష్ తన భుజస్కంధాలమీద మోసిన సినిమా. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సీరియస్ ఎపిసోడ్ లో సైతం హాస్యం పండించిన తీరు, క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఎమోషనల్ గా చేసిన నటన సినిమాకి ప్రాణం పోస్తే, యాక్షన్ ఎపిసోడ్స్ లో హాలీవుడు హీరోలా కనిపించి అభిమానులకు పండగ చేశాడు మహేష్ బాబు. అలాగే మహేష్ బాబు కొడుకు గౌతం కి సినిమాలో చాలా నిడివి ఉన్న పాత్ర దొరికింది. తన పరిధిలో గౌతం చాలా బాగా చేశాడనే చెప్పాలి.

కేవలం స్క్రీన్ ప్లే, మహేష్ బాబు నటన మాత్రమే కాకుండా సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి, లండన్ లో సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, కథలో ఎప్పటికప్పుడు రివీల్ అయ్యే కొత్త ట్విస్ట్స్ తెలుగు సినిమాలో అంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా ఉన్నాయి. సినిమా అంతా ఒక ఎత్తైతే సినిమా లోని క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక్కటే చాలు ఈ సినిమాని మరో నాలుగు కాలాలపాటు గుర్తుంచుకోవడానికి. ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఎవరూ ఊహించని క్లైమాక్స్ ఇది. నాకైతే సినిమా మొత్తం సుకుమార్ దాస్తూ వచ్చిన విషయం అక్కడ రివీల్ చేసిన విధానం నభూతో నభవిష్యతి. నాకైతే సినిమాలో ఇదే పెద్ద హైలైట్.

తమిళ్ లో “భారతీయార్” రాసిన ఒక పాట వుంది. “ఆశై ముఖం మరందు పోచ్చే (ఇష్టమైన ముఖాన్ని మర్చిపోయానే)” అని సాగుతుంది ఈ పాట. “1-నేనొక్కడినే” చూసి తిరిగొస్తుంటే ఈ పాటే నాకు గుర్తొచ్చింది. తనకు బాగా ఇష్టమైన తల్లి చిన్నప్పుడే చనిపోగా ఆమె ఫోటో మాత్రమే జ్ఞాపకంగా మిగిలిందట భారతీయార్ కి. కాలక్రమంలో ఆ ఫోటో మాసిపోయి, చినిగిపోవడంతో కొన్నాళ్లకు భారతీయార్ తన తల్లి ఎలా ఉంటుందో మర్చిపోయాడట. ఆ బాధలో రాసిన పాటే “ఆశై ముఖం”. “1-నేనొక్కడినే” క్లైమాక్స్ చూశాక నాకీ పాటే గుర్తొచ్చింది.

ఈ పాటలోలాగే తన ఉన్నారో లేరో తెలియని తల్లిదండ్రుల కోసం హీరో సాగించిన అన్వేషణే ఈ సినిమా కథ. కానీ సినిమా చివర్లో తప్ప ఈ పాయింట్ మనకి హైలైట్ కాదు. ఇద్ మాత్రమే కాకుండా సినిమాలో ఫస్టాఫ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సినిమా మొదలవడమే సెకండ్ యాక్ట్ లా మొదలవుతుంది. దాంతో చాలా సేఫు ప్రేక్షకులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంతే కాకుండా హీరో-హీరోయిన్ల మధ్య రొమాన్స్ సాగతీత లా ఉండడం కూడా ఒక పెద్ద సమస్య. వీళ్ల మధ్య వృధా చేసిన స్క్రీన్ టైం, గౌతమ్ కథ ను సెటప్ చెయ్యడంలోనూ (గౌతం రాక్ స్టార్ ఎలా అయ్యాడు, అతనికి సన్నిహితులు ఎవరైనా ఉంటే వాళ్లతో గౌతం రిలేషన్‌షిప్ లాంటి అంశాలు) సమయం వెచ్చించి ఉండొచ్చు. అంతేకాకుండా సినిమాలో ప్రధాన అంశమైన “ఇంటిగ్రేషన్ డిజార్డర్” గురించి కూడా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. సినిమాలో అందరూ (షాయాజీ షిండే, డాక్టర్ పాత్రలో సూర్య, హీరోయిన్) కూడా గౌతం కి ఉన్న డిజార్డర్ ని కామెడీ చెయ్యడం తప్ప ఎవరూ అతని బాధను అర్థం చేసుకోరు. దాంతో ప్రేక్షకులు కూడా అతని డిజార్డర్ గురించి disconnected గానే ఉంటారు. ఇది కాకుండా సినిమాలో కీలకాంశమైన “సబ్ ప్లాట్” లేదా “ప్లాట్ బి” అయిన అంశాన్ని (హీరోయిన్ పాత్ర ఇన్వెస్టిగేషన్ చేసే జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాల ట్రాక్) కూడా తేలిగ్గా వదిలేయడంతో, సబ్ ప్లాట్ లోని అంశాలు మైన్ ప్లాట్ లో వచ్చి చేరినప్పుడు కాస్తా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కథ ఫస్టాఫ్ లో కాస్తా ఇబ్బందికరంగానే సాగడానికి పైన చెప్పిన అంశాలే ముఖ్యకారణాలని నా ఉద్దేశం. మొత్తానికి ఇవన్నీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం వల్ల స్టోరీ సెటప్ వీక్ అయింది. కాకపోతే ఇంటర్వెల్ కి ఇరవై నిమిషాల ముందు నుంచి ఊపందుకున్న కథ చివరి వరకూ అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది.

ఏది ఏమైనా తెలుగు కమర్షియల్ సినిమాకి ఒక కొత్త ఊపిరినిచ్చిన సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా నచ్చితే విపరీతంగా నచ్చుతుంది. లేకపోతే అస్స్లలు నచ్చదు. కాస్తా విభిన్నమైన సినిమాలు కోరుకునే వారికి మాత్రం ఇది నచ్చి తీరుతుంది. ఫారిన్ కంట్రీస్ లో అండర్ కవర్ కాప్స్, డాన్స్ తో మొదలై చివరికి ఇండియాలోని ఒకింట్లో కి కథ ని ఈడ్చుకొచ్చే స్థాయి నుంచి, ఇండియాలో మొదలై మిస్టరీ ని చేధించడానికి ఫారిన్ కంటీ వెళ్లడమనేది ఈ సినిమా కథలో ప్రత్యేకత. కాస్తా హాలీవుడ్ ధోరణి లో కథ సాగినా, ఎబ్బెట్టు గా లేకుండా కూడా తెలుగు సినిమాకీ ఇలాంటి కథలు చేయొచ్చనే నమ్మకాన్ని కలిగించే సినిమా ఇది. హిట్టో, ఫ్లాపో అని టక్కున చెప్పేసే సినిమాగా కాకుండా “genre” బేస్ట్ సినిమాలకు ద్వారాలు తెరిచిన సినిమాగా కూడా “1-నేనొక్కడినే” చరిత్రలో నిలిచిపోతుంది.

సాధారణంగా వేరే రాష్ట్రాలకు చెందిన నా మిత్రులు ఏదైనా తెలుగు సినిమా రికమండ్ చెయ్యమని అడిగితే చెప్పడానికి సినిమాలు లేక వెతుక్కోవాల్సి వస్తుంది. గత సంవత్సరం వచ్చిన సినిమాల్లో “ప్రేమ కథా చిత్రం”, “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్” లాంటి కొన్ని సినిమాలు తప్ప రికమెండ్ చెయ్యడానికి నాకు సినిమాలే దొరకలేదు. మామూలుగానే “genre” సినిమాలంటే చాలా ఇష్టం. హాలీవుడ్ సినిమాల్లా, ఈ మధ్యనే వస్తున్న హిందీ, తమిళ్, మలయాళం “genre” సినిమాల్లాగే తెలుగులో కూడా కలగూరగంపలాంటి మసాలా మిక్స్ సినిమాలతో పాటు “జన్రా” బేస్డ్ సినిమాలు కూడా కొద్దిమందైనా ప్రయత్నిస్తే బావుండని రోజూ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను. సుకుమార్ ద్వారా నా కోరిక నిజమైందనే చెప్పాలి. ఒక సూపర్ స్టార్ తో పూర్తి యాక్షన్ థ్రిల్లర్ జాన్రా లో వచ్చిన “1-నేనొక్కడినే” గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, “…it is going to raise the bar for the Telugu films”.

I can proudly say I liked “1-నేనొక్కడినే” better than any high budget Telugu commercial film in the recent past. It is a film that will definitely find its audience, if not now, eventually.

12 Comments
 1. chandrabose January 10, 2014 /
 2. మమత January 10, 2014 /
 3. narresh January 10, 2014 /
 4. Sunny January 11, 2014 /
 5. Sarath January 12, 2014 /
 6. సుజాత January 13, 2014 /
 7. Krishna January 15, 2014 /
 8. Krishna January 15, 2014 /
 9. venkateswarlu rejeti January 17, 2014 /
 10. సుజాత January 24, 2014 /
  • krishna January 24, 2014 /
 11. VENKAT BALUSUPATI April 7, 2014 /