Menu

1:నేనొక్కడినే

ప్రేమంటే ఏమిటి? ఒంటరితనం వల్ల వచ్చే భయాన్ని పోగొట్టి ప్రశాంతతనిచ్చే ఆసరా. భయమంటే ఏమిటి? ఆ ఆసరాని కోల్పోతామేమోనన్న మానసిక భావన.

మనిషి ఎప్పుడూ తోడు కోరుకుంటూ ఉండేది అందుకే – మొదట తల్లిదండ్రుల నుంచీ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళ నుంచీ, తరువాతి కాలంలో స్నేహితులనుంచీ, ఆపై జీవిత భాగస్వామినుంచీ, చివర్న బిడ్డలూ మనవలనుంచీ.

మరి అలాంటిది, ఒక వ్యక్తికి వీళ్ళెవ్వరూ లేకపోతే? జీవితం మొదట్లోనే అతను తల్లిదండ్రులని కోల్పోతే? అదీ ఇంకెవ్వరో వాళ్ళని తన కళ్ళముందే చంపటం వల్ల అయితే? తనని కూడా చంపేస్తారేమోనన్న భయం మనసులో నిలిచిపోతే? ప్రపంచం అతణ్ణి పిచ్చివాడిగా లెఖ్ఖ కట్టి, నీకసలు తల్లిదండ్రులే లేరు అని నమ్మించే ప్రయత్నం చేసి వదిలేస్తే?

“ఆ బిడ్డ ఎలాంటి మానసిక స్థితిలో పెరుగుతాడు? తన తల్లిదండ్రుల రూపురేఖలుకూడా మరిచిపోయి, హంతకుల ముఖాలు మాత్రమే గుర్తుండి ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తాడు? భయాన్ని పోగొట్టుకోవడానికీ (పగతీర్చుకోవడం ద్వారా), తన గతమేంటో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాడు?” అన్నదే ‘1-నేనొక్కడినే’ సినిమా కథ.

అసలు ఇలాంటి కథని తెలుగులో, ఈ కాలంలో, ఈ పధ్ధతిలో సినిమాగా తీయవచ్చని నమ్మి రాసిన సుకుమార్ పట్ల , ఇదొక మంచి సినిమా అవుతుందని నమ్మి నటించిన మహేశ్ పట్ల నా గౌరవం పదింతలు పెరిగింది.

అందరికంటే ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతల అభిరుచి, సాహసం ప్రశంసనీయం. “శంకరాభరణం” తీయడానికి ఏడిద నాగేశ్వర్రావు గారు ఎంత సాహసం చూపించి ఉంటారో, ఈ కాలంలో, ఇంత వ్యాపార సామర్థ్యం కలిగిన హీరోతో, ఇలాంటి సినిమా తీయడానికి పూనుకోవడం ద్వారా వాళ్ళూ అంతే తెగువ చూపించారని నాకనిపించింది.

ఇక సాంకేతిక అంశాల జోలికి వెళ్తే:

1. దర్శకుడిగా సుకుమార్ ప్రేక్షకుడిని గౌరవించి, కథకు మాత్రమే విలువనిచ్చి (ఒక్క బూతు పాట విషయంలో తప్ప), కీలకమైన భావోద్వేగాన్ని చివరికంటా వదలకుండా సినిమాని నడిపిన తీరు అద్భుతం. తన తల్లిదండ్రులెవరో, వాళ్ళెలా ఉండేవారో తెలుసుకోవడాన్ని క్లైమాక్స్ గా ఎంచుకోవడం మహాద్భుతం. దానికి ఒక రైమ్‌ని క్లూగా ఎంచుకొని చూపించిన తీరు మధురం. ప్రతి తల్లికీ కంట్లో నీళ్ళు తిరగాల్సిందే.

2. నటుడిగా మహేశ్ ని ఒక శిఖరంపై కూర్చోబెట్టిందీ సినిమా. అతను ఆ పాత్రని అర్థం చేసుకుని నటించిన తీరు, వ్యక్తిగా అతనిలోని పరిణతికి అద్దం పట్టింది. సినిమా చూసి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కూడా “మహేశ్ కాకుండా తెలుగులో ఏ యువనటుడు ఇంత బాగా ఈ పాత్రకు న్యాయం చేయగలడబ్బా?” అని ప్రేక్షకుడిచేత ఆలోచింపజేయగలిగాడు మహేశ్. సినిమా పూర్తి చేయటానికి ఇంత ఎక్కువ సమయం తీసుకోవడం, ఈ ఒక్క సినిమా విషయంలో న్యాయబధ్ధంగా అనిపించింది.

3. దేవిశ్రీప్రసాద్ కెరీర్ లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్ అవుతుందీ చిత్రం. “ఒక్కడు” సినిమా మణిశర్మ రీరికార్డింగ్ సత్తాని చాటితే, ఈ సినిమా దేవిశ్రీ సామర్థ్యాన్ని, పరిణతిని చూపింది. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కూడా, ఒక “హాంటింగ్ ట్యూన్” మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.

4. రత్నవేలు కెమెరా ద్వారా ప్రేక్షకుడు ఈ సినిమా చూడగలగటం ఒక అదృష్టం.

5. సంభాషణల రచయితగా కూడా సుకుమార్ మెరిశాడు. కీలకమైన సన్నివేశాల్లో, అతి తక్కువ మాటల్లో పాత్ర భావోద్వేగాల్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేశాడు. మచ్చుకి కొన్ని – “ప్రేమకన్నా భయం గొప్పదేమో?”, “మా నాన్న ఎలా ఉంటాడు రా? నాలాగా ఉంటాడా?”.

6. పోరాటాలూ, వెంటపడటాలూ లాంటివి సాంకేతికంగా ఉన్నత స్థాయిలోనే ఉన్నా, ఈ సినిమాని ప్రపంచస్థాయి సినిమాగా మార్చింది మాత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంభాషణలు, నటన, నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణమే.

చివరగా: సినిమాని కొంచెం కత్తిరించబోతున్నారని విన్నా. ఆ కత్తెర్లేవో ఛేజుల్లోనో, ఫైటుల్లోనో చేస్తే ఫర్వాలేదు. కొందరు అడుగుతున్నట్టు క్లైమాక్స్ ని కత్తిరించకపోతే ఎంతో సంతోషం.

–శ్రీహర్ష

One Response
  1. Ravi Avula February 6, 2014 /