Menu

One Flew Over the Cuckoo’s Nest

సినిమా అంటే కేవలం కథ ఒక్కటే కాదు; అందులో చాలా విషయాలు కలిసిపోయుంటాయి. మంచి కథ సైతం చెత్త సినిమా గా తయారవ్వొచ్చు; సాధారణ కథని సైతం అద్భుతమైన సినిమాగా రూపొందిచవచ్చు. అందుకు తోడ్పడే అంశాల్లో స్క్రీన్ ప్లే రచన, కెమెరా పనితనం, ఏడిటింగ్, నటన…ఇలా చాలా ఉన్నాయి. ఇప్పటివరకూ కథాంశం ప్రధానంగానే ఈ వ్యాసాలు కొనసాగినా, ఇక నుంచి సాంకేతిక అంశాలు, తాత్విక విషయాలను కూడా చర్చించాలని ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రయత్నం.

One Flew Over the Cuckoo’s Nest
మనిషి స్వేచ్ఛ నుంచి తప్పించుకోలేడు – Man is condemned to be free

మనిషి స్వేచ్ఛా జీవి. కానీ స్వేచ్ఛ అంటే ఏమిటని అడిగితే చెప్పడం కొంచెం కష్టమే! స్వేచ్ఛ అనేది ఒక సంభావ్యత మాత్రమే. దానిని ఆలోచన ద్వారా తెలుసుకోలేము; అనుశీలనం చేయడం ద్వారానే దానిని తెలుసుకోగలం. అప్పుడు కూడా అది అన్నిసార్లు కనిపిస్తుందన్న నమ్మకం లేదు. కేవలం కొన్ని అరుదైన క్షణాలలో కొద్ది మందికి మాత్రమే స్వేచ్ఛ ఈషన్మాత్రంగా దర్శనమిస్తుంది. కానీ మనిషి దేన్నుంచైనా తప్పించుకోగలడు కానీ స్వేచ్ఛ నుంచి తప్పించుకోలేడు; ఫ్రెంచ్ రచయిత సార్త్రె చెప్పినట్టు, “Man is condemned to be free”. మనం స్వేచ్ఛ గురించి ఎంత పట్టించుకోకుండా వదిలేసినా, ఎక్కడో దగ్గర, ఎప్పుడో ఒకసారి, ఎవరో ఒకరి ద్వారా మనిషి ని ఎదుర్కొని ప్రశ్నిస్తుంది స్వేచ్ఛ. తమ శ్రేయస్సు కొరకు అమలు జరిపిన అనేక నియమనిబంధనలు తమ స్వేచ్ఛను హరించేసేయన్న విషయం సైతం మర్చిపోయిన కొంతమందికి స్వేచ్ఛ గురించి తెలియచెప్పే కథ “One Flew Over the Cuckoo’s Nest”.

*****

మెక్మర్ఫీ ఒక చిన్న సైజు నేరస్థుడు. జైలులో అతని ప్రవర్తన తట్టుకోలేక మెంటల్ హాస్పిటల్ కి పంపించారు. మెక్మర్ఫీ సామాన్యుడు కాదు; జైలు జీవితం నుంచి తప్పించుకోవడానికే పిచ్చి వాడిలా నటించి మెంటల్ హాస్పిటల్ చేరుకున్నాడు. అతను మనసులో మాట దాచుకోలేడు. తనకి ఏది అనిపిస్తే అది వెంటనే చేసేయడం, చెప్పేయడం అతనికి అలవాటు. అన్నింటికీ అత్యుత్సాహం కనబరుస్తాడు; అవకాశం దొరికితే చాలు రూల్స్ బ్రేక్ చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఆ మెంటల్ హాస్పిటల్ లో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న రాచెడ్ అతనికి పూర్తి వ్యతిరేకం. స్వేచ్ఛగా ఉండగలిగి కూడా వివిధ కారణాల వల్ల మెంటల్ హాస్పిటల్ లో ఉండిపోయి, నర్స్ రాచెడ్ విధించిన నియమ నిబంధనలకు తలొగ్గి నడుచుకుంటూ ఉంటారు అక్కడి వాళ్లు. అక్కడి రోగులు మాత్రమే కాదు, హాస్పిటల్ లో పని చేసే వాళ్లు కూడా ఆమె కనుసన్నలలో నడవాలనుకునే తత్వం ఆమెది. బయటకు ప్రశాంతంగానే ఉన్నా నివురుగప్పిన నిప్పు లాంటిది రాచెడ్. తన జీవితాన్ని తన ఇష్టానుసారం గడపాలనుకునే చిచ్చరపిడుగు మెక్మర్ఫీ. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఇమడం చాలా కష్టం. వారిద్దరి మధ్య అనివార్యమైన వివాదానికి రంగం సిద్ధమయింది. ఫ్రీడం మరియు అధారిటీల మధ్య యుద్ధం మొదలయింది.

one-1

కీలక సన్నివేశం

హాస్పిటల్ లోని రోగులతో నర్స్ రాచెడ్ నిర్వహించే రోజువారీ మీటింగ్ జరుగుతోంది. రెండు గంటల పాటు నడిచే చలనచిత్రంలో ఈ మీటింగ్ సన్నివేశాలు నాలుగైదు సార్లు ఉంటాయి. ఇప్పుడు మనం చర్చించే మీటింగ్ సన్నివేశం కంటే ముందే రెండు సార్లు మీటింగ్ జరిగి ఉంటుంది. జైలు శిక్ష ను తప్పించుకోవడానికి మెంటల్ హాస్పిటల్ కి వచ్చిన మెక్మర్ఫీ కి ఒక్కొక్క విషయం అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంటుంది. ఈ సన్నివేశానికి కాస్తా ముందు జరిగిన ఒక మీటింగ్ లో, హాల్లో ప్లే చేస్తున్న సంగీతం హోరులో ఒకరు మాట్లాడే మరొకరికి వినిపించడం లేదని, సౌండ్ తగ్గించాల్సిందిగా కోరుతాడు మెక్మర్ఫీ. “ఇది ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహింపబడుతున్న హాస్పిటల్. నీ ఒక్కరి కోసం నియమాలను మార్చలేమ” ని సమాధానం చెప్తుంది రాచెడ్. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటాడు మెక్మర్ఫీ.
కథాపరంగా సినిమాలో ఇది చాలా కీలక సన్నివేశం. స్వేచ్ఛ అనే విషయాన్ని మరిచిపోయి రాచెడ్ పాలనలో నలిగిపోతున్న వారిలో స్ఫూర్తి రగిలించే సన్నివేశం ఇది. అప్పటివరకూ మెక్మర్ఫీ ని పెద్దగా పట్టించుకోని రాచెడ్, మొదటి సారిగా తన సామ్రాజ్యం కూలిపోతోందేమోనన్న భయం మొదలయ్యేది కూడా ఈ సన్నివేశంలోనే. అయితే కేవలం కథా పరంగానే కాకుండా, స్క్రీన్ ప్లే రచనా పరంగా కూడా ఈ సన్నివేశం ఈ సినిమా మొత్తానికి ఆత్మలాంటిది.

one-3

సాధారణంగా ఒక స్క్రీన్ ప్లే ని ఐదు భాగాలుగా విభజిస్తారు.
1) Setup – ఈ భాగంలో కథ జరుగుతున్న ప్రపంచాన్ని వర్ణించి, సినిమాలోని ముఖ్యపాత్రలను పరిచయం చేయడం జరుగుతుంది.
2) Initial Confrontation – ఇక్కడ కథ లోని నాయకుడు ప్రతి నాయకునితో ఘర్షణ పడతాడు. ఇద్దరి మధ్య శతృత్వం ఏర్పడుతుంది. కానీ ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తక్కువ అంచనా వేసుకుంటారు.
3) Midpoint (Moment of false victory) –ప్రతి నాయకునికి పై కథానాయకునికి, లేదా కథానాయకునిపై ప్రతినాయకునికి విజయం వరించినట్టే వచ్చి, చివరినిమిషంలో అంతా తలకిందులవుతుంది.
4) Final Confrontation – ప్రతి నాయకుని పై కథానాయకుడు అసలైన యుద్ధం ప్రకటిస్తాడు. ప్రతినాయకుడు కూడా తనూ సిద్ధమని పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతాడు.
5) Resolution – చివరికి కథానాయకుడు విజయం సాధిస్తాడు.
తొంభై శాతం సినిమాలు దాదాపు పైన చెప్పిన పద్ధతిలోనే నడుస్తాయి. అయితే అత్యుత్తమ స్క్రీప్లే రచయితలు, పైన చెప్పిన పద్ధతిని కేవలం కథకి మాత్రమే కాకుండా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలలో సైతం ఉపయోగిస్తారు. ఈ సినిమాలోని ఈ సన్నివేశం లో కూడా మనం పైన చెప్పుకున్న ఐదు భాగాలను చూడొచ్చు.

Setup : సినిమాలో అంతకుముందే చూసినట్టు రోజు వారీ మీటింగ్ తో సన్నివేశం మొదలవుతుంది. హాస్పిటల్ లోని కొంతమంది రోగులు మీటింగ్ కి హాజరవుతారు. “ఈ రోజు బిల్లీ అనే రోగి సమస్య ను చర్చించుకుందాం” అని ప్రకటిస్తుంది రాచెడ్.

Initial Confrontation : బిల్లీ తన సమస్య గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాడు. గతంలో ఇలాంటి మీటింగ్స్ లో రాచెడ్ ఎవరిని ఎన్నుకుంటే వారు తమ సమస్య గురించి మాట్లాడాల్సిందే. అయితే అంతకుముందు మీటింగ్ లో మొదటిసారి రాచెడ్ ని ఎదిరించి మాట్లాడుతాడు మెక్మర్ఫీ. ఇది చూసిన కొంత మందిలో ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే చెస్విక్ అనే అతను బిల్లీ ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగొద్దని రాచెడ్ ని వారిస్తాడు. ఇది ఆమె అనుకోని పరిణామం. రాచెడ్ పై మెక్మర్ఫీ ప్రకటించిన యుద్ధానికి ఇది మొదటి సంకేతం.

బిల్లీ సమస్య నుంచి వేరే విషయానివైపు చర్చను దారి మళ్లిస్తాడు చెస్విక్. టివిలో ప్రసారమవుతున్న జాతీయ బేస్ బాల్ ఆటలను చూడ్డానికి అనుమతివ్వాలని రాచెడ్ ని అడుగుతాడు చెస్విక్. అయితే అంతకుముందు మీటింగ్ లో మెక్మర్ఫీ ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే అందుకు అనుకూలంగా స్పందించారు. కానీ చెస్విక్ ఈ విషయం లేవనెత్తగానే మెక్మర్ఫీ అందుకుని మరోసారి ఓటింగ్ నిర్వహించమంటాడు.

Midpoint: ఓటింగ్ నిర్వహించడానికి ఒప్పుకున్న రాచెడ్, బేస్ బాల్ మ్యాచ్ చూడాలనుకున్న వారిని చేతులెత్తమనడంతో తొమ్మిది మంది చేతులెత్తడంతో ఆశ్చర్యపోతుంది. కానీ 18 మంది ఉన్న ఆ వార్డ్ లో మరొకరు ఓట్ వేస్తే తప్ప తమ వాదన గెలిచినట్టు కాదని ప్రకటిస్తుంది రాచెడ్.

Final Confrontation : మెక్మర్ఫీ కి ఏం చెయ్యాలో అర్థం కాదు. చేతులెత్తిన తొమ్మిది మంది కాకుండా మిగిలిన తొమ్మిది మంది దాదాపు పూర్తిగా మతి స్థిమితం లేని వాళ్లు. వాళ్లకి సమస్య గురించి చెప్పి ఒప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు మెక్మర్ఫీ. ఒక్కొక్కరి వద్దకూ వెళ్లి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతని ప్రయత్నం ఫలిస్తుంది.

ఎన్నో ఏళ్ళుగా మెంటల్ హాస్పిటల్ లో ఉంటూ, మూగ చెవిటి వాడైన బ్రోమ్డెన్ అనే వ్యక్తిని ఒప్పించి, తమకు అనుకూలంగా ఓటు వేస్తూ చేతిని పైకి లేపించగలుగుతాడు మెక్మర్ఫీ.

Resolution: అయితే ఇంత జరిగిన తర్వాత కూడా విజయం రాచెడ్ దే అవుతుంది. పద్దెనిమిది మందిలో పది మంది అనుకూలంగా ఓటు వేసినప్పటికీ, వారికి బేస్ బాల్ మ్యాచ్ లు చూడ్డానికి అనుమతినివ్వకుండా తనమాటే నెగ్గించుకుంటుంది. కానీ జీవితంలో ఎప్పుడూ ఎవరి మాటలకూ స్పందించని బ్రోమ్డెన్ ని మొదటిసారి కదిలించగలుగుతాడు మెక్మర్ఫీ.

ముందే చెప్పినట్టు ఈ సినిమా మొత్తానికి ఈ సన్నివేశం ఆత్మ లాంటిది. కథ లో అప్పటివరకూ జరిగిన విషయాలు మాత్రమే కాకుండా, జరగబోయే విషయాలు – క్లైమాక్స్ తో సహా, ఈ సన్నివేశంలో చాలా తెలివిగా ప్రస్తావించారు రచయిత , దర్శకులు.

ఒక విధంగా ఈ సినిమా కథ మొత్తం ఈ సన్నివేశం లో ఇమిడిపోయి ఉంటుంది. ఈ సన్నివేశంలోలానే, సినిమా మొదలయ్యేటప్పటికి మెక్మర్ఫీ అసలు కథలోనే ఉండడు. ఒక హాస్పిటల్, అందులో కొంతమంది పేషెంట్స్. వారిని నియంత్రిస్తున్న నర్స్ రాచెడ్ – వీళ్లతో కథ మొదలవుతుంది, ఇలాంటి పరిస్థితిలోకి మెక్మర్ఫీ కథలోకి వస్తాడు.

ఈ సన్నివేశంలో కూడా అంతే. మొదట బిల్లీ, చెస్విక్ మరియు రాచెడ్ ల మధ్య జరుగుతున్నట్టుగా మొదలవుతుంది. కానీ మెక్మర్ఫీ మధ్యలో ప్రవేశిస్తాడు. రాచెడ్ తో వాదనకు దిగుతాడు. అయితే మెక్మర్ఫీ ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది రాచెడ్. రాచెడ్-మెక్మర్ఫీ ల మధ్య ఏర్పడ్డ ఘర్షణే సినిమా లో ప్రముఖంగా మనకి కనిపిస్తుంది. అయితే ఓటింగ్ పెట్టి మెక్మర్ఫీ ని ఓడించానని అనుకుంటున్న సమయంలో మెక్మర్ఫీ తనకు అనుకూలంగా తొమ్మిది ఓట్లు సంపాదించి రాచెడ్ మీద విజయం సాధిస్తాడు. కానీ పదో ఓటు కావాలని తిరకాసు పెడ్తుంది. మెక్మర్ఫీ చాలా కష్టపడి బ్రోమ్డెన్ చేత చెయ్యెత్తించగలుగుతాడు. కానీ మీటింగ్ కి సమయం అయిపోయిందని రాచెడ్ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది; ఆమె మాటే నెగ్గించుకుంటుంది.

ఈ సన్నివేశంలోలానే సినిమా చివరలో మెక్మర్ఫీ ఓడిపోతాడు. రాచెడ్ తన మాటే నెగ్గించుకుంటుంది. కానీ మెక్మర్ఫీ చేసిన పోరాటం కారణంగా బ్రోమ్డెన్ అనే వ్యక్తిలో మార్పు కలుగుతుంది. ఈ సన్నివేశంలో మాత్రమే కాదు, సినిమా ముగింపు కూడా బ్రోమ్డెన్ మీదే ముగుస్తుంది.

one-4

ముగింపు : మానవ జీవితాన్ని అణిచివేసే ప్రతిదానికి ఎదురుతిరగవలసిందే. సంప్రదాయం అన్ని ప్రక్కల చుట్టుముట్టి మనిషిని సంకోచింపచేస్తుంది. సమాజ శ్రేయస్సు పేరుతో అమలు జరిపే అనేక చట్టాలు మనిషి స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఈ సినిమాలో చూపించిన “మెంటల్ హాస్పిటల్” లాంటి “సంస్థలు” ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయి; రాచెడ్ లాంటి నర్స్ లు వివిధ రూపాల్లో ఈ సమాజమంతా ఉన్నారు. వీళ్ల ప్రభావం నుంచి బయటపడాలంటే మనిషి అంతర్గతంగా స్వేచ్ఛతో ఉండాలి. అప్పుడు మాత్రమే అతడు బాహ్యంగా స్వేచ్ఛ కోసం పోరాడగలడు; ఇలా పోరాడిన వాడే “మెక్మర్ఫీ”. ఒక సమయంలో రాచెడ్ మీద దాడి చేసి ఆమెను హత్య చేయడానికి సైతం వెనికాడడు.

కేవలం తన ఒక్కడి స్వేచ్ఛ కోసం మాత్రమే కాకుండా, అందరి తరపున పోరాడాడు కాబట్టే మెక్మర్ఫీ చలనచిత్ర చరిత్రలోనే గొప్ప హీరోల్లో ఒకడిగా నిలిచిపోతాడు. అంతే కాదు మనిషి ఏదో ఒక దాని నుంచి స్వేచ్ఛ పొందడం కాదు, ఏదో ఒక దాని కొరకు స్వేచ్ఛ పొందాలి. ఇలా రాచెడ్ ఆన్యాయాలనుంచి రోగుల విముక్తి కొరకు మెక్మర్ఫీ పోరాడాడు.

అయితే, తన మీద మెక్మర్ఫీ దాడి చేసిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది రాచెడ్. మెక్మర్ఫీ కి ట్రీట్మెంట్ పేరుతో తీవ్రమైన ఎలక్ట్రిక్ షాక్ కి గురి చేస్తుంది; అది తట్టుకోలేక మెక్మర్ఫీ మెడడు లోని నరాలు దెబ్బతింటాయి. కొన్నాళ్ల పాటు సాగిన ఈ ట్రీట్మెంట్ కారణంగా మెక్మర్ఫీ మెదడు నిజంగానే మొద్దుబారిపోతుంది. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ తిరిగిన మెక్మర్ఫీ ని చివరికి బతికున్న శవంలా తయారు చేస్తారు.

మెక్మర్ఫీ ని అలాంటి పరిస్థుతుల్లో చూసి తట్టుకోలేకపోతాడు బ్రోమ్డెన్. తమందరి స్వేచ్ఛ కోసం అంతవరకూ మెక్మర్ఫీ చేసిన పోరాటం అతనిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. తన శక్తినంతా ఉపయోగించి, కిటికీ ని బద్దలు చేసుకుని హాస్పిటల్ నుంచి బయటపడతాడు. కానీ వెళ్లేముందు మాత్రం అర్థం లేకుండా పోయిన మెక్మర్ఫీ జీవితానికి మరణాన్ని బహుమతిగా ఇచ్చి వెళ్తాడు.