Menu

My dinner with Andre

సినిమాలలో “మై డిన్నర్ విత్ ఆంద్రే” సినిమా వేరయా!!!

సాయంత్రం ఏడయింది. షాన్ తన ఇంటి నుంచి బయల్దేరాడు. అతని మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనల ప్రభావం అతని మొహం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆందోళన నిండిన మొహంతో షాన్ రైల్వే స్టేషన్ వైపు నడిచాడు. నడుస్తున్నంత సేపూ అతనికి ఎంతో పరిచయమైన ఆ నగరం ఎప్పటిలానే పలకరించింది. కానీ షాన్ ఇవేవే పట్టించుకునే స్థితిలో లేడు. నాటక రచయితగా కొద్దో గొప్పో పేరున్నా ఇప్పుడు తన నాటకాలను పట్టించుకునే నాథుడు లేకపోవడమే షాన్ బాధ కి కారణం. ఉదయాన్నే లేచి, తన నాటకాలను నాలుగైదు కాపీలు చేసి, పోస్టాఫీసు కి వెళ్లి నిర్మాతలకు పంపించాడు. రచయితగా కాకపోయినా కనీసం నటుడిగానైనా ప్రయత్నిద్దామనుకుంటే అక్కడా పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

బాగా ఉన్న వాళ్ల కుంటుంబంలో పుట్టిన షాన్, తన యుక్తవయస్సులో కళ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుకుని తాపత్రయపడ్డాడు. దాని పర్యవశానమే నాటక రచయితగా, నటుడిగా అవతారమెత్తాడు. కానీ మధ్యవయసు దాటి పోతున్న తరుణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే తను సంపాదించింది ఏమీ లేకపోగా, పేరు ప్రతిష్టలు సైతం సాధించలేకపోయాడు. అందుకే ఇప్పుడు అతని జీవితంలోని ప్రతి క్షణం డబ్బు గురించే ఆలోచన. ఉదయం లేచిన దగ్గర్నుంచీ పాల వాడు, పేపర్ వాడు, పని వాడు – డబ్బు, డబ్బు అని వెంటపడుతుంటే షాన్ మాత్రం ఏం చెయ్యగలడు? కరెంట్ బిల్. వాటర్ బిల్. గ్యాస్ బిల్ – ఎవన్నీ కట్టడానికి ఎక్కడ్నుంచి డబ్బులు తేగలడు?

dinner1

సరే, రోజంతా కష్టపడి డబ్బులు సంపాదించే మార్గాల కోసం అన్వేషిస్తూ సాయంత్రం ఇంటికి చేరి రిలాక్స్ అవుదామంటే ఈ రోజూ అదీ కుదర్లేదు షాన్ కి; అందుకు కారణం ఆంద్రె..

నిజానికి ఇప్పటికిప్పుడు ఇంటికి వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ డెబ్బీ చేసిన వేడి వేడి భోజనం చేస్తూ, ఆమె తో కాసేపు సరదాగా గడిపి నడుం వాల్చి, కష్టాలన్నీ మర్చిపోయి నిద్రలోకి జారిపోవాలనే ఉంది షాన్ కి. కానీ ఉదయం ఆంద్రె ఫోన్ చేశాడు; సాయంత్రం డిన్నర్ కి కలుద్దామన్నాడు. చాలా రోజుల్నుంచీ మిత్రుడైన షాన్ మాట కాదనలేకపోయాడు. అంతే కాకుండా తనతో పాటే నాటక రచయితగా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించే దిశలో ఉండగా, ఒకరోజు హటాత్తుగా మాయమైపోయాడు ఆంద్రె. అప్పట్నుంచీ ఆంద్రె గురించి రకరకాల కథలు విని ఉన్నాడు షాన్. ఎక్కడో సహారా ఎడారిలో ఏదో చేస్తున్నాడని ఒక సారి, అడవిలో చెట్లతో మాట్లాడే ప్రయోగాలు చేస్తున్నాడని, టిబెట్ లో ఉన్నాడని….ఇలా ఆంద్రె గురించి వింటూనే ఉన్నాడు షాన్.

ఈ మధ్యనే ఒకతను ఆంద్రె గురించి చెప్పిన విషయం మరింత విచిత్రంగా తోచింది షాన్ కి. ఒక రోజు తన కుక్కను తీసుకుని వాకింగ్ కి వెళ్తుండగా కనిపించాడట ఆంద్రె. ఒక గోడకానుకుని, ఘోరంగా ఏడుస్తున్నాడట. చాలా రోజుల తర్వాత అనుకోకుండా కనిపించిన ఆంద్రె ని చూసి ఆశ్చర్యపోయిన అతను, ఆంద్రె అలా ఏడుస్తూండడం చూసి మరింత ఆశ్చర్యపోయాడట. ఇంగ్మర్ బెర్గ్మన్ దర్శకత్వంలో వచ్చిన “ఆటమ్ సొనాటా” సినిమా చూసి అప్పుడే బయటకు వచ్చిన ఆంద్రె, ఆ సినిమాలో ఒక పాత్ర చెప్పిన డైలాగ్ – “నాకు కళ మీద ఉన్న ఆసక్తి , జీవితం మీద లేదు” గుర్తుకొచ్చి ఏడుస్తున్నాడని తెలుసుకున్న అతను నోరెళ్లబెట్టాడట!

ఇలా ఆంద్రె గురించి విన్న కొన్ని రోజులకే ఆంద్రె నుంచి ఫోన్ వచ్చింది – డిన్నర్‌కి సాయంత్రం ఒక రెస్టారెంటులో కలుద్దామా అన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచీ ఎవరికీ కనిపించకుండా మాయమైపోయిన ఆంద్రె నుంచీ హఠాత్తుగా ఫోనొచ్చేసరికి ఆశ్చర్యపోతాడు షాన్‌ – డిన్నర్‌కి ఒప్పుకున్నాడు. ఆంద్రె గురించి, తన జీవితం గురించి ఆలోచించుకుంటూ హోటల్ చేరుకున్నాడు షాన్. తను చేరుకునే సరికి ఆంద్రె ఇంకా హోటల్ కి రాలేదు. ఖరీదైన హోటల్ పరిసరాలు గమనిస్తుండగా ఆంద్రె రానే వచ్చాడు. ఇద్దరూ తమ టేబుల్ దగ్గర కూర్చున్నారు.

****

సినిమాలలో “మై డిన్నర్ విత్ ఆంద్రె” సినిమా వేరయా, అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకు చాలా కారాణాలున్నాయి. మనకు తెలిసినంతవరకూ సినిమాల్లో ఒక హీరో ఉంటాడు; మధ్యలో వాడికేదో సమస్య వస్తుంది. చివరికి ఆ సమస్యనుంచి ఎలా బయటపడ్డాడు – దాదాపుగా సినిమాలన్నింటిలోనూ ఇదే జరుగుతుంది.

ప్రపంచంలోని తొంభై శాతం సినిమాల కథలు హీరో, వాడి సమస్య, పరిష్కారం చుట్టూనే అల్లబడి ఉంటాయి. కానీ మై డిన్నర్ విత్ ఆంద్రె అనే సినిమాలో ఇవేవీ ఉండవు. ఇందులో సాంకేతికంగా అసలు కథంటూ ఏమీ ఉండదు. కొన్ని సంవత్సరాల నుంచీ ఎవరికీ కనిపించకుండా మాయమైపోయిన ఆంద్రె అనే మిత్రుడిని న్యూయార్క్ లో ఒక పెద్ద రెస్టారెంటులో కలుస్తాడు షాన్ అనే రచయిత. డిన్నరు చేస్తున్నంతసేపు వారిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకొంటారు. అయిపోగానే ఎవరు దారిన వాళ్ళు వెళ్లిపోతారు – ఇంతే కథ.

సాధారణంగా ఒక సినిమాలో ఎంత లేదన్నా అరవై నుంచి డెబ్భై సన్నివేశాలుంటాయి. కానీ ఈ సినిమాలో కేవలం రెండే సన్నివేశాలు. తన స్నేహితుడు ఆంద్రె ని కలవడానికి హోటల్ కి బయల్దేరి వస్తూన్న షాన్ కి సంబంధించిన దృశ్యాలతో కూడిన ఆరు నిమిషాల నిడివి కలిగిన మొదటి సన్నివేశం తర్వాత, మిగిలిన గంటా నలభై ఐదు నిమిషాల పాటు నడుస్తుంది రెండవ సన్నివేశం. ఈ సన్నివేశంలో మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకొంటూ భోంచెయ్యటం తప్ప మరేమీ జరగదు. కెమారా కూడా వారి టేబుల్ దాటి వెళ్లదు. ఇద్దరు నటులు – షాన్ వాలిస్‌, ఆంద్రె గ్రిగరి. ఆపైన వారికి వడ్డిస్తున్న ఒక వెయిటర్. వీరు తప్ప ఈ సినిమాలో వేరే నటీ నటులు కూడా ఉండరు.

dinner2

ఆంద్రె ఇన్నాళ్ళూ ఎక్కడ ఉన్నాడో, ఏం చేశాడో చెప్పమని అడుగుతాడు షాన్. మొదట్లో ఆ విషయాలు చెప్పడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, కాసేపటికి చెప్పడం మొదలు పెడ్తాడు ఆంద్రె. ప్రపంచం అంతా తిరిగి తను గడించిన అనుభవాలను చెప్పుకొస్తాడు. కళల పట్లా, మనిషి మనుగడ పట్లా, మానవాళి భవిష్యత్తు పట్లా ఆయనకి నిశ్చయమైన అభిప్రాయాలు చాలా ఉంటాయి. కొన్ని, ఆథ్యాధ్మిక అనుభవాలు, దివ్య అనుభూతులను నెమరు వేసుకుంటాడు ఆంద్రె.

న్యూయార్క్ లోని నాటకరంగం వదిలేసి, పోలాండ్ లోని ఒక అడవిలో ఇంగ్లీష్ భాష తెలియని నలభై మంది యువతీ యువకులతో తను చేసిన థియేటర్ వర్క్ షాప్ గురించి, ఆ తర్వాత ఒక రోజు చర్చి లో తను చూసిన ఒక వింత జంతువు గురించీ చెప్తాడు ఆంద్రె. ఐర్లాండ్ లోని ఒక పల్లెటూరిలో తను గడిపిన రోజుల గురించి చెప్తాడు. అక్కడ పురుగు మందులేవీ లేకుండానే పంటలకు పురుగు పట్టకుండా చేసిన విధానాన్ని చెప్పుకొస్తాడు. ఈ భూమి పై ప్రతి వస్తువుతోనూ మనిషి మాట్లాడగలడనీ, ఆ విధంగా పురుగులతో సైతం మాట్లాడి వాటికోసం ఒక ప్రత్యేకమైన చోటు కేటాయించడంతో, పురుగులు పంటపొలాల వైపు రాకుండా చేశారని చెప్తాడు ఆంద్రె. అలాగే సహారా ఎడారిలో ఒక జపనీస్ వ్యక్తితో చేసిన నాటకం, ఆంద్రె ఇండియా పర్యటన; …ఇలా ఆ ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆంద్రె చెప్పిన సంగతులు ఒక్కొక్కట్టి ఒక్కొక్క అడ్వెంచర్ లా ఉంటుంది. వీటన్నిటినీ షాన్ ఒప్పుకోలేడు. వాదించటానికి ప్రయత్నిస్తాడు, కాని అంతకన్నా ఎక్కువగా, ఆంద్రె మాటలు అతన్ని ఆలోచనలో ముంచెత్తుతాయి. కాసేపటికి వారిద్దరి మధ్య మౌనం; ఇంకా చెప్పమని షాన్ అడగడంతో ఆంద్రె తిరిగి మొదలు పెడ్తాడు. ఇలా, సంభాషణ వచ్చిపోయే కెరటాల్లా ఉంటుంది. కానీ స్నేహితుల సంభాషణకి ముగింపు అంటూ ఏమీ ఉండదు. చివరికి హోటల్ మూసేసే సమయం అయిందని వెయిటర్ వచ్చి చెప్పడంతో ఆ మిత్రులిద్దరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది.

హోటల్ లో ఒక టేబుల్ వద్ద ఇద్దరు మాట్లాడుకుంటుంటే కెమెరా అక్కడ పాతేసి, వారి సంభాషణలను రికార్డ్ చేసినట్టుగా, సింపుల్ గా అనిపిస్తుందీ సినిమా. కానీ ప్రఖ్యాత ఫ్రెంచి దర్శకుడు లూయీ మాల్ ఈ సినిమా తీయడం కోసం ఎంతో కష్టపడ్డారు. కొన్ని చోట్ల, కెమారాకి నటుల మధ్య ఎంత దూరం ఉండాలి అనేదాన్ని మిల్లిమీటర్లలో కొలిచాడట. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మొదలయ్యే ఈ సన్నివేశంలో – బయట రాత్రి చిక్కబడుతున్న కొద్దీ, లోపల దీపకాంతి ఎక్కువవుతూ ఉన్నట్టుగా, ఆ కాంతిలో మిత్రులిద్దరి ప్రతిబింబాలు పక్కనున్న రెస్టారెంటు కిటికీలకున్న అద్దాలపై ప్రతిఫలించేట్టుగా చేసి, మనం నిజంగానే రియల్ టైమ్ లో జరిగిన సన్నివేశాన్ని చూస్తున్నట్టుగా దర్శకుడు మనల్ని భ్రమింపచేస్తాడు. కానీ నిజానికి ఈ సన్నివేశాన్ని కొన్ని వారాల పాటు ఒక స్టూడియో లో చిత్రీకరించారు.

dinner3

1981 లో ఈ సినిమా వచ్చిన తర్వాత, సినిమాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో సహజత్వాన్ని సాధించటం అనే విషయంలో చాలా మార్పులు వచ్చాయి. అంతకు ముందు వరకూ, సంభాషణ అంటే, కేవలం డైలాగులే అనే అపప్రధని ఈ సినిమా తొలగించింది. సంభాషణ అనేది ఒక పూర్తి సన్నివేశం – ఇట్లాంటి సన్నివేశాలు ఎలా చిత్రీకరించాలి అనే దానికి ఈ సినిమా ఒక పాఠ్యపుస్తకం లాటిది. ఈ సినిమా విడుదలైనప్పుడు , మొదట్లో, ఎవ్వరికీ అర్థం కాకపోయినా, మెల్ల మెల్లగా ప్రజాదరణ పొంది న్యూయార్క్ లో ఒక సంవత్సరం పాటు ఆడిందట. ఒక్క న్యూయార్కు లోనే కాకుండ, అమెరికాలో మరో 900 థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడింది.

One Response
  1. Nagaraju May 7, 2014 /