Menu

మేఘసందేశం

అతను గోదారి ఒడ్డున ఉన్న పల్లెటూరిలో ఓ పెద్ద మనిషి. నలుగురికీ మంచీ చెడూ చెప్పే వ్యక్తి. అతని భార్య మామూలు పల్లెటూరి మహిళ. పూజలు, వ్రతాలు, కుటుంబ వ్యవహారాలు..ఇవే ఆమె ప్రపంచం. వాళ్ళిద్దరికీ ఓ కూతురు. అతనికి సంగీతసాహిత్యాల పట్ల అభినివేశం, వాటిలో ప్రవేశం ఉన్నాయి. అతని భార్యకి ఇవేమీ తెలియదు. ఇంతలో ఆ ఊరికి ఓ ‘దేవదాసి’ వచ్చింది. ఆమె తన ఆటపాటలతో ఆ ఊరి కుర్రాళ్ళందరినీ ఆకట్టుకోడం మొదలుపెట్టింది. ఆమెని ఊరినుంచి పంపేయమని ఊరిజనమంతా అతన్ని అభ్యర్ధించారు. తరువాత ఏం జరిగింది? జరిగిన పరిణామాలు ఆ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాయి? ఈ ప్రశ్నలకి సమాధానమే పాతికేళ్ళ క్రితం విడుదలైన ‘మేఘసందేశం.’

ఊరిపెద్ద రవీంద్ర బాబు (అక్కినేని నాగేశ్వర రావు), అతని భార్య పార్వతి (జయసుధ), దేవదాసి పద్మ (జయప్రద) ల మానసిక సంఘర్షణను చిత్రించిన ఈ కళాత్మక సినిమా నాలుగు జాతీయ అవార్డులతో కలిపి మొత్తం 27 అవార్డులను అందుకుంది. దాసరి నారాయణ రావు నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించడంతోపాటు కథను కొన్ని పాటలనూ కూడా సమకూర్చారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు హంపి అందాలనూ ఈ సినిమా లో చూడొచ్చు.
తన పిన్ని, చెల్లెలితో కలిసి గోదారి గట్టున ఓ ఇంట్లోకి దిగిన పద్మ ఆటపాటలు ఊరంతా మారుమోగుతాయి. మగవాళ్ళంతా పగలూ రాత్రీ ఆమె ఇంటి దగ్గరే కాలం గడుపుతూ ఉంటారు. ఆమెను ఊరినుంచి వెళ్ళగొట్టి, ఊరి వాళ్ల కాపురాలు బాగుచేయాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికి వెళ్ళిన రవీంద్ర బాబు సంగీతం, సాహిత్యం, నాట్యాలలో ఆమెకి ఉన్న ప్రతిభ చూసి అప్రతిభుడవుతాడు. ఊహించని విధంగా వాళ్ళిద్దరి మధ్యా స్నేహం మొదలవుతుంది. ఆమె స్ఫూర్తితో అతను పద్యాలు రాయడం మొదలవుతాడు. అప్పటివరకూ తనలో ఉన్న అశాంతి తగ్గుతున్నట్టుగా గమనిస్తాడు. ఐతే ఊరంతా వాళ్ళిద్దరి మధ్యా ఏదో సంబంధం ఉందన్న గుసగుసలు వస్తాయి. ఇవి పార్వతి వరకూ వచ్చేసరికి ఆమె తన అన్న జగన్నాధాన్ని (జగ్గయ్య) పిలిపిస్తుంది.

బావగారిని, చెల్లెలి కాపురాన్ని బాగు చేయడం కోసం పద్మ ఇంటికి వెళ్ళిన జగన్నాధం ఆమె ప్రవర్తనను తప్పు పడతాడు. తనకు రవీంద్ర బాబు కి మధ్య ఊరంతా అనుకునే సంబధం ఏమి లేదని పద్మ చెప్పినటికీ, ‘నువ్వు రవీంద్ర బాబు మంచి కోరే దానివే ఐతే ఊరు విడిచి వెళ్ళిపో” అంటాడు జగన్నాధం. రవీంద్ర బాబు బాగే తనకు కావాలన్న పద్మ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. మొదట ఆగ్రహించి, తరువాత వేదన చెందిన రవీంద్ర బాబు ఓ పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకం విడుదల కార్యక్రమానికి రహస్యంగా వచ్చిన పద్మ అతని కంట పడుతుంది. పార్వతి కూడా పద్మను తన ఇంటికి వచ్చి ఉండమంటుంది. ‘నేను వస్తే ఆయనకు మిగిలేది అవమానమే..’ అని చెప్పిన పద్మ మళ్ళీ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. పార్వతే పద్మను వెళ్ళగొట్టిందని అపోహ పడతాడు రవీంద్ర బాబు.

తన సాహచర్యంలో భర్త సంతోషంగా లేదని గ్రహించిన పార్వతి కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్లి పోతుంది. దేశదిమ్మరి గా మారిన రవీంద్రబాబు హంపి లో పద్మను కలుసుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. చాలా ఏళ్ళ తర్వాత, కూతురి పెళ్ళికి రవీంద్రబాబు ని పిలవడం కోసం జగన్నాధం హంపి వస్తాడు. పెళ్ళికి వెళ్ళిన రవీంద్రబాబు పార్వతికి తానూ చాలా అన్యాయం చేశానని గ్రహిస్తాడు. ఆ బాధతోనే అక్కడే కన్ను మూస్తాడు. ఈ వార్త పద్మకి చెప్పడం కోసం వెళ్ళిన జగన్నాధానికి అక్కడ ఇంట్లో పద్మ శవం కనిపించడంతో సినిమా ముగుస్తుంది.

బలమైన కథానాయిక పాత్రలున్న సినిమా ఇది. జయసుధ, జయప్రదలిద్దరూ పోటీపడి నటించారు. ఆత్మాభిమానం గల గృహిణి పార్వతి గా జయసుధ, ‘సరస సరాగాల సారంగి’ గా జయప్రద వంక పెట్టలేని నటనను ప్రదర్శించారు. ఐతే ఓల్డ్ గెటప్ నాగేశ్వర రావు, జయప్రద లకు సూట్ ఐనట్టుగా జయసుధ కి నప్పలేదు. ఆ సీన్స్ లో మేకప్ తో ఆమె ఇబ్బందిని మనం గమనించగలుగుతాం. రవీంద్రబాబు పాత్ర బెంగాలీ రచయిత శరత్ నవలల్లో నాయక పాత్రలను పోలి ఉంటుంది. ఆ పాత్ర వేషధారణ కృష్ణశాస్త్రి, ఆరుద్రలను గుర్తు చేస్తుంది. చిన్న పాత్రే అయినా జగ్గయ్య నటన గుర్తుండిపోతుంది. ముఖ్యం గా జగ్గయ్య-జయప్రద ల మధ్య వచ్చే సీన్. జయప్రద-జయసుధ ల మధ్య వచ్చే రెండు సీన్లని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలని ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఈ రెండు సీన్లలో గమనించొచ్చు. కథ ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది.

రమేష్ నాయుడు సంగీతంలో అన్ని పాటలూ ఆణిముత్యాలే. సినిమాకి తగ్గ నేపధ్య సంగీతం. ‘ముందు తెలిసేనా ప్రభూ..’ పాట రవీంద్రనాథ్ టాగోర్ ‘గీతాంజలి’ ప్రేరణతో రాసినట్టు అనిపిస్తుంది. ఈ పాట సినిమా ప్రారంభం లోను, ముగింపు లోను వస్తుంది. ‘రాధికా కృష్ణా..’ అన్న జయదేవుడి అష్టపదిలో విరహిణి రాధ గా జయప్రద అభినయం ఆకట్టుకుంటుంది. ‘ఆకాశ దేశాన’ పాట జేసుదాస్ ఆల్ టైం హిట్స్ లో ఒకటి. అలాగే ‘ఆకులో ఆకునై’ పాట సుశీలకి చాల మంచి పేరు తెచ్చింది. ‘నిన్నటిదాకా శిలనైనా..’ ‘శీతవేళ రానీయకు..’ ఇలా ప్రతి పాటా ప్రత్యేకమే. ‘పాడనా వాణి కళ్యాణిగా’ పాటను మంగళంపల్లి బాలమురళి కృష్ణ పాడడమే కాకుండా గాయకుడి పాత్రలో కనిపిస్తారు కూడా.

రవీంద్రబాబు-పద్మ ల intellectual companionship ని (సరైన తెలుగు పదం సూచించండి) ఎస్టాబ్లిష్ చేసే సీన్లలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఎన్నో కమర్షియల్ సినిమాలు తీసిన దాసరి ఈ సినిమాకి దర్శకత్వం చేశారంటే నమ్మడం కొంచం కష్టమే.. ఎంతో అభిరుచితో నిర్మించిన సినిమా ఇది. మూడు ప్రధాన పాత్రల్లో ఏ పాత్ర వైపునుంచి చూస్తే ఆ పాత్ర చేసింది కరక్ట్ అనిపిస్తుంది. ఐతే, రవీంద్రబాబు-పద్మ ల అనుబంధాన్ని అంగీకరించాలా? తాను చేయని తప్పుకి పార్వతి శిక్ష అనుభవించింది కదా? అన్న ప్రశ్నలకు సమాధానం ఎవరికి వాళ్లు వెతుక్కోవాల్సిందే. ఈ సినిమాని మొదటి సారి చూసేవాళ్ళు మొదటి ఇరవై నిమిషాలు కొంచం ఓపికగా చూడాలి. చాలా స్లో నేరేషన్. ఒక్కసారి కథలో పడ్డాక ఇక సినిమాలో లీనమైపోతాం. కళాత్మక చిత్రాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళంతా ఈపాటికి ఈ సినిమాని చాలాసార్లు చూసి ఉంటారు. మంచి సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు.

–మురళి

12 Comments
 1. badri February 1, 2009 /
 2. రామేశబాబు February 1, 2009 /
 3. shree February 2, 2009 /
 4. venkat B February 4, 2009 /
 5. sriram velamuri February 8, 2009 /
 6. మురళి February 8, 2009 /
  • sriram velamuri February 19, 2009 /
 7. మురళి February 20, 2009 /
 8. santosh December 29, 2009 /
 9. budugoy December 30, 2009 /