Menu

Getting Home

నేలరాలిన ఆకు తిరిగి తన మూలాలకు చేరుకుంటుంది. మనిషి కూడా అంతే!

కీచుమని శబ్దం చేస్తూ బస్సు ఆగింది. నిద్రావస్థలో మునిగివున్న ప్రయాణికులు మెల్లగా కళ్లు తెరిచి చూచారు. “బస్సు ఐదు నిమషాలు ఆగుతుంది. మళ్లీ లాస్ట్ స్టాప్ వరకూ ఎక్కడా ఆగదు,” అని చెప్పి కండక్టర్ హడావుడిగా బస్ దిగి వెళ్లిపోయాడు. బస్ దిగిన మగవాళ్లంతా ఒక వైపు వెళ్లారు. ఆడాళ్లంతా మరోవైపు చెట్లలోకి వెళ్లారు. బస్ లోనుంచి ఒక వ్యక్తి మాత్రం దిగలేదు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, ఆడవాళ్లు వెళ్లిన వైపే చూస్తూ కూర్చున్నాడు. అది గమనించిన ఆడవాళ్లు బస్ లోపలకి వచ్చి గొడవ చెయ్యడం మొదలుపెట్టారు.

ఇంతలో ఆ వ్యక్తితో పాటే ప్రయాణిస్తున్న జో బస్ ఎక్కాడు. జరుగుతున్న హడావుడి చూసి తన సీట్ దగ్గరకు వచ్చాడు. “ఆడవాళ్ళు పాస్ పోసుకుంటుంటే సిగ్గు లేకుండా కిటికీ లోనుంచి చూస్తావా?” అని ఆడిపోసుకుంటున్నారు అందరూ. తన స్నేహితుడు లీ అలాంటి వాడు కాదని, అతనికి సరిగ్గా కళ్లు కనిపించవని చెప్పి ఆడవాళ్లను సముదాయించడానికి ప్రయత్నించాడు జో; అయినా వినలేదు వాళ్లంతా. లీ కి ఆరోగ్యం బాగోలేదని, కావాలంటే చూడండని అతన్ని తట్టిలేపే ప్రయత్నం చేశాడు. లీ కనీసం కళ్లైనా తెరవకుండా నిద్రలో మునిగిపోయి ఉన్నాడు. ఇంతలో బస్ బయల్దేరడంతో గొడవ సద్దుమణిగింది.

బస్ కొంచెం ముందుకెళ్లిందో లేదో మళ్లీ ఆగింది. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ప్రయాణికులు విసుగ్గా కళ్లు తెరిచారు. అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపే దొంగల ముఠా బస్ ని చుట్టుముట్టింది. కత్తులు చూపెట్టి బెదిరించి ప్రయాణికుల దగ్గర్నుంచి నగలు, డబ్బులు దోచుకున్నారు. ఇదంతా తనకు పట్టనట్టు నిద్రపోతున్న జో దగ్గరకు వచ్చారు దొంగలు. అతని దగ్గరున్న డబ్బులు ఇవ్వమని బెదిరించారు. జేబులో ఉన్న నాలుగొందలు తీసి ఇచ్చాడు. ప్యాంట్ జేబులో ఏముందని అడిగారు; ఖాళీ జేబులు చూపించాడు. కానీ ఇంతలోనే తన చొక్కాకింద పదిలంగా దాచుకున్న సంచీ చూశారు దొంగలు. అందులో ఏముందని అడిగారు. జో చెప్పడానికి తటపటాయించాడు. దొంగల ముఠా నాయకుడు ఆ సంచి లాక్కున్నాడు. సంచి నిండా డబ్బులు. ఆ డబ్బులు మాత్రం తీసుకోవద్దని ప్రాథేయపడ్డాడు. అవి తన డబ్బులు కాదని, పక్కన నిద్రపోతున్న తన మిత్రుడు లీ డబ్బులని చెప్పాడు. అవి అతని కుటుంబానికి చాలా అవసరమని వేడుకున్నాడు. దొంగలు అతని మాటలు లెక్కచేయలేదు. లీ ని నిద్రలేపమన్నారు. కానీ అది అసాధ్యం అన్నాడు జో. అతని మాటలు ఎవరికీ అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక నిజం చెప్పేశాడు జో; లీ చనిపోయి అప్పటికే చాలా సేపయింది.

*****

కూటి కోసం, కూలి కోసం నగరానికి తరలివచ్చిన అసంఖ్యాకమైన పేద వాళ్లలో లీ ఒకడు. రోజు కూలీ చేసుకుంటూ బతుకుతుండే వాడు. అక్కడే పని చేసే జో అతనికి స్నేహం కుదిరింది. పగలంతా అలిసిపోయే దాకా పని చేయడం, రాత్రి కూర్చుని రెండు చుక్కలు మందు తాగుతూ కబుర్లాడుకోవడం వారికి అలవాటుగా మారింది. లీ కి తన ఊర్లో భార్యా పిల్లలు ఉన్నారు. నగరంలో కష్టపడి సంపాదించిన డబ్బులు వారికి పంపిస్తాడు. కానీ జో కి తన వాళ్లంటూ ఎవరూ లేరు. అదే అతనికి పెద్ద దిగులు. ఏదో ఒక రోజు పుటుక్కుమని ప్రాణం పోయి దిక్కూ మొక్కూ లేని చావు చస్తాడని జో భయం. అందుకే స్నేహితుడైన లీ ని వేడుకున్నాడు. తను చనిపోయాక, భౌతిక కాయాన్ని తన ఊర్లో ఖననం చేయాలని లీ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ జో కంటే ముందే లీ చనిపోయాడు. లీ ఏనాడు నోరు తెరిచి కోరకపోయినా అతని చివరి కోరికేమయ్యుంటుందో జో కి తెలుసు.

నేల రాలిన ఆకు సైతం తన మూలాలకు చేరుకుంటుంది. బతుకునీడుస్తూ ఎంత దూరం వెళ్లినా చివరికి తను నడక నేర్చిన మట్టిలోనే కలిసిపోవాలనుకుంటాడు మనిషి. అందుకే లీ భౌతిక కాయాన్ని అతని ఊరిలోని కుటుంబానికి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాడు జో.

కానీ అదంత సులభమైన పనేమీ కాదు. పనిలో ఉండగా చనిపోయిన కారణంగా లీ కి యాభైవేలు పరిహారం అందింది. లీ భౌతిక కాయాన్ని నగరం నుంచి అతని ఊరికి తరలించడానికి అంతకంటే ఎక్కువ డబ్బే ఖర్చవుతుంది. ఉన్న ఒక్కగానొక్క ఆసరా కోల్పోయిన ఆ పేద కుటుంబానికి ఆ యాభై వేలు అందితే ఎంతో కొంత సాయంగా ఉంటుందని జో ఆలోచన. అందుకే లీ ని స్వంత ఊరు చేర్చే బాధ్యత తన మీద వేసుకున్నాడు. లీ ని భుజాన వేసుకుని బస్సెక్కాడు. అనుమానం వచ్చిన వాళ్లకు, లీ తాగిన మత్తులో ఉన్నాడని చెప్పి నమ్మిస్తూ వచ్చాడు. కానీ బస్ లో దొంగల దగ్గర నిజం చెప్పక తప్పలేదు.

జో చెప్పినదంతా విన్న దొంగలు ఆశ్చర్యపోయారు. తన స్నేహితుడి చివరి కోరిక తీర్చడానికి తాపత్రయపడుతున్న జో ని మెచ్చుకున్నారు. అంతే కాదు అప్పటివరకూ తాము దోచుకున్న డబ్బులంతా జో చేతిలో పెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

బస్ తిరిగి బయల్దేరింది. ఒక గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నాడు జో. కానీ ఇక్కడే అతని కష్టాలు మొదలయ్యాయి. దొంగలు ఇచ్చిన డబ్బులను జో మీద పడి లాక్కున్నారు ప్రయాణికులు. అంతే కాదు; శవంతో కలిసి ప్రయాణించేది లేదని ప్రయాణికులంతా గొడవ చేశారు. చేసేదేమీ లేక జో బస్ దిగిపోయాడు. లీ ని భుజాన వేసుకుని రోడ్డున పడ్డాడు.

gh1

ఇక్కడ్నుంచి జో కష్టాలు మొదలయ్యాయి. నానా కష్టాలు పడి, అబద్ధాలు చెప్పి ట్రాక్టర్ లో ప్రయాణం చేసి ఒక ఊరికి చేరుకున్నాడు. అప్పటికే రాత్రవడంతో ఒక లాడ్జ్ లో బస చేశాడు. అక్కడ కూడా లీ గురించి అబద్ధం చెప్పి నమ్మించగలిగాడు. ఉదయం లేచి చూసుకునే సరికి జేబులో ఉన్న నాలుగొందలు మాయమవడంతో జో హడావుడి చేశాడు. లాడ్జ్ లో ఉన్న వాళ్లెవరో తన డబ్బులు దొంగలించారన్నాడు. లాడ్జ్ లో ఉండే వాళ్లు పోలీసులని పిలవమన్నారు. కానీ పోలీసులొస్తే లీ గురించి తెలిసిపోతుందని భయపడ్డాడు జో. మరో సారి లీ ని భుజాన వేసుకుని బయల్దేరాడు. కానీ అదృష్టవశాత్తూ వారికి ఒక లారీ డ్రైవర్ సహాయం చేశాడు. లారీ లో సగం దూరం వెళ్లాక వారి దారులు వేరవడంతో జో మరో సారి నడక ప్రారంభించాడు.

*****

మార్గమధ్యంలో ఒక పల్లెటూరు చేరుకుంటాడు జో. అప్పటికే రెండు రోజుల్నుంచీ తిండిలేకుండా ఉండడంతో ఊరిలో తినడానికేమైనా దొరుకుతుందేమోనని వెళ్లాలనుకుంటాడు. కానీ లీ ని తనతో తీసుకెళ్లకపోవడమే మంచిదని ఆలోచించి అక్కడున్న పొలాల్లో ఉన్న దిష్టిబొమ్మకు లీ ని కట్టేసి ఊర్లోకి వెళ్తాడు జో. ఊర్లో ఒక వృద్ధుని అంత్యక్రియలు జరుగుతుంటాయి. అప్పటికే మరణించిన మిత్రుడి బాధతో సతమతమవుతున్న జో, మరొక మరణాన్ని చూసి తట్టుకోలేక భోరున ఏడుస్తాడు. కాసేపటికి అక్కడ వడ్డించిన వంటకాలు తింటుండగా, అంతకుముందు శవ పేటిక లో చూసిన వృద్ధుడు వచ్చి తన ఎదురుగా కూర్చోవడంతో కంగారుపడతాడు జో. కానీ ఆ వృద్ధుడు అసలు విషయం చెప్తాడు. తను చనిపోలేదని, తనకంటూ ఎవరూ లేకపోవడంతో రేపు నిజంగానే చనిపోతే తనకోసం ఎవరూ ఏడ్చే వాళ్లుండరనీ, అందుకే బతికుండగానే జనాలకు డబ్బులిచ్చి తన కోసం ఏడ్చేలా ఏర్పాటు చేసుకున్నానని చెప్తాడు. కానీ అక్కడికొచ్చిన వాళ్లలో కేవలం జో ఒక్కడే నిజంగా ఏడ్చాడని అంటాడు ఆ వృద్ధుడు. తన పరిస్థితి ఆ వృద్ధుని కి వివరించి అక్కడ్నుంచి బయటపడ్తాడు జో.

కడుపు నింపుకుని ఊరి బయటకొచ్చి చూసిన జో కి లీ కనిపించడు. అతన్ని కట్టేసిన దిష్టి బొమ్మ కోసం వెతుకుతాడు. చుట్టూ చూస్తే పొలాల నిండా దిష్టి బొమ్మలే కనిపిస్తాయి. ఎలాగో కష్టపడి లీ ని వెతుక్కుని మళ్లీ ప్రయాణం మొదలుపెడ్తాడు.

మార్గమధ్యంలో జో కి వివిధ రకాలైన వ్యక్తులతో పరిచయం అవుతుంది. మూడు వేల కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న ఒక కుర్రాడు జో ని ప్రోత్సాహిస్తాడు. కొంత సేపటికి, దార్లో దొరికిన ఒక పెద్ద టైరులో లీ ని ఇరికించి, టైరుని తోసుకుంటూ బయల్దేరుతాడు.

gh3

కీలక సన్నివేశం

వెళ్తున్న కొద్దీ జో లో శక్తి క్షీణిస్తుంది. ఇక లీ ని మోసుకెళ్లడం తన వల్ల కాదనుకుంటాడు. కానీ ఎలాగైనా లీ భౌతిక కాయాన్ని అతని ఊరికి చేర్చాలనే ప్రయత్నం మానడు. అదృష్టవశాత్తూ లీ బూట్లలో దాచుకున్న ఐదొందలు జో కి దొరకడంతో అతనికొక కొత్త ఆలోచన వస్తుంది. ఆ డబ్బులతో ఒక ట్రక్ మాట్లాడుకుని అందులో లీ ఊరికి చేరుకోవాలనుకుంటాడు. బయల్దేరేముందు దగ్గర్లో ఉన్న హోటల్లో భోజనం చేస్తాడు జో. కానీ జో అమాయకత్వం చూసి అతనికి ఏడొందలు బిల్లు వేస్తాడు ఆ హోటల్ యజమాని. అతనితో గొడవపెట్టుకుంటాడు జో. కానీ ఆ హోటల్ మనుషులు జో ని కొట్టడానికి రావడంతో, అప్పటివరకూ బధ్రంగా దాచుకున్ని లీ డబ్బుల్లోనుంచి కొంత తీసి హోటల్ వాళ్లకిస్తాడు. కానీ అవి దొంగ నోట్లని తేలడంతో జో పూర్తిగా నీరసించిపోతాడు.

జన్మనిచ్చిన తల్లినొదిలి,
నడకనేర్చిన నేలనొదిలి,
కూటి కోసం,
కూలి కోసం,
పేదవాడు నగరమొస్తే,
ఊపిరాగి నేలరాలితే,
బతుకులో దోపిడి
చావులోనూ దోపిడి.

ఏ డబ్బులు కోసమైతే ఇంత కష్టపడ్డాడో అవే లేవని తెలిసాక, తన ప్రయాణం వృధా ప్రయాస అనుకుంటాడు జో. లీ ని అక్కడే ఖననం చేయాలని నిర్ణయించుకుంటాడు. జనాలెవరూ లేని చోటు ఎంచుకుని, భూమి లో గుంట తవ్వడం మొదలుపెడ్తాడు. కాసేపటికి అలసిపోయిన జో ఆ గుంటలో పడుకుంటాడు. ఆ క్షణంలో అతనికి పైన ఉన్న ఆకాశం, ఊగుతున్న చెట్లు చాలా అందంగా కనిపించాయి. ప్రతి రోజూ అనుభవించే కష్టాలు గుర్తుకొస్తాయి. పేదవాడిగా ఆ కష్టాలన్నీ భరించడం కంటే తను కూడా చనిపోవడమే మేలని నిర్ణయించుకుంటాడు. ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు.

కళ్లు తెరిచి చూసే సరికి జో ఒక అందమైన తోటలో ఉంటాడు. కాసేపు అది స్వర్గమేమో అనుకుంటాడు. కానీ ఇంతలోనే తను చనిపోలేదని, తనను ఒక రైతు కుటుంబం రక్షించిందనీ తెలుసుకుంటాడు. ఆ కుటుంబంలోని పిల్లవాడు పాడే ఒక పాట జో లో నూతన ఉత్సాహాన్ని రేపుతుంది.

“మాతృభూమి ఒక సముద్రమైతే, చేపనై సంతోషంగా ఈదుతాను; మాతృభూమి ఒక రహదారైతే, వాహానాన్నై దానిమీద పరిగెడ్తాను; మాతృభూమి ఒక వృక్షమైతే, ఆకునై రెపరెపలాడుతాను” అని ఆ పిల్లాడి దగ్గర నేర్చుకున్న పాట పాడుకుంటూ లీ తో ప్రయాణం మొదలుపెడ్తాడు.

*****

ముగింపు: ఎన్నో కష్టాలకోర్చి జో తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాడు. మధ్యలో ఒక చోట జో పోలీసులకి దొరికిపోతాడు. పోలీసులు జో ని దర్యాప్తు చేసి వదిలేస్తారు. కానీ అప్పటికే పాడైపోయిన లీ శవన్ని దహనం చేస్తారు. అస్థికలు తీసుకుని పోలీసు వాహనంలో లీ ఊరికి చేరుకుంటారు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. దగ్గర్లో నిర్మిస్తున్న ప్రాజెక్టు కారణంగా ఊరు ఊరంతా ముంపుకు గురవ్వడంతో, అక్కడి వాళ్ళు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారని తెలుస్తుంది. పేద వాడి కష్టాలకు అంతే ఉండదు. లీ ఇంటి తలుపు మీద అంటించిన అడ్రెస్ వెతుక్కుంటూ తిరిగి తన ప్రయాణం మొదలుపెడ్తాడు జో.

2 Comments
  1. Ravi Avula February 6, 2014 /
  2. satya February 8, 2014 /