Menu

దృశ్యం

కొత్త సంవత్సరం ఒక మంచి సినిమాతో మొదలైంది నాకు – మలయాళం సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న సినిమా “దృశ్యం”. నాకు తెలిసినంతవరకూ మలయాళం సినిమా పరిశ్రమ నుంచి వచ్చినన్ని థ్రిల్లర్స్ మిగిలిన పరిశ్రమనుంచి రాలేదనే చెప్పొచ్చు. అందరికీ బాగా తెలిసిన “చంద్రముఖి” కి మూలమైన మలయాళం సినిమా “మణిచిత్రతాళు”, “22 ఫిమేల్ కొట్టాయం” “షట్టర్”, “భ్రమరం” తో పాటు మరెన్నో గొప్ప థ్రిల్లర్స్ మలయాళంలో ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో ఇండియన్ స్క్రీన్ మీద చాలా మంచి థ్రిల్లర్స్ వచ్చాయి కానీ వాటన్నింటికీ భిన్నంగా వుంటూనే ఒక మంచి థ్రిల్లర్ గా రూపొందిండిన సినిమా దృశ్యం. గతంలో “డిటెక్టివ్”, “బ్యాంగిల్స్” లాంటి మంచి థ్రిల్లర్స్ తీసిన జీతూ జోషెఫ్, ఈ సినిమా కి దర్శకుడు. చాలా కాలం నుంచి హిట్ సినిమా లేని మోహన్ లాల్ కి ఆయన కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలవడం కాకుండా, మంచి సినిమాగా నిలిచిపోతుంది ఈ సినిమా.

కథా పరంగా, జార్జ్ కుట్టీ (మోహన్ లాల్), ఒక చిన్న ఊరిలో కేబుల్ టివి ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. పెద్దగా చదువుకోని జార్జ్ కుట్టీ ఎప్పుడూ టివి ముందు కూర్చుని సినిమాలు చూస్తూ ఉంటాడు. అతని భార్య రాణి (మీనా) అతనికి పూర్తిగా వ్యతిరేకం. పిసినారైన భర్త ని మార్చి కాస్తా ఖర్చు పెట్టించాలనుకునే చూస్తుంటుంది. వారి కూతుళ్ళు అంజు, అనులతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారు వీరిద్దరు. ఒక రోజు జార్జ్ ఊర్లో లేని సమయంలో ఒక విషాదమైన సంఘటన జరుగుతుంది. ఆ సమయంలో రాణి మరియు అంజు ఒక తప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటికి తిరిగొచ్చిన జార్జ్ కి విషయం తెలిసి షాక్ అవుతాడు. ఈ పరిస్థుతుల్లో జార్జ్ ఏమి చేశాడన్నదే కథ. ఇంతకంటే ఈ కథ గురించి ఏ మాత్రం ఎక్కువ చెప్పినా చూసే వాళ్లకి థ్రిల్ పోతుంది. సినిమా చూసే ముందు ఈ కథ గురించ ఎంత తక్కువ తెలుసుంటే అంత మేలు.

సినిమా మొదటి భాగం కాస్తా నిదానంగానే నడిచినా, ఇంటర్వెల్ కి కాస్తా ముందు నుంచి సినిమా చివరి వరకూ ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా సినిమా నడుస్తుంది. సినిమా లోని మిగిలిన అంశాల గురించి చర్చించాలంటే, జీతూ జోషెఫ్ దర్శకత్వం అద్భుతం.చాలా రోజుల తర్వాత మీనా స్క్రీన్ మీద కనిపించింది. మోహన్ లాల్ తో పాటు మీనా నటన కూడా అపూర్వం. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఆశా,కానిస్టేబుల్ పాత్రలో నటించిన అతను కూడా అద్భుతంగా నటించారు. 2013 చివర్లో విడుదలైనా, గత సంవత్సరం వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటని గ్యారెంటీగా చెప్పొచ్చు.

ఈ వారాంతంలో ప్రసాద్ మల్టిప్లెక్స్ లో “దృశ్యం” ప్రదర్శింపబడుతోంది. తప్పక చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *