Menu

Citizen Kane

మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు

“సిటిజెన్ కేన్”. ఈ సినిమా పేరు తెలియని ప్రపంచ సినిమా అభిమానులు ఉండరు. ఈ సినిమా తెలియనివారెవరైనా ఉన్నారంటే వారికి ప్రపంచ సినిమా గురించి ఇంకా అంత పరిచయం లేకుండా ఉండి ఉండాలి. వందేళ్లకు పైబడ్డ చలనచిత్ర చరిత్రలో నెంబర్ వన్ సినిమా ఏదంటే ఠక్కున నోటికొచ్చేది ఈ సినిమా పేరే! నేటికీ ఏ ప్రపంచ చలనచిత్రకారుడ్ని అడిగినా దాదాపు అందరూ ఏకకంఠంతో నెంబర్ వన్ సినిమా గా అంగీకరించే సినిమా; ఇప్పుడే కాదు, మరో వందేళ్ల తర్వాత కూడా నెంబర్ వన్ గా నిలిచిపోయే సినిమా ఇది. 1941లో విడుదలైన ఈ చలన చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందింది. 23 ఏళ్ల అతి చిన్న వయసులో, కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించి ప్రపంచ సినిమా చరిత్రలో చిరస్థాయుగా నిలిచిపోయాడు ఈ చిత్ర దర్శకుడు ఆర్సన్ వెల్స్.

సినిమా అంటే కేవలం కథ చెప్పడం వరకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన రోజుల్లో, కథ కంటే ముఖ్యంగా కథనానికి ప్రాముఖ్యం ఇచ్చిన సినిమా ఇది. కథ చెప్పిన తీరు ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో కూడా వైవిధ్యమైనదే. సినిమా కథను, సంఘటనలు జరిగిన సమయానుక్రమంలో లీనియర్ గా కాకుండా, నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పడం ఈ సినిమా తోనే మొదలయింది. అలాగే మరెన్నో ప్రక్రియల్లో కూడా ఈ సినిమా ప్రత్యేకతలను కలిగిఉంటుంది. ఉదాహరణకు, సినిమాటోగ్రఫీ విభాగంలో డీప్ ఫోకస్ అనే ప్రక్రియను మొదటి సారిగా ఈ సినిమాలోనే ఉపయోగించారు. ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలతో వెలువడ్డ సినిమా కాబట్టే గొప్ప సినిమా గా నిలిచిపోతుంది సిటిజెన్ కేన్ .

*****

మీడియా మొగల్ చార్లెస్ ఫాస్టర్ కేన్ యొక్క పెద్ద కోట బయట “ఇతరులకు అనుమతి లేదు” అనే బోర్డు చూపుతూ సినిమా మొదలవుతుంది. కోట బయట నుంచి చిన్నగా కదుల్తూ కెమెరా కేన్ బెడ్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ కేన్ తన జీవితపు ఆఖరు క్షణాల్లో ఉంటాడు. చనిపోయే ముందు అతని నోటినుంచి వెలువడే చివరి పదం “రోజ్ బడ్”. కేన్ నోటి నుంచి వెలువడ్డ చివరి మాట ‘రోజ్ బడ్’ అనేదానికి అర్ధం కనుగొనటానికి జెర్రీ థాంప్సన్ అనే పాత్రికేయుడు చేసిన ప్రయత్నమే మిగిలిన సినిమా కథంతా.

citizen-2

తన ప్రయత్నంలో భాగంగా కేన్ తో బాగా పరిచయమున్న స్నేహితులను, బంధువులను కలిసి వారి ద్వారా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటాడు థాంప్సన్. అయితే వీరు చెప్పే విషయాలు ఒక వరుసక్రమంలో ఉండవు. అంతే కాకుండా ఈ ఐదుగురు కేన్ జీవితంలోని వివిధ దశల్లో పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి మనకి కేన్ జీవితంలోని ఆయా దశల గురించి మాత్రమే తెలుసుకుంటాం. అయితే ఈ విషయాలన్నీ దర్శకుడు సమ్మరైజ్ చేసి మనకి చెప్పడు. జిగ్ సా పజిల్లోని కొన్ని ముక్కలు మాత్రమే మనకిస్తాడు దర్శకుడు. వాటిని మనల్నే పేర్చుకోమంటాడు. ఈ విధంగా సిటిజన్ కేన్ చూడ్డంలో కేవలం వినోదమే కాక కాస్త మెదడుకి మేత కూడా లభిస్తుంది.

కథ పరంగా ఇది చార్లెస్ ఫాస్టర్ కేన్ అనే వ్యక్తి జీవిత కథ. కేన్ చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు అతని కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటుంది. అయితే అదృష్టవశాత్తూ వారి కుటుంబానికి సంబంధించిన భూమిలో బంగారు గనులున్నాయని తెలియడంతో ఆ కుటుంబం అమాంతం ధనవంతులవుతారు. కానీ కేన్ తల్లి అతన్ని ఒక ధనిక కుటుంబంలో పెంచి పెద్ద చేసి అతని ఇరవై ఐదో ఏట అతనికి ఆస్తిపాస్థులు అందేలా ఒప్పందం కుదుర్చుకుంటుంది. అలా తన తల్లిదండ్రులకు, చిన్నతనానికి దూరమైన కేన్ అతి చిన్న వయసులోనే ప్రచురణ రంగంలోకి అడుగుపెట్టి, అఒక్కో మెట్టే ఎక్కుతూ అమెరికాలో మీడియా మొత్తాన్నీ శాసించే స్థాయికి ఎదగటం, ఆ క్రమంలో ప్రత్యర్ధులని నిర్దాక్షిణ్యంగా చిత్తుచేయటం, మొదట్లో మంచివాడుగా ఉన్న కేన్ అగ్రస్థానానికెదిగే సమయానికి నిరంకుశుడిగా, ఎవరినీ నమ్మలేనివాడిగా తయారవటం, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్యకు దూరమై మరొకరితో సంబంధం ఏర్పరుచుకోవడం, చివరికి ఆమెను కూడా దూరం చేసుకుని ఎంతో సాధించినా ఒంటరివాడిగా మిగిలిపోయి చివరికి “రోజ్ బడ్” అంటూ మరణిస్తాడు.

*****

సిటిజెన్ కేన్‌లో ప్రతి షాట్‌, ప్రతి సీన్ లోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి సినిమాలో ఒకే కీలక సన్నివేశాన్ని ఎన్నుకోవడమంటే చాలా కష్టమైన పని. అయినా కూడా ఒకే సన్నివేశాన్ని ఎన్నుకోవాల్సి వస్తే అది “లైఫ్ విత్ ఎమిలీ” సన్నివేశమే అవుతుంది.

“రోజ్ బడ్” రహస్యాన్ని చేధించే ప్రయత్నంలో ఉన్న థాంప్సన్, కేన్ ఆప్తమిత్రుడైన్ లేలండ్ ని కలుస్తాడు. లేలండ్ కూడా తనకు “రోజ్ బడ్” అంటే ఏంటో తెలియదనీ, కాకపోతే కేన్ మొదటి భార్య ఎమిలీ ని ఉద్దేశించి ఆ మాట అన్నాడేమో అంటాడు. ఎమిలీ-కేన్ మధ్య వైవాహిక బంధం గురించి చెప్పమని అడుగుతాడు థామ్సన్. లేలండ్ చెప్పడం మొదలు పెడ్తాడు.

citizen3

మొదట, ఈ సన్నివేశం మొదలయ్యే సరికి ఎమిలీ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో మంచి రొమాంటిక్ సంగీతం ప్లే అవుతుండగా కేన్ అక్కడకు వస్తాడు. చూడ్డానికి కొత్తగా పెళ్ళైన వారిలా అనిపిస్తుంటారు. కేన్ తన ఆఫీస్ కి వెళ్లే హడావుడిలో ఉంటాడు. ఎప్పుడూ ఆఫీసేనా అని అడుగుతుంది ఎమిలీ. మొదట వెళ్లక తప్పదంటాడు కేన్. కానీ భార్య మొహం చూసి, వచ్చి ఆమెకు దగ్గరగా కూర్చుంటాడు కేన్; ఆమె కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, కావాలంటే ఈ రోజుకి ఆఫీస్ మానేస్తానని అంటాడు. కట్ చేస్తే….

కేన్ మరియు ఎమిలీ అదే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. వారిద్దరి రూపు రేఖలను బట్టి చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినట్టుగా మనం ఊహించుకోవచ్చు. ఎప్పుడూ పనీ పనీ అని ఎందుకు తిరుగుతుంటారో నాకర్థ కాదని భర్త ను విసుక్కుంటుంది ఎమిలీ. ఇప్పుడు ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వారిద్దరి మధ్య నెలకొన్న దూరాన్ని పెంచుతూ ఇద్దరి మధ్యా ఒక పూల గుచ్చాన్ని ఉంచుతాడు దర్శకుడు. కట్ చేస్తే …

ఈ సారి కూడా కేన్ మరియు ఎమిలీ అదే టేబుల్ వద్ద ఉంటారు. ఈ సారి ఎమిలీ మొహంలో గతంలో ఉన్న ఆందోళన ఉండదు; ఆ స్థానంలో ఒక రకమైన వెటకారం చోటు చేసుకుని ఉంటుంది. అప్పుడు అమెరికా ని పరిపాలిస్తున్న రాష్ట్రపతి పై కేన్ తన పత్రికలో ప్రచురించిన వ్యాసం గురించి అతన్ని ఎదిరిస్తుంది. రాష్ట్రపతి గురించి అలా ఇష్టమొచ్చినట్టు రాయడం మంచిది కాదని అంటుంది. తను చేసింది తప్పని వాదిస్తుంది. చివరికి భార్య మాటలకికి కాస్తా తలొగ్గుతాడు. తన తప్పు ని సరిద్దిద్దుకుంటానంటాడు. కట్ చేస్తే….

కేన్ మరియు ఎమిలీ లకు పెళ్ళై అప్పుడే ఆరేళ్ళు గడిచిపోతుంది. ఎవరో ఎవరికి ఇచ్చిన బహుమతి గురించి భార్యా భర్తలిద్దరూ వాదులాడుకుంటారు. ఈ వాదనలో ఒకరి మీద ఒకరు గెలవాలనే తాపత్రయం కనిపిస్తుంది. ఇద్దరి మధ్యా ప్రేమ కరువవుతుంది. కట్ చేస్తే…

వారిద్దరికీ పెళ్ళై ఎనిమిదేళ్ళైపోయింది . ఒకరంటే ఒకరికి అసలు పడదు. “జనాలు ఆలోచిస్తున్నారు…” అని ఏదో చెప్పబోతుంది. “నేను వాళ్ల ఆలోచనలను నియంత్రించగలను” అని ఆమె మాటలను కట్ చేసేస్తాడు కేన్. ఇద్దరి కళ్లల్లో విపరీతమైన ఏహ్యభావం. కట్ చేస్తే…
సన్నివేశంలోని చివరి అంకం. వారి పెళ్లి పెటాకులైపోయిందని చెప్పకనే చెప్తాడు దర్శకుడు. ఇక్కడ వారిద్దరి మధ్య మాటలే ఉండవు. పేపర్ చదువుతూ కేన్ వైపు సీరియస్ గా చూస్తుంది ఎమిలీ. పేపర్ చదువుతున్న కేన్ కూడా కళ్లెత్తి ఆమె వైపు ఒకసారి చూస్తాడు. కెమెరా వారు కూర్చున్న టేబుల్ నుంచి దూరంగా వస్తుంది. ఇప్పుడు వాళ్లిద్దరూ టేబుల్ కి చెరో వైపు చాలా దూరంగా కూర్చుని ఉంటారు.

citizen4

కేన్ మరియు ఎమిలీ ల మధ్య కాలం జరిగే కొద్దీ దూరం ఎలా పెరుగుతూ వచ్చిందో చూపించే ఈ సీన్ సినిమాకే హైలైట్.

ఈ సన్నివేశంలో కేవలం పాత్రల వయసు మాత్రమే మారినట్టు చూపడం కాకుండా, కేన్ మరియు ఎమిలీ పాత్రలు పోషించిన నటులు చేత అద్భుతంగా నటింప చేస్తూనే, ఎప్పటికప్పుడు పాత్రలకు సరిపోయే మేకప్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లైటింగ్ వాడుతూ, కేన్ మరియు ఎమిలీల తొమ్మిదేళ్ళ వైవాహిక జీవితాన్ని మరియు వారిద్దరి మధ్య పెరుగుతున్న దూరాన్ని ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. రెండు నిమిషాల పదకొండు సెకండ్ల పాటు నడిచే ఈ సన్నివేశంలో 32 షాట్లను ఉపయోగించాడు ఆర్సన్ వెల్స్.

ముగింపు : అయితే సినిమా పూర్తయ్యేసరికి మనం ఎక్కడైతే మొదలయ్యామో కథ అక్కడే వుంటుంది. సినిమాల్లో మొదట్లో చూపించిన సమస్య (conflict) కి చివర్లో ఒక పరిష్కారం (resolution) చూపిస్తేకానీ పరిపూర్ణమైన సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులు పొందలేరనుకునే నేటికీ అనుకుంటారు. కానీ మన దైనందిన జీవితంలోని ఎన్నో సంఘర్షణలకు రిజల్యూషన్ దొరకక జీవితం చివరి వరకూ మనం వెతుకుతూనే వుంటాం. జీవితంలోని వివిధ సంఘర్షణలను సినిమాల్లోలాగా తీర్మానించి, చివరకు మన జీవితానికో హ్యాపీ ఎండింగ్ ఉంటుందో లేదో అన్న సందిగ్ధత, భువిలో జీవన్ముక్తులుగాని వారలకు మోక్షము గలదా? అని అనుమానం – వీటి మధ్య ఊగిసలాడుతూ ఒంటరి బతుకు బతికిన కేన్, చివరికి తన జీవితంలోని ఒక మధుర ఘట్టాన్ని తలచుకుంటూ “రోజ్ బడ్” అన్నాడన్న విషయం తెలియడంతో సినిమా ముగుస్తుంది

One Response
  1. Ajay Reddy August 20, 2015 /