Menu

Chakrapani (1954)

ఆ మధ్య ఒకరోజు రాత్రి నిద్రపట్టక చానెళ్ళ నివాసాల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఈటీవీ లో ఏదో బ్లాక్ అండ్ వైట్ చిత్రం కనబడ్డది. సహజంగా పాత సినిమాలంటే ఉన్న ఇష్టం వల్ల ఆ ఛానెల్ వద్ద రెణ్ణిమిషాలు ఆగాను. ఇక ఆపై వేరే ఛానెల్ మార్చలేకపోయాను.
నేను చూసిన దృశ్యం –

సీ.యస్.ఆర్. కూ, అతని గుమాస్తా వంగర (వంగర వెంకట సుబ్బయ్యే నా ఆయన పేరు??) కూ జరిగే సంభాషణ: (యధాతథంగా నాకు గుర్తు లేదు కానీ, ఇలా సాగుతుంది)

సీయస్సార్ డబ్బు అంటే లక్ష్మీ దేవి పోగొట్టుకోకూడదు..ఇలా ఏదో అంటాడు
దానికి జవాబుగా ఆయన గుమాస్తా : నేనూ అలాగే అనుకుంటాను. అందుకే ఎప్పుడూ ఓ నాలుగు రాళ్ళు పెట్టెలో పడాలనే చూస్తూ ఉంటాను, కానీ, పది రాళ్ళు బైట పడిపోతూ ఉంటున్నాయి అంటాడు. తరువాత డైలాగు లో:
‘నాకు మాత్రం జమలు దేవ కన్యల్లాగానూ, ఖర్చులు రాక్షస పడుచుల్లాగానూ కనిపిస్తాయి’ – అంటాడు.
-ఆ దృశ్యం మొత్తం చూసి సినిమా చూడాలి అని ఫిక్సై, మొదలుపెట్టాను. ఆ తరువాత మొత్తానికి విజయవర్ధన్ గారి పుణ్యమా అని డీవీడీ దొరికి, పూర్తిగా చూసేసరికి రెండ్రోజులు పట్టింది లెండి!!

కథ గురించి: (స్పాయిలర్స్!!)
ఈ కథ తరువాత తెలుగు లో వచ్చిన చాలా కథలకు మూలమేమో అనిపిస్తుంది.
ముఖ్యంగా – వెంటనే నాకు ప్రస్ఫుటంగా గుర్తొచ్చిన దృశ్యాలు – ‘బామ్మ మాట, బంగారు బాట’ లో రాజేంద్ర ప్రసాద్-గౌతమి – భానుమతి కి తమకి పిల్లాడు పుట్టాడని అబద్దం చెప్పడం ఒకటి. రెండవది – మళ్ళీ రాజేంద్రప్రసాదే హీరోగా వేసిన ‘లక్కీఛాన్స్’ సినిమా లోని సన్నివేశాలు… అలాగే, మరో రాజేంద్ర ప్రసాద్ చిత్రం లో – అతను తన భార్య వంట వాడిగా నటించాల్సి వస్తుంది..అతని స్నేహితుడు తన భార్య కి భర్తగా నటిస్తాడు. ‘వద్దు బావా తప్పు’ అనుకుంటా చిత్రం పేరు…అందులోని కొన్ని దృశ్యాలు కూడా ‘చక్రపాణి’ సన్నివేశాల్లాగానే ఉన్నాయి.

ఈ సినిమా కూడా కథ ఒరిజినలా, కాదా – అన్న చర్చ నాకు అప్రస్తుతం. నాకు ఈ సినిమా విపరీతంగా నచ్చడానికి కారణం – డైలాగులు, పాటలు, నటీనటుల మధ్య కెమిస్ట్రీ.

చక్రపాణి గారు పరమ పిసినారి లాగ మనకి కనిపిస్తాడు. ఆయనా, ఆయన కోడలు, ఆవిడ నలుగురు పిల్లలూ – ఇదీ ఆ కుటుంబం. కొడుకు పటంలో ఉంటాడు (అనగా, పరమపదించాడని భావము) . చక్రపాణి గారు ఇంట్లో అవసరాలకి వాటికీ ఏమాత్రం కాసులు రాల్చడు…దానికి తగ్గట్లే అతని గుమాస్తా గారూనూ. (మీ నాన్నే ఉండి నేను పోయినా బాగుండేది అని అమ్మ అన్నప్పుడల్లా, ‘ఇనప్పెట్టె తాళం ఉండి తాతయ్య పోయి ఉంటే బాగుండేది’ అని మనవరాలు భానుమతి అంటూ ఉంటుంది)

ఆయన పిసినారి తనమూ – దానికి మనవరాలు భానుమతి ఆకతాయి రిటార్టులూ – జరుగుతూ ఉండగా, ఆయన మనవడూ, భానుమతి అన్నా – తాతగారితో తగువుపడి ఇల్లొదిలి వెళ్ళిపోతాడు. దిగులుతో తల్లి చనిపోతుంది. చక్రపాణి గారు తన ముగ్గురు మనవరాళ్ళలో పెద్దవారైన ఇద్దరికీ – (భానుమతి, మరొకావిడ – టీజీ కమలాదేవి??) ఎవరో అనామకులతో పెళ్ళి చేద్దామనుకుంటూ ఉండగా, భానుమతి పారిపోయి – రైల్లో ఛాయాదేవి-శివరామకృష్ణయ్య దంపతుల చెంత చేరి వారితో వాళ్ళింటికెళ్ళి, ఛాయాదేవి తమ్ముడు చలాన్ని (అక్కినేని) పెళ్ళి చేస్కుంటుంది.

ఇంతలో అవతల చక్రపాణి గారు లక్ష రూపాయలు పోగు చేసి, తన మొదటి మనవడికి ఇస్తానంటాడు. అక్కడ్నుంచి జరిగే డ్రామా – ఇన్నాళ్ళుగా ఇన్ని సినిమాలు చూశాము కనుక, ఊహించవచ్చు.

ఇందులో ప్రతి పాత్రకీ ఒక రకం Distinguishing trait ఉంది.
ఉదాహరణకి – ఛాయాదేవి మాటిమాటికీ శివరామకృష్ణయ్యని – ‘అయ్యో! నా ఖర్మ కొద్దీ దొరికారండీ!’ అనడం
సూర్యకాంతం – ‘సగం చాలు…….’
భానుమతి – ఆద్యంతమూ అన్నింటికంటే ఎక్సెంట్రిక్ పాత్ర
సీయస్సార్, వంగర – డబ్బు పిచ్చి
అక్కినేని – భానుమతిని(సినిమాలో మాలతి) ‘మా…’ అనడం…అసలు అది ఒక్క కోణమే. ఇందులో అక్కినేని మాత్రం – ఏ ప్రొఫెషనల్ హాస్య నటుడికైనా సరితూగే విధంగా చేశారు 🙂

-బహుశా, ఈ విధమైన ‘వెర్రితనం’ వల్లే హాస్యం పుట్టిందేమో ఈ సినిమాలో. అసలైనా ఒకళ్ళని మించి ఒకళ్ళకి ఉన్నాయి డైలాగులు.
పడీ పడీ నవ్వాను వాళ్ళ నటనకీ, ఆ సంభాషణ లకీ. నాకైతే డైలాగు డైలాగూ మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది. ఎక్కడన్నా సంభాషణలు మాత్రం దొరికితే చెబుదురూ!! (రాసిన వారు: రావూరు వెంకట సత్యనారాయణ)

‘ఉయ్యాల జంపాలలూగరావయా…’ పాట సాహిత్యం ఒక వంక నవ్విస్తే, ఆ పాట ఆద్యంతమూ సూర్యకాంతం ముఖ కవళికలు మరో పక్క.

తక్కిన పాటలు కూడా – భానుమతి పాటలు – అద్భుతంగా అనిపించాయి వింటూంటే.
అక్కినేని సోలో పాట – అది మాత్రం చూసి తీరాల్సిందే!

-మొత్తానికి అద్భుతమైన సినిమా! తప్పకుండా చూడండి. డీవీడీలు దొరుకుతున్నాయట! అయితే, సీను సీను కీ మధ్య కట్ అయిపోతూ ఉంది డీవీడీలో కొన్ని చోట్ల. ఏం చేస్తాం – కరువుకాలంలో దొరికిందే పరమాన్నం అని…. ఇప్పుడెక్కడ వెదికేది ఇలాంటి చిత్రల్ని…. దొరకవు కనుక, పాత వాటినే..కట్టో, పేస్టో – ఏదో ఒకటైతే ఉంది కదా, అని నిట్టూర్చి చూసేయడమే!

ఈ పాత్రల హాంగోవర్ చూసి పదిరోజులైనా వదలడం లేదు!!

4 Comments
  1. sreenivas pappu September 6, 2010 /
  2. శారద September 7, 2010 /
  3. రవి September 9, 2010 /