Menu

అందాల రాముడు-అదో అనుభవం

అందాలరాముడు సినిమాను మొదటి సారి నా చిన్నతనంలో చూశాను,ఏ సంవత్సరమో సరిగ్గా గుర్తు లేదు గానీ చూస్తూ చాలా సార్లు పడిపడి నవ్వుకోవటం బాగా గుర్తుంది.అందుకు కారణం తీతా అంటూ పిలిపించుకునే అల్లు,ఓ ఫైవుందా అంటూ వెంటాడే రాజబాబు.తర్వాత కొన్ని సార్లు చూసినా సినిమాహాల్లో చివరి సారి చూసి మాత్రం పదిహేనేళ్ళు దాటింది.మధ్యమధ్య స్థానిక కేబుల్ నెట్వర్కుల్లో వచ్చినప్పుడు అక్కడక్కడ కొన్ని సన్ని వేశాలు మాత్రం ఆస్వాదించాను.

చివరిసారి చూశానన్నానే దానికో చిన్న రామాయణంలో పిడకల వేట లాంటి పిట్టకధ ఉంది.నేను పదకొండేళ్ళ క్రితం వరకూ శెలవుల్లో మా బాబాయి (మా నాన్న చిన్న తమ్ముడు)గారింట్లో,ఒంగోలులో గడిపేవాడిని.ఆ ఊర్లో నాకు సినిమాలకు సంబంధించినంత వరకూ చాలా అనుభవాలున్నాయి,అవి తర్వాత వీలుంటే తెలియజేసుకుంటాను.మా ఇంటి దగ్గరలో రామకృష్ణ అనే సినిమా హాలుండేది.తర్వాత సినీ నిర్మాత డి.రామానాయుడు ఆ హాలును కొని సురేష్ మహలుగా మార్చారు,ఆతర్వాత వేరే యాజమాన్యం చేతిలోకిపోయింది.గత సంవత్సరం చూద్దామని వెళ్తే అక్కడొ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కనిపించింది.ఇంతకీ ఏమిటయ్యా ఆ సినిమా హాలు ప్రత్యేకత అంటే మీరు అందులో ఏమూల కూర్చున్నా,ఆఖరుకు నేల క్లాసులో మొదటి వరుస అంటే తెరకు సరిగ్గా ఎదురుగా కూర్చున్న మెడ నెప్పి పుట్టకుండా సాఫీగా చూడొచ్చన్నమాట. నా అనుభవం లో ఆ ఒక్క సినిమా హాలులోనే ఆ ఇంజనీరింగు టెక్నిక్ కనిపించింది.అలాగే అత్యంత దరిద్రగొట్తు సీటింగు మాత్రం నాదృష్టిలో హైదరాబాద్ లోని అమరావతి.ఇప్పుడు లేదు గానీ వైజాగ్ లో ఒక ధియేటర్ లో స్తంభాలు అడ్డుండేవి జనం మాత్రం మామూలుగానే చూడగలిగేవారు. సరే సినిమాహాళ్ళ గురించి మరో సారి ముచ్చటించుకుందాం.

సదరు రామకృష్ణ హాలులో ఒకరోజు నాగేశ్వరరావు నటించిన దొంగరాముడు ఈ రోజు,మరుసటి రోజు అందాలరాముడు చూశాను.అనగనగా ఒక కాలనీ,అందరూ మధ్యతరగతి జనాలు,వారందరి మధ్య ఒక బామ్మగారు,ఆవిడ పెంచుకుంటున్న ఒక సీతారావుడు.ఒకానొక ఉదయాన మన సీతారావుడు చెక్కు చెదరని క్రాఫుతో,నున్నటి గడ్డం తో దుప్పటి తప్పించి చిరునవ్వులు చిందిస్తూ నిద్ర లేవటం తో దాదాపు కధాప్రారంభం అవుతుంది.పాత సినిమాల్లో మొదట న్యూసుపేపరు,అందులోనుంచి ఫస్ట్ క్లాస్ అంటూ చాలాసార్లు బియ్యే ప్యాసయిన హీరోలు కనిపించేవారు, అప్పుడు బియ్యే అంటే అంత ఇదన్నమాట.ఇక్కడ మన హీరో అప్పటికే బియ్యేలు అవీ ప్యాసయ్యి ఉంటాడు,అప్పటికోఇంకాసేపటికో డిప్టీ కలెక్టరుగా  కూడా ఎంపికయ్యుంటాడు కాకపోతే మనకా సంగతి తర్వాతి రీళ్ళలో తెలుస్తుంది.అందాలరాముడు లాంటి సినిమాలు చూసినవారికి ముఖ్యంగా ఇవ్వాళ్టి తరం ప్రేక్షకులకు ఒక సందేహం వస్తుంది,హీరో రాత్రి నిద్రలోనే స్నానం,షేవింగూ అదీ చేసి నిద్రలేచేటప్పటికే అంత ఫ్రెష్ గా కనిపిస్తారా అని?కానీ,హీరో శుచిశుభ్రతలు ఉన్నవాడై.క్లీనుగా,నీటుగా ఉండాలి అన్నది మన సినిమా దర్శకులు చాలా కాలం పాటించిన నియమం.మరీ అరుదైన సన్నివేశాలలో తప్ప సినిమా హీరోలు తలమాసిన వాళ్ళ లాగా కనిపించరు. ముఖ్యంగా బాపు సినిమాల్లో.అది అందాలరాముడు కావచ్చు, కృష్ణ కేడీగాడి వేషం వేసిన కృష్ణావతారం కావచ్చు, ముత్యాలముగ్గులో శ్రీధర్ కావచ్చు.

మన సీతారావుడు, బాగా డబ్బు చేసిన జేబీ అనబడే నాగభూషణం, అతని కూతురుగా లత (ఇప్పుడు టీవీ సీరియల్లో అత్త,అమ్మ పాత్రలు వేస్తున్నావిడ,)జేబీ పియ్యేగా ధూళిపాళ్ళ, మేనల్లుడుగా నూతన్ ప్రసాద్(బహుశా అతని తొలి సినిమా)తీసేసిన తాసీల్దారు(తీతా)గా అల్లు రామలింగయ్య,తీతా దగ్గర బిళ్ళ బంట్రోతుగా కాకరాల,సీతారావుడి మిత్రుడిగా రాజబాబు,ఇంకా రావికొండలరావు, రాధాకుమారి, సూర్యకాంతమ్మ, మాడా, సాక్షి రంగారావు,ఇలా చాలామంది పాత్రధారులున్నారు.

కొన్ని సంఘటనలు అయ్యాక ప్రధాన పాత్రధారులందరూ భద్రాద్రి రాముడిని సేవించుకునేందుకు రెండు పడవల్లో బయలుదేరుతారు.ర్తెండు పడవలన్నాను  గాని ఒకటి జనతా ఎక్స్ ప్రెస్ సాదాసీదా బాపతు.రెండోది రాజహంస,జెబీ పరివారానికి మాత్రం పరిమితం,స్విమ్మింగ్ పూలూ ఉంటుంది డీలక్స్ బోటన్న మాట.మధ్యలొ జరిగే కొన్ని సన్నివేశాలు,చివరకు కధ సుఖాంతమవుతుందనుకోండి.

1970 ల నాటి తెలుగునాట ఉన్న సగటు,దిగువ మధ్య తరగతి ప్రజానీకం రోజువారీ జీవితం మీద బాపు తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యానం అనిపిస్తుంటుంది ఈ సినిమా చూస్తుంటే.అలాంటి జనం ఒక డబ్బుతో కళ్ళుమూసుకుపోయిన ఒక తలతిక్క కోటీశ్వరుడితో మూడు రోజులపాటు కలసి ప్రయాణం చేయాల్సి వస్తే ఎలా స్పందిస్తారు,ప్రవర్తిస్తారు అన్నది హాస్యగుళికలుగా మనకు అందించారు.

ఈ సినిమాలో రావి కొండలరావు గారి శ్రీమతి రాధాకుమారి గారిది కాస్త చాదస్తం తో కూడిన బ్రాహ్మణ వితంతువు పాత్ర.ఆమె పాత్ర మీద రాజబాబు తో ముళ్ళపూడి కలం నుంచి మంచి ములుకుల్లాంటి సంభాషణలు విసురుతారు.

గోదావరి నీళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు,ముందు చేపలు తాగి ఎంగిలి చేసిన నీళ్ళేగదమ్మా మనం తాగుతుంది అంటాడు.మరోసారి కులాల గురించి మాట్లాడుతూ,ఏవమ్మోయ్ మీరు పూజించే రాముడిది మీ కులం కాదు,రాజుల కులం అని ,ఆనాటి అభ్యుదయ రచయితలు అని ముద్రలేయించుకున్న వాళ్ళు కూడా రాయ సాహసించని(కులాల మీద)డైలాగులు ఆయన్ రాశారు.అలాగే సందు దొరికినప్పుడల్లా నాగేశ్వరరావు, నాగభూషణం, ఆర్ధికాంతరాలమీద విసురుకునే చెణుకులూ చూసి తీరాల్సిందే.

ఈ సినిమాలో నాలాంటి సామాన్య ప్రేక్షకులను ఆశ్చర్యమనిపించే మరో అంశం..మేరు పర్వతం లాంటి సూర్యకాంతమ్మకు జోడీగా మిడత లాంటి మాడా.సైజులను పక్కన పెట్టినా అప్పటికి మాడా దాదాపు వర్ధమాన నటుడు,తర్వాత వచ్చిన ముత్యాలముగ్గులో    చిన్నపాత్రలో విశ్వరూపం చూపాడనుకోండి అది వేరే సంగతి.హీరో సీతారావుడ్ని నూతన్ ప్రసాద్ వెనుక నుంచి దొంగదెబ్బ తీసినప్పుడు రాముడిమీద మాడా అలిగి  అరేయ్ రాముడూ,రామచంద్రప్రభూ అంటూ తిట్లకు దిగటం చూసితీరాల్సిందే.బాపు రమణలు ఈ మధ్య వచ్చిన రాధాగోపాళం లో కూడా ఇలాంటి జంటను(దివ్యవాణి,వేణుమాధవ్ ను) జోడీ కట్టించారు కానీ అంత ఆకట్టుకోలేకపోయింది.

12 Comments
  1. Sowmya September 4, 2008 /
  2. Falling Angel September 4, 2008 /
  3. కొత్తపాళీ September 8, 2008 /
  4. ceenu September 10, 2008 /