Menu

కృషీ వలుడు అక్కినేని – ఆచార్య ఆత్రేయ

అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ.

ఎలా పెరిగాడు?

జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు.

ఏం సాధించాడు?

లక్షలు(వివరాలు ఉన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు.అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు. అమ్మాడు. హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నాడు. ఇంకొక ఇల్లు కడుతున్నాడు. పొడి చేస్తాం, దంచేస్తాం అనే ఒక పరిశ్రమ,మరికొన్ని పరిశ్రమలూ పెట్టాడు. పిల్లల భవిష్యత్తుకు కావల్సిన ఏర్పాట్లన్ని చేసాడు. మంచి కార్లున్నాయి కాబట్టి తిరుగుతాడేమో అనుకుంటే మంచి సంసారం ఉండబట్టే తిరగటం లేదు. తానట్టే చదువు కోలేదు కనుక ఇతరులైనా చుదువుకోనీ అని గుడివాడలో తన పేరిట ఒక కాలేజీ పెడతామంటే సరేనని విరాళమిచ్చాడు. త్వరలోనే ఇలాంటివి మరికొన్ని చేస్తాడంటున్నారు…. చేస్తాడు.

ఇదయ్యా కథ…

“ఇదంతా మాకు తెలిసిందే కదయ్యా” అంటారు.

అవును.

మీకు తెలియనిది చెప్పమంటారా? చెప్తాను.

నాగేశ్వరరావు అందగాడు కాదు…దేశంలో కొందరమ్మాయలు నా మీద విరుచుకు పడ్డా సరే..అన్నపూర్ణమ్మగారు నన్ను క్షమిస్తారు కనుక అందగాడు కాడు.
నాగేశ్వరరావుకు మంచి కళ్ళు లేవు.

కంఠం అంత కన్నా లేదు.

ఒడ్డూ పొడుగూ విగ్రహం లేదు

బాషా పాండిత్యం లేదు.

ఇంతెందుకు నటుడికి కావిలిసిన లక్షణాలు అసలు లేవు

అయినా-

హీరో అయ్యాడు…ఇప్పటికీ హీరోగా ఉన్నాడు..ఇంకా ఉంటాడు

ఇదయ్యా కథ…

“ఇదీ మాకు తెలిసిందే కదయ్యా?” …అంటారు.

మీకేమిటి నాగేశ్వరరావుకే తెలుసు.కనుక మీకూ..ఆయనకూ తెలియందొకటి చెప్తాను.

నెల్లూరులో ‘మాయాలోకం’ విడుదలైంది చూశాను. అందులో ఆ కుర్రాడి పేరు నాగేశ్వరరావు అని నాకు తెలియదు కానీ ఈ కుర్రాడెవరో ఫరవాలేదు-కంఠమూ, బిగుసుకు పోవటమూ-ఈ రెండూ సర్ధుకుంటే పనికొస్తాడు,అని నేననుకున్నాను. పక్క నెవరితోనో అన్నాను కూడా ఇప్పడు పెద్ద వాళ్ళయిన వాళ్ళందర్ని గురించి ఒకప్పుడిలా అనుకున్నామని చాలా మంది చెప్పడం సహజం. నేను ఆ జాబితాలో చేరను. ఎందుచేతంటే నేనప్పుడు నాటకాలలో ఉన్నాను.ప్రతిభను వెతకటం,గుర్తించటం నా వృత్తిగా ఉండేది.పైన నేను ఉదహరించిన రెండులోపాలూ ఆయన ఏ మాత్రం సర్ధుకున్నాడో మీరే నిర్ణయించాలి. కానీ,నేననుకున్నట్లు మాత్రం పనికొచ్చాడు.పై కొచ్చాడు.

“ఎలా పైకొచ్చాడయ్యా?” అంటారు.

నాగేశ్వరరావు ఇంత పైకి రావటానికి ఒక కుల వ్యవస్ధ,ఒక నిర్మాణ సంస్ధ,ఒక పంపణీ కంపెనీ వెనక ఉన్నాయని కొందరంటూంటారు. …

తన లోపాలు తనకు తెలుసు కనుక. తన తప్పులు తను తెలుసుకుంటాడు కనుక.
నాగేశ్వరరావంటే అదృష్టం కాదు.అంగబలం కాదు,అర్ధబలం కాదు.
నాగేశ్వరరావు అంటే దీక్ష,కృషి,క్రమ శిక్షణ.
నాగేశ్వరరావు నటుడుగా పుట్టలేదు.నటుడు కావాలనుకున్నాడు.శరీరాన్ని,మనసునూ,అలవాట్లనూ,అభిరుచులను,ఆశలనూ,ఆకర్షణలనూ,అదుపులో పెట్టుకుని,తన లక్ష్యానికి తగ్గట్టుగా మలుచుకుని తీర్చి దిద్దుకుని నటుడయ్యాడు.
దీనికంతా ఆనాటి సినిమా పరిశ్రమ వాతావరణం కూడా సహాయపడింది.

అంటే-
తారాబల ప్రభావం ఇంత ప్రబలంగా లేని రోజులవి. దర్శకుడు,కెమెరామెన్,సౌండ్ రికార్డిస్ట్ మొదలగు సాంకేతికనిపుణులే అప్పుడు తారలు.వాళ్ళలో చాలా మంది విద్య,సంస్కారం కలవారు. దక్షిణ దేశ చలన చిత్ర పరిశ్రమ ఒక లక్ష్యంగా,ఒక ఉద్యమంగా స్వీకరించినవాళ్ళు. అందువల్ల ప్రతిభను వెతకడం,తయారుచేయడం పరిశ్రమకు బలం చేకూర్చడం వాళ్ళ కర్తవ్యంగా ఉండేది. ఈ వాతావరణం అప్పుడుండబట్టే ఆ నాగేశ్వరరావు ఈ నాగేశ్వరరావు అయ్యాడు. అవన్నీ ఇప్పుడు పూర్తిగా శూన్యం కాబట్టే మరో నాగేశ్వరరావు రాలేకపోతున్నాడు.

నాగేశ్వరరావు ఇంకా హీరోగా చెలామణి కావడం మనకు ఇబ్బంది లేదు కాని,మరి కొందరు నాగేశ్వరరావులు రాకపోవడం పరిశ్రమకు ఆరోగ్యకరం కాదు.

నాగేశ్వరరావు గొప్ప నటుడంటారు.కాడని నేనంటాను.కారణం నాగేశ్వరరావును నటజీవితానికి పరిచయం చేసిన నాటక రంగాన్ని ఆయన వదలకుండా ఉంటే ఆయన నటన నిగ్గు తేలేది. అందుకు నిదర్శనం చాలా మంది తమిళ నటులే. నాగేశ్వరరావు ఇప్పటికి ఆరితేరింది సినిమా నటనలో మాత్రమే అని నా అభిప్రాయం. నటన గురించి ఆయనకు కొన్ని నిశ్చతాభిప్రాయాలు ఉన్నాయి. వాటితో నేనేకీభవించను.అందువల్ల నాగేశ్వరరావుకు నష్టముండదు..కాని ఆయన మళ్ళా నాటకరంగానికి రావడం అంటూ తటస్ధపడితే నటన గురించి ఆయన నిశ్చితాభిప్రాయాలు మార్చుకుని నాతో ఏకీభవిస్తాడనీ,అందువల్ల చాలా లాభం ఉంటుందని నా ఆశ.

ఈ సోదంతా ఎందుకంటారేమో
అభిమానముంది కనుక.
నన్ను గురించి నాగేశ్వరరావును అడగండి ..ఎన్ని చెబుతాడో..
అదీ అభిమానమే.
మీకు తెలియంది ఇంకోటి చెబుతాను.

నేనింతవరకూ మానవ మాత్రుడు మీద..అందులో సినిమా నటుడు మీద వ్రాయటం ఇదే మొదటిసారి.
అందుకే పొగడాలంటే పొగరడ్డమొస్తోంది. తెగడాలంటే సత్యం అడ్డొస్తోంది. అందుచేతే నాగేశ్వరరావు కృషిని ఎప్పుడూ కాదనను గొంగళి పురుగు సీతాకోక చిలుక కావడానికి పడే శ్రమ,పరిణామ అవస్ధలూ పడ్డాడు నాగేశ్వరరావు. అందుకే నిలబడ్డాడు. అందుకే ఇప్పుడు వచ్చిన,ఇక రాబోయే నటులకూ,హీరోలకు ఆదర్శంగా ఉంటాడు.

నాగేశ్వరరావు అందుకున్న శిఖరాలను చూచి అర్రులు చాచే వాళ్ళే కాని,చేసిన కృషినీ,పడ్డ శ్రమనూ బయిలుదేరే ముందు చేరుకోవాలనుకున్న లక్ష్యాన్నీ గుర్తించి అనుసరించేవాళ్లు ఒక్కరూ లేరు.

నాగేశ్వరరావు సినిమా పరిశ్రమకు డబ్బు సంపాదించాలని రాలేదు. ఇప్పటికీ ఆయన డబ్బుని సంపాదిస్తున్నా- డబ్బు ఆయన్ను సంపాదించడం లేదు. వ్యక్తిగా ఆయనకు జీవితంలో సంతృప్తి ఏర్పడింది. నటుడుగా ఆయనకింకా అసంతృప్తి ఉందని నాకు తెలుసు.అసంతృప్తిని వెతుకుతూనే ఇంకా వేషాలు వేస్తున్నాడు.అది దొరికే వరకూ హీరోగానే ఉంటాడు. దొరికిన నాడు నిజంగా హీరో అవుతాడు.

నాగేశ్వరరావు మంచివాడంటారు. అంత మంచివాడేం కాదు. కాస్త చెడ్డవాడు కూడా అంటాను. సినిమా పరిశ్రమలో అందరూ అనుసరించలేని నీతులూ,నియమాలు కొన్ని ఉన్నాయి ఆయనకు. అవి అందరూ అనుసరించాలని ఆయన పట్టుదల అనుసరించలేని వాళ్ళకు చెడ్డవాడవుతుంటాడు.

నా పేరు నాగేశ్వరరావు.నేను నాగు పాము లాంటి వాడ్ని అని ఒకప్పుడన్నాడట. నిజమే.ఆయన పగ పడతాడు.కానీ విషం కక్కడు.
నాగేశ్వరరావు నిలకడ లేని మనిషి. అభిప్రాయాలు మార్చుకుంటూంటాడు.
అవును. ఆ మార్చుకునేవి దురభిప్రాయాలే.

నాగేశ్వరరావు ఇంత పైకి రావటానికి ఒక కుల వ్యవస్ధ,ఒక నిర్మాణ సంస్ధ,ఒక పంపెణీ కంపెనీ వెనక ఉన్నాయని కొందరంటూంటారు. నేనది సుతారామూ నమ్మను.ఒప్పుకోను. ఆ నమ్మకంతో అలాంటి ఏర్పాట్లు చేసుకోవటానికి ఈ తరం వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే తప్పు దారిలో వెళుతున్నారని..అభివృధ్ది కన్నా అధోగతి పాలవుతారనీ హెచ్చరిస్తునన్నాను. నాగేశ్వరరావు సినిమా రంగంలో అడుగు పెట్టినప్పుడు అలాంటివేమీ లేవు.నిజం చెప్పాల్సి వస్తే ఆయన్ను ఆధారం చేసుకుని అవన్నీ బలం చేకూర్చుకున్నాయని అంటే తప్పులేదేమో. ఆయనకు సినిమారంగంలో మొదటి రంగు పూసింది కులం కాదు. ఆయన్ను ప్రప్రధమంగా క్లిష్టమైన ఉదాత్తమైన పాత్రలను పోషించగల నటుడుగా నిరూపించింది తన నిర్మాణ సంస్ధ కాదు.

నాగేశ్వరరావు తన్ను తానొక బంక మట్టిగా భావించుకున్నాడు.దాన్ని తానే మర్ధించాడు. మదించాడు.అందులో రాళ్ళూ రప్పలూ,నలుసులూ పొలుసులూ ఏరి పారేసుకున్నాడు. తనకొక రూపాన్ని నిర్ణయించుకొని,తీర్చి దిద్దుకున్నాడు. ఒక మూర్తిగా తయారయ్యాడు. మనం దాన్ని ఆదర్శమూర్తి అందాము.

కృషీవలుడుగా పుట్టి కృషిలో ఉన్న ఖుషీని గుర్తించి,నిషాను ఆస్వాదించిన ఒక మధురమూర్తిగా తయారయ్యాడు.
నాగేశ్వరావు ఈజ్ యీక్వల్ టు కృషి -ఈజ్ యీక్వల్ టు నాస్తి దుర్భిక్షం.
(షరా ఈ వ్యాసం మొత్తంలో ప్రభుత్వం ఇచ్చిన బిరుదు వాడలేదు-వాడకూడదన్నారు కనుక.)
‘డు’ అన్నాను-నాకు చాలా ఆప్తు’డు’ కనుక.

ఆచార్య ఆత్రేయ స్వయంగా “కృషీ వలుడు..ఇంతింతై వటుడింతయై..”అనే టైటిల్ తో సినిమా రంగం అనే పత్రికలో (1970 పిబ్రవరి సంచికలో) అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆయన సినీ జీవితం రజితోత్సవం సందర్బంగా రాసినది.

2 Comments
  1. రామేశబాబు January 23, 2009 /
  2. krishna rao jallipalli January 23, 2009 /