Menu

అడూర్ తో ముఖాముఖి- తొమ్మిదవ భాగం

ప్ర: స్వయంవరం ని సృష్టించడంలో ఇతర సినిమాల ప్రభావం కానీ దర్శకుల ప్రభావం కానీ ఉందంటారా?

అడూర్: స్వయంవరంలో కొంతవరకూ ఘటక్, (సత్యజిత్) రే ల ప్రభావం కొంచెం ఉంటే ఉండొచ్చు. ఆ తరవాత సినిమాల్లో మాత్రం కచ్చితంగా లేదు. ఘటక్ సినిమా సుబర్ణరేఖ లాగా ఉంది అని కొందరన్నారు స్వయంవరం గురించి. అందులో కూడా ఒక యువ జంట లేచిపోయి పట్నం వెళ్ళడం జరుగుతుంది. కానీ స్వయంవరం ముఖ్యంగా ఆ ప్రయాణం గురించి. ఘటక్ సినిమాతో పోలిస్తే ట్రీట్మెంట్ పూర్తిగా వేరే.

ప్ర: స్వయంవరాన్ని ఏదైనా అంతర్జాతీయ చిత్రోత్సవాలకి పంపారా?

అడూర్: మాస్కో చిత్రోత్సవంలో పోటీ విభాగంలో పెట్టాము. చాలా మంది మెచ్చుకున్నారు. బహుమతి గెలుస్తుందని పుకారు కూడా బాగా బలంగా వీచింది కానీ జరగలేదు. బహుమతుల నిర్ణయాలు ఎక్కడో జరిగాయి, జూరీ చేతుల్లో ఏం లేదని తేలిపోయింది. భారద్దేశం నించి ప్రవేశపెట్టిన సినిమా మాస్కోలో బహుమతి గెల్చుకోకపోవడం అదే మొదటి సారనుకుంటా. భరించడానికి కాస్త కష్టమైన బిరుదు. ఇవ్వాళ్ళ పరిస్థితి బాగా మారింది. యువ దర్శకులకి చాలా అవకాశాలున్నాయి. ఒక దర్శకుడి మొదటి సినిమా గనక చాలా బాగుంటే అతనికి తరువాతి సినిమా తీసేందుకు డాబ్బుకి డబ్బూ, ప్రోత్సాహానికి ప్రోత్సాహమూ పుష్కలంగా దొరుకుతాయిప్ప్డు. డబ్బు మదుపు పెట్టేందుకు రకరకాల సంస్థలున్నాయి. ఈ రోజున టేలెంట్ అంటూ ఉంటే, దానికి చాలా ప్రోత్సాహం లభిస్తుంది.

ప్ర: కేరళలో విమర్శ ఎలాగుంది అప్పుడు?

అడూర్: పెద్దగా ఏం లేదు. పట్టించుకోక పోవడం ముఖ్య కారణమనుకుంటా, వ్యక్తిగత ద్వేషం కన్నా. లేదా కొన్ని బలీయమైన శక్తులు ఈ సినిమాకి కొంచెం దడుచుకుని ఉన్నా ఉండొచ్చు. టిఎంపి నెడుంగడి గారు మంచి సమీక్ష రాశారు. ముర్కోత్ కూంజప్ప గారు సంపాదకులకి ఉత్తరం లాగా రాశారు మంచి సమీక్ష. చాలా మంది, ఇదేంఇ చెత్తసినిమా అని తిట్టిపోస్తున్న సమయంలో ఆ ఉత్తరం ప్రచురితమవడం చాలా ఊతమిచ్చింది మాకు. కొనసాగే ధైర్యాన్నిచ్చింది. నెడుంగడి గారైతే “స్వయంవరం వచ్చింది .. మరి మలయాలం సినిమాకి తరువాయి యేమిటి?” అనే ప్రశ్నతో తన సమీక్ష ముగించారు.

ప్ర: ఫిలిం సొసైటీల్లో?

అడూర్: అప్పటికింకా ఫిలిం సొసైటీలు పెద్ద బలం పుంజుకోలేదు. ఒక ఉద్యమంలాగా ఎదగలేదు. ఉన్నవాటికేమో, స్థానికులు తీసినవి పెద్దగా ఎక్కేవి కావు. మొదణ్ణించీ వాళ్ళకి బయటి (ఇతర దేశాల) సినిమాలంటేనే వ్యామోహం. అసలు ఫిలిం సొసైటీ ఉద్దేశమేంటి? ఇన్నేసి అంతర్జాతీయ సినిమాలు చూసి చూసిన ప్రయోజనమేవిటి? ఆ గమనికతో మనమూ అంతగొప్ప సినిమాలు తియ్యాలని. లేకపోతే ఈ శ్రమంతా దేనికి, వృధా. కానీ ఇక్కడ జరిగేది వ్యతిరేకం. బయటి సినిమాలంటే ఆరాధన పెంచుకోవడంలో స్వదేశీ సినిమాల మీద చిన్నచూపు కూడా అలవరుచుకున్నారు. బయటి సినిమాలు చూడ్డం ఒక మంచి సంస్కృతిని నేర్పి ఉండాల్సింది, కానీ .. ఓ బెర్గ్మానో, ఒక ఫెల్లినీయో చూపిస్తేనే గౌరవం, అబ్బే అలాంటి గౌరవం మనలో ఒకడికి ఎందుకిస్తాం? ఇలా ఉంటుంది.
ఎం. గోవిందన్ అని పేరు మోసిన రచయిత, మేధావి. సమీక్ష అని ఆయన పత్రిక, చాలా ప్రతిష్ఠ గలది. అందులో స్వయంవరం గురించి బాగా వివరమైఅన్ వ్యాసం రాశాడాయన. అంతే కాకుండా చెన్నైలో ఒక చర్చావేదిక కూడా నిర్వహించాడు. దానికి చెన్నైలో నాకు పరిచయమున్న సినిమావాళ్ళ నందర్నీ పిలిచాను. చాలా మంది మేధావులూ, రచయితలూ పాల్గొన్నారు. అందరూ ఏ అభ్యంతరం లేకుండా ఆ సినిమాని మెచ్చారు కూడా. పి. భాస్కరన్ బయటికొచ్చి సినిమా గురించి ఒకటే పొగడ్డం నేనెప్పటికీ మర్చిపోలేణు. ఆయన్ని అంతగా కదిలించిందా సినిమా. బాలూ మహేంద్ర బయటికొస్తూనే నన్ను కావలించుకుని, “మమ్మల్ని రక్షించావు!” అన్నాడు. ఆ రోజుల్లో యువ దర్శకులు చాలా కష్టాల్లో ఉన్నారు చెన్నైలో. ఫిలిం ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే ఇంకానూ.

తిరువనంతపురంలో సినిమా వేసినప్పుడు చాలా మందొచ్చి అచ్చు ఇంగ్లీష్ సినిమా చూసినట్టుందని చెప్పారు .. దీనిభావమేమి తిరుమలేశ అనుకున్నాం మేము. సినిమాలోని కథా కథనం వల్ల వాళ్ళలా అనుకున్నారా, లేక శబ్దాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, సినిమాని నడిపించడంలో ఒక పొదుపూ ఉండడం చూసి అలా అనుకున్నారో, నాకిప్పటికీ అర్ధం కాదు.

ప్ర: థియెటర్లలో స్పందన ఎలాగుంది?

అడూర్: వాళ్ళ నించి కూడా కాల్సొచ్చేవి. కాసిని పాటలైనా పెట్టుంటే మంచి హిట్టయ్యేది అనే వాళ్ళు. ఐనా ఎవార్డులు రావడం కొంత మేలు చేసింది మాకు. జాతీయ పురస్కారాలు లభించాక, ఆ దన్నుతో సినిమాని మేమే సరిగ్గా విడుదల చెయ్యగలిగాం. బాగా నడిచింది కూడాను. ఎఫ్ఎఫ్‌సీ వాళ్ళా లోను తీర్చేశాము కూడా. ఆ రోజుల్లో అందరూ ఎఫ్ఎఫ్‌సీ దగ్గర లోన్లు తీసుకోవడమే గాని తీర్చే వాళ్ళు కాదు. మేమైనా సోంత పంపిణీ చేసుకోడం వల్ల తీర్చగలిగాం.

ప్ర: మళ్ళీ ఎఫ్ఎఫ్‌సీ వాళ్ళతో ఇంకో సినిమా తియ్యలేదా?

అడూర్: లేదు. స్వయంవరం తరవాత మళ్ళీ వాళ్ళ దగ్గరకి పోలేదు.

ప్ర: ఒకవిధంగా చూస్తే ఇండియన్ న్యూవేవ్ సినిమాకి ఎఫ్ఎఫ్‌సీ వారే బాగా మదుపుపెట్టారు. ఆ రోజుల్లో కమర్షియల్ సినిమాకి భిన్నంగా తీసిన సినిమాలన్నీ వారి పుణ్యాన రూపు దిద్దుకున్నవే. మరి వాళ్ళు మలయాళం సినిమాలు ఎక్కువగా ఎందుకు తియ్యలేదు?

అడూర్: బహుశా మలయాళంనించి ఎక్కువమంది అప్లై చేసుండరు. బొంబాయి వాళ్ళకి వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు. మిగతా భేదాలన్నీ అలా ఉండగా, దూరంకూడా ఒక అడ్డంకిగా ఉండేది. మాలాంటి వాళ్ళం పనిగట్టుకుని బొంబాయి వెళ్ళి అక్కడ పని జరిపించుకోవడం చాలా కష్టం. అంచేత, స్థానికంగా ఉండడంతో ఎక్కువగా బొంబాయివాళ్ళు ఆ వెసులుబాటుని బాగా ఉపయోగించుకున్నారు. ఏదో, స్వయంవరం సినిమాకైనా మాకు ఆమాత్రం అవలంబన దొరకడం అదృష్టమే.

ప్ర: ఎఫ్ఎఫ్‌సీ వాళ్ళు ఫైనాన్సు చేసిన సినిమాల్లో థియెటర్లలో డబ్బు సంపాయించి పెట్టింది, నాకు తెలిసి, బహుశా స్వయంవరం ఒక్కటేనేమో. వాళ్ళు సహాయం చేసిన మిగతా సినిమాలేవీ అసలు రిలీజయ్యేవే కావు, ఒకవేళ అయినా అవి ఎక్కువ ఆడేవి కావు.

అడూర్: అవును, స్వయంవరం నిజంగా విలక్షణంగా నిలిచింది. అంత విజయం సాధించినా, ఆ సంవత్సరం కేరళ అవార్డుల కమిటీ ఆ సినిమాని పట్టించుకోలేదు. బ్యూరోక్రసీ, దానికి తోడు సొంతలాభాలను చూసుకునే సినిమా ఇండస్ట్రీ – ఈ రెండూ కలిసి ఆ సినిమాని పట్టించుకోకుండా చేశాయి. అప్పట్లో పీ కే నాయర్ అవార్డు కమిటీకి అధ్యక్షుడు. అవతలి వాళ్ళు ఆయన నోరు మూయించడమే కాక, ఆ అతర్వాత బహిరంగంగా కూడా ఆయన్ని అవమాన పరిచారు. ప్రాంతీయ స్థాయి నించి జాతీయ అవార్డులకి సిఫారసు చెయ్యడంలో కూడా ఈ సినిమాని ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించారు. మద్రాసులో జరిగిన ప్రాంతీయ ఎంపికల్లో ఈ సినిమా ప్రస్తావన రాలేదు.