Menu

About Elly – మనసు నాటకం

కొన్ని మనం వదిలేయాలనుకుంటాం..కొత్తగా జీవించాలని ఆశపడతాం.  కానీ అవి మనని వదలవు ..అంతలోనే కొత్తవి అల్లుకుపోతుంటాయి. ఏం చేయాలోతోచదు..  అప్పుడు మనని మనమే వదిలేయాలని నిర్ణయించుకుంటాం !!
తమ సమస్యని కాలం కూడా పరిష్కరించలేదని భావించిన మనిషి ఏం చేస్తాడు ??? !! ఈ సినిమా డౌన్లోడు అవుతుండగా.. మధ్యలో ఒకసారి క్వాలిటీ చెక్ కోసం ప్లే చేసాను. చూడతగ్గ క్వాలిటీ లేకుంటే డౌన్లోడు వేస్ట్ కదా అందుకే !   క్వాలిటీ ఒకే..కానీ ప్లే అవుతున్న  సన్నివేశం మీద నా దృష్టి నిలిచించి. ఆ సన్నివేశం గొప్పగా చిత్రీకరించబడి నన్నాకర్షించింది. చాలా ఉత్కంఠ కల్గించే సన్నివేశం  అది.

నేను చూసిన సన్నివేశం

మగాళ్లంతా వాలీ బాల్ ఆడుతున్నారు..నవ్వుతూ తుళ్ళుతూ..వగరుస్తూ.. ఇంతలో ఒక మూడు నాలుగేళ్ల  పాప పరిగెత్తుకుంటూ వస్తుంది. అమాయకంగా అందంగా ఉందా పాప.
పప్పా.. పప్పా ఆరాష్.. పప్పా ఆరాష్  అని వచ్చీ రాని మాటలతో పిలుస్తూ ఓ వైపు చెయ్యి చూపిస్తుంటుంది.. వాళ్లంతా ఆటలో ఉంటారు. ఆ అమ్మాయి మొహాన్ని గమనించే స్థితిలో లేరు. ఆపిల్ల మాత్రం దీనంగా మొహం పెట్టి
పప్పా .. ఆరాష్ అని  ఓ వైపు చేయి చూపిస్తుంది. ‘మీ పప్పాని మేం బానే చూసుకుంటాంలే ‘ . .అని తలమీద మీద సరదాగా ఒక్కటిస్తాడు ఓ మిత్రుడు. ఇంతలో మరో పెద్దమ్మాయి  డాడీ..డాడీ అని పరిగెత్తుకుంటూ వస్తుంది.. వీళ్లమొహాల్లో కొంచం టెన్షన్.. పప్పా ఆరాష్..పప్పా ఆరాష్ అని తానుకూడా చెయ్యి చూపుస్తుందో వైపు..

అప్పుడు వాళ్లకి విషయం అర్థమయ్యి…పరిగెత్తుతారు.. వాళ్ల వెంటే కెమెరా కూడా.. అంతా ఉత్కంఠ..  ఎం జరిగింది ???

డౌన్లోడు పూర్తిగా అవ్వలేదుకదా.. సినిమా ఆగిపోయింది. నా ఉత్కంఠ మిగిలిపోయింది. ఇహ ఎప్పుడెప్పుడు డౌన్లోడవుతుందా ఎప్పుడు చూసేద్దామా అని నిద్రపోకుండా  ఎదురుచూసా..డౌన్లోడయ్యి  నిన్నరాత్రి మూడింటివరకూ సినిమా చూస్తే గానీ తృప్తి కలగలేదు. అయితే మరీ గొప్ప సినిమా యేం కాదనుకోండి. కాని కథల్లేవూ అనే మనకి మాత్రం కథ కొంచం కొత్తదే మరి. రాద్దామనుకున్నవాళ్లకీ..రాయగలిగేవాళ్లకి  కాదేదీ కవితకనర్హం అన్నట్టే..,  సినిమా తీయాలనుకుంటే కాదేకథా  సినిమా కనర్హం అనొచ్చేమో. ఓ కథ తీయొచ్చు అన్న నమ్మకమూ..తీయగలం..తీసి జనాలని మెప్పించగలం  అన్న ప్రఘాడ విశ్వాసం ఉంటే ఏ కథయినా తీయొచ్చేమో !  అవును ఏ కథన్నా తీయొచ్చు..జీవితానికి దగ్గరగా ఉంటే..రియల్ సీనిమా…భయం జోడిస్తే హార్రర్ సినిమా.. కాల్పనిక జగత్తు జతచేస్తే ఫాంటసీ. పోరాటాలు కలిపితే ఆక్షన్…. హీరోఇజం జతచేరిస్తే తెలుగుసినిమా. 😛

 

ఒకింత నిగూడత్వం కలిగిఉన్న మానసిక నాటకం ఇది. ఇదివరకు కాలేజీ మిత్రులయిన కొందరు తమ ఫామిలీలు పిల్లలతో సహా పిక్నిక్ కి వస్తారు. మూడు జంటలు వాళ్ల పిల్లలు. వాళ్లతో పాటూ ఒక జంటకావాలనుకునే  జంట. తాము మూడురోజులుందామనుకుంటే ఒకరోజుకే దొరుకుతుంది వాళ్లకి గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ ఓనర్ మూడురోజులకీ సర్ధటం వీలుకాదు ఆల్రెడీ వేరేవాళ్లకి ఇచ్చేసాను అంటుంది.  మూడునాళ్ళు ఎలా ఉండాలి మరి..అసలే అది సీజన్ టైం. ఇళ్ళుదొరకటం కష్టం.   ఈ ప్రోగ్రాంనంతా ప్లాన్ చేసిన సఫీదా. అమే మూడురోజులకి ఖాలీలేదని తెలిసినా..ఉందని నమ్మించి అందరినీ తీసుకొచ్చింది. వచ్చాక మరోటి వెతుక్కోవచ్చులే అని. ఎందుకంటే అసలే దొరకలేదంటే ఇక్కడిదాకా రారు కదా..అందుకే సఫీదా మెల్లిగా ఓనర్ దగ్గరికి వెళ్ళి ‘ మేం అయితే ఎక్కడో కాంప్ వేసుకుని ఉండేవాళ్లం..కానీ మాతో ఒకకొత్తపెళ్ళి జంట ఉన్నది. వాళ్లకి ఇది ఒక రకంగా హనీమూన్’  ఏదన్నా చేయొచ్చుగా అని అంటుంది.  ఆ ఓనర్ మరో గెస్ట్ హౌస్ గురించి ఆరాతీస్తే అదీ ఖాలీ లేదని తెలుస్తుంది. కొద్దిసేపాలోచించి..”ఒక విల్లా ఉన్నది కాని పాడుబడింది..దానికితోడు  దానికి తలుపులూ కిటికీలు సరిగ్గాలేవు. రాత్రి చలికి తట్టుకోవటం కష్టం. మీకేమో పిల్లలు కూడా ఉన్నారు మరి “.. అంటుంది.  సరే  ముందో సారి చూస్తాం దానిపరిస్థితి అని వెళతారు.  సముద్రపు ఒడ్డునే ఆ విల్లా..చల్లని గాలి..సంగీతంలా సముద్రపు హోరు. కొన్ని కిటికీ అద్దాలు పగిలి..కిందంతా దుమ్ముపేరుకొని ఉంటుంది. కొందరికి నచ్చుతుంది..కొందరికి నచ్చదు.  కొందరు ఉందామని..కొందరు వద్దనీ అంటారు. ఓటింగ్ పద్దతిన ఉండటానికే నిర్ణయిస్తారు.అందరూ తలోచేయి వేసుకొని కాబోయే జంటని ఆట పట్టిస్తూ ఇల్లు సరిచేస్తారు.  ఆ జంట  ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నంలో..దగ్గరయ్యే పనిలో ఉంటారు. అందరూ ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటూ  వంటలు సిద్దం చేస్తారు.భోజనాలయ్యాక సరదాగా ‘మూగ సంజ్ఞల ఆట’ ఆడుకుంటారు. అటుమీద మగాళ్లంతా బయట కూర్చొని హుక్కా పీలుస్తుంటారు. మరి అమ్మాయి బావున్నట్టేనా.. మీకు నచ్చినట్టేనా..మన అహ్మద్ కి జోడీ కుదిరినట్టేనా అని అందరినీ అడుగుతుంది సఫీదా చొరవగా ..ఆనందంగా.  అందరూ ఆ  అమ్మాయి నచ్చిందని చెపుతారు.  సఫీదాయే  ఆ అమ్మాయికీ  జర్మన్ మిత్రుడు అహ్మద్ కీ జోడి కుదుర్చాలని అనుకున్నది. ఆ అమ్మాయిని ఇక్కడిదాకా తీసుకొచ్చీంది. ఆ అమ్మాయి తనకూతురు ట్యూషన్ టీచరు.  ఆ అమ్మాయి పేరే ఎల్లీ…తెల్లగా ..గుండ్రంగా ..చందమామలా మొహం..మల్లెపువ్వులా నవ్వు.

 

ఉదయాన్నే మగాళ్లంతా వాలీబాల్ ఆడుతుంటారు.. ఆడవాళ్ళు పనులకుపక్రమిస్తుంటారు. నేను తెహ్రాన్ వెళ్ళిపోతాను. ఒక్కరోజుకనే వచ్చాను. మూడు రోజులంటే నావల్ల కాదు అంటుంది ఎల్లీ.  కాదు ఉండాల్సిందే అంటుది సఫీదా..పంపించకపోతే నడుస్తూ అయినా వెళ్లిపోతాను అంటుంది ఎల్లీ.  మిగతావాళ్ళు కూడా ఉండొచ్చుగా అని బ్రతిమిలాడుతారు. సఫీదా అలా మార్కెట్టుకి వెళ్లాల్సిఉంటుంది. ఎక్కడ ఎల్లీ వెళ్ళిపోతుందో అని ఆమె బ్యాగు దాచేస్తుంది. ఇంతమంది బలవంత పెడుతున్నారు కదా అని ఎల్లీ ఆలోచనలో పడుతుంది. ఇంటిముందు మెట్లమీద కూర్చుంటుంది. ఓ పిల్లాడు ఒడ్డున నీళ్లల్లో ఆడుతుంటాడు..మిగతా ఇద్దరు పిల్లలు గాలిపటం ఎగరేసే పనిలో ఉంటారు…

 

ఇదుగో ఇప్పుడే నేను మొదట్లో చెప్పిన ఉత్కంఠ భరితమైన సన్నివేశం వచ్చేది. ఇప్పుడు మొదలై  సినిమా సాంతంసాగే ఆ ఉత్కంఠ ఏంటో తెలియాలంటే సినిమా చూసాల్సిందే !
మనం రోజువారీ ఎన్నో పనులు చేస్తుంటాం. ఏదేని  పని చేసేటప్పుడు మన మనసులో ఒక పథకం ఉంటుంది. మనం ఉత్సాహంగా ఆ పథకాన్ని అమలు పరచాలనుకుంటాం. అందులో భాగంగాకొన్ని విషయాలు ఎదుటివాళ్ళకి చెపుతాం.. కొన్ని చెప్పం..చెప్పాలని అనిపించేంత ముఖ్య విషయాలు కాదేమో అని చెప్పం. లేదా కొన్ని విషయాలు నిజంగా దాయాలనే అనుకుంటామేమో..లేదూ చెప్పకుంటే వచ్చే నష్టం ఏముంది..ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వస్తే మేనేజ్ చేసుకుంటాగా అనుకుంటాం..  కానీ చివరికి అలాంటి విషయాలు ఎదుటివాళ్లకి తప్పకుండా తెలియాల్సిన విషయాలవుతుంటాయి. ఎందుకంటే.. మననీ మన జీవితాన్నీ మన  జీవితనాటకాన్ని మనమే నిర్దేశించుకుంటున్నామనీ మనం అనుకుంటాం.. కానీ మనని నిర్దేశించేది మనం కాదు. మనంకాదూ అన్నవిషయం మనకర్థం కాదు. కానీ చూసేవాళ్లకి అర్థమవుతుంటుంది. 
ఫిలాసఫీ అర్థం కాలేదా ..అదర్థవమటానికే ఈ సినిమా !!
****  సఫీదాగా ..  గోల్షిఫ్టే ఫరానీ.. అదే బాడీ ఆఫ్ లైస్ లో మన టైటానిక్ హీరో పక్కన కనపడుతుందిగా ఇరానియన్ పిల్ల.  అందమైన పిల్ల..అద్భుతమైన నటన.