Menu

2013 లో తెలుగు సినిమా

కాలం నిత్య సంచారి. ‘నిన్న’నుంచి ‘నేటి’మీదుగా ‘రేపటి’వైపు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎనె్నన్నో జ్ఞాపకాలను, అనుభవాలను మనకు మిగులుస్తుంది. అలా టాలీవుడ్‌కు కూడా 2013 సంవత్సరం ఎనె్నన్నో తీపి కబురులను, చేదు స్మృతులను తెచ్చింది. 82 ఏళ్ళ కాలంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఎదురులేని స్థానాన్ని, అంతకుమించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు ఈ సంవత్సరం కూడా యధాశక్తి తమ ‘పరంపర’ను కొనసాగించే ప్రయత్నం చేసాయి.

ఈ 365 రోజుల ప్రయాణంలో తెలుగు సినిమా ‘అత్తారింటికి దారేది’అని ప్రశ్నించిన ‘బాద్‌షా’లకు ‘సాహసం’తో ‘మిర్చి’, ‘మసాలా’ ఘాటు చూపించి, ‘‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’’ నీడలో ‘ఇద్దరమ్మాయిలతో’ ప్రేమకథాచిత్రమ్’ని ప్రత్యక్షం చేసింది.. ‘గుండెజారి గల్లంతయ్యిందె’ అని ఆశ్చర్యపోయిన ‘మిస్టర్ పెళ్ళికొడుకు’కు ‘గుండెల్లో గోదారి’ని, ‘మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు’నీ, ‘గౌరవం’గా అనుభవంలోకి తెచ్చి, ‘నాయక్’ లనీ, ‘పోటుగాడు’లనీ, ‘కేస్ నెంబర్ 666/2013’ కింద బుక్‌చేసి ‘స్వామిరారా’ అని పిలిచింది. ‘అంతకుముందు ఆ తర్వాత’ ‘తడాఖా’చూపించాలనుకున్న ‘ఒంగోలుగిత్త’ ‘యాక్షన్’కు ‘జబర్ధస్త్’గా ‘బ్రేక్‌అప్’ చెప్పింది ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో దిగిన ‘గ్రీకువీరుడు’ ‘ఆకాశంలో సగం’ మాత్రమే చూపించి, ఎప్పట్లాగే ‘1000 అబద్ధాలు’తో ‘వెల్‌కమ్ ఒబామా’ అని ఆహ్వానం పలికింది…!

ఎన్ని సినిమాలు? ఎన్ని హిట్‌లు

2013 సంవత్సరంలో తెలుగులో దాదాపు 110 వరకూ స్ట్రెయిట్ చిత్రాలు, 60కు పైగా డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఆ లెక్కన తెలుగు సినిమాలపై ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి దాదాపు 1200 కోట్లు! అయితే ఈ పెట్టుబడిలో 15 భారీ సినిమాల బడ్జెట్ట్ 600 కోట్ల వరకూ ఉండగా మిగతా 100 సినిమాల మొత్తం బడ్జెట్ 600 కోట్ల వరకూ ఉండటం విశేషం! కాగా, ఇన్ని సినిమాలలో బాక్సాఫీస్‌వద్ద మరో సక్సెస్‌ను సాధించి సూపర్‌హిట్ అయిన సినిమాలు మాత్రం వేళ్ళమీద లెక్కపెట్టేలా ఉండటం గమనార్హం. అలా కమర్షియల్‌గా సూపర్‌హిట్ అయిన సినిమాలు ఐదు మాత్రమే ఉండగా, హిట్ అయిన సినిమాలు మరో ఐదు ఉన్నాయి. మిగతా సినిమాలన్నీ అంతగా సక్సెస్ కాలేక తెలుగు సినిమాల సక్సెస్ రేటు ఎప్పుడైనా 8నుండి 10 శాతం లోపే అనే సూత్రాన్ని మరోసారి నిరూపించాయి.

50 కోట్ల క్లబ్

ఈ సంవత్సరం తెలుగు సినిమాల సక్సెస్‌ను కొలిచే కొత్త సూచికను రూపొందించింది అదే ‘50 కోట్ల క్లబ్’! బాలీవుడ్‌లో మొదలైన ‘10 క్రోర్స్ క్లబ్’, ‘200 క్రోర్స్ క్లబ్’ సూచికలాగా, టాలీవుడ్‌లో ఈసారి ‘50 కోట్ల క్లబ్’ అవతరించింది. ఇటీవలి కాలంలో బిగ్ స్టార్స్ నటించిన తెలుగు సినిమాల బడ్జెట్‌లు సగటున 40నుంచి 45 కోట్ల వరకూ ఎగబాకాయనేది తెల్సిన విషయమే. అంత భారీ ఖర్చుపెడ్తున్నారు కానీ ఆ మేర ఆదాయాలు రాబట్టడం మాత్రం తెలుగు సినిమా మార్కెట్‌కు అంత ఈజీకాదు. ఇలాంటి అంచనా ఉన్న సమయంలో, ఈ సంవత్సరం దాదాపు 4 సినిమాలు సునాయాసంగా ఈ 50 కోట్ల మార్క్‌ను దాటేసి పెద్ద హీరోల స్టామినాను తెలియచేసాయి. అలా ‘అత్తారింటికి దారేది’ సినిమా 75 కోట్లకు చేరువైన సినిమా (ఈ వివాదాలను నిర్మాతలు ధృవీకరించలేదు)గా ఇండస్ట్రీలో టాక్ ఏర్పడింది. ఇక ‘సీతమ్మవాకిట్లో.. (60కోట్లు), మిర్చి (55 కోట్లు), నాయక్ (52 కోట్లు) సినిమాలు ఈ 50 కోట్ల మైలురాయిని దాటి తెలుగు సినిమా రంగంలో కొత్త క్లబ్‌ను ఓపెన్ చేసాయి.

హీరోల ప్రోగ్రెస్ ఏమిటి?

తెలుగు సినిమాలు పూర్తిగా హీరో డామినేటెడ్ చిత్రాలే అనడంలో సందేహం లేదు. ఒక సినిమా సక్సెస్‌నూ, ఫెయిల్యూర్‌నూ నిర్ధారించగలిగే సత్తా ఇప్పటికీ హీరోకే ఉందనే విషయాన్ని కాదనలేము. ‘సీతమ్మ వాకిట్లో’వంటి సినిమాలో మహేష్‌బాబు-వెంకటేష్ కాకుండా మరే చిన్న హీరోలు చేసినా ఆ సినిమా ఫలితం అలా ఉండేది కాదు. ఈ ఒక్కటి చాలు మన తెలుగు సినిమాలు ఎంతగా హీరో డామినేటెడ్‌గా ఉన్నాయని చెప్పడానికి. అందుకని, హీరోల ప్రోగ్రెస్ రిపోర్టే మన తెలుగు సినిమాల ప్రోగ్రెస్ రిపోర్ట్‌గా మారిన పరిస్థితి ఈ ఏడుకూడా కొనసాగింది. ఆమేరకు, ఈ సంవత్సరం సీనియర్ హీరోలు నాగార్జున (భయ్, ఢమరుకం, గ్రీకువీరుడు), వెంకటేష్ (సీతమ్మ వాకిట్లో, షాడో, మసాలా) చెరి మూడు సినిమాలతో సంఖ్యాపరంగా ముందు వరసలో ఉన్నారు. కాగా బాలకృష్ణ సినిమా ఈ సంవత్సరం ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఇక పవన్‌కళ్యాణ్ (అత్తారింటికి దారేది), రవితేజ (బలుపు) తో సక్సెస్‌ని చూసారు. యంగ్ హీరోలలో ఈ సంవత్సరం రామ్‌చరణ్ (నాయక్, తుఫాన్), సిద్ధార్థ (జబర్ధస్త్, సమ్‌థింగ్ సమ్‌థింగ్), ఎన్‌టిఆర్ (బాద్‌షా, రామయ్యా వస్తావయ్యా), రామ్ (ఒంగోలుగిత్త, మసాలా), కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ (మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా) మాత్రం రెండు సినిమాలతో వచ్చారు. కాగా, మహేష్‌బాబు (సీతమ్మవాకిట్లో), అల్లుఅర్జున్ (ఇద్దరమ్మాయిలతో), ప్రభాస్ (మిర్చి), గోపీచంద్ (సాహసం), నితిన్ (గుండెజారి గల్లంతయ్యిందే), విష్ణు (దూసుకెళ్తా), మనోజ్ (పోటుగాడు), నాగచైతన్య (తడాఖా), నిఖిల్ (స్వామిరారా) ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను పలకరించారు. అలాగే సందీప్‌కిషన్ (గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, డి ఫర్ దోపిడీ), వరుణ్ సందేశ్ (చమ్మక్ చల్లో, డిఫర్ దోపిడీ, సరదాగా అమ్మాయితో)లు చెరో మూడు సినిమాలు, సుధీర్ (ప్రేమకథాచిత్రమ్, ఆడుమగాడ్రా బుజ్జీ) రెండు సినిమాలు చేసారు.

హీరోయిన్‌ల సంగతి?

ఈ సంవత్సరం హీరోయిన్‌ల పరంగా సమంతా హవా కొనసాగింది. సమంతా ఈ సంవత్సరం మరే హీరోయిన్ చేయనన్ని సినిమాలు (అత్తారింటికి, సీతమ్మ వాకిట్లో…, జబర్ధస్త్, రామయ్యా వస్తావయ్యా) చేసి ఇండస్ట్రీలోనూ, ఆడియెన్స్‌లోనూ తన క్రేజ్‌ను, స్థానాన్ని బలపరుచుకుంది. కాగా, నిన్నమొన్నటి వరకూ తెలుగు సినీ రంగాన్ని ఏలిన ఛార్మి (ప్రేమ ఒక మైకం), ప్రియమణి (చండీ), శ్రీయ (పవిత్ర), నయనతార (గ్రీకువీరుడు) ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. కాగా, త్రిష సినిమా ఏదీ ఈ సంవత్సరం విడుదల కాకపోవడం గమనార్హం. అయితే అనుష్క మాత్రం ఇప్పటికీ తన ఛరిష్మాను తెలుగు ప్రేక్షకులలో కొనసాగిస్తూనే ఉంది. మిర్చి, వర్ణ సినిమాలే దీనికి ఉదాహరణ. యంగ్ హీరోయిన్‌లలో నిత్యామీనన్ (ఒక్కడినే, గుండెజారి గల్లంతయ్యిందే, జబర్ధస్త్), అంజలి (సీతమ్మ వాకిట్లో.. బలుపు, మసాలా), తాప్సి (గుండెల్లో గోదారి, షాడో, సాహసం)లు మాత్రమే చెరి మూడు సినిమాలలో నటించారు. కాగా, కాజల్ (బాద్‌షా), తమన్నా (తడాఖా), అమలాపాల్ (ఇద్దరమ్మాయిలతో), హన్సిక (సమ్‌థింగ్ సమ్‌థింగ్), ఒక్కొక్క సినిమాలలో నటించగా, రీచాగంగోపాధ్యాయ (మిర్చి, భాయ్), కృతికర్బందా (ఒంగోలుగిత్త, ఓం 3డీ), నిషా అగర్వాల్ (సరదాగా అమ్మాయితో, సుకుమారుడు) రెండు సినిమాలలో నటించారు. ప్రణీత (అత్తారింటికి), లావణ్య (దూసుకెళ్తా) అటు పరిశ్రమనీ, ఇటు ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షించారు. కాగా తెలుగమ్మాయిలు స్వాతిరెడ్డి (స్వామిరారా), నందిత (ప్రేమకథా చిత్రమ్)లు సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకులను అలరించి, తెలుగు వెండితెరపై తెలుగు అందాలపై ఆశలు రేకెత్తించారు. న్యూటాలెంట్: ప్రతీ సంవత్సరంలాగే, ఈసారి కూడా తెలుగు వెండితెరపై ఎనె్నన్నో కొత్త ముఖాలు ప్రత్యక్షం అయ్యాయి. వారిలో క్యాథరీన్ ట్రెసా (ఇద్దరమ్మాయిలతో), నీతిటేలర్ (పెళ్ళిపుస్తకం), ఈషా (అంతకుముందు ఆ తర్వాత), రకుల్‌ప్రీత్‌సింగ్ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)లు చెప్పుకోదగినవారు. అలాగే తెలుగమ్మాయి శ్రీదివ్య (మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు) కూడా చూడచక్కగా ఆకట్టుకుంది.

కొత్త దర్శకుల హవా

తెలుగు సినిమాకు క్రేజ్‌ను, సేలబిలిటీని తెచ్చే క్రెడిట్ హీరోలదైతే, మన సినిమాలకు ప్రతిసారీ దశనీ, దిశనీ నిర్దేశం చేయగల బాధ్యతను నెత్తికెత్తుకుంటున్నవారు మాత్రం దర్శకులే. అందుకే, ఇండస్ట్రీలోకి కొత్త దర్శకులెవరైనా వస్తున్నారంటే వారివైపు, వారు తీసే సినిమాలవైపు ఆసక్తిగా చూడటం కామన్ అయిపోయింది. అలా ఈ సంవత్సరం చాలామంది కొత్త దర్శకులు నవ్యతరహా క్రియేటివిటీతో, తమదైన ముద్రకోసం ప్రయత్నించే అస్తిత్వ పరివేదనలో ఎన్నో సినిమాలను తీసారు. వారిలో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మారిన జె.ప్రభాకర్‌రెడ్డి (ప్రేమకథాచిత్రమ్), జీవన్‌రెడ్డి (దళం), వాచస్పతి జొన్నలగడ్డ (కెమిస్ట్రీ), నిర్మాత నుండి దర్శకత్వం వైపు మారిన అనిల్ సుంకర (యాక్షన్ 3డి), సుధీర్‌వర్మ (స్వామిరారా), వెంకట్ సిద్ధారెడ్డి (కేస్ నెంబర్ 666/2013), కుమార్ నాగేంద్ర (గుండెల్లో గోదారి), జి.వి.రామరాజు (మల్లెలతీరం), మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్), కొండా విజయ్‌కుమార్ (గుండెజారి గల్లంతయ్యిందే), తమ సినిమాలతో రేపటి తెలుగు సినిమాలపై కొత్త ఆశను రేకెత్తించారు.

మళ్ళీ మొదలైన మల్టీస్టారర్స్

ఎన్.టి.ఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబుల తర్వాత నుండి మల్టీస్టారర్ సినిమాలు తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై దాదాపు కనుమరుగు అయిపోయాయి. అలా దాదాపు మూడు దశాబ్దాలనుండి మల్టీస్టారర్ సినిమాలకోసం ఎందరెందరో ప్రయత్నిస్తున్నారు. కానీ అవేవీ అంతగా సఫలీకృతం కాలేదు. కానీ 2013 సంవత్సరం ఆ అసాధ్యాన్ని సుసాధ్యంచేసి చూపించింది. ఈ సంవత్సరం మల్టీస్టారర్ సినిమాలకు స్వాగతం పలికింది. అలా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, సినిమాతో మళ్ళీ శ్రీకారం చుట్టుకున్న మల్టీస్టారర్ సినిమాలు ఈ సంవత్సరంలోనే మరిన్ని సినిమాలు రావడానికి ప్రోత్సాహాన్నిచ్చాయి. అలా ‘మసాలా’ ‘తడాఖా’ సినిమాలు వచ్చి, రాబోయే కాలంలో మరిన్ని మల్టీస్టారర్ సినిమాల ఆగమనానికి ఊతాన్నిచ్చాయి.

రీమేక్‌లు… బైలింగువల్స్

ఈ సంవత్సరం తెలుగుతెరపై రీమేక్‌లు/ ఒరిజినల్ సినిమాలలోని తమ సక్సెస్ హవాను కొనసాగించే ప్రయత్నం చేసాయి. అయితే వాటిలో అన్నీ తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఎదురుదెబ్బలనే ఎదుర్కొన్నాయి. మసాలా (బోల్ బచ్చన్‌కు రీమేక్). మిస్టర్ పెళ్ళికొడుకు (‘తను వెడ్స్ మను’) వంటి బాలీవుడ్ రీమేక్‌లే కాకుండా, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ వంటి దక్షిణాది రీమేక్‌లు కూడా ప్రతికూల ఫలితానే్న చవిచూసాయి. కానీ ‘పోటుగాడు’ మాత్రం యూత్‌ని ఆకట్టుకుంది. అలాగే బైలింగువల్స్‌గా వచ్చిన సినిమాలలో ఈసారి అన్ని సినిమాలూ అంతగా ఆడలేదు. తుఫాన్ (‘జంజీర్’ హిందీ), గౌరవం, వర్ణ, విశ్వరూపం సినిమాలు వాటిలో కొన్ని.

వైవిధ్య చిత్రాలు

తెలుగు సినిమా అనగానే ఫార్ములా, కమర్షియల్ ఎలిమెంట్స్, రొటీన్ కథలు అనే ముద్రే ఉంది. కానీ ఈ సంవత్సరం తెలుగు వెండితెరపై కొన్ని వైవిధ్య కథాచిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. కథలో, కథనంలో, కథాసంవిధానంలోనే కాక, క్యారెక్టరైజేషన్స్‌లోనూ, కథా నేపథ్యంలోనూ భిన్నత్వాన్ని, నవ్యతను చూపించి సినిమాటిక్ ఆర్ట్‌లో క్రియేటివిటీకి అగ్రస్థానాన్ని అందించాయి. వాటిలో మొదటగా చెప్పుకోవలసిన సినిమా- ‘గుండెల్లో గోదారి’! 1980 దశకంనాటి ఉప్పెన నేపథ్యంగా గ్రామీణ గోదావరి జిల్లాలలోని రెండు జంటల కథను సింబాలిక్‌గానూ, పీరియడ్ ఫార్మాట్‌లోనూ ఈ సినిమా అందించింది. అలాగే, హారర్ థ్రిల్లర్స్‌లో ఇప్పటివరకూ తెలుగు తెరకు అంతగా పరిచయంలేని కొత్త ‘జెనర్’ను ‘ప్రేమకథాచిత్రమ్’ ఆవిష్కరించింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయింది. ఇక కవిత్వం సాహిత్యంలోని భావుకతని, అక్షరాలలోని సౌందర్యాన్ని తెరపైకి అనువదించే ప్రయత్నంచేసిన చూడచక్కని సినిమాగా ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ చలం భావజాలాన్ని సినిమాటిక్ ఫ్లేవర్‌లో చెప్పే ప్రయత్నం చేసింది. ఇక, ‘సాహసం’ సినిమా అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ జర్ని సినిమాగా, ‘ఆకాశంలో సగం’ నవలా చిత్రంగా, ‘కాళిచరణ్’ పీరియడ్ డ్రామాగా, ‘గౌరవం’ సినిమా హానర్ కిల్లింగ్స్‌పై సామాజిక చైతన్య చిత్రంగా డిఫరెంట్ లుక్‌నీ, ఫీల్‌నీ అందించాయి. ఇక, అర్బన్ మెట్రో యూత్‌లోని ప్రేమ-పెళ్ళి భావనలను అర్ధవంతంగా అందించిన ‘అంతకుముందు ఆ తర్వాత’, అద్దె అమ్మల భావ సంఘర్షణ (సర్రొగసీ మదర్‌హుడ్)ని సున్నితమైన సెంటిమెంట్ కథగా అద్దిన ‘వెల్‌కమ్ ఒబామా’ సినిమాలు నవ్యతకి ఊపిరులూదాయి.

ప్రయోగాలేం లేవా?

సినిమా అంటేనే నిరంతరం క్రియేటివిటీతో చేసే ప్రయోగమే. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు అత్యల్పమే అయినప్పటికీ, ఈ సంవత్సరం కూడా కొన్ని ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు వచ్చాయి. వాటిలో 3డి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకులకు ఒక ‘విజువల్ ఎక్స్‌పీరియెన్స్’ని అందించాలనే తపనతో వచ్చిన సినిమాలను ప్రస్తావించుకోవాలి. ఈఏడు యాక్షన్-3డి (భరతీయ సినీ చరిత్రలోనే తొలి 3డి- కామెడీ చిత్రం). ఓం 3డి (భరతీయ సినిమాలలో తొలి 3డి యాక్షన్ సినిమా) అనే రెండు సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను ‘దృశ్య సంభ్రమం’లో ముంచెత్తాలని ఆశించిన ఈ సినిమాలు ఎనె్నన్నో లోపాలవల్ల తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. అయితే ‘కేస్ నెంబర్ 666/2013’ సినిమా కథనం, టెక్నిక్, టెక్నాలజీ పరంగా టాలీవుడ్‌కు పరిచయం లేని నావెల్ క్రియేటివిటీని ప్రదర్శించి, ప్రయోగాత్మక చిత్రం అన్న మాటకు అన్నివిధాలా ఎగ్జాంపుల్‌గా నిలిచింది. ఫౌండ్ ఫుటేజ్’ ఆధారంగా అల్లుకున్న ఈ సస్పెన్స్‌డ్రామా వరల్డ్ సినిమా స్టైల్‌ని సమకాలీన స్ఫూర్తితో అందించింది.

వాదాలు- వివాదాలు… విభజనలు-భజనలు

ఈ సంవత్సరం కూడా తెలుగు సినీరంగంలో లెక్కకుమిక్కిలి వాదాలు, వివాదాలు పొడసూపాయి. వాటిలో ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సంబంధించిన సీడీలు పైరసీకి గురవడం, దాని తర్వాత మీడియాలో చెలరేగిన సంచలనం ప్రధానమైనది. పైరసీ దొంగలు ఆ సినిమావాళ్ళే అనే నిజంతో పాటు, ఈ వివాదాన్ని సినిమాని హైప్ చేయడంకోసం సృష్టించారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అన్ని వివాదాలనూ అధిగమించి, ఈ సినిమా బాక్సాఫీస్‌వద్ద సూపర్‌హిట్ అయి కథ, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌దే ఎప్పటికైనా పైచేయి అని నిరూపించింది. అదే సమయంలో ‘స్వామిరారా’ సినిమా అయితే అన్ని హిట్ సినిమాలలోని సీన్లని ఓపెన్‌గా కాపీ చేసినట్లుగా ప్రకటించి కొత్త సంచలనానికి దారితీసింది. ఇంతకాలం ‘ఇన్‌స్పిరేషన్’ అనే మాటకే పరిమితం అయిన కాపీ కల్చర్, క్రియేటివిటీలో ‘కాపీ క్రియేటివిటీ’ అనే నవ్యధోరణికి నాంది పలికింది. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన అంశాలు కూడా ఈ సంవత్సరం తెలుగు సినీరంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసాయి. అయితే దాదాపు రెండుమాసాలపాటు సీమాంధ్రలో జరిగిన సమ్మె మరో విధంగా చిన్న సినిమాలకు వరంగా మారింది. ఇంతకాలం విడుదలకు నోచుకోకుండా ఉన్న ఎన్నో సినిమాలకు థియేటర్లు ఈజీగా దొరికి రిలీజ్ అయ్యాయి. ఇక, సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ, తెలంగాణ సినీ పరిశ్రమగా నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి అధికారికంగా ఏర్పడింది. ఇదే సమయంలో చెన్నైలో జరిగిన 100 ఏళ్ల భారతీయ సినిమా ఉత్సవాలలో తెలుగు ఉత్సవాలు పేలవంగా సాగి విమర్శల పాలయ్యాయి.

కుటుంబ కథలకే నిరా‘జనం’

ఈ సంవత్సరం ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలన్నీ ఫ్యామిలీ కామెడీ చిత్రాలే కావడం గమనార్హం. అందులోనూ రాష్ట్ర విభజన జరుగుతున్న నేపధ్యంలో ‘ఫ్యమిలీ రీయూనియన్’ కథాంశాలతో వచ్చిన సీతమ్మవాకిట్లో… అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలు విజయవంతం కావడం విశేషం! మొత్తంమీద 2013 సంవత్సరంలో టాలీవుడ్, ఎప్పట్లాగే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నంలో ‘మిక్స్‌డ్ సక్సెస్’నే సాధించిందని చెప్పాలి!

2 Comments
  1. Santhosh January 2, 2014 /
  2. Santhosh January 2, 2014 /