Menu

1962 ఓ ‘ఆరాధన’

1962 లో “జగపతి పిక్చర్స్” బ్యానరు పై, వీ.మధుసూధన రావుగారి దర్శకత్వంలో, రంగరావు-వీ.బీ.రాజేంద్రప్రసాద్ గార్ల నిర్మాణంలో తీసిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు సినీ ప్రపంచానికి కొత్త ఒరవడిని సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రీ ముఖ్య పాత్రలతో ప్రజలని అలరింపజేసిన చిత్రం “ఆరాధన”. బెంగాళీ చిత్రమైన “సాగరిక” ఈ చిత్రానికి మాతృక. ప్రేమ, త్యాగం, సంగీతం వెరసి “ఆరాధన”. సహాయ పాత్రలలో రేలంగి, గిరిజ, జగ్గయ్య, గుమ్మడి, రమణా రెడ్డి, రాజశ్రీ లు చాలా బాగా నటించారు (బాగా నటించటం అనేది ఒక ప్రామాణికమైన వాక్యంగా కాక కేవలం ఓ అభిప్రాయ వాక్యంగా తీసుకోగలరు).సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తి కరమైన సంగతులు,

1. ప్రేమకీ, త్యాగానికీ ఉన్న సంబంధాన్ని ప్రధానంగా ప్రదర్శించిన ఈ చిత్రంలో కథానాయకుడు,నాయికల మధ్యన ఒకే ఒక్క పాట చిత్రంపబడింది అది కూడా యుగళ గీతం కాదు (వారివురూ కేవలం నటించారు ఈ పాటలో).

2. చిత్రించిన యుగళ గీతాలలో రెండు (ఇంగ్లీషులో మ్యారేజీ, ఓహోహొ మామయ్యా)రేలంగి, మరియూ గిరిజ గార్ల మీద చిత్రించినవే (ఇది అప్పట్లోని సినిమా వర్గాలని ఆశ్చర్యపరిచింది)

3. చాలా పేరుపొందిన “నా హృదయంలో నిదురించే చెలి”(గానం:ఘంటసాల) పాటని “శ్రీ శ్రీ” గారు వ్రాయటం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించిదట.

4. “నా హృదయంలో నిదురించే చెలి” పాటను అక్కినేనిగారి సోలోగా చిత్రీకరించారు. ఇందులో ఆయన పియానో వాయిస్తూ కనిపిస్తారు, పాట మొదట్లో పియానో వాయిస్తున్నట్టుగా చూపించిన చేతి వేళ్ళు ఈ సినిమా సంగీత దర్శకులైన సాలూరి రాజేశ్వర్రావు గారి తనయుడు, రామలింగేశ్వర్రావుగారివి. ఈ రకంగా తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి సారిగా “చేతి వేళ్ళకి డూపు”ని ఈ చిత్రంలో వాడటం జరిగింది.ఈ పాటకి మాతృక* కూడా బెంగాలి సినిమా “సాగరిక” లోనిదే.

(*మాతృక అని అనటం ఎంతవర్కూ సమంజసమో తెలియదు, ఈ పాట బాణీ బెంగాలి చిత్రంలోనిదే, పాట భావం కూడా ఆ భాషలోనుండి తీశారా అనే విషయం ఎవరైనా బెంగాలి తెలిసిన వారు చెప్తే బాగుంటుంది)

ఈ సినీకథను వివరించటానికి నేను ప్రయత్నించను ఎందుకంటె ఇది ఆపాత మధురాలలో ఒకటిగా పేరున్నది కనుక సామాన్యంగా చాలా మందికి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను.

నాకు ఈ సినిమాలోని మూడు పాటలు బాగా ఇష్టం. నా హృదయంలో నిదురించే చెలి, ఆడదాని ఓరచూపుతో, ఇంగ్లీషులోన మ్యారేజీ. “ఇంగ్లీషులోన మ్యారేజీ” పాటాలోని పదాలు చాలా సరదాగా ఉంటాయి. ఈ పాటని రేలంగి, గిరిజ గార్ల మధ్య చిత్రింపబడిన యుగళ/నవ్వుల/సరదా గీతం. ఆరుద్రగారి రచన, ఘంటసాల మరియూ జానకిల గాత్రంలో సాగే ఈ సరదా గీతాన్ని చూడండి.

పల్లవి:

ఇంగ్లీషులోన మ్యారేజీ హిందీలొ అర్ధము షాదీ
యే భాషలో ఎమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చరణం:

ప్రెమించుకున్న పెళ్ళిలోనె హాయి ఉందోయి
పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్
జరిగాక మనకూ పెళ్ళి పోదాములే న్యూ ఢిల్లీ
ఆ మాటకే నా గుండెలో గెంతేను తుళ్ళి తుళ్ళి

న్యూ ఢెల్లి నుండి సింగపూరు వెళ్ళిపోదాము
న్యుయార్కులోన డాన్స్ చేస్తూ ఉండిపోదాము
కోశావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు
రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు

||ఇంగ్లీషు||

పొంగేను సోడాగాసులాగా నేడు నీ మనసు
మా నాన్న ముఖము చూడాగానే నువ్వు సైలెన్సు
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు
నీ మాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు

చిన్నప్పుడు ఎన్ని సార్లు ఈ పాట విన్నా, ఈ మధ్య కాలంలో వింటుంటె ఆ కాలంలో ఇలా ఇంగ్లీషు పదాలూ, ప్రాంతాల పేర్లతో అంత సులువుగా పాట కట్టేవారా అని ఆశ్చర్యమేస్తుంది. సాహిత్య పరంగా దీనిని కవిత్వమనాలో లేక పదాల వాడుక అనాలో నాకు తెలియదు. కానీ జనరంజకంగా ఉంది అని అనటం మాత్రం సరైనదే.

ఒహోహొ మామయ్యా(రచన: ఆరుద్ర,గానం:ఘంటసాల, జానకి) అనే ఇంకో పాటను జూ పార్కులో చిత్రీకరించారు, (ఇలాంటి సినిమా పాటలో రెండు మూడు ఉంటె భవిష్యత్తులో మనం పిల్లలకి అంతరించిపోతున్న/పోయిన జీవజాలంలోని కొన్నింటిని చూపించొచ్చు).

ఆడదాని ఓరచూపుతో(రచన:ఆరుద్ర, గానం: జానకి) అనే పెప్పీ నంబరు అప్పటికీ ఇప్పటికీ ఎంతో పేరున్న పాట. ఈ పాటలోని సాహిత్యం తరువాతి తరాలలో ఎంతో మంది కవులకి మంచి మార్గదర్శకంగా నిలిచింది.

ఇవికాక “నీ చెలిమి నేడే కోరితిని” (రచన: ఆచార్య ఆత్రేయ, గానం:సుశీల),”ఏమంటావ్ ఏమంటావోయ్ బావ” (రచన:ఆత్రేయ, గానం:స్వర్ణలత,పిటాపురం),”వెన్నెలలోని వికాశమే” (రచన:ఆత్రేయ, గానం:సుశీల)కూడా జనాన్ని అలరించాయి.

ఈ పాటలన్నీ దృశ్య రూపంలో యూట్యూబ్లో “TeluguOldsGold” అనే చానెల్ లో పొందుపరిచారు. చూడగలరు. ఆ వీడియోలలో పైన నా పేరు ఉన్నా ఆ పాటలకీ నాకూ ఎటువంటి సంబంధమూ లేదు 🙂 ఆ ఫలానా సతీష్ గారికి నా అభినందనలు,మంగిడీలు.

–సతీష్ కుమార్ కొత్త

9 Comments
 1. G October 26, 2009 /
 2. MBS Prasad October 27, 2009 /
  • సతీష్ కుమార్ కొత్త October 27, 2009 /
 3. MBS fan October 27, 2009 /
 4. MBS Prasad October 28, 2009 /
  • సతీష్ కుమార్ కొత్త October 28, 2009 /
  • సతీష్ కుమార్ కొత్త October 28, 2009 /
 5. MBS PRASAD November 2, 2009 /
 6. శ్యామ్ ప్రసాద్ బెజవాడ July 31, 2010 /