Menu

Zombie – జీవమున్న శవం

 

పడమటి ఆఫ్రికాలో కొన్ని మంత్ర తంత్ర శక్తులూ నమ్మకాలకి సంభందించిన పదం జోంబీ ..దాని అర్థం ‘బ్రతికిన శవం’. శవానికి  తంత్ర విద్య ద్వారా ప్రాణంపోస్తే  జోంబీ అంటారు. అలా బతికించి దాన్ని ఒక బానిసగా వాడుకుంటారట.అయితే అవి మామూలు మనుషుల్లా ఉండక నడవలేక నడుస్తూ వింతగా ఉంటాయి.  మైకెల్ జాక్సన్ థ్రిల్లర్ లో స్మశానంలోంచి లేచొచ్చిన శవాలమీద చిత్రీకరించిన పాట ఎంత గొప్ప హిట్టో మనకి తెలిసిందే.   ఆ చరిత్ర అటుంచితే..  పాశ్చ్యాత్యులు  ఎక్కడెక్కడి నమ్మకాలనీ..వాటికి సంభందించిన విషయాలతో పాత్రలూ కథలూ సృష్టించి  సినిమాలుగా తీయటం, ఓ జోనర్ గా అలాంటి సినిమాని అలా బతికించుకుంటూ రావటం అనేది మొదటినుండీ జరుగుతూనే ఉన్నది. సూపర్మాన్..కౌబాయ్..జేమ్స్బాండ్ లాంటివన్నీ అలా సృష్టించబడి బతుకుతున్నవే.  ఈ మధ్య కాలంలో  ఈ జోంబీ సినిమాలు చూడటం వల్ల  ఇదేదో కొత్త తరహా  సినిమా అనుకున్నా.. కానీ కొంచం వెతికితే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే….

1932 లోనే  ‘వైట్ జోంబీ’  అనే సినిమా వచ్చింది అటు మీద ఓంగా ..రివోల్ట్ ఆఫ్ జోంబీస్..ఇలా  వరుసగా యూ ఎస్ నుండి సినిమాలు వచ్చాయి. ఈ జోనర్ వివిధ దేశాలకి పాకి అడపా దడపా ఇటలీ..స్పెయిన్..మెక్సికో .యూకే మొదలైన దేశాల వాళ్లంతా  జోంబీ సినిమాలు తీసారు.  ఇటీవల ఇన్నాళ్లకి మన వాళ్ళు కూడా ‘గొ గో గోవా’ అనే ఒక సినిమాని తీయగలిగారు. ఇప్పటిదాకా దాదాపు మూడువందల యాభై సినిమాలు వచ్చాయి.   ఈ  లింకు లో  ఏయే సంవత్సరం ఏ సినిమా వచ్చిందో తెలుసుకోవచ్చు.
ఏదో వింతవ్యాది సోకిన మనిషి  ( జోంబీ)  మిగతా జనాన్ని కొరికేయటం..క్షణాల్లో వాళ్ళు కూడా ఆ వ్యాధిబారిన పడి,  వ్యాది లేనివాళ్ళమీదకి ఎగబడటం, అలా అందరూ జోంబీలవుతుంటే  హీరో తనవాళ్ళను వాళ్లబారినుండి రక్షించుకోవటం ఈ తరహా సినిమాలో  ప్రధానఅంశం గా ఉంటుంది. ’28 డేస్ లాటర్’ అనే సినిమా నేను చూసిన మొదటి జోంబీ సినిమా..అంతకుముందేమన్న చూసినా జోంబీ అనే పదం ఆ సినిమాతో పరిచయం అన్నమాట.  అది మొదలు  ఎక్కడేమీ తోచకుంటే  ఈ జోంబీ సినిమా చూడటం అలవాటయ్యింది. అన్ని జోంబీ సినిమాల్లో    ప్రధాన అంశం ఒకేలా ఉన్నప్పటీకీ  ఎంతో కొంత కొత్తదనమూ .. ఉత్సుకత..పట్టు ఉంటుంది ఈ సినిమాల్లో, కనక అలా చూస్తుండిపోతాం. సినిమాల్లో అవనీ..కథల్లోగానీ..లేదా నిజజీవితంలో అవనీ బ్రతుకు పోరాటం..హింస…సెక్స్  అనేవి  ఆకర్షక అంశాలు మనిషికి. ఎటువంటి విపత్కర పరిస్థితులనీ ఎదిరించి నిలిచి  బ్రతికితీరటం అన్నది బ్రతుకుపోరాటం.మనిషికి అలా  బ్రతుకుమీద నమ్మకాన్ని కలిగించే సినిమాలు చాలా స్పూర్తిదాయకంగా ఉంటాయి. అందుకే వాటికి గొప్ప అవార్డులు కూడా వస్తూంటాయ్.

ఈ జోంబీ సినిమాల్లో  ‘బ్రతుకుపోరాటం ఉండటం ఉండటం చేత ఆసక్తిగానూ ఆకర్షకంగానూ  అనిపిస్తాయేమో. దానికి తోడు భయం..సస్పెన్స్ ఉండనే ఉంటుంది. కొన్ని కామిడీ సినిమాలూ..కామిడీగా అనిపించే జోంబీ సినిమాలు కూడా ఉన్నాయనుకోండి.  🙂 . చాలావరకు ఈ  సినిమాల్లో జోంబీలనుంచి తప్పించుకొని సురక్షితప్రాంతాలకి వెళ్ళటం ముగింపయితే… మరో సినిమాల్లో సురక్షితం అనుకున్న ప్రాంతం నిండా జోంబీలు దర్శనమివ్వటంతో ముగింపు అవుతంది. విల్ స్మిత్ నటించిన అయాం లెజెండ్లోనూ..నిన్నామొన్నటి వరల్డ్ వార్ జెడ్ లొనూ ఆ జబ్బుకి వాక్సిన్ కనిపెట్టటంతో ముగుస్తుంది. వీటికి భిన్నంగా వార్మ్ బాడీస్ అనే సినిమా .. జోంబీ రొమాన్స్ సినిమా .  ఓ జోంబీ ప్రపంచంలో ని జోంబీ హీరో హీరోఇన్ ని చూస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. ఇహ ఆమెని తోడి జోంబీల బారిన పడకుండా కాపాడుతూంటాడు.   ప్రేమ అనేది ఒక మందులా పనిచేసి చివరికి అతను మనిషిగా మారటంతో కథ ముగుస్తుంది.

అయితే ఈ జోంబీ కథలకి మూలం ఏమై ఉండొచ్చూ ?

మత పరంగా

ఏదో ఒక నాటికి ఈ మానవజాతి అంతం అవుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం ప్రబలి ఉన్నది.
” పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ-సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే..
హిందూధర్మం  ప్రకారం నాలుగు యుగాల్లో  కలియుగం చివరిది. ప్రపంచమంతా  అధర్మం ప్రబలినపుడు అవతార పురుషుడు కలి ఉద్బవించి  ‘కలియుగాంతం’ చేస్తాడనీ..మళ్ళీ సధర్మ యుగమైన సత్యయుగం మొదలవుతుందనీ  నమ్మకం.
అలాగే లోకంలో ధర్మ మన్నది నశించి మానవజాతి అంతమొంది మళ్ళీ మైత్రేయుడు అవతరిస్తాడనీ బుద్దిజం చెపుతుంది.

థ బుక్ ఆఫ్ రివిలేషన్ లో చెప్పబడినట్టు ‘అపాకలిప్స్’ జరిగి మానవజాతి అంతమొందుతుందనీ కైస్తవమతంలో చెప్పబడింది.  మనుషుల్లో విలువలు నశించి పుచ్చిపోయిన మెదళ్లతో  విపరీతమైన   ప్రవర్తనకలిగిన నాడు  Yawm ad-Dīn వస్తుందనీ ఆనాడు చెడు నశింపబడి మంచి మాత్రం బతుకుతుందనీ ఇస్లాం మతస్తులు విశ్వసిస్తున్నారు.

ఏదో ఒకనాటికి ఈ ప్రపంచం నాశనమవుతుంది. తిరిగి కొత్త ప్రపంచం సృష్టించబడుతుంది  అనే మతపరమయిన నమ్మకాలు.. మత గ్రంధాలలోని రాతలు ఈ జోంబీ సినిమాకి ఒక స్పూర్తి అనుకోవచ్చు.

మానవతా విలువల పరంగా

చెడు ఎప్పుడూ మంచిని నాశనం చేయటానికి చూస్తుంది. మంచి ఎప్పుడూ చెడు నించి రక్షించుకోవాలని ప్రయత్నిస్తుంది.  కమ్యూనికేషన్ విప్లవం కారణంగా.. ప్రపంచమంతా ఒక గ్రామంగా మారుతున్నాకొద్దీ మనిషి వ్యక్తిగతంగా కుచించుకు పోతున్నాడు.. ఎక్కడ ఏమూల ఏమి జరిగినా క్షణాల్లో ప్రపంచంలోని ప్రతిమూలకీ తెలిసిపోతూ ఉన్నది. మంచి కంటే చెడు విపరీతంగా వ్యాప్తి చెందుతూ మనిషి విషమవుతున్నాడు.  ప్రపంచంలో అధర్మంపెరిగి..మానవీయ విలువలైన్ ప్రేమ..స్నేహం..కారుణ్యం నశించి డబ్బు సుఖమే పరమావధిగా  తను నీచానికి దిగజారి మనిషిలా కాక  చచ్చిన మనిషిలా శవం/ జోంబీ లాగా బ్రతుతుకున్నాడు.  మనం చెడి ఎదుటివాడిని చెడగొట్టటం..మనం లంచగొండులమై అందరినీ లంచగొండులుగా మార్చటం..చివరికి మనిషి అన్నవాడు మిగలక మానవజాతి శవాలుగా బ్రతుకుతారు  అని చెప్పటమే  జోంబీ సినిమా కథలు అనుకోవచ్చు.

వైద్యశాస్త్ర పరంగా

వ్యాధుల్లో కొన్ని అంటువ్యాధులు ఉన్నాయి.  ప్రపంచాన్ని గడగడలాడించిన ప్లేగు..మసూచీ లాంటి ఎన్నో మహమ్మారులకి  వాక్సిన్ కనుగొన్నారు. మరెన్నో వ్యాధులకి చికిత్సలు కనుకొంటున్నారు. చాలా ఏళ్ళుగా  మనుషులని భయపెడుతున్న వ్యాది  ఎయిడ్స్. ఇది రాకుండా ముందు జాగ్రత్తలు తప్ప దీనికి చికిత్స లేదు. చికెన్ గున్యా..డెంగ్యూ వ్యాదులు మొన్నటిదాకా భయపెట్టాయి మనని.  బర్డ్ ఫ్లూ, ఆంత్రాక్స్ లాంటివి ప్రపంచదేశాలని అప్రమత్తం చేశాయి.

ప్రస్తుతకాలంలో ఎటునించి ఏ వ్యాది పొంచి వస్తుందో తెలుసుకోలేని పరిస్థితి.  మనుషుల విపరీత ప్రవర్థనవల్లో  మరి దేనివల్లనైతేనేమి.. ఒక భయంకర అంటువ్యాధి ప్రబలి అదేమిటో…ఏందుకొచ్చిందో..ఎందుకొస్తుందో…చికిత్స ఏమిటో.. ఆపటం ఎలాగో  కనుగొనే లోపే ఆ విశ్వమారి   ప్రపంచవ్యాప్తంగా ప్రబలి పోతే అన్న ఆలోచన ఈ జోంబీ మూవీకి ఓ ఆధారం  కావచ్చు.
ప్రతి జోంబీ సినిమాలోనూ ఈ మూడు విషయాలు కలగలిసి అంతర్లీనంగా ఉంటూ ఉంటాయి. ఒక్కోదానిలో ఒక్కో ప్రస్తావన అధికంగా ఉండవచ్చు. అసలే లేక పోవచ్చు.

మూవీ మేకింగ్

1) అయితే ఈ జోంబీ సినిమాలు తీయటం అంత సులువుకాదు. వందలూ వేలకొదీ జూనియర్ ఆర్టిస్టులు జోంబీలుగా నటించాలి. దానికితోడు ప్రతి ఒక్కరికీ జోంబీలుగా మేకప్ అవసరం.కనపడే ప్రతి మొహమూ జోంబీలుగా భిన్నమైన వేషాలు కలిగి ఉండాలి.
2)  చాల సినిమాల్లో అతలాకుతలం అయిన  పెద్ద పెద్ద పట్టణాల్లో నరమానవుడూ..పిట్టపురుగూ లేనట్టుగా చూపిస్తారు లేదా ఆయా ప్రదేశాల నిండా జోంబీలే నిండిపోయినట్టు గా చూపించాలి. ఇది భారీ సెట్టింగుద్వారా కానీ గొప్ప విజువల్ ఎఫెక్ట్ వల్లగానీ సాధ్యపడదు. అయాం లెజెండ్ సినిమా శూటింగ్ కోసం న్యూ యార్క్ లో కొన్ని వీధులు మూసివేశారట, దాంటో  ప్రజలు  ఇబ్బందితో  అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆ సినిమా హీరో  విల్ స్మిత్ ఏమంటాడండే ” “I don’t think anyone’s going to be able to do that in New York again anytime soon. People were not happy. That’s the most middle fingers I’ve ever gotten in my career.”
3) ఇక జోంబీలు మనుషులని చంపటం..హీరో జోంబీలని చంపటం అనేది ప్రతి సినిమాలోనూ   విభిన్నంగా ఉంటుంది, ఉండాలి.  అవయవాలు తెగిపటటం.. రక్తాలు చిందటం.. మొహాలు చితికి పోవటం లాంటి హింసాత్మక భయానక స్టంట్లు అడుగడుగునా అవసరం. అవి లేకపోతే జోంబీ సినిమా ఆకట్టుకోదు.

ఇలా చెప్పుకుంటూ పోతే  తెలిసేదేమిటంటే  జోంబీ సినిమా తీయటం ఆశామాషీ కాదు.గొప్ప  సృజనాత్మాకత తో పాటు పక్కా ప్లానింగు..ఓపికా అవసరం,అన్నింటినీ మించి నమ్మకమూ అవసరం అని తెలిస్తోంది.

బాక్సాఫీస్

బాక్సాఫీసు విషయానికొస్తే ఈ జోంబీమూవీలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.కనక కొన్ని సినిమాలు డొమాస్టిక్ గా బాగా వసూలు చేస్తే కొన్ని ఓవర్ ఆల్గా బాగా వసూళ్ళు సాధీంచాయి.
జోంబీలాండ్ ఇరవై మూడు మిలియన్లతో నిర్మింపబడి ప్రపంచవ్యాప్తంగా డెబ్బై అయిదు మిలియన్లు వసూలు చేసింది. రెసిడెంట్ ఇవిల్ ఇప్పటివరకూ అయుదు భాగాలుగా చిత్రీకరింపడింది.  ప్రతిభాగమూ నిర్మాణానికి రెండింతల పైకం వసూలు చేసింది.ఆరో భాగం 2015 లో రావచ్చు. వరల్డ్ వార్ జెడ్ జోంబీ సినిమాల్లో భారీ చిత్రం. నూట ఇరవై అయిదు  మిలియన్లతో నిర్మింపబడి రెండువందల మిలియన్లు వసూలు చేసింది. అంటే ముప్పైశాతానికి పైగా. దీన్నిబట్టి నాణ్యతతో నిర్మింపబడ్డ  ఏ సినిమా అయినా బాక్సా ఫీసు వద్ద బాగానే వసూళ్లు చేశాయని అర్థమవుతోంది.

మరి తెలుగులో ??

అయిదారేళ్ళకి ఓ హారర్ సినిమా నిర్మింపబడే  తెలుగు సినిమాల్లో బాక్సాఫీస్ పరంగా విజయం సాధించినవి బహుతక్కువ ( ? ). మనమింకా సినిమాని..దాని జానర్లనీ ఇంకా గుర్తించలేదు..గుర్తించినా తీయగల సమర్థతా..తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకమూ కరువే. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు జోంబీ సినిమా  ప్రశ్నార్థకమే.  అతి రద్దీగా ఉండే  చార్మీనారు.. పాతబస్తీలు.. హైటెక్ సిటీ .. ట్రాఫిక్ జాం అయ్యే ప్రతి ప్రదేశాన్నీ అతి నిర్మానుష్యంగా చూపిస్తు ఓ జోంబీ సినిమా చూడాలని  నా కోరిక.  😉

ముగింపు

ఏమో  ప్రస్తుత ప్రపంచాన్ని చూస్తుంటే  జోంబీ సినిమాల్లో చూపించినట్టు.. నిజంగానే మనుషులంతా  జోంబీలుగా తయ్యారయ్యి ఒకరినొకరు పీక్కుతింటారేమే, యుగాంతం సంభవించబోతోందేమో  అనే భావనకలుగుతుంటూంది.  ;P. అతిగా జోంబీ సినిమాలు చూస్తే ఇలా విపరీత భావనలే కలుగుతాయంటారా ?? ఏమో..!! 😀

జోంబీ సినిమా వర్దిల్లాలి…. జై జోంబీ..!! 😀

3 Comments
  1. సుజాత December 21, 2013 /
  2. Jayashree Naidu December 23, 2013 /
  3. Kiran Rising July 21, 2014 /