Menu

Welcome

వృత్తానికి ఒక్క కేంద్రమే అయినట్లు అతని బ్రతుక్కి ఆమె ఒక్కటే లక్ష్యం.

ఒన్…టూ…థ్రీ!

మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి కుడి వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి.

ఒన్…టూ…థ్రీ!

మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి ఎడమ వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఇలా చేస్తున్నంత సేపు, నీళ్లలో కాళ్ళాడిస్తూ, చేతులను కిందకి పైకి ఆడిస్తూ నీటిలో ముందుకు పోవాలి.

తన గురువు చెప్పిన పాఠాన్ని తూచాతప్పకుండా పాటిస్తూ నీటిలో ఈత కొడుతున్నాడు అతను. ఎంత సేపలా ఈదుతున్నాడో తెలియదు. ఇంకా ఎంత సేపట్లో అతను గమ్యం చేరుకుంటాడో కూడా తెలియదు. కానీ పట్టువీడని విశ్వాసంతో అతను ముందుకు కదుల్తున్నాడు.

అతని లక్ష్యం ఒక్కటే! అవతలి ఒడ్డుకు చేరుకోవాలి; మీనా ని చూడాలి. ఒక్కసారి ఆమె ను చూసే అవకాశం కలిగితే చాలు. ఆమె మృదు మధుర నేత్రాల్లో నుంచే సమస్త జీవితాన్ని సాక్షాత్కరింపచేయాలి. అందుకే అలుపెరగకుండా ఈదుతూనే ఉన్నాడు. ఆమె కోసం, ఆమె ప్రేమ కోసం ఈ ప్రవాహమేంటి? ఉప్పెనల నడిచి, సంద్రాల గడచి, కెరటాల నణచి, పెనుతుఫాన్లను సైతం సైచి, వేచిన దూరం కరిగించగలడతను. అతని పేరు బిలాల్.

*****

ఫ్రాన్స్ దేశంలోని కలే పట్టణం. దేశంలోని ఓడరేవుల్లో ఒకటి ఈ పట్టణంలోనే ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ కి ఎగుమతయ్యే సరుకులు ఈ ఓడరేవు ద్వారానే ఎక్కువగా రవాణా అవుతుంటాయి. అందుకే కాబోలు, ఇరాక్, అఫ్గనిస్తాన్ లాంటి దేశాలనుంచి ఇంగ్లాండ్ కి అక్రమంగా చేరాలనుకునే శరణార్థులు ఆఫ్రికా గుండా మొదట ఫ్రాన్స్ దేశంలోకి అడుగు పెడ్తారు. అక్కడ్నుంచి కలే పట్టణానికి చేరుకుని ఓడల్లో ప్రయాణిస్తూ అక్రమంగా ఇంగ్లాండ్ చేరుకుంటుంటారు.

అలా చేరిన వేల మంది యువకుల్లో ఒకడు బిలాల్. వయసు పదిహేడు సంవత్సరాలు. ఇరాక్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లాలనే ఆశతో కలే పట్టణానికి చేరుకున్నాడు. ఎన్నో కష్టాలకోర్చి అక్కడి వరకైతే రాగలిగాడు కానీ అక్కడ్నుంచి ఇంగ్లాండ్ ఎలా చేరుకోవాలో అతనికి అర్థం కాలేదు. కానీ అదృష్టవశాత్తూ అతనికి జొరాన్ కనిపించాడు.

welcome-2
జొరాన్ తన ఊరి వాడే! మొదట్లో అతన్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. ఊరిలో అందరూ జొరాన్ లండన్ లో ఉన్నాడని, అక్కడో ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ నిజం అది కాదు. జొరాన్ గత కొన్ని నెలలుగా కలే పట్టణంలోనే ఉన్నాడు. ఇంగ్లాండ్ వెళ్ళాలన్న అతని పథకాలేవీ ఫలించలేదని, సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు జొరాన్.

బిలాల్ తో కలిసి ఇంగ్లాండ్ కి వెళ్లే ప్లాన్ వేశాడు జొరాన్. ఇంగ్లాండ్ కి ఓడలో వెళ్లే కంటైనర్ లో దాక్కుని ప్రయాణించాలనేది వాళ్ల ప్లాన్. ఇందుకోసం ఒక్కొక్కరు ఐదొందల యూరోలు చెల్లించాలి. బిలాల్ దగ్గర డబ్బులైతే ఉన్నాయి కానీ ఎందుకో ఈ ప్లాన్ నచ్చలేదు. ట్రైన్ లో వెళ్లడం మేలని లేదా పడవ దొంగతనం చేసి దాని ద్వారా ఇంగ్లీష్ ఛానెల్ ద్వారా ఇంగ్లాండ్ చేరొచ్చు అంటాడు బిలాల్. అదంత సులభం కాదని, ప్రతి చోటా పోలీసులు తనిఖీ ఉంటుందని, ఎక్కడో దగ్గర దొరికిపోతామనీ అంటాడు జొరాన్. కొత్తగా వచ్చి కొత్త పథకాల గురించి చెప్తున్న బిలాల్ మీద చిరాకు పడతారు తోటివారు.చివరికి జొరాన్ చెప్పిన ప్లాన్ కి ఒప్పుకుంటాడు బిలాల్. కానీ బిలాల్ అనుమానమే నిజమయింది. చివరి నిమిషంలో పోలీసులకి దొరికిపోయారు వాళ్లంతా!

*****

ఇరాక్ లో ఉన్న పరిస్థుతుల దృష్ట్యా బిలాల్ ని తిరిగి అతని దేశానికి పంపించడం లేదనీ కాకపోతే ఇంగ్లాండ్ వెళ్లే ఆలోచన మాత్రం మానుకోమని చెప్పాడు కోర్ట్ లో న్యాయమూర్తి.

ఎవరెన్ని చెప్పినా బిలాల్ వినే స్థితిలో లేడు. తన మీనాతో గడిపిన గతపు తాలూకు జ్ఞాపకాలేవో అతన్ని రారమ్మని పిలుస్తున్నాయి. ఎదను తాకిన చినుకులేవో తమ ప్రేమ స్మృతులను కొత్తగా మొలకెత్తించాయి. కానీ మీనా కి లండన్ లో ఆమె తండ్రి మరొకరితో పెళ్లి చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలిసి అతని చిట్టిమనసుల మంటలేవో చిచ్చురేపాయి. అంతే వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. నగరంలో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ కి చేరుకున్నాడు. అక్కడే అతనికి పరిచయం అయ్యాడు సిమోన్.

welcome-3
అక్కడ స్విమ్మింగ్ పూల్ లో కోచ్ గా పనిచేసే సిమోన్ వద్ద ఈత కొట్టడం నేర్చుకోనారంభిస్తాడు బిలాల్. మొదట్లో అయిష్టంగానే నేర్పించినా రాను, రాని బిలాల్ తో మంచి స్నేహం ఏర్పడుతుంది సిమోన్ కి. తనకు చేతనైనంతలో బిలాల్ కి సహాయం చెయ్యాలనుకున్నాడు సిమోన్. కానీ అతని సమస్యలు అతనికి ఉన్నాయి.

ఒకవైపు, తన చుట్టుపక్కల వాళ్ళు బిలాల్ కి సహాయం చేస్తున్న విషయం గురించి పోలీసులకి చెప్తామని బెదిరించారు. మొత్తం సైన్యాన్ని తీసుకొచ్చిన తనకు భయం లేదంటూ బిలాల్ తో ఎప్పటిలానే ఉన్నాడు. కానీ పోలీసులు రానే వచ్చారు. శరణార్థులకు సహాయం చేస్తున్న ఆరోపణలు చేశారు. కానీ సిమోన్ తొణకలేదు. అసలు ఇవన్నీ అతనికి పెద్ద సమస్యే కాదు. అతని సమస్యల్లా అతనే! విడాకుల కోసం అతని భార్య కోర్టును ఆశ్రయించింది. సిమోన్ కూడా అందుకు సమ్మతమే అన్నట్టు తలూపాడు. కానీ ఆమె దూరమవుతుందని తెలిసినప్పటినుంచీ అతన్ని ఒంటరితనం వెంటాడుతోంది.

ఈ సమయంలో ఈత నేర్పించమని పరిచయం అయిన బిలాల్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ప్రేమ కి దూరమైన తనకి, ప్రేమ కోసం ఎంతకైనా తెగించిన బిలాల్ గురించి మరింత ఆసక్తి పెరిగింది.

కీలక సన్నివేశం

welcome-4

 

 

 

 

 

సిమోన్ కి విడాకులు మంజూరవుతుంది. తన మాజీ భార్య తో కలిసి ఒక హోటల్ కి వెళ్తాడు సిమోన్. అక్కడ ఆమె బిలాల్ గురించి అడుగుతుంది. ఇరాక్ నుంచి మూడు నెలలపాటు ఎండనకా, వాననకా ప్రయాణం చేసి ఫ్రాన్స్ కి బిలాల్ చేరుకున్న విషయాన్ని ఆమె కి చెప్తాడు.

“టర్కీ లో సైనికులకు పట్టుబడినప్పుడు ఎనిమిది రోజులపాటు నరకయాతన, అల్బేనియాలో ఒక లారీకింద వేలాడుతూ వందల కిలోమీటర్లు ప్రయాణం, ఫ్రాన్స్ లో ఒక కంటైనర్ లో వెళ్తూ పోలీసులకి దొరికిపోవడం, ఇప్పుడు ఈత నేర్చుకుని ఇంగ్లీష్ చానెల్ గుండా ఈత కొడ్తూ వెళ్లాలనుకోవడం – ఇవన్నీ బిలాల్ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ప్రేమ కోసం.” అని సిమోన్ చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోతుంది.

“తను ప్రేమించిన అమ్మాయు కోసం ఇన్ని కష్టనష్టాలనుభవించి ఎన్నో వేల కిలోమీటర్ల దూరాన్ని దాటి వచ్చాడు బిలాల్. విడాకుల పేరుతో విడిపోతున్న నిన్ను తిరిగి సాధించడానికి నేను కనీసం రోడ్ కూడా దాటలేదు” అని చెప్పి బాధపడతాడు. ఓ క్షణం పాటు ఆమె కూడా ప్రేమ యొక్క గొప్పతనాన్ని తలచుకుంటుంది. ఒకపుడు తామిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. కానీ ఏం లాభం అప్పటికే వారిద్దరూ తిరిగి చేరుకోలేనంత దూరాలకు తరలిపోయారని వాళ్లకి తెలుసు.

చివరికి శరణార్థుల విషయంలో ఏ మాత్రం తలదూర్చకూడదని స్వయంగా చెప్పిన తనే ఇప్పుడు ఎందుకు బిలాల్ కి సహాయపడుతున్నాడని అడుగుతుంది ఆమె.

ఆమె వెళ్లిపోవడంతో వ్యర్థమైన తన జీవితానికో కొత్త అర్థం వెతుక్కోవాలనుకుంటాడు సిమోన్. బిలాల్ కి ఈత నేర్పించినట్టే, మరి కొంతమంది శరణార్థులకూ స్విమ్మింగ్ నేర్పించి ఇక్కడ్నుంచి బయటపడేలా చేస్తానంటాడు.

*****

శరణార్థుల విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవరిస్తుంది. తన కారణంగా సిమోన్ చాలా కష్టాలు అనుభవిస్తున్నాడని బిలాల్ కి తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే లండన్ లో మీనా కి వేరొకరితో పెళ్లి అయిపోవడమే కాక, తనని తిరిగి ఇరాక్ పంపివేస్తారన్న భయం పుట్టుకుంటుంది బిలాల్ కి.

ఏది ఏమైనా తను లండన్ వెళ్లితీరాలనుకుంటాడు. సిమోన్ ఇచ్చిన స్విమ్మింగ్ దుస్తులు ధరించి నీళ్లలోకి దూకేస్తాడు. సిమోన్ చెప్పిన స్విమ్మింగ్ పాటాలు నెమరువేసుకుంటూ ఈత కొడ్తుంటాడు. ఈ విషయం తెలిసిపోయిన సిమోన్ భయపడ్తాడు. ఇంగ్లీష్ ఛానెల్ దాటడం గజఈతగాళ్లకే సాధ్యం కాదని అతనికి తెలుసు. అందుకే వెంటనే పోలీసులకు విషయం చెప్తాడు. అతన్ని కాపాడమని వేడుకుంటాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించవు.

బిలాల్ ధైర్యంగా ఈదుతూనే ఉంటాడు. మరొక కిలోమీటర్ దూరం ఈదితే అతను ఇంగ్లండ్ తీరానికి చేరుకుంటాడు. కానీ ఈ లోగా ఇంగ్లడ్ పోలీసులు అతన్ని చూస్తారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. వారి నుండి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తాడు బిలాల్.

బిలాల్ ని తిరిగి ఫ్రాన్స్ కి పంపిస్తారు ఇంగ్లండ్ పోలీసులు. కానీ అతన్ని కాదు; ప్రేమ కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయక మరణించిన అతని భౌతిక కాయాన్ని. బిలాల్ ని తన కొడుకుగా స్వీకరించి అంత్యక్రియలు జరిపిస్తాడు సిమోన్. ఆ తర్వాత అతను లండన్ వెళ్లి మీనా ని కలుస్తాడు. జరిగిందంతా ఆమె కి చెప్తాడు. అంతా తెలుసుకున్న మీనా కన్నీరు మున్నీరు గా రోదిస్తుంది.

సిమోన్ దిగులుగా ఫ్రాన్స్ కి తిరుగుముఖం పడ్తాడు. వస్తుండగా మధ్యలో ఒక దగ్గర టివిలో వస్తున్న ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తాడు. లండన్ చేరుకుని మీనా ని పెళ్లి చేసుకుని పెద్ద ఫుట్ బాల్ ఆటగాడినవుతానని బిలాల్ చెప్పిన సంగతులు గుర్తుకు రావడంతో సిమోన్ కి దుఖం ముంచుకు రావడంతో సినిమా ముగుస్తుంది.

కథ ముగిసినా బిలాల్ ప్రేమ మాత్రం ఎప్పటికీ అంతం కాదు. అతను మరణించినా అతని ప్రేమ కథ మాత్రం ఎందరో మనసుల్లో సజీవంగానే ఉంటుంది. అందుకే అంటారు, ప్రేమకు చావు బ్రతుకుల తేడా లేదని.