Menu

The Hobbit – Desolation of Smaug

1. సీ. మొదటి భాగము మెండు ముచ్చట కల్పించె, హాబిట్టు కథజూడ నబ్బురమ్ము
కథకు నాయువుపట్లు కదలివచ్చిరి షైరు, గాండాల్ఫె వెనుదన్ను కారణమ్ము
బిల్బోను జతచేర పిలువవచ్చిరి వారు, సాహసయాత్రకు సత్వరమ్ము
తాతల రాజ్యము తమ ధనాగారము, కబళించె నొక్క రాకాశిబల్లి

తే. అంతమొందించి దానిని స్వంతసొమ్ము, చేత చిక్కించుకొనవలె శీఘ్రతరము
పరహితమ్ముండు పరదేశ పయనముండు, గాన మరుగుజ్జులన్ బిల్బొ కలసి సాగె

2. తే. పూర్వ రంగము కొద్దిగా పొందుపఱచి, బిల్బొ కథలోకి ఎటులొచ్చె పిసరుచెప్ప
కడగి గాండాల్ఫు థోరిన్ల కథను జూపి, క్షణము దర్శకుడు తెరపై కానబడును
(దర్శకుడు – పీటర్ జాక్సన్)

3. వ. అంతలో కథ

4. చ. పదపడి దూకు ముందుకు గభాలున, ఆర్కులు వెంబడించగా
కదలక దాగియున్న నతకాయులు కుబ్జుల మధ్యకున్ నిరా
యుధులయి డస్సినిల్చి భయమూనిన యోధులవద్దకున్, ప్రియం
వదుడయి వారి నందఱిని ప్రక్కకు పంపును మాంత్రికుండొగిన్

5. తే. కామరూపు డగు బియోర్ను కడకు చేరి, సరవి తిని త్రావి కొంత విశ్రాంతి నొంద
ఆయుధంబు లశ్వంబుల సాయ మంద, మిర్కువుడ్డను కానను మించిపోవ

6. వ. గాండాల్ఫు వారిని మిర్కువుడ్ బయట వదిలి పెట్టి వెళ్లపోగా, పదునాలుగు మంది ఆ కారడవిలోకి వెళతారు

7. ఉ. మాయల మిర్కువుడ్డు, క్షణమాత్రము నేమఱిపాటు గల్గినన్
త్రోయును ప్రక్కత్రోవలకు, దూరపుమూలకు క్రొత్తవారలన్,
రోయుచు ముందు కేగరి విరోధము లన్నియు మించి, మార్గమున్
బాయక నెట్టులో చనుచు బంధితులైరి ప్రమత్తచిత్తులై

8. వ. వారిని పట్టినవి రక్కసి సాలీళ్లు

9. సీ. రక్కసి సాలీళ్ల ప్రక్కకు త్రోసిరి, ఒకచిక్కు తొలగె వేఱొకట బడిరి
ఎల్ఫులు వారల నిరియించి కట్టిరి, కొనిపోవ వేగమే గుహలలోకి
మాయల ఉంగర మంతలో వేలికి, ధరియించి మాయమై దాగియుండి
వెనువెంట బిల్బోయు వెళ్లెను రక్షింప, మరుగుజ్జు మిత్రుల చెరలనుండి

ఆ. పొంచియుండి సమయమెంచి నెమ్మదిగాను, బిల్బొ దొంగలించె బీగములను
పెద్దవైన మందుపీపాలలోదూర్చి, ముక్తినిచ్చెను పదమువ్వురికిని

10. ద్వి. వెనువెంట బాణముల్ వేయుచు నొకరు, కనికర మెఱుగని కర్కశు లొకరు
తప్పించుకొనిపోవు దారి దుర్భరము, పిప్పి పిప్పిగమారి భీతనొందుచును

11. ఉ. కోనల పాఱు వాహినులు కొండొకసేపు భరించి రెట్టులో,
మానవు లుండు చోటికి సమాశ్రితులై చని లంచమిచ్చి రా
పైన సహాయమందుకొని బార్డను వాని గృహంబునుండి స్వ
స్థానము చేరుమార్గము విచారముచేయ కడంగి రంతలో

12. తే. ఆయుధమ్ముల కెగబ్రాకపోయి వారు, పట్టుబడి నిల్చి రా జనపాలు మో్రల
కొండలోపలి కోటలోనిండియున్న, ధనము నాశించి యారాజు కనికరించె

13. తే. కావలసిన సామాగ్రిని నావలోన, చక్కగా పెట్టి వారిని సాగనంపె
కొండకోటకు చేరినగుంపు తుదకు, కష్టములకోర్చి నిలిచి నాగమును లేపి,

14. తే. రకరకముల కష్టముల పెట్టి కసితోడ, బయటకున్ దానినెట్టులో పారద్రోలి,
తమ నివాసము తమదైన ధనము తిరిగి, చేత చిక్కించు కొన్న విశిష్టులైరి

15. వ. స్థూలముగా ఇదీ కథ. అయితే,

16. సీ. మూలకథ నరయ మున్నూరు పుటలలో, హాబిట్టు సాహసయాత్రసాగు
పరిమిత మూల మపరిమితముగ పెంచి, పీటరు జాక్సను పెద్దచేసె
టోల్కిను కథలోన టోరియల్ కనరాదు, ఊసు లేదిక లెగొలాసు గూర్చి
గిలి టోరియల్లుల గేలి పోకడలు నా, పైన ప్రేమకథలు కానరావు

ఆ. స్మాగు మాటలాడు సన్నివేశములునూ, సిసలు కథయందు నసలు లేవు
లేనిగాథలిన్ని పూనిపుట్టించిరి, హాటకమునకు మెరుగ లద్దినట్టు

17. తే. నిడివి నూటఱువది నొక్కనిమిషములని, తెరను బొమ్మలాడునపుడు తెలియలేదు
మూడవ విడత వెంటనే చూడలేక, బొమ్మ లాగినా లేచి రాబుద్ధిగాదు

18. ద్వి. తుదికథ కోసము తొందరపాటు, ఎదురు చూచెదమింక ఏడాది వఱకు.

 

—గిరిధర్ లంక

One Response
  1. Mamatha December 19, 2013 /