Menu

Midnight in Paris

నోస్టాల్జియా అంటే బాధాకరమైన వర్తమానాన్ని నిరాకరించడమేనా?

వర్షం లో ప్యారిస్ నగరం కొత్త అందాలతో మెరిసిపోతోంది. చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి ప్యారిస్ నగరానికి వచ్చాడు గిల్. అమెరికాలో అతనో సినిమా కథలు రాసే రచయిత. కానీ ఇప్పుడు అతనికి సినిమా కథల మీద ఆసక్తి పోయింది. ఒక నవల రాయాలన్నది అతని ఆలోచన. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక కూర్చోని రాయడమే మిగిలుంది. అతని కథలో హీరో ఒక నోస్టాల్జియా షాప్ లో పని చేస్తుంటాడు. నోస్టాల్జియా షాపంటే, గతకాలపు జ్ఞాపకాలను గుర్తుకుతెప్పించే వస్తువులు అమ్మే అంగడి. గిల్ అనుకున్న కథలో హీరో అచ్చు అతని లాంటి వాడే! “గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్” అని నమ్ముతూ తను సృష్టించుకున్న కాల్పనిక గత జగత్తులో బతికేస్తుంటాడు.

ప్యారిస్ లోని పార్క్ లో నడుస్తూ, ఈ చోటులోనే కదా మోనే అద్భుతమైన చిత్రాలు సృష్టించింది, ఇక్కడే కదా జేమ్స్ జోయ్స్ చైతన్య స్రవంతి లోనుండి పదాలు అలలై పొంగినది…అనుకుంటూ ప్యారిస్ మాయలో మునిగిపోతాడు. అమెరికా వదిలేసి ప్యారిస్ లో ఉండిపోదామంటే అతనికి కాబోయే భార్య ఇనెజ్ ఒప్పుకోదు.

ఆమె మనస్తత్వం గిల్ కి పూర్తిగా వ్యతిరేకం. వర్షంలో నడుస్తూ హాయిగా నగరమంతా తిరుగుదామని ఉంటుంది గిల్ కి. కానీ వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందంటుంది ఇనెజ్. అత్యంత అవసరముంటే తప్ప ప్రజల మధ్యకు రాడు గిల్. ఎప్పుడూ తన చుట్టూ జనాలుండాలనుకుంటుంది ఇనెజ్. ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్లు, వేగంగా సాగే జీవితం, పార్టీలు, ఖరీదైన దుస్తులు, డబ్బు, డబ్బు తెచ్చిపెట్టే డాబూ,దర్పం….ఇవి చాలు ఆమెకి. సంతోషంగా బతికెయ్యాలన్న తాపత్రయం ఆమెది. కానీ గిల్ బాధ వేరు. అమెరికాలోని హడావుడి జీవితం వదిలేసి, ప్యారిస్ లో ఒక చిన్న ఇల్లు కట్టుకుని కథలు రాసుకుంటూ బతికెయ్యాలని గిల్ కల. కానీ ఎప్పటికప్పుడు అది కేవలం కల మాత్రమే అని గిల్ కి గుర్తు చేస్తూ ఉంటుంది ఇనెజ్.

అమెరికాలో హడావుడి జీవితానికి దూరంగా ఉండడానికి ప్యారిస్ వస్తే అక్కడా అతనికే మాత్రం ప్రశాంతత దక్కదు. అదే సమయానికి బిజినెస్ పని మీద ప్యారిస్ వచ్చిన ఇనెజ్ తల్లిదండ్రులు, అనుకోకుండా హోటల్ లో కలిసిన ఇనెజ్ స్నేహితులు అతని ఏకాంతానికి భంగం కలిగిస్తారు. ప్యారిస్ లోనూ పార్టీలని, షికార్లనీ హడావుడి చేస్తారు. గిల్ ని తన స్నేహితులకు పరిచయం చేస్తుంది. గిల్ కి ఇష్టం లేకపోయినా వారితో కలుపుగోలుగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇనెజ్ స్నేహితుడైన పాల్ చేసే హడావుడి గిల్ కి ఏ మాత్రం నచ్చదు. అదీకాక గిల్ రాయబోయే నవల గురించి ఇనెజ్ చెప్పినపుడు గిల్ ఐడియాని చులకన చేస్తాడు పాల్.

“అసలైనా గతంలో బతకాలని ఎవరికైనా ఎందుకుంటుంది? గతం గురించి తలుచుకుంటూ గడిపే నోస్టాల్జిక్ జీవితం వృధా” అని గిల్ తో వాదనకు దిగుతాడు పాల్. “బాధాకరమైన వర్తమానాన్ని నిరాకరించడమే నోస్టాల్జియా” అని గిల్ ని పరోక్షంగా వెక్కిరిస్తాడు కూడా. అతని మాటలు పట్టించుకోడు గిల్. తను కూడా1920 ల కాలంలో పుట్టి ఉంటే ప్యారిస్ లోని సేన్ నది ఒడ్డున కెఫేల్లో రచయితలు, కళాకారుల మధ్య కూర్చుని రాసుకుంటుంటే ఆ జీవితమే వేరుగా ఉండేదన్న ఆలోచన అతన్ని వేధిస్తూ ఉంటుంది.

*****

ప్యారిస్ లో తన కాబోయే భార్య ఇనెజ్ తో కలిసి ఇష్టం లేని పార్టీలు తిరిగి అలసిపోయిన గిల్ ఒక రోజు రాత్రి ఒంటరిగా తన హోటల్ కి బయల్దేరాడు. కానీ అలోచనల్లో మునిగిపోయి నడుస్తూ దారి తప్పాడు. హోటల్ పేరైనా గుర్తుంటే ఎవర్నైనా అడిగి వెళ్లొచ్చు. కానీ అదీ అతనికి గుర్తు లేదు. తిరిగి తిరిగి అలసిపోయి అర్థరాత్రి సమయానికి ఒక బిల్డింగ్ ముందు కూలబడ్డాడు.

అప్పుడే సరిగ్గా రాత్రి పన్నెండు గంటలయినట్టుగా పైన ఉన్న గడియారం పన్నెండు గంటలు కొట్టింది. గిల్ కి ఏం చెయ్యాలో తెలియక రోడ్ మీద వెళ్తున్న వాహనాలను చూస్తుండగా అతనికెదురుగా ఒక కారు వచ్చి ఆగింది. కారు నిండా చాలా మంది కూర్చుని ఉన్నారు. గిల్ ని తమతో రమ్మని ఆహ్వానించారు. వాళ్లెవరో గిల్ కి తెలియకపోవడంతో ఎవరో అనుకుని తనని రమ్మంటున్నారని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్లు వింటే కదా!

కారు లోనుంచి ఒక వ్యక్తి దిగి గిల్ ని బలవంతంగానే కారులోకి ఎక్కించాడు. అక్కడేం జరుగుతుందో అతనికి ఏ మాత్రం అర్థం కాలేదు. లోపల కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది మగవాళ్లూ ఉన్నారు. గిల్ కి కార్ లోపలే షాంపేన్ ఇచ్చారు. బాగా తెలిసిన వాడిలాగే మాట్లాడుతూ గిల్ ని తీసుకుని ఒక క్లబ్ దగ్గరకు వచ్చారు.
అసలు వాళ్ళు ఎవరో, తనను ఎందుకు అక్కడకు తీసుకువచ్చారో గిల్ కి అర్థం కాలేదు. అయినా అతనిలో ఏ మాత్రం భయం లేకపోగా కాస్తంత ఉత్సాహం నెలకొంది. వారితో పాటే క్లబ్ లోకి నడిచాడు. లోపల చాలామంది ఉన్నారు. ఒక మూల ఒకతను పాడుతుండగా జనాలు అతని చుట్టూ మూగి ఆనంద పారవశ్యంలో మునిగిపోయి ఉన్నారు. ఆ పాట గిల్ కి బాగా తెలిసిన పాట. అంతా గమ్మత్తుగా అనిపించింది అతనికి. చూస్తుండగానే తననక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు జనాల్లో కలిసిపోయారు.

Midnight-2

ఏం చెయ్యాలో తెలియక దిక్కులు చూస్తుండగా, ఒకమ్మాయి వచ్చి పలకరించింది. తన పేరు జెల్డా ఫిజెరాల్డ్ అంటూ పరిచయం చేసుకుంది. తన భర్త స్కాట్ ఫిజెరాల్డ్ నీ గిల్ కి పరిచయం చేస్తుంది. వాళ్ల పేర్లు విని గిల్ ఆశ్చర్యపోయాడు. ఆ పేర్లు తనకు సుపరిచతం. కానీ వాళ్లని ఎప్పుడూ కలవనే లేదని తెలుసు. అతనేదో అడుగుదామనుకునే లోపలే వాళ్లు అతన్ని మరో క్లబ్ కి వెళ్దాం రమ్మని తీసుకెళ్లిపోయారు. అక్కడ మరి కొంతమంది కలిసారు. ఒకతను తన పేరు హెమింగ్వే అని చెప్పాడు. ఈ సారి మరింత ఆశ్చర్యం. క్లబ్ లో ఒక్కొక్కరినీ కలిసే కొద్దీ గిల్ మరింతగా ఆశ్చర్యపోయాడు. కాసేపటికి గిల్ కి అసలు విషయం అర్థమయింది. కానీ మొదట నమ్మబుద్ధి కాలేదు. తానెప్పుడూ కనే కల నిజమైందని మాత్రం అర్థమయింది. ఎలా జరిగిందో ఏమో తెలియదు కానీ వర్తమానం నుంచి గతం లో తనకిష్టమైన 1920 ల కాలానికి చేరుకున్నాడు అతను.

*****

ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతుంది, దానితో పాటు మనమూ మారిపోతాం. కానీ గతం గుర్తుకొచ్చినప్పుడల్లా గ్యారంటీగా “ఆ రోజులే వేరు” అనుకుంటాము. జీవితంలో ఎప్పుడోకపుడు కనీసం ఒక్కసారైనా ఆ రోజుల్లో….అని తలుచుకోని వాళ్లెవరూ ఉండరు. గతం గురించిన నోస్టాల్జియా ఎప్పుడూ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా కళాకారులకు. గిల్ పరిస్థితి కూడా ఇదే! కానీ గతం గురించి ఆలోచిస్తూ కూర్చోగలం కానీ అప్పట్లోకి వెళ్లలేము; అప్పటి జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించలేము. కానీ…ఏదో మాయ జరిగి మనం ప్రస్తుత కాలం నుంచి గతంలోకి ప్రయాణించగలిగితే? అంతకంటే మించిన అవకాశం మరొకటి ఉంటుందా? గిల్ కి సరిగ్గా ఇలాంటి అవకాశమే దొరికింది.

గిల్ తను ఆరాధించిన ఎంతో మంది రచయితలను, కళాకారులను, దర్శకులను కలుసుకుంటాడు. అతని ఆనందానికి అవధులు ఉండవు. పికాసో, బూనుయెల్, సాల్వడార్ డాలీ ఒకరేంటి? ఆ రోజుల్లోని ప్రముఖులందరితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. తను రాస్తున్న నవల గురించి వారితో చర్చిస్తాడు. తన నవల చదివి ఎలా ఉందో చెప్పమని కోరుతాడు. వాళ్లు సరే అనడంతో నవల తీసుకువద్దామని క్లబ్ లోనుంచి బయటకు వస్తాడు గిల్. బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడేమీ ఉండడు. గతం నుంచి వర్తమానంలోకి వచ్చి పడ్డాడన్న నిజం తెలుస్తుంది. మళ్లీ గతంలోకి ఎలా వెళ్లాలో తెలియక హోటల్ కి వెళ్తాడు.

తనకు జరిగిన అనుభవాన్ని ఇనెజ్ తో చెప్తాడు. ఆమె నమ్మదు. అంతా కట్టు కథ అని కొట్టిపారేస్తుంది. ఆ తర్వాత రోజు రాత్రి తను ముందు రోజు కూర్చున్న చోటుకి ఇనెజ్ తో వస్తాడు. కానీ గిల్ చెప్పినట్టు ఏమీ జరగకపోవడంతో తను పార్టీకి వెళ్తున్నానని చెప్పి చిరాగ్గా వెళ్లిపోతుంది ఇనెజ్. ఏం చెయ్యాలో తోచక గిల్ అక్కడే దిగులుగా కూర్చుని ఉండగా గడియారం పన్నెండు గంటలు కొడ్తుంది. ఇంతలో ముందు రోజు వచ్చిన కారు మళ్లీ వస్తుంది. గిల్ ని ఎక్కించుకుని మరో సారి క్లబ్ కి వెళ్తారు అందరూ.

*****
కీలక సన్నివేశం

గతకాలపు యాత్రల్లో తేలి ఉన్న గిల్, ఒక రోజు గొప్ప చిత్రకారుడిగా పేరొందిన పికాసో ని కలిసే అవకాశం వస్తుంది. అక్కడే అతనికి పికాసో స్నేహితురాలు ఆడ్రియానా కూడా పరిచయం అవుతుంది. గిల్ నవలలోని మొదటి వాక్యాలు చదవగానే అడ్రియానా అతన్ని అభిమానిస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా సేపు గడుపుతారు; మంచి స్నేహం కుదురుతుంది. రాత్రుళ్ళు హోటల్ గదికి తిరిగిరాని గిల్ మీద ఇనెజ్ కి అనుమానం వస్తుంది. కానీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంటాడు గిల్. అలా ప్రతి రోజూ గతంలోకి ప్రయాణించి ఒక వింత జీవితాన్ని అనుభవిస్తుంటాడు గిల్.

Midnight-4

రోజు రోజుకీ ఆడ్రియానా తో పరిచయం పెరుగుతుంది. తనకు తెలియకుండానే ఆడ్రియానాతో ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా అతనంటే ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్యారిస్ వీధుల్లో నడుస్తూ ఆనందంగా తిరుగుతారు. ఇనెజ్ కోసం కొన్న చెవి పోగులను ఆడ్రియానా కు బహుమతిగా ఇస్తాడు.

ఒక రోజు ఇద్దరూ ఒక ప్రదేశంలో కూర్చుని ఉండగా ఒక గుర్రపు బండి వచ్చి వారి ముందు ఆగుతుంది. రండి ఎక్కండని వారిని ఆహ్వానిస్తారు. ఇద్దరూ అనుమానంగానే గుర్రపు బండి ఎక్కుతారు. కాసేపటికి గుర్రపు బండి ప్యారిస్ లోని ఒక ప్రాంతంలో ఆగుతుంది. ఆ ప్రదేశం చూడగానే అడ్రియానా ఆశ్చర్యపోతుంది. ఆ ప్రదేశం తను కలలు కన్న 1890 ల కాలంలో లాగా ఉంటుంది. నిజానికి అది ఆ కాలమే! ఎలాగైతే గిల్ వర్తమానం నుంచి 1920 లోకి వచ్చాడో, 1920 ల నుంచి 1890 ల కాలంలోకి వాళ్లు ప్రయాణించారని తెలుసుకుంటారు.
గిల్ కి ఇదంతా గమ్మత్తుగా ఉంటుంది. అప్పటి కాలంలోని మరి కొన్ని వింతలూ విశేషాలూ చూసి ఆశ్చర్యపోతాడు. కానీ కాసేపటికి అక్కడ్నుంచి తిరిగి వెళ్దామని అడ్రియానా ని అడుగుతాడు. కానీ అడ్రియానా తనకక్కడే ఉండిపోవాలని ఉందని తిరిగి రానని అంటుంది. గిల్ ఆశ్చర్యపోతాడు. వర్తమానం మీద విరక్తి తో తను ఎలాగైతే కాల్పనిక గతంలో బతుకుతున్నాడో, అడ్రియానా కూడా గతంలోనే జీవిస్తుందని తెలుసుకుని షాక్ అవుతాడు గిల్.

గిల్ గతం అనుకున్నది అడ్రియానాకి వర్తమానం. అందుకే ఆమె తను కలలుగన్న గతాన్ని చూసే అవకాశం రాగానే ఆనందంగా వెళ్లిపోయింది.

ఒక్క ఆడియానా మాత్రమే కాదు. అప్పటి కాలంలో గిల్ కలిసిన ప్రతి వారికీ సమస్యలు, విపరీత ప్రవృత్తులు ఉన్నాయన్న విషయం తెలిసొస్తుంది గిల్ కి. తను ఊహాలోకంలో సృష్టించుకున్నంత గొప్పగా గతం లేదనుకుంటాడు. నోస్టాల్జియా అంటే గతం తాలూకు గతుకుల బాటను దూరంనుంచి చూసి నున్నగా ఉందనుకునే భ్రమ పడడమే అని తెలుసుకుంటాడు.

Midnight-3

హాయిగా బతకడమంటే గతం తాలూకు జ్ఞాపకాల్లో తలదాచుకోవడమో, భవిష్యత్తు గురించి ఆశలతో పేకమేడలు కట్టుకోవడమో కాదని అర్థమవుతుంది. మరోసారి వర్తమానం లోకి వచ్చి పడతాడు. ఇనెజ్ తో ఉన్న తన సంబంధాన్ని తెంచుకుంటాడు. సంతోషకరమైన జీవితమంటే ఇప్పుడు-ఇక్కడ బతకడమే అని తెలుసుకుంటాడు. ఆనందంగా సేన్ నది ఒడ్డున నడుస్తుండగా, అంతకుముందు పరిచయమైన గాబ్రియెలా ఎదురుపడుతుంది. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న ఆమెతో స్నేహం కుదురుతుంది. ఇంతలో వర్షం పడుతుంది. ప్యారిస్ నగరం వింత అందాలతో మెరుస్తుండగా ఇద్దరూ ఆనందంగా వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది.

One Response
  1. సుజాత December 18, 2013 /