Menu

Lucia – స్వప్నజీవితం

చిన్నప్పుడు కథలు చదివేవాళ్ళం. అందులో  ప్రతి కథకీ ఓ నీతి ఉండేది. అయితే రామాయణ భాగవతాల్లాంటి కావ్యాల్లోనూ..నవలల్లోనూ  ప్రతి చోటా నీతులు..జీవన సత్యాలూ , ప్రవచనాలూ అడుగడుగునా దర్శనమిస్తుంటాయి. సినిమా కూడా విజువల్ గా చెప్పేకథే కనక దానికీ ఓ సారాంశం ఉండాల్సిందే. దీన్నే సినిమా పరంగా మనం ఇతివృత్తం/ ఫిలాసఫీ లేదా /జీవితసత్యం అంటాం.  అయితే పూర్తి వినోదాత్మక చిత్రాలలో సారాంశం గొప్పగా ఉండకపోవచ్చు. వినోదం మరుగున ఆ బలహీనమైన/కొత్తది కానటువంటి  సారాంశాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు.  కానీ  చాలవరకు సినిమాలకి  ఓ బలమైన సారాంశం అవసరం. అది  బలహీనంగా ఉండటం వల్లో.. లేదా బలమైన సారాంశం ఉన్ననూ దానికి తగ్గ కథని ఎంచుకోక అది తేలిపోవటమో జరుగుతుంది. అయితే ఈ జీవిత సత్యాలు అందరికీ  నిజజీవితంలో వర్తించక పోవచ్చు. కానీ ప్రస్తుతం మనం ఎంచుకున్న కథకీ, పాత్రలకీ సరిగ్గా వర్తిస్తే చాలు.

అయితే ఈ ఇతివృత్తం ఎక్కడనించి వస్తుంది?

జీవితం నించి.. మన అనుభవం నించి..మన చుట్టూ ఉన్న సమాజ..వ్యక్తుల గమనింపు నుండి  మనం ఒక ఇతివృత్తం/సారాంశం తయ్యారు చేసుకోవచ్చు.

దర్శకుడు అంటే దార్శనికుడు. జీవితాన్ని…సమాజాన్నీ..వ్యక్తులనీ సినిశితంగా గమనిస్తూ తనదైన  దృక్పథంతో పరిశీలిస్తూ ఒక జీవిత సత్యాన్నో..ఒక భావప్రకటననో ( స్టేట్మెంట్)  చెప్పాలనుకుంటాడు. దానికి అనుగుణమైన పాత్రలూ/కథా అల్లుకొని  సినిమా మాధ్యమం ద్వారా ఆకర్షణీయంగా వ్యక్త పరుస్తాడు. తన అభివ్యక్తీకరణ ద్వారా తను దర్శించిన ఆ సత్యాన్నీ.. తత్వాన్ని మనకూ దర్శింప చేస్తాడు. అప్పుడే అతడు నిజమైన దర్శకుడు.  అయితే ఈవ్యక్తీకరణని సకల విధాలుగా మనం చూపించవచ్చు. వాటినే మనం సినిమా పరిభాషలో జానర్స్ అని అంటాము. హాస్య ధోరణిలో వ్యక్తీకరిస్తే కామిడీ సినిమా అనీ.. ప్రేమ/సెంటిమెంటుద్వారా అయితే  రొమాన్సు అనీ .. సస్పెన్సు గగుర్పాటుని థ్రిల్లర్ అనీ..ఇల్లా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కో ‘వ్యక్తీకరణ’ ఒక్కో జానర్ లో సరిగ్గా ఇముడుతుంది. అయితే ఇంత లోతుగా దర్శకులందరూ  ఆలోచించకపోయినా…సినిమా తీయటం ద్వారా జరిగేది అదే.. తత్వదర్శనం.

అయితే అందరికీ తోచేవే కాకుండా భిన్నంగా ..స్వంతంగా వ్యక్తీకరణలు చేయగల వాళ్ళని    గొప్ప దర్శకుడు అని అనవచ్చు. అలాంటి వ్యక్తీకరణలు చేసినప్పుడే ఆ సినిమా గురించి అందరూ చెప్పుకుంటారు చూస్తారు.

మనకో జీవితం ఈయబడింది. ఎవరూ ఎందుకూ అనేది ఇక్కడ  అప్రస్తుతం. సో…  మనకో జీవితం ఉంది. దాన్ని మనం జీవిస్తున్నాం. కానీ మన అంతు లేని కోరికల వల్ల అయితే నేమి…ఇంకొంచం సుఖంగా బతకాలి అనే ఆశ   అనే మానవతత్వం వల్ల అయితే నేమీ మనం ఉన్నదానికంటే ఉన్నతమైన జీవితాన్ని కలలు కంటాం.  మనలో చాలామంది  కలలు కన్న జీవితతాన్ని  అందుకోవాలని పరిశ్రమిస్తూ  ప్రయత్నిస్తు ఉంటారు. కొందరు పరిశ్రమని కూడా పక్కన పడేసి  ఉన్న జీవితాన్ని తిట్టుకుంటూ..కేవలం కలలు కంటూ ఉంటారు. కలల్లోనే బతుకుతారు. కలల్లోనే బతకాలనుకుంటాడు. ఎందుకంటే అవి తనకి ఆనందాన్నిస్తాయి కనక..ఎందుకంటే అవి నిజజీవితంలో సాధ్యం కాకపోవచ్చుకనక.

కలలో ఏమన్నా జరగొచ్చు. అయితే మనం అనుకున్నదే కల కనగలిగితే అంతకన్నా ఆనందంలేదు. అయితే అట్టాంటి కలలు ఇవ్వగలమందేమైనా ఉంటే.. ??
కలని కల అని ఎందుకంటామంటే ఓ రాత్రి కలకీ రెండో రాత్రికలకీ సంభందం లేదు ఈ నిద్రలో కలుసుకున్న వ్యక్తులని రేపు కలుసుకోం. వాళ్లు ఒకే స్థలంలో కనపడరు. కాలంలో క్రమంగా మారరు. అట్లా కాకుండా ప్రతిరాత్రీ..నిన్నరాత్రి మనం ఒదిలిన చోటునుండి..మర్నాడు రాత్రి నిద్దట్లో  అదేకలని అందుకొని తరవాత భాగం కలగని ..ఇట్లా ప్రతీ రాత్రీ జరిగితే  పగలు మేలుకున్న జీవితం ఎంత వాస్తవంగా జరుగుతుందో..ఆ కల జీవితమూ అంతే వాస్తవం అయిపోతుంది. అలా రెండుజీవితాలనీ గడుపుతాడు ఆ మనిషి. ఒకటి వాస్తవజీవితం, మరోటి స్వప్నజీవితం -చలం
అసలు విషయం చెప్పకుండా గొప్ప ( చెత్త) ఉపోధ్గాతాలిస్తూ  మళ్ళీ  ఇప్పుడు చలం రాత ఎందుకయ్యా అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా..  నేను ఓ సినిమా గురించే మాట్లాడుతున్నాను.
ఇతివృత్తం

your  ‘SMALL’  life is …..  somebody’s  ‘BIG’ dream.

మనజీవితం గొప్పది కాకపోవచ్చు..చప్పగా సాగుతుండవచ్చు. కానీ ఆజీవితం దొరికితే బావుండూ అని కలగనే వాళ్ళు ఉంటారు. ఇది ఒక సత్యం.. ఇదీ మన ఇతివృత్తం. –
మనం ఫలానా వ్యక్తి లాంటీ  జీవితం ఉంటేనా  అని ఎన్నోసార్లు అనుకుని ఉండుంటాం. అలాగే మన గురించి కూడా ఎవరో ఒకరు అనుకుంటూ ఉంటారు అ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకంటే అధమంగా బ్రతికేవాళ్ళు మనకళ్లముందు కనపడతారు. వాళ్ళు నిజంగా మనలాంటి జీవితం ఉంటే చాలు అని ఆ జీవితానికై కలకంటూ ఉండవచ్చ న్నది సత్యం.  ఒక్కోజీవితం కొన్ని అనుభవాల పరంపర. నా అనుభవాలు నాకే స్వంతం. నేను కొన్ని అనుభవాలు పొందుతున్నానంటే.. ప్రపంచంలోని మిగతా మనుష్యుల అనుభవాలన్నీ మిస్ అవుతున్నా అన్నమాట. మనం అలా అనుభవాలు మిస్ అవుతున్నాం కనక మన అనుభవాలు మనకి నచ్చక  వాళ్ళ అనుభవాలు మనకి నచ్చొచ్చు.. .ఇంకో మాటలో మన జీవితం కంటే వాళ్ళ జీవితం మనకి బాగా నచ్చొచ్చు. కానీ వాళ్లలా బతకటం కుదరకపోవచ్చు.సరిగ్గా అప్పుడే మనకి కల అవసరం అవుతుంది.

దర్శకుడు

తన అనుభవాల ద్వారానో..సునిశిత పరిశీలన ద్వారానో ఎలా పట్టుకున్నాడో కానీ ఆ ఇతివృత్తాన్ని/సత్యాన్ని  పట్టుకొని దానికి తగ్గ  ..చక్కని  కథా పాత్రలు  అల్లుకొని పక్కా స్క్రీన్ప్లే తో ..పకడ్బందీ ప్రణాలికతో ప్రేక్షకులే నిర్మాతలుగా తన భావాలని వ్యక్తీకరించ ప్రయత్నించి సఫలీక్రుతుడయ్యాడో వ్యక్తి..  అతడే పవన్ కుమార్.  మన డెఫినేషన్ ప్రకారం తన స్వంత..భిన్నమైన భావలని ఆకర్షణీయంగా హత్తుకునే విధంగా వ్యక్తీకరించాడు కనక అతడు గొప్ప దార్శనికుడూ..దర్శకుడు.

ఇక్కడ పవన్ కుమార్ పైన ఉండే ఇతివృత్తాన్ని చక్కని కథద్వారా ..సస్పెన్స్ లో రొమాన్సూ మిక్స్ చేసి ‘ మానసిక తత్వోత్సుక’ సినిమా  ( సైకలాజికల్  థ్రిల్లర్ )  గా రూపొందించాడు. అయితే ఆ  కథని నేనిక్కడ చెప్పదలచుకోలేదు. అక్కడక్కడా  అబ్ స్ట్రాక్ట్ గా చెప్పబడింది.మళ్ళీ ఓ సారి చదువుకోండీ. అయితే దాన్ని కథగా ఎలా మలిచాడన్నదే సినిమా చూడటానికి ప్రేరేపణ.

ఇలాంటి ఇతివృత్తంతో ఓ కథని తయ్యారు చేసుకోవటం ఒక ప్రయోగం. దాన్ని సినిమాగా తీయాలనుకోవటం మరో ప్రయోగం. అన్నింటికీ మించి  ప్రేక్షకులే నిర్మాతలుగా.. సినిమాకు కావలసిన మొత్తాన్ని సమీకరించి సినిమాని తీసి అందరినీ మెప్పించటం అన్నది మహా ప్రయోగం. అన్ని ప్రయోగాల్లోనూ విజయం సాదించారు పవన్ కుమార్ గారు.

అలాగే దర్శకుడికి రెండవ సినిమాయే అయినప్పటికీ  అన్ని విభాగాల్లోనూ గొప్ప అనుభవాన్ని కనపరిచాడు.  నటీనటులనుండి కావలసిన  నటన రాబట్టుకున్నాడు. చక్కని సంగీతాన్ని తోడుతెచ్చుకున్నాడు. అద్భుతంగా చిత్రీకరించే సినిమాటోగ్రాపర్ని ఎంచుకున్నాడు.తనకి కావలసినట్టు.. వాస్తవం..కలా..కలా వాస్తవం.. వాస్తవమా?  కలా? .. ఇలా కొంత సందేహాలని కలిగిస్తూనే ..అర్థమయ్యీ కానట్టూనే.. సినిమా మీద ఎక్కడా పట్టుకోల్పోకుండా  ఎడిట్ చేయగల ఎడిటర్ని ఎంచుకున్నాడు.. ఇంకేముంది ఒక అధ్బుత ప్రయోగాత్మక ఇండిపెడెంట్ సినిమా అవతరించింది. కన్నడ సినిమా ప్రపంచ సినిమాగా ఎదగటానికి కొత్త ఆశని తెరతీసింది.

కథ

సినిమా కథా కథనాల గురించీ…భావాలూ భావోద్వేగాల గురించీ తరవాత మరో వ్యాసంలో చర్చించుకుందాం.  ప్రస్తుతానికి మీరేమాత్రం సినిమా ప్రేమికులైనా ఈ సినిమాని చూసేయండి. 🙂

 

చివరగా ఈ సినిమా గురించి  మన తెలుగు సినిమా పరిభాషలో చెప్పాలంటే.. ‘ హీరో ఒక్కడే కాక  చాల పాత్రలు  డబల్ ఆక్షన్ చేసే డబల ఆక్షన్ కాని డబల్ ఆక్షన్ సినిమా..  😉

 

 జీవితం సత్యమైతే సుందరమైన స్వప్నాన్నే కందాం.. ఈ దరిద్రంలోంచి,భయంలోంచి మేలుకుందాం – చలం
 
5 Comments
  1. సత్య December 7, 2013 /
  2. Indian Minerva December 7, 2013 /
  3. సుజాత December 7, 2013 /
    • Ravi Avula December 31, 2013 /
  4. Veni September 13, 2015 /