Menu

జర్మన్ సినిమాలు-భావవ్యక్తీకరణ వాదం

పరిచయం: 20 వ శతాబ్దపు తొలి రోజుల్లో కళారంగం గతి మార్చిన భావవ్యక్తీకరణ వాదం సాధారణంగానే బహుళకళల సమ్మేళనమైన చలనచిత్ర ప్రక్రియనూ మార్పు దిశగా నడిపించింది.ముఖ్యంగా జర్మనీలో 1920 ప్రాంతంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో అప్పటి సినిమా దర్శకులు భావవ్యక్తీకరణ ద్వారా తమ ఆలోచనలను బలంగా చిత్రించారు. వ్యాపారమే ప్రాముఖ్యంగా నడుస్తున్న జర్మన్ సినిమా హఠాత్తుగా ఇలా కళాత్మక సినిమాలను నిర్మించడానికి కారణాలు అప్పటి పరిస్థుతులే అని చెప్పుకోవచ్చు.

1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఘోర పరాజయం పొందడమే కాకుండా మిత్రదేశాల సముదాయం (Allied Forces) తో సంధి చేసుకోవడంతో జర్మనీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ వాతావరణంలో యువత సంప్రదాయ సిద్ధాంతాలపై తిరుగుబాటు ప్రకటించారు. దాని పర్యవసానంగా కళల్లో భావవ్యక్తీకరణ వాదానికి ప్రాముఖ్యత కల్పించారు. అప్పటివరకూ కళ్ళతో చూసింది చూసినట్టుగా చిత్రించడం గొప్ప కళ అని భావనను పక్కనపెట్టి  విషయాన్ని కళ్ళతో చూసినప్పుడు మనసులో కలిగిన భావనలు చిత్రీకరించడం మెదలుపెట్టారు. అలాగే అప్పుడప్పుడే మారుతున్న సామాజిక పరిస్థుతులు, పారిశ్రామీకరణ, సినిమా మరియు రేడియో ల విజృంభణ, ఐన్‍స్టీన్, ఫ్రాయిడ్ లాంటి దృష్టల నూతన ప్రపంచ దృక్పథాలు భావవ్యక్తీకరణ వాదానికి బలం చేకూర్చాయి.

పరిస్థుతులు:మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వర్శలీస్ (The Treaty of Versailles) సంధి కారణంగా అప్పటివరకూ జరుగుతున్న ఇతర దేశాల సినిమాల దిగుమతి కూడా ఆగిపోవడంతో, మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో ముఖ్యంగా ప్రచారం కోసం చలన చిత్రాలను నిర్మించే ఉద్దేశంతో జర్మన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన Universum Film AG (UFA) అనే సంస్థ కమర్షియల్ సినిమా నిర్మాణం తలపెట్టింది.దాంతో జర్మనీలో చిత్ర నిర్మాణం కూడా ఊపందుకుంది. 1913 లో జర్మనీలో కేవలం 28 సినిమాలు నిర్మించగా 1919 కీ ఆ సంఖ్య 245 కి పెరిగింది. కాకపోతే ఆ సమయంలో వచ్చిన ఎక్కువ సినిమాలు ఇతర దేశాల సినిమాలకు అనుకరణలు లేదా పూర్తిగా వ్యాపారత్మకంగానూ వుండేవి.

ఇదే సమయంలో అమెరికాలో D W గ్రిఫిత్ లాంటి దర్శకులు అమెరికన్ సినిమాకి కొత్త ప్రక్రియలు జోడిస్తుండగా, రష్యాలో ఐజెన్స్టీన్ లాంటి వారు ఎడిటింగ్ లో మోంటాజ్ అనే ప్రక్రియ ద్వారా సినిమా కళను కొత్త మలుపు తిప్పారు. ఈ రెండింటి నడుమ జర్మనీలోని UFA స్టూడియో హాలీవుడ్తో పోటిగా సినిమా నిర్మాణం చేపట్టినప్పుడు అప్పటి పరిస్థుతులను అవగాహన చేసుకున్న రచయితలు, సెట్ డిజైనర్లు  మరియు దర్శకుల సహకారంతో నిర్మితమైన ’The Cabinet of Dr.Caligari’ సినిమా విడుదలయింది. ప్రపంచా వ్యాప్తంగా ఈ సినిమా విజయవంతం కావడమే కాకుండా సంచలనం సృష్టించడంతో ప్రపంచ వ్యాప్తంగా జర్మన్ సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అదే సమయంలో జర్మనీలోన కళా రంగాన్ని ప్రభావితం చేసిన భావవ్యక్తీకరణవాదం సినిమాల్లో కూడా ప్రవేశపెట్టబడింది.

సినిమాలు-భావ వ్యక్తీకరణవాదం:భావవ్యక్తీకరణ వాదపు సినిమాల్లో రెండు ముఖ్య విషయాలు గమనించవచ్చు.

  1. కథ సంవిధానం(Narrative):పాత్రల యొక్క వేదనా భరితమయిన అంతరంగిక మనస్తత్వాన్ని ప్రతీకాత్మకం(symbolic)గా చిత్రించడం.
  2. రసాత్మక విధానాలు(Aesthetic practices): వస్తువులు మరియు దృశ్యమాన సామాగ్రి(Mise-en-scene) ని వక్రీకరించి చూపడం ద్వారా కథా సంవిధానంలో ఎన్నుకొన్నమనస్తత్వాన్ని ప్రేక్షకులు అనుభవానికి తేవడం.

భావవ్యక్తీకరణ వాదపు సినిమాలు మరియు దర్శకులు:

  • The Cabinet of Dr.Caligari:భావవ్యక్తీకరణ వాదపు సినిమా అనగానే మొదటగా చెప్పుకోవాల్సింది ’The Cabinet of Dr.Caligari’. ఈ సినిమాకు దర్శకుడు రాబర్ట్ వీని(Robert Wiene). ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది మొట్టమొదటి ఫాంటసీ సినిమా అని చెప్పుకోవచ్చు. భీభత్స భయానకమైన కల్పిత గాథ అయిన ఈ సినిమా మతి భ్రమించిన ఒక వ్యక్తి కథ.
  • Nosferatu:1921లో విడుదలయిన ఈ సినిమా దర్శకుడు F.W.Murnau. ఇది భావవ్యక్తీకరణ వాదపు సినిమాల్లో అత్యంత ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోనే బీభత్స జాతము (horror genre) ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. ఇది Bram Stoker రచించిన డ్రాక్యులా నవల అధారంగా రూపొందించబడినది.
  • M:1931 లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు Fritz Lang. కథా పరంగా ఇది ఒక సీరియల్ కిల్లర్ కథ. ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే నిశా చిత్రాల (Film Noir) ఆవిర్భావం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకంటే ముందే Fritz lang రూపొందించిన Metropolis చిత్రం మొదటి శాస్త్ర కల్పన (Science Fiction) చిత్రంగా చెప్పుకోవచ్చు.

గమనిక:జర్మనీ లో 1919-1935 మధ్యలో వచ్చిన కొన్ని భావ వ్యక్తీకరణ వాదపు సినిమాలు మరియు వాటి దర్శకుల వివరాలు మాత్రమే ఇక్కడ పొందు పరిచాము. ఇక్కడ ఇచ్చిన లిస్టులోని కొన్ని సినిమాల గురించి వివరణాత్మక వ్యాసాల తో పాటు వీలైన చోట్ల ఆయా సినిమాలను కూడా నవతరంగంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము.

ముగింపు:భావవ్యక్తీకరణ వాదపు సినిమాల గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకూ వివిధ కోణాల్లో విశ్లేషణ జరుగుతూనే వుంది. Key Concepts in Cinema Studies అనే గ్రంధంలో Susan Hayward ఇలా అంటారు:

Critics of different generations have tried to read different things in to this movement. Some have seen it as reflecting a German mentality on the brink of madness, obsessed with death and ready to encompass fascism. Morerealistically, these films reflect a desire to escape, even into horror, from the dreadful effects of the economic crisis and inflation. They did leave an important legacy not just in themselves but in the influence they had, particularly in matters of style, on the horror film and the film noir. Cross-fertilization with Hollywood came about in part because a number of the German directors, for example Lang and Murnau, went to Hollywood, particularly during the late 1920s and early 1930s.

జర్మనీలో 20 వ శతాబ్దపు మొదటి రోజుల్లో మొదలై దాదాపు పాతికేళ్ళు చలనచిత్ర సీమకు వివిధ ప్రక్రియలు, సినిమా రంగంలో వివిధ జాతపు (genres) ని పరిచయం చేస్తూ వచ్చిన భావ వ్యక్తీకరణ వాదపు సినిమాలు ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి.అయితే ఆ రోజుల్లో వచ్చిన అన్ని సినిమాలు భావవ్యక్తీకరణ వాదపు సినిమాలే అని చెప్పడానికీ లేదు. కానీ అలా కాని సినిమాలు కాల గర్భంలో కలిసిపోగా భావవ్యక్తీకరణ వాదపు సినిమాలు మాత్రం నేటికీ క్లాసిక్స్ గా పరిగణించబడుతున్నాయి.అయితే 1935 లో హిట్లర్ అధికారంలోకి వచ్చాక భావవ్యక్తీకరణవాదం పూర్తిగా మరుగునపడింది.భావ వ్యక్తీకరణ వాదం ఒక ఉద్యంమంలా కొనసాగపోయినప్పటికీ ఎన్నో సమకాలీన సినిమాల్లో (ఉదా: The Blade Runner, Batman, many Dracula films, Sin city and many more)అప్పటి ఛాయలు కనబడ్తూనే వున్నాయి.

3 Comments
  1. mvraman April 21, 2009 /
  2. su July 26, 2009 /
  3. గీతాచార్య August 16, 2009 /