Menu

వియోగ వేదనల – Brief Encounter: సలపరింతల గాయము, సాంత్వనల లేపనమూ!

జ్ఞాపకాల్నీ, మనల్నీ కలిపే దారం గజిబిజిగా ఉంది కాబట్టి కొంత నయంగానీ, కుళ్లుమోతు విధి విధించిన సంకెళ్లకి ఇలా మిగిలాం గానీ, అదే కురచైన సరళరేఖైనట్లైతేనా ఇంకెంత నరకం? తుది- మొదలు తెలిసిపోయి, రెండు కొసల చివర్లలో ఏమీలేనితనం ఎడతెగని ఖాళీలా-
అవును ప్రియా!

ఇప్పుడు, వీడ్కోలు చెప్పుకోవల్సిన పరిస్థితులు దాపురించిన ఈ గుబులు పొగుళ్ల గుంజాటనే ఈవలి కొస అయితే, మన కలయికకి మొదలెప్పుడు? నిజానికి మనది కలయికేనా అసలు? అదొక తత్తర బిత్తరల తమి, సంతప్తాంతరంగాల తహతహ…. అంతే.

తంపులు అసలేలేని ఈ తప్పనిసరి తెగతెంపులకి ముందువెనుకలేమున్నాయ్? అయినా ఏమంత కాని పని చేశాము? నీ దగ్గర నన్ను, నాలో నిన్ను పారేసుకోవడమేనా? నిష్ఠూరాలతో, నిందల ఉచ్చులతో సదా పొంచిన సంఘం కళ్లు దాయలేము సరే, మన ముచ్చెబంగారు మురిపెమై నేలకు దిగిన నక్షత్ర దీపాన్ని మూయలేము ముమ్మాటికీ నిజమే, అయితే ఇక మిగిలింది ఇలా చీలిపోవడమేనా, చిరిగిపోవడమేనా?

** ** ** **

కొన్నేళ్ల క్రితం నేను మద్రాసులో పనిచేసేటప్పుడు పిరియవిట్టై రైల్వే స్టేషనులో లోకల్ ట్రైను మారి, వటక్కువాక్కం వెళ్లే రైలు కోసం పడిగాపులు పడేవాడ్ని రైల్వే క్యాంటినులో. ఓ రోజు ఎప్పట్లానే ఎదురు చూస్తున్నాను అనౌన్సుమెంట్లు వింటూ. పిల్లలిద్దరూ మరీ మరీ చెప్పారు- ‘నాన్నా సాయంత్రం త్వరగా ఇంటికొచ్చే’యమని, ఏదో అంతా నా చేతుల్లో ఉన్నట్టు. ఆఫీసు, పని, పరుగులు, ఇరుకు ఇల్లు, బోనులో చిలకడదుంప, ఇనుప ఊచల్లో పటికపు పలుకుల చిలక, తడిలేని నీళ్లు, ఒట్టిబోయిన కుళాయిలు, రావడాలు, రాకపోవడాలు, రొద, రొచ్చు, ఉచ్చు…. మళ్లీ.. మళ్లీ ఆఫీసు- ఇంటి మధ్య పడుతూ లేస్తూ పరుగులు! ముక్కిపోయిన బన్ను మీద ఎంత విదిలించినా ఈగ ముసురుతూనే ఉంది, టేబుల్ మీద టీ చుక్క చుట్టూ చలిచీమలు మోహరించాయి, ముళ్లు విరిగిన గోడగడియారం వగర్చే కాలాన్ని వెక్కిరిస్తుంది.

సరిగ్గా అప్పుడు చూశానామెని, నేను కూర్చొన్న చోటికి ఐమూలగా.

బొంగురుపోయిన పాత రేడియోలోంచి అర్థంతెలీని పాటే ఐనా శ్రావ్యంగా ఉంది. గల్లాపెట్టెని తప్పించుకున్న రూపాయి బిళ్ల గాలిలో త్రీడైమెన్షనల్ వృత్తాలు గీస్తుంది. రోజువారీ రొటీన్ ఈతల ఆక్వేరియం చేపకి సముద్రమంత సాంద్రానుభవమేదో చప్పున స్ఫురించింది.

ఆట్టే జనంలేని క్యాంటీనులో. తనని ఇంకొంచెం తేరిపార చూసాను. అదేపనిగా నీళ్లూరుతున్న ఓ కంటిని తెగ నలిపేస్తూనే, అనౌన్సుమెంట్లకి చెవి రిక్కిస్తోంది. అర్థమయ్యింది, తన కంట్లో నలుసు. బావిలో పూడికలు, కంట్లో నలుసులు తీసే ఎక్స్‌పర్ట్‌లాగా ఒక సందర్భోచిత సాయానికి చొరవ తీసుకున్నాను. నలుసుని నాలుకతో తీయడం దాదాపు ఫ్రెంచ్ ముద్దంత తీయని అనుభవమే గానీ, అంత సాహసం చేయలేక, కర్చీఫ్‌ని వాడాను. ఆకర్ణాంతాలైన ఆల్చిప్ప కళ్లు అరమోడ్పులై, విదియ చంద్ర దర్శనమవుతుంటే వాటికి తదేకమవ్వడం తప్ప మరో పని చేయడం సౌందర్య ద్రోహమే అయినప్పటికీ, దృష్టంతా బలవంతాన నలకంత నలుసుమీద పెట్టి గెలిచాను- ఆమె థాంక్స్‌ని. రెండు చేతులూ చాచాలని ఉన్నా కుదరదు కాబట్టి, షేక్‌హ్యాండు మిషతో ఒక చేయి చాస్తూ చెప్పాను నా పేరు. తెన్‌పాలయం ట్రైన్ వస్తుందన్న అనౌన్సుమెంటు విని మరో ‘థాంక్స్’ నా ముఖాన గిరాటేసి తుర్రుమందామె.

** ** ** **

మర్నాటి నుంచీ నా తిప్పలు చెప్పనలవి కావు. మామూలుగా అయితే తెన్‌పాలయం ట్రైన్ టైముకి హాజరవడం నాకు కుదరని పని. ఆఫీసులో చండామార్కుల బాసుకి బొంకడానికి పచ్చివి, దోరవి చెట్టుకు కాయని అబద్ధాలు ఎన్నని దొరుకుతాయి? అయినా మూడు రోజులు వరసగా వచ్చాను. క్యాంటినూ, ప్లాట్‌ఫారం కలియ తిరిగాను. తెన్‌పాలయం లోకల్ ట్రైన్ ఆగే ఒక నిమిషంలో అన్ని కంపార్టుమెంట్లూ స్కాన్ చేసే చురుకుదనం సాధించాను. కానీ, ఆమె కనబడలేదు. ఇక ఆశ వదులుకొని, చెప్పాపెట్టకుండా మొలిచిన చిరు రెక్కల పెడరెక్కలు విరిచేసుకున్నాను. ఎప్పట్లానే గానుగ గాడిలో పరుగు మొదలెట్టానే గానీ, మనసు మనసులో లేదు. చూడటానికి ఉద్యోగం చేస్తున్నట్టు అనిపించలేదు. కాబట్టి రోజూ రాదన్న మాట. పోనీ తెన్‌పాలయం వెళ్లి చూడ్డానికి అదేమైన చిన్నా చితకా ఊరా? అయినా తన ఊరు తెన్‌పాలయం అయ్యుండాలనేముంది? ఆ ఒక్క రోజు వెళ్లిండొచ్చు. తనది కూడా వటక్కువాక్కమే అయ్యుండొచ్చుగా, మా పక్కింట్లోనే… మరీ అంత వద్దులే….. మా పక్క వీథిలోనే ఉంటూ, ఇన్నాళ్లూ దాక్కొని, ఇప్పుడు తారసపడేలా-

‘గొంగళిలో వెంట్రుకల్లా మరీ ఇన్ని తప్పులా ఇంత చిన్న ఫైలులో….’
‘వంద వంకలు చెప్పి జీతం ఎంతకాడికీ అడ్డగోలుగా కోసేయడమే కదా…’
‘అరకేజీ వంకాయల్లో అన్నీ పుచ్చులేనా….’
‘పెన్సిల్ ముక్కు కూడ చెక్కలేవా నాన్నా…. ‘
….. ఆఫీసు… ఇల్లు…. గాడి తప్పలేదు, అడుగులు ఎలపటికో… దాపటికో తడబడటం లేదు. అంతా పద్ధతిలోనే నడుస్తుంది.

మళ్లీ గురువారం… ఆమె కనిపించి వారం. అఫీసులో అన్యమనస్కంగా ఉన్నానేమో, కొలీగ్ ఒకడు చెవిదగ్గర జోరీగై వాగిన విషయం కొంత సేపటికిగాని ఎక్కలేదు : పిరియవిట్టైలో గురువారం సంతకి తోడు రమ్మన్నాడు. ఇది బుర్రకి ఎక్కాక చప్పున ఒకటి తట్టింది. ఆ రోజు ఆమె చేతిలో బరువైన సంచులు. తను కూడా సంతకే వచ్చుంటుందా? ఈ వారం కూడా వస్తుందా? మళ్లీ కొత్త సాకుతో పర్మిషన్ తీసుకొని పిరియవిట్టై సంతకి దౌడుతీసాను మొయిళ్లమీదా, రైళ్ల మీదా. తోడు రమ్మంటే రాకుండా అదే సంతలో దారితప్పిన పిల్లాడిలా తిరుగుతున్న నన్ను చూసి ఆఫీసు మిత్రుడు పలకరించ బోతుంటే చూడనట్టు పారిపోయాను. ఈ labyrinthలో ఇరుక్కుపోవడం కన్నా, ఆమె కోసం రైల్వే క్యాంటీనులో ఎదురు చూడ్డమే మంచిదని పాత సంకేత స్థలానికే చేరి, అభిసారికుడ్నై (పదప్రయోగం కరెక్టేనా) ఎదురుతెన్నులు!

** ** ** **

నిర్లిప్తంగా కన్పిస్తున్న టేబుల్ చివర స్పాంజ్‌ముక్కని తాకుతుంటే తెలుస్తున్నాయి చిప్పిల్లే జ్ఞాపకాలేవో తడితడిగా. హఠాత్తుగా వాతావరణం మారింది. ఎక్కడ పడితే శుభమో తెలియదు గానీ, శకునాల బల్లి క్యాషియర్ బట్టతలమీద పట్టుతప్పి ముఖమ్మీదకి జారింది. వేడిపాలు కాలిన నా నాలుక మీద మీగడ తరగలెత్తింది. ఆమె వచ్చింది.

ఎదురెళ్లి లేని చనువులు నటిస్తూ, గోము నవ్వులు పులుముకుంటూ తన చేతిలో బరువులు తీసుకొంటుంటే ఒకింత అనుమానంగా చూసిందామె, ‘నీవెవరూ అన్నట్టు కనుబొమ్మల జారుముడితో. బాగా జావగారిపోయాను; కనీసం గుర్తు కూడా లేనా? కనిపించీ కనిపించనంత నలుసే కావచ్చు, చేసిన సాయం కూడా అంతదేనా? గుర్తులు చెప్పాక, నిజాయితీగా నొచ్చుకుంది, తన మతిమరుపుకి. ఏటి తేట నీటిలో గరగరికల గులకరాయి గరుకు లాంటి తన నొచ్చుకోలు అందంగా ఉండటమే కాదు, నాకు మేలు చేసింది కూడా. మరుపు అనే తన తప్పిదానికి పరిహారంగా నాకో కేక్ ఆఫర్ చేసింది. పట్టుమని పదిరూపాయలుండని రొట్టెముక్కేనా, అని ఎకసెక్కాలు పోవద్దు; అదొక ఆరంభం. రికామీ గాలుల కుదుపుకి పీల కొమ్మలు జలజలా రాల్చేస్తున్న పువ్వుల్లాంటి లెక్కకి మించిన నవ్వులై ఆమె కదులుతూ నన్ను పక్కనే నడవనిచ్చింది, తన సంచులు ట్రైనులో తాను ఎక్కే వరకూ మోయనిచ్చింది, ‘ప్రతి గురువారం సంతకి వస్తాను’ అని చెప్పి, నాకు ప్రచ్ఛన్న ఆహ్వానం అందించింది, అన్నింటి కన్నా ముఖ్యంగా విప్పతేనె కంటే ఇంపైన తన పేరు కూడ చెప్పింది.

అంత క్రితం చూసిన లోకం, నిజంగా అంతకుముందు చూసిందేనా అని ఓ విస్మయం. చిరిగి, కాలి, పెళుసు బూడిద చిద్రుపలై ఎగిరిన కేలండర్ కాగితాలన్నీ గురువారాల చుట్టే గిరికీలు కొట్టడం ఒక వింత. పడిగాపుల్తోనే పరుగులు, పరుగుల్తోనే పలవరింతలు!

ఎడతెగని ఎదుర్చూపుల్తో వారమంతా ఆత్రపడి కలుస్తామే గానీ, గట్టిగా గంట సేపైనా కబుర్లాడుకుంటామా అంటే చెప్పలేం. ఇంతా చేసి, మేము చేసేదేమీ చందన చర్చలు కావు; మాట్లాడుకునేది కాళిదాసు మేఘసందేశ విరహాలో, షేక్స్‌పియర్ రోమియో జూలియట్ల విషాదాంత ప్రణయాలో కానేకావు. గండశిలమీద విధివశాత్తు నిద్రపోతున్న అతి సామాన్యమైన ఈ Endymionమీద కురిసిన వెన్నెల సోన, celestial Selene తానని నేను చెప్పలేదు. నిజానికి నేను చెప్పింది తక్కువే, విన్నదే ఎక్కువ.

మెట్టినింటి వారిది పెద్ద కుటుంబం. తనకి నాకు లానే ఇద్దరు పిల్లలు. భర్తది సర్కారీ కొలువు, ఐనా చాలా నిజాయితీగా పనిచేస్తాడు. కుటుంబం తప్ప మరేమీ పట్టని వాడు. తన భర్తే ఇంటికి పెద్ద. ముగ్గురు తమ్ముళ్లు, ఐదుగురు చెల్లెళ్లూ. అందరికీ పెళ్లిళైపోయాయి. మామ గారు పోయారు. అత్త గారు అందరి దగ్గరా తలా కొద్ది రోజులుంటుంటారు. ఈ కారణాల వల్లే కలిసిన ఆ కొద్దిసేపు కూడా తెలిసిన వాళ్లెవరైనా చూస్తారా అని వల్లెవాటు చాటు చేసుకుంటూ ఆమె, కంటి ముందు తను కదలాడే కాసేపట్లోనే తెరచాటేమిటని గుబులుకొంటూ నేను. దోబూచులైతేనేం, ఆ గుప్పెడు క్షణాలు ఒక్కొక్కదానికీ ఒక్కో జీవితం ఫణంగా పెట్టొచ్చు.

** ** ** **

ఇక వారం వారం గురువారం లీవు హాఫ్ డేల నుంచి, క్రమేణా ఫుల్ డేల వరకూ ఎదిగింది. బోడి ఉద్యోగాన్నే లెక్కచేయనప్పుడు, కోన్‌కిస్కా మేనేజర్ ఒక లెక్కా జమా?

పిరియవిట్టైలో తెలిసిన వాళ్లుండే అవకాశాలు ఎక్కువ కాబట్టి కొంచెం మాటు కావాలంటే సీమా సమయ సందర్భాల్లో మొదటిదైన place change కరక్టనే దుందుడుకు నిర్ణయం కూడబలుక్కొని చేసుకోవడం ఎంత బాగుందంటే, దొంగచాటుగా పంచుకున్న నువ్వుల జీడీ కాకెంగిళ్లతో మరింత తీపెక్కినంత. కణల్ నీర్ స్టేషన్ మాకు అనువైన rendezvous అని ఖాయం చేసుకొని ఆ వచ్చే గురువారం అక్కడ కలవాలని ప్లాన్ వేసుకున్నాం.

టైమ్ ముందుకు దూకుతుంది, లేదా కనీసం పాకుతుంది అని కూడా నాకు నమ్మకం చిక్కలేదు, ఆ వారం మాత్రం. ఒక దశలో అయితే, దయ్యం మాదిరిగా కాలానికి వెనుకకాళ్లేమో అనిపించింది. ‘కడచేనటే సకియా, ఈ రాతిరి/ కడుభారమైన ఎడబాటున/ అయ్యయ్యో….’ అని వలచి వగపించిన కృష్ణశాస్త్రి గారు ఆ వారం రోజులూ నన్ను అస్సలు విడవనే లేదు.

ఏదిఏమైనా, ఏడు రోజుల తర్వాత కాదు, ఏడున్నర కోట్ల యుగాల తర్వాత ఏడిపించీ ఏడిపించీ వచ్చిన గురువారం (అంత క్రితం వరకూ గడచిన) నా జీవితం మొత్తానికీ ఒక అర్థాన్నిచ్చింది. వయసులు మరిచిన మాకు కొత్తగా ఏవో రెక్కలు తొడిగింది. తెరలు తొలిగి, కాదు… చిరిగి పొడగట్టిన రంగస్థలం- యుగళానికి తప్ప, జుగల్‌బందీ వినా, జమిలీ జాజర మినహా మరిదేనికీ తావు లేదు. కంపించే తన వేళ్లు నా వేళ్లలోకి జొనిపి భద్రమైనప్పుడు అసలు చుట్టూ లోకమే లేదు. గుట్టు గుబుర్ల పార్కులో, కిక్కిరిసిన సినిమా హాల్లో, ఈగలు తోలుకుంటున్న కచేరీలో…. ఎక్కడైనా మార్మోగినవి మా జంట చప్పట్లే. మళ్లీ సాయంత్రానికి పిరియావిట్టైలో ఏమెరగని వీడ్కోళ్లు.

ఆ తర్వాత అటువంటివే ఒకట్రెండు గురువారాలు వచ్చాయేమో. ఓ వారమైతే తను రానే లేదు. రాలేనని ముందే చెప్పింది కాబట్టి సరి గానీ, లేకుంటే కచ్చితంగా నా తలలో నరాలు చిట్లిపోయేవే. ఎందుకంటే, ఇద్దరి మధ్య మరే ఇతర కమ్యూనికేషనూ లేదు.

ఎంచుకొని కొలుచుకొనే అవసరం రాని, పర్యవసానాల చింత లేని బంధమని ఎంత నమ్మినా, మా పెనవేతలో ఎందుకో తరుచూ పెనుగులాట. తన భర్త, పిల్లలు, సంసారం, కుటుంబ గౌరవం… వంటి ఆలోచనల్తో మథనపడేది. నలుగురిలోనే కాదు, చివరికి నా దృష్టిలో కూడా చులకనౌతానేమో అని కలవరపడేది. తనని ‘పడేయాలని ‘పెళ్లిగాక ముందు, అయిన తర్వాత కూడా ఎంత మంది ప్రయత్నాలు చేశారో చెప్పేది, తాను ఎవ్వరినీ కన్నెత్తి కూడా చూడలేదనేది. అందుకే, మా చెలిమిలో పచ్చిదనం ఆరక ముందే, నెత్తావి ఇగరక మునుపే ఆమె అన్నదో రోజు- ‘మనం ఇకపై మరెప్పుడూ కలవొ’ద్దని. అపురూపమైన మా స్నేహం ఒక చాటు మోహం కావడం అవమానమని ఇద్దరికీ తోచింది ఉమ్మడిగా. బహుశా అందుకే, గుండెని వెయ్యిన్నొక్క ముక్కలు చేస్తున్న బాధని దిగమింగి, ధార కట్టనివ్వకుండా కన్నీళ్లు దాచుకొని ఆ నిర్ణయానికి తలొగ్గాం. తనని ఇలా అప్పుడప్పుడూ అయినా చూడకుండా ఆ వాతావరణంలో ఉండలేనని ముందే తెలుసు కాబట్టి, దూర దేశంలో ఎప్పటి నుంచో ఉన్న ఉద్యోగానికి ‘ఓకే’ చెప్పేశాను. పిల్లాజెల్లాతో ప్రయాణం కూడా ఓ గురువారం రాత్రికే. ఆ గురువారమే మా చివరి కలయిక అనుకున్నాం.

** ** ** **

మొదట కలుసుకున్న పిరియవిట్టై రైల్వే క్యాంటినులో మేము ఎప్పుడూ కూర్చుండే మూల టేబుల్ దగ్గర ఎదురుబొదురుగా కూర్చొన్నాం ఎప్పట్లానే. ఇద్దరి మధ్యా కంటికి కనిపిస్తున్న ఎడం- లోన లేదు, అదే కంటికి కనిపిస్తున్న అడుగుల దూరం మాత్రమే కాదు, ఓ ఆకాశమంత శూన్యం, సముద్రాల సామూహిక దుఃఖం కూడా ఉన్నాయి.

‘దుఃఖాన్ని దిగమింగి’ అనుకుంటామేగానీ మాటవరసకి, అది మింగుడు పడదు సరికదా, బైటపడి తేలిక పడనివ్వలేదన్న ఉక్రోషంతో గొంతుని పూడ్చేసి, డగ్గుత్తిక చేసి, మాటల్లేని, మాటలురానితనాల్ని మోపుతుంది. ‘మాట తొలి క్షతం…. మౌనం తుది పదం’ అని ఎవరో కవి అన్నాడు గానీ, మౌనం గాంగ్రిన్ కంటే ప్రమాదకరం, నిశ్శబ్దంగా లోలోపల విధ్వంసం సృష్టిస్తుంది, అంతా డొల్ల చేసేస్తుంది. ‘స్పర్శ’ అనే దివ్యౌషధమే లేకపోతే ఎన్ని హృదయాలు ఆ గాంగ్రిన్ బారిన పడేవో అన్న భయం స్వానుభవంలోకి వచ్చింది, ఆ బేల క్షణాల్లో. పరిసరాలు, ప్రపంచం అన్నింటినీ రద్దుచేసేసి ఒకరిలో మరొకరం సంలీనమై పోవాలన్న అటువంటి తపనల సమయంలో కొనవేళ్లు తాకినా కొత్త సృష్టి జరిగినంత సంచలించిపోతున్నాం ఇద్దరం.

సరిగ్గా అప్పుడే మా ఏకాంతాన్ని నిట్టనిలువున చీలుస్తూ ఒక ఉత్పాతం, ఓ వదరుబోతు ఉల్కాపాతం. ఆమె అత్తగారి తరఫు దూరపు చుట్టం. నా వంక ఒకింత అనుమానంగా చూస్తూ, బదుళ్లు పట్టించుకోని ప్రశ్నల్ని, వంకర తిరిగిన ఆరాలతో కలిపి గుప్పిస్తూనే ఉంది తన మీద. సదరు శబ్ద కాలుష్యానికి ఊపిరి సలపలేక పోతున్న నా చంద్రికని కాపుకాసే crisis managementకి నేను పూనుకున్నాను. ఆ ఆగడాల ఆగంతుక అడిగిన కుడితతో పాటు, అడగని దాణా కూడా తెచ్చిపడేశాను. సమయానుకూలంగా ఏ అనుమానం రాకుండా జాగ్రత్త పడటగలిగాం. ఐనా, ఎంత ప్రయత్నం చేసినా ఆ సైంధవిని వదిలించుకోలేక పోయాం. నేను వెళ్లవల్సిన టైమ్ ముంచుకొచ్చి, తప్పక లేచాను. ఊరొదిలి వెళ్లిపోతున్నట్టు అప్పటికే చెప్పడంవల్ల నాకు జాగ్రత్తలు చెబుతున్న ఆ మాటలమారి చూడకుండా నా నేస్తురాలి భుజం మెల్లగా నొక్కి అక్కడ నుంచి బైటకిపడ్డానేగానీ, ఆమెలోంచి మాత్రం కాదు.

** ** ** **

నా యీ కథ విన్నాక మీకు డెజావు (అంతకుముందు విన్నట్టు, లేదా చూసినట్టు) అనిపించిందా, అనిపించొచ్చు కూడా. కాస్త కుడి ఎడమలుగా ఇటువంటివి మనందరి జీవితాల్లో దొర్లుతూనే ఉంటాయి. దుస్సహమైన, నిస్సారమైన మన జీవితాల్లో కొన్ని బతికిన క్షణాల్ని పోసే గోరింట దోసిళ్లు చెరగని గుర్తులౌతూనే ఉంటాయి. నేను చెప్పిన మన కథ నిజానికి నాది కాదు. నా అభిమాన విశ్వవిఖ్యాత సినీ దర్శకుడు David Lean 1945లో తెరకెక్కించిన క్లాసిక్ Brief Encounter సినిమా కథ.

అయితే, ఇదే కథని కథానాయికి లారా జెస్సన్ (Celia Johnson) తన భర్తతో ఒక confessionలా చెప్పుకొస్తే, నేను ఎలెక్ హార్వే (Trevor Howard)ని ఆవహించి, అతని సొదలా, వ్యథలా ఊహలో అనుభవించి చెప్పాను. గొంతుకలో తేడానే గానీ, సంఘటనలు అన్నీ సమాంతరాలే. బ్రిటన్ సబ్అర్బనులో మిల్‌ఫోర్డ్ అనే ఒక fictitious రైల్వే స్టేషన్‌ని అక్కడ కల్పిస్తే, మద్రాసు శివారుల్లో పిరియవిట్టై (ఎడబాటు) అనే స్టేషన్‌నీ, కణల్ నీర్ (ఎండమావి) అనే మరో స్టేషన్‌నీ నేను కల్పించాను.

Brief Encounter సినిమా ప్రారంభం, ముగింపు కూడా రైల్వే క్యాంటీన్ సీనే. మొదటి సీన్‌లో మనుషుల్ని, చివరి సీన్‌లో మనసుల్ని షూట్ చేయడమే David Lean అనితరసాధ్యమైన ప్రతిభ. ఎడబాటుకి నిమిషాల ఎడం కూడా లేనప్పుడు Dolly Messiter అనే వాగుడుగాయ చొరబడి ఆ గుప్పెడు ఏకాంత క్షణాలకి కూడా వారిని దూరం చేస్తుంది. ఎలెక్ వెళ్లిపోతాడు, చేసేది మరేమీ లేక.

“క్షణం పాటు అతని చేతి స్పర్శలో చెమ్మ మనసుకు తెలిసింది. తను వెళ్లిపోయాడు, నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా. తను మరో ప్లాట్‌ఫారం మీదకు వెళ్లాలి. అందుకోలేని రైళ్ల గురించి ఎవరో చెప్పుకుంటుంటే, అతనిదైతే బాగుండని ఆశ. డొలీ మాట్లాడుతూనే ఉంది, కానీ నాకేమీ వినపడటం లేదు. అతని రైలు శబ్దాన్ని వింటున్నాను. అంతలోనే నాతో నేను చెప్పుకున్నాను-

‘అతను వెళ్లలేదు. నన్నిలా వదిలి వెళ్లడానికి తనకి మనసొప్పలేదు, అందుకే తను పోలేదు. నాలోకి, ఈ గదిలోకి మళ్లీ వస్తాడు, ఏదో మర్చిపోయాన్న మిషతో..’

నా ఆశలు నిజం కావాలని దేవుడ్ని వేడుకున్నాను. ఓ క్షణం పాటు తను కనిపిస్తే చేయాలన్నదే నా ఆశ. కానీ, నిమిషాలు దొర్లిపోతున్నాయి. నా ప్రార్థనలు ఫలించలేదు…… ” అని భర్త ఫ్రెడ్‌కి చెప్పుకుంటుంది లారా.

ఎలెక్ వెళ్లిపోయాక, తను తిరిగి మరిక రాడని నిర్ధారణైన ఒక ఉద్వేగ స్థితిలో క్యాంటీన్ డోర్ తెరుచుకొని ప్లాట్‌ఫార్మ్ మీదకి దూసుకొస్తుంది లారా. ఆగకుండా వెళ్లిపోయే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని ప్లాట్‌ఫార్మ్ చివరి వరకీ వెళ్తుంది.

“ఆ చావుబతుకుల అంచు మీద వణుకుతూ నిలబడిపోయాను. నేను దూకలేకపోయాను. అంత ధైర్యం చేయలేకపోయాను. నిజం చెప్పాలంటే, నువ్వు, పిల్లలే నాకు అడ్డుపడ్డారు…” అని వెక్కిళ్ల మధ్య వెళ్లబోసుకుంటుంది లారా. “నాకు మళ్లీ దక్కావు, అంతే చాలు: అని ఆమె భర్త ‘థాంక్స్’ చెప్పి ఆమెని పొదువుకోవడంతో సినిమా ముగుస్తుంది.

స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణని, ఐక్యతనీ, ఘర్షణనీ నైతికానైతిక విచికిత్సకి అతీతంగా చిత్రించే రచన, ప్రదర్శన, మరేఇతర కళారూపమైనా నాకు అపురూపమే. స్త్రీ-పురుషుల చెలిమి కథాంశంగా వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో Brief Encounter ఒకటని నా అభిప్రాయం. 1936 నాటి Noël Coward ఏకాంకిక ‘స్టిల్ లైఫ్ ‘ ఈ సినిమాకి మూలమని అంతర్జాల సమాచారం.

1984లో విడుదలైన Falling In Love సినిమా కూడా ఇదేలా పెళ్లైన వాళ్ల మధ్య రైల్వే స్టేషనులో అంకురించిన ప్రేమ కథే. అయినా, మనుషులకంటే వ్యవస్థలు ఎక్కువైపోయి అమెరికన్ సమాజపు లావాదేవీ విలువల చుట్టూ అల్లుకున్న ఆ సినిమాలో మనోవేదనలకి తావు లేదు. నా ఆల్‌టైమ్ ఫేవరేట్ Meryl Streep అంతటి జగన్మోహన సౌందర్యం ఉందన్న ఒకే ఒక్క కారణం తప్ప Falling in Loveలో చూడదగింది పెద్దగా ఏంలేదు, Brief Encounterతో పోలిక ఎంత మాత్రం లేదు.

Brief Encounter పదిహేనేళ్ల క్రితం ఏదో ఫిలిం ఫెస్టివల్‌లో మొదటిసారి చూసి, మమేకమై, లారాతో పాటు వెక్కిళ్లు పడి, ఆ జంట వియోగ దుఃఖాన్ని మనఃశ్శరీరాల్లో నింపుకొని థియేటర్ బైటకి వచ్చాను.

నా తోటి ప్రేక్షకుడు, పరిచయమున్న వాడే, చదువుకున్న వాడు కూడా, ఇలా అన్నాడు నాతో-
“సమాజమండీ. నిజంగా చాలా గొప్పది. ఎన్ని తప్పుల్నైనా సరిచేస్తుంది. మళ్లీ వ్యవస్థని గాడిలో పెడుతుంది- మా దొడ్డ సమాజం లేండి… ”
ఆ నీతిబోధకి దిమ్మెరబోయాను.

లారా- ఎలెక్‌ల మీద నిఘా కళ్లతో పొంచి, వారి దగ్గరితనాల్ని చుప్పనాతి గోళ్లతో చీరి, కువకువలాడే పసిగుడ్డు ప్రేమల్ని పొడిచి పొడిచి, రెక్కలల్లారుస్తున్న గద్దరి గద్ద సమాజాన్ని చించి పోగులెయ్యాలని ఆ క్షణంలో కుతకుతలాడుతున్న నాకు, అతని వ్యాఖ్యానం మరింత మంటపెట్టింది. అతన్ని చీత్కరించడం సోకాల్డ్ సమాజం దొంగ నీతులమీద ఖాండ్రించి ఊసినంత ఊరట కలిగింది.

ఈ పదిహేనేళ్లుగా Brief Encounterని ఇప్పటి వరకూ ఎన్నోసార్లు చూశాను, చూస్తూనే ఉంటాను. నా మటుకు నాకు ఈ సినిమా ఒక సలపరింతల గాయము, సాంత్వనల లేపనమూ కూడా.

-నరేష్ నున్నా