Menu

Bicycle Thieves

జీవితమొక పద్మవ్యూహం . ఇక్కడ మనం వేసే ప్రతి అడుగూ ఎడతెగని, అలుపెరుగని పోరాటం.

అదిగో అక్కడ చూడండి! రోడ్డు మీద వందల సంఖ్యలో, నిరాశ నిస్పృహలు నిండిన కళ్లతో నీరసంగా నిలబడి ఉన్నారే వాళ్లను చూడండి. వాళ్లల్లో ఒకడిని ఎంచుకోండి. ఎవరైనా ఫరవాలేదు. దారిన పోయే అనేక మంది దానయ్యలలో ఎవరో ఒకరు చాలు. అతనే ఈ నాటి మన కథకు హీరో. ముందే చెప్పాను కదా, అతను మనందరి లాంటి వాడే!

మన కథకు నాయకుడైతే దొరికాడు కానీ, ఈ కథ ఎప్పుడు, ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. నిజానికి ఈ కథ, ఎక్కడైనా ఎప్పుడైనా జరగొచ్చు. కానీ సౌలభ్యం కోసం ఈ కథ జరిగిన స్థలకాలాదులు కాస్తా వర్ణించుకుందాం.

స్థలం : ఇటలీ దేశం లోని రోమ్ నగరం.
కాలం : రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కొన్ని నెలల తర్వాత.
పరిస్థితి : దేశంలో నిరుద్యోగ సమస్య అతి భయంకరంగా ప్రబలి ప్రజా జీవితాల్లో ఎంతో సంక్షోభాన్ని సృష్టిస్తోన్న సమయం.

సరే ఇప్పుడు మన హీరోకి ఒక కొడుకున్నాడనుకుందాం. అతని వయసు పది సంవత్సరాలని నిర్ణయిద్దాం. ఇంతా చేశాక వారికి నామకరణం చేయకుంటే ఎలా?

తండ్రి పేరు రిచీ . కొడుకు పేరు బ్రూనో .

సరే! ఇక రండి. జీవితంలోని సత్యం తెలుసుకోవడంలో వీళ్లను కాసేపు ఉపయోగించుకుందాం. ఈ తండ్రీ కొడుకులతో కాసేపు రోమ్ నగరంలో ప్రయాణం చేద్దాం.

bicy-1

దేశంలోని లక్షలమంది నిరుద్యోగ కార్మికుల్లో ఒకడు రిచీ. అందరిలానే అతను కూడా ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎప్పటిలానే ఉద్యోగం కోసం క్యూలో నిల్చుని ఆశగా ఎదురుచూశాడు. ఒక రోజు అతనికి అదృష్టం కలిసివచ్చింది. ఉద్యోగం వచ్చింది. కానీ అధుకారులు అతను ఉద్యోగంలో చేరాలంటే సైకిలు తప్పనసరిగా ఉండాలని ఒక నియమం పెట్టారు.

పాపం రిచీకి ఒకప్పుడు సైకిలుండేది. కానీ కుటుంబాన్ని పోషించలేని స్థితిలో సైకిల్ ని తాకట్టు పెట్టాడు. ఇప్పుడా సైకిల్ ని విడిపించేంత డబ్బు అతని దగ్గర లేదు. భార్య దగ్గర తన బాధను వెళ్ళబోసుకున్నాడు . చివరికి ఇంట్లోని దుప్పట్లు తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో సైకిల్ విడిపించుకున్నారు. నెలకో పన్నెండు వేల జీతమున్న ఉద్యోగం, అంతే కాకుండా కుటుంబ సంరక్షణార్థం ఇచ్చే మరి కొంత డబ్బే కాకుండా, ఆఫీస్ సమయానికి మించి పని చేస్తే వచ్చే ఓవర్ టైం డబ్బులు అన్నీ లెక్కలేసుకుని, రాబోయే రోజుల్లో తమ జీవితాల గురించి కలలు కంటూ ఇంటికి బయల్దేరారు భార్యాభర్తలు. మార్గమధ్యంలో ఒక జోతిష్యురాలి ఇంటికి వెళ్ళింది భార్య. త్వరలోనే రిచీ కి ఉద్యోగం రాబోతుందని ఆమె అంతకు ముందు చెప్పి ఉండడంతో ఆమె కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. రిచీ కి ఇది ఏ మాత్రం నచ్చలేదు. తన ఉద్యోగానికీ, జ్యోతిష్యురాలు చెప్పినదానికీ ఏ మాత్రం సంబధం లేదని ఆమె ను అక్కడ్నుంచి తీసుకొచ్చాడు.

ఉదయమైంది. రిచీ తన ఉద్యోగానికి బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. మధ్యాహ్నం తినడానికి వంటచేసి పార్శిల్ చేసి అతనికిచ్చింది. రిచీతో పాటు కొడుకు బ్రూనో సైతం తయారయ్యాడు. ఇద్దరూ కలిసి సైకిల్ మీద బయల్దేరారు. బ్రూనో పని చేస్తున్న ఒక పెట్రో బంక్ వద్ద అతన్ని వదిలిపెట్టి, సాయంత్రం ఏడింటికి వస్తానని చెప్పి అక్కడ్నుంచి బయల్దేరాడు రిచీ.

గోడలకు సినిమా పోస్టర్లు అంటించే ఉద్యోగం రిచీది. తనతోపాటు పని చేసే వ్యక్తితో కలిసి పని లోని మెలుకవలు నేర్చుకుని కాసేపటికి సొంతంగానే పోస్టర్లు అంటించడం మొదలుపెట్టాడు.

bicy-2

అదిగో ఆ గోడపై నిచ్చెన వేసుకుని పోస్టర్ అంటిస్తున్నాడే అతనే మన రిచీ. అరే! మరి వీళ్లెవరు? అతన్నే గమనిస్తూ అటూ ఇటూ ఎందుకు తిరుగుతున్నారు? గోడకానించిఉన్న రిచీ సైకిల్ తో వీళ్లకేం పని? అరెరే! చూశారా ఎంత ఘోరం జరిగిపోయిందో? ఇంతకుముందు అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్న వాళ్ళు సైకిల్ దొంగలు. నిచ్చెన పైన ఉన్న రిచీ ఇదంతా చూశాడు. దొంగను వెంటాడాడు. కానీ అతని వేగాన్ని అందుకోలేకపోయాడు. దిగులుగా తన కొడుకు పని చేసే వద్దకు వచ్చాడు. బ్రూనోని ఇంటి వద్ద వదిలి తన స్నేహితుడి దగ్గరకు చేరుకున్నాడు రిచీ. జరిగిందంతా అతనికి చెప్పాడు. అంతా విన్న స్నేహితుడు దొంగతనం చేయబడిన సైకిళ్లు ఎక్కడ అమ్ముతారో అతను తెలుసునని, తర్వాత రోజు ఉదయమే వెళ్లి సైకిల్ వెతికే పనిలో ఉందామని చెప్పాడు.

*****

ఉదయాన్నే తన స్నేహితులతో కలిసి సైకిల్ వెతకడానికి బయల్దేరాడు రిచీ. తన సైకిల్ గురించి తన కంటే ఎక్కువ తెలిసిన బ్రూనో తోడు రాగా సెకండ్ హ్యాండ్ సైకిళ్లు అమ్మే షాపులన్నీ తిరిగి చూశారు. కానీ లాభం లేదు. ఎక్కడా దాని ఆచూకీ దొరకలేదు. తన సైకిలు పోయిందని పోలీసు అధికారికి రిపోర్ట్ చేస్తే, రిపోర్ట్ స్వీకరించడమే తమ బాధ్యత అనీ, సైకిలు వెతుక్కునే బాధ్యత అతనిదేదని అధికారి అంటాడు. చివరికి అతనికి ఒకటే మార్గం కనిపిస్తుంది. జ్యోతిష్యం మీద నమ్మకం లేకపోయినా, అంతకు ముందు రోజు తన భార్య వెళ్లిన జ్యోతిష్కురాలు దగ్గరకు వెళతాడు. “దొరికితే వెంటనే దొరుకుతుంది. లేకపోతే దొరకదు” అని ఆమె జోస్యం చెబుతుంది. ఇక చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరుగుతారు తండ్రీ కొడుకులు.

bicy-3
చివరికి ఒక చోట సైకిల్ దొంగను చూస్తాడు. కానీ దొరికినట్టే దొరికి తప్పించుకుంటాడు. సైకిల్ దొంగ కి పరిచయస్థుడైన ఒక ముసలివాడిని పట్టుకుని అతని అడ్రెస్ కనుక్కుంటాడు. కానీ అతడే దొంగ అని సాక్ష్యం తేలేకపోవడం వల్ల తన అభియోగం నిరూపించుకోలేకపోతాడు.

కీలక సన్నివేశం

పోయిన సైకిల్ తిరిగి తెచ్చుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో బాధగా అక్కడ్నుంచి బయల్దేరుతారు తండ్రీ కొడుకులు. ఏం చెయ్యాలో తోచని స్థితిలో మౌనంగా నడుస్తుంటాడు రిచీ; తండ్రి బాధను అర్థం చేసుకునీ ఏమీ చేయలని దిగులుతో అతని వెనుకనే నడుస్తుంటాడు బ్రూనో. కాసేపటికి వాళ్లిద్దరూ ఫుట్ పాత్ మీద కూర్చుంటారు. రిచీ దిక్కుతోచని స్థితిలో చుట్టూ చూస్తాడు. అతని ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపిస్తాయి. ప్రతివాడికీ సైకిలుంది. తనకి మాత్రం సైకిలెందుకు ఉండగూడదు? తను చేసిన తప్పేమిటో రిచీ కి అర్థం కాదు. సైకిళ్లు మాత్రం ఒకదాని తర్వాత ఒకటు మెరుపుల్లాక అతని కళ్ల ముందు మెరిసి మాయమైపోతుంటాయి. సైకిళ్ల మీద ఎవరు కూర్చున్నదీ అతడు గమనించడు; వాటి చక్రాలనే చూస్తూ ఉంటాడు. తండ్రి వైపే చూస్తూ బాధగా కూర్చుంటాడు బ్రూనో.

bicy-4
రిచీ లో అసహనం పెరిగిపోతూ ఉంటుంది. అవకాశం వచ్చినట్టే వచ్చి మాయమవడం అతని జీర్ణించుకోలేకపోతాడు. ఇంతలో రిచీకి ఒక ఆలోచన వస్తుంది. బ్రూనో ని పక్క వీధిలోని ఒక చోట ఉండమని చెప్పి పంపిచేస్తాడు. రిచీ తన ఆలోచనను అమలుపెట్టే ఉద్దేశంలో అక్కడ్నుంచి కదులుతాడు. కాసేపటికి ఒక వీధిలో గోడకు ఆనించిఉన్న ఒక సైకిల్ అతనికి కనిపిస్తుంది. రెండు సార్లు అటూ ఇటూ తిరిగి ఎవరూ చూడటం లేదని నిశ్చయించుకున్నాక ఆ సైకిల్ దొంగలించి అక్కడ్నుంచి వెళ్లబోతుండగా ఎవరో చూసి “దొంగా, దొంగా” అని అరవడంతో వీధిలోని వారు పోగై అతన్ని వెంటాడుతారు.

పక్క వీధులో తండ్రి కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ బ్రూనో సైకిల్ పై పారిపోతున్న తండ్రిని చూస్తాడు; బ్రూనో కూడా వారి వెంటే పరిగెడ్తాడు. కాసేపటికి వెంటాడుతున్న జనాలకు దొరికిపోతాడు రిచీ. సైకిలు దొంగలించిన అతన్ని నలుగురూ పట్టుకొని కొడుతూఉంటారు. అది చూసి బ్రూనో గుంపుమధ్య నుంచి దూరివచ్చి కాళ్ళవద్ద చేరి “నాన్నా,నాన్నా” అని హృదయభేదకంగా ఏడుస్తాడు. ఆ ఒక్క ధ్వనీ మన హృదయాలను కలకాలం దోచివేస్తుంది. రిచీ సిగ్గుతో తలచించుకుంటాడు. అందరూ రిచీని పోలీసు స్టేషను కి తీసుకెళ్ళమని సలహా ఇస్తారు. కాని పక్కన ఏడుస్తోన్న బ్రూనో ని చూసి, దయతలచి అతన్ని వదిలిపెట్టేస్తాడు. ఈ సన్నివేశం చూస్తున్న కాసేపూ ఆ బాలుడిలో మనం లీనమైపోతాము. తన తండ్రిని ఎందుకు కొడుతున్నారో ఆ బాలుడికి తెలియనట్టే, మనకి కూడా జీవితం ఇంత అర్థరహితంగా, క్రూరంగా, మానవుడికి శత్రువుగా ఎందుకుండాలో అర్థం కాదు.

ముగింపు : ముందే చెప్పినట్టు ఇది మనం బాగా ఎరిగిన కథ. మనకు తెలిసిన మిత్రుల జీవితాల్లోనో, రోడ్డు మీద నడుస్తోంటే ఫుట్ పాత్ మీద జీవించే అభాగ్యుల జీవితాల్లోనో, ఇంటికి వస్తే ఉద్యోగం కోసం తిరిగి తిరిగి వచ్చిన మన తమ్ముడి జీవితంలోనో, రిచీ అనే దురదృష్టవంతుడి కథ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే “బైసికిల్ థీవ్స్” చిత్రానికి విశ్వజనీనత ఉన్నది. మీకూ నాకూ ఎవరికైనా ఆ సమస్య వర్తిస్తుంది. ఒక పేద కార్మికుడు తను పోగొట్టుకున్న సైకిలు కోసం చేసే అన్వేషణ జీవితం కోసం చేసే అన్వేషణే. ఆ సైకిలి ఒకసారొ దొరికినట్టనిపించి మళ్లీ మళ్లీ అందకుండా పోతుంది. జీవితానికి ఎలాగయితే ఆద్యంతాలు లేవో, నీలో కాకపోతే నాలో, కాకపోతే మరొకరిలో జీవితం ఎలాగయితే అవిచ్ఛిన్న స్రవంతిలాగ ప్రవహిస్తూ వుంటుందో, అలాగే ఈ కథ కూడా మన నిత్య జీవితానుభవాలలోకి చొచ్చుకుని ప్రవహించి మళ్ళీ మళ్ళీ మనల్ని కలవర పెడుతుంది.