Menu

బెర్గ్ మెన్ ’ వైల్డ్ స్ట్రా బెర్రీస్

సినిమా ఓ కళాత్మక ప్రక్రియ అన్నదానికి సరైన నిర్వచనాలు గా ప్రపంచ సినీ చరిత్ర లో ఎన్నదగిన అతి తక్కువ సినిమాల్లో స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్ మెన్ సినిమాలు ముఖ్యమైనవి. సినిమాల ద్వారా , ఆనాటి నుంచీ ఈ నాటి వరకూ సినిమా అభిమానులకీ ముఖ్యంగా విమర్శకులకూ, మేధావులకూ రకరకాలుగా అర్థం అవుతూ ఆరాధించబడుతూ వచ్చాడు బెర్గె మెన్. ఆయన కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు. ఆయనొక ఫిలాసఫర్. ఆయనొక కవి. ఆయనొక స్వాప్నికుడు. ఆయనొక సౌందర్యాన్వేషి. బెర్గ్ మెన్ సినిమాలు చూస్తున్నప్పుడు పై అన్ని విధాలుగా ఆయన మనకు కనిపిస్తాడు.

బెర్గె మెన్ సినిమాల్లో మానవ స్వభావాల్లో వుండే సంక్లిష్టతా ,మార్మికతా,ఈ సృష్టి పట్ల లోతైన ఆలోచనలూ,సమాధానం లేని అనేక ప్రశ్నలూ మనకు కనిపిస్తాయి. ఈ సృష్టి గురించో దేవుడి గురించో సినిమా తీస్తే బావుంటుంది.ఇదేదో కొత్త ఐడియాలా వుంది అని సినిమాలు తీసిన దర్శకుడు కాదు బెర్గ్ మెన్. ఆయన లోపలి సంఘర్షణలూ, ఆయనకున్న సందేహాలూ, జీవిత అనుభవాలూ అన్నింటినీ సినిమాల్లో చూపాడు బెర్గ్ మెన్ .అందుకే బెర్గ్ మెన్ సినిమా ఆయన వ్యక్తిగత జీవితం రెండూ వేరు వేరు కాదు.

సినిమా అనే మాధ్యమం ద్వారా దేవుడు ఉన్నాడా ? లేడా ?ఉంటే ఎక్కడున్నాడు ? ప్రపంచం లో ఇన్ని ఘోరాలూ, ధారుణాలూ జరుగుతుంటే చూస్తూ ఏం చేస్తున్నాడు ? ఇలాంటి ఎన్నో లోతైన, విలువైన ప్రశ్నలను సూటిగా అడిగాడు బెర్గ్ మెన్.

బెర్గ్ మెన్ సినిమాల్లో అత్యుత్తమ సినిమాలు గా సెవెంత్ సీల్, వైల్డ్ స్ట్రాబెరీస్ & వింటర్ లైట్ లను చెప్పుకోవాలి. బెర్గ్ మెన్ కు గొప్ప పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చిన సినిమాల్లో ఓ ముఖ్యమైన సినిమా వైల్డ్ స్ట్రా బెర్రీస్. ఆయన సినిమాలన్నింటి లో కెల్లా ఎమోషనల్ సినిమా ఇది. హ్యూమన్ సైకలాజికల్ ఎనాలిసస్ పరంగా అద్బుతం ఈ సినిమా..

1957 లో వచ్చిన వైల్డ్ స్ట్రా బెర్రీస్ సినిమాలో ప్రముఖ స్వీడిష్ నటుడు, దర్శకుడు విక్టోర్ ప్రధాన పాత్ర లో నటించాడు. బెర్గ్ మెన్ సినిమాల్లో తరచుగా కనిపించే బిబీ అండర్సన్, ఇంగ్రిడ్ తులిన్ ,గున్నార్ బో స్ట్రాండ్, మాక్స్ వాన్ సైడో వంటి వారూ.. ఈ సినిమాలో నటించారు.ఈ సినిమా టైమ్ లో బెర్గ్ మెన్ హీరోయిన్ బిబీ అండర్సన్ లు సహజీవనం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బెర్గ్ మెన్ చేసిన చాలా సినిమాల్లో బిబీ అండర్సన్ నటించింది.

ఈ సినిమా లో ప్రధాన పాత్ర ఓ ప్రొఫెసర్. జీవిత చివరి దశ లో ఒంటరిగా కాలం గడుపుతున్నాడు. ఈయనకు ఓ యూనివర్సిటీ జూబ్లీ డాక్టర్ గా అవార్డు ప్రకటిస్తుంది. ఈ అవార్డ్ తీసుకోవటానికి ప్రొఫెసర్ చేసే ప్రయాణమేఈ సినిమా నేపథ్యం. డ్రీమ్-రియాలిటీ, టైమ్- స్పేస్, పాస్ట్- ప్రెజెంట్,ఇలా ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే తో ప్రొఫెసర్ జీవితం మొత్తాన్ని సునిశితంగా దర్శించటమే ఈ సినిమా.

ఒక డాక్టర్ గా ,మెడికల్ రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ గా,పబ్లిక్ లో మంచి పేరు సంపాదించాడు బోర్గ్. కానీ ఆయన ప్రైవేట్ లైఫ్ లో సరైన ,చెప్పుకోదగిన సంగతులు కానీ, అనుభూతులు కానీ లేవు. ఒక కొడుకు గా, ఒక భర్తగా, ఒక తండ్రి గా అతను ఏ ఒక్కరి మీదా ఏ ఎమోషన్ నూ సరిగ్గా చూపలేదు. ఆయన లోకమే వేరు. ఆయన తత్వమే వేరు అన్నట్టు గా గడిపాడు. ఇప్పుడు చనిపోవటానికి దగ్గరపడుతున్న వయసులో చేసిన తప్పులకు భయం మొదలైంది. భయంకరమైన కలల రూపం లో ఆ తప్పుల శిక్షలు వేధిస్తుండటం ఆయన్ని అప్రశాంతతకూ, ఆందోళనకూ గురిచేస్తాయి.

గతం లోని సంఘటనలు గుర్తుకొచ్చే కొద్దీ మునుపెన్నడూ కలగని భయాలకూ ,ఆందోళనలకూ, సంఘర్షణలకూ లోనవటం,చివరకు పశ్చాత్తాపపడటం ,ఆయన గురించి మొదటిసారి కొత్తగా ఆయనే పూర్తిగా తెలుసుకోవటం..ఇదీ ఈ వైల్డ్ స్ట్రాబెరీస్ సినిమా కథ.

సినిమా మొదట్లో ప్రొఫెసర్ బోర్గ్ తన గురించి చెప్పుకుంటున్నట్టు ఓ వాయిస్ ఓవర్ వుంటుంది. మానవ సంబంధాల్లో వ్యక్తుల క్యారెక్టర్, బిహేవియర్ ల గురించి చర్చలు,చివరకు ఎవరు ఎలాంటివారు అని నిర్దారించటాలు ఎక్కువగా జరుగుతుంటాయి.అందుకే నేను ఈ సంబంధాలకు దూరంగా బతికాను. ఇప్పుడు నా ఈ చివరి దశ లో చాలా ఒంటరిగా వున్నాను అని చెప్పటం మనం గమనించవచ్చు.ఇలా,ఇన్నాళ్ళూ ప్రొఫెసర్ బోర్గ్ ఎలా బతికాడు అనే దాని గురించి మనకు ఓ ఐడియాను క్రియేట్ చేస్తాడు బెర్గ్ మెన్.
వైల్డ్ స్ట్రా బెరీస్ సినిమాకు సెంట్రల్ పాయింట్ అయిన సెల్ఫ్ కాన్ ఫ్రంటేషన్ ను బెర్గ్ మెన్ అత్యంత భయకర, విషాద డ్రీమ్స్ రూపం లో చూపించాడు. ప్రపంచ సినీ చరిత్ర లో మోస్ట్ పవర్ ఫుల్ అండ్ మిస్టీరియస్ సీక్వెన్స్ గా ఈ సినిమా లో ని డ్రీమ్ స్వీకెన్స్ ను చెప్పుకోవాలి. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ పొయిట్రీ లు ఈ డ్రీమ్స్. ఇప్పటికీ ఈ డ్రీమ్స్ మీద ఫిల్మ్ క్రిటిక్స్ పరిశోధనలు చేస్తూ,కొత్త కొత్త ఇంటర్ ప్రెటేషన్స్ చేస్తున్నారంటే, ఇవి ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు.

మొదటి డ్రీమ్ లో.. మార్నింగ్ వాక్ కెళ్ళిన ప్రొఫెసర్ దారి తప్పుతాడు. తెలియని ఓ కొత్త ప్రదేశం లో ఆయన ఒక్కడే నడుస్తూ వుంటాడు. అంతా నిశ్శబ్దం..నిర్మానుష్యం. కేవలం మోడువారిన చెట్లు తప్ప ఎవరూ లేరు. అటూ ఇటూ చూస్తాడు. అక్కడ ఓ స్తంభానికి వేలాడ దీసి ఓ పెద్ద క్లాక్ ఒకటి కనిపిస్తుంది. ఐతే..ఆశ్చర్యంగా ఆ క్లాక్ లో ఏ ముల్లూ లేవు. ఆయన చేతి వాచీ ని తీసి చూసుకుంటాడు.దాంట్లో నూ ఏ ముల్లూ కనిపించవు. ఇక్కడ బెర్గ్ మెన్ కాలం అనేది అసలు లేకపోవటం అనే లోతైన విషయాన్ని విజువల్ గా చెపుతున్నాడు.

కాలం అనేది మనిషికి లేకపోవటం ఒక్క చనిపోయాక మాత్రమే జరిగేది. ఈ ప్రొఫెసర్ కు ఇంకా టైమ్ లేదు అన్న నిజాన్ని గుర్తుచేస్తున్నాడా లేదా నువ్వు ఇప్పటికే చనిపోయావ్ అని చెపుతున్నాడా.. ఇలా రెండు రకాలు గా నూ దీన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ క్లాక్ కింద వున్న గ్లాసెస్ లో కన్ను బ్లీడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ వ్యక్తి కి ఐ సైట్ సరిగ్గా లేదన్న విషయం చెపుతున్నాడు బెర్గ్ మెన్ అంటే నీ టైమ్ దగ్గర పడింది, ఇప్పటికే లేటయ్యిందని గుర్తు చేయటాన్ని మెటాఫర్ గా చెపుతున్నాడు.

కాలం లేదు, ఇప్పటికే ఆలస్యం అయింది. కొంత కాలం మాత్రమే వుంది.ఈ టెన్షన్ ను సినిమా కథనానికి ఉపయోగించారు బెర్గ్ మెన్.మొదటి డ్రీమ్ నుంచి మేల్కొనగానే ప్రొఫెసర్ హడావిడిగా పక్కనున్న అలారం ను చెవి దగ్గర పెట్టుకుంటాడు. టైమ్ తిరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. హమ్మయ్య.. టైమ్ ఇంకా మిగిలే వుంది. ఇప్పుడు అర్జంటు గా ఈ తక్కువ టైమ్ లో కొత్త జీవితానికి స్వాగతం పలకాలి. కొత్త కాలాన్ని ..కొత్త విజన్ తో ఉపయోగించుకోవాలి. వెంటనే అంతకు ముందు అనుకున్న ప్లాన్ ను కాదనుకొని, చిన్నప్పుడు తను గడిపిన ఊరు మీదుగా కారు లో జర్నీ చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఈ ప్రొఫెసర్ కేవలం రక్త మాంసాలున్న ఓ మనిషి, అంతకుమించి ఏ హ్యూమన్ వాల్యుస్ ఇతనిలో లేవు. ఈ విషయాన్ని ఓ డ్రీమ్ లో చాలా సూటిగా చెపుతాడు బెర్గ్ మెన్. ప్రొఫెసర్ దారి తప్పిన డ్రీమ్ లో.. ఓ చోట దూరంగా అస్పష్టంగా ఓ మనిషి ఆకారం కనిపిస్తుంది.కానీ దగ్గరకెళితే,కళ్లూ ,ముక్కూ ఇలా ఏమీ లేకుండా కేవలం ఫేస్ అవుట్ లైన్ భయంకరంగా వుంటుంది. ఆ మరుక్షణ మే ఆ ఆకారం నేల కూలి బెలూన్ లో గాలి తీసినట్టు ముడుచుకుపోతుంది. రక్త ప్రవాహం కనిపిస్తుంది.దూరంగా మనిషి,దగ్గరగా కాదు అని చెపుతున్నది ఈ ప్రొఫెసర్ గురించే. సినిమాల్లో చాలా చోట్ల బోర్గ్ ఫేస్ ఎక్స్ ప్రెషన్ సిమిలర్ గా ఈ ఆకారం ఇచ్చే ఎక్స్ ప్రెషన్ లా వుండటమే దీనికి సాక్ష్యం.

వైల్డ్ స్ట్రా బెరీస్ సినిమాలో బోర్గ్ మానసిక వ్యవస్థ ను డ్రీమ్స్ లో గొప్పగా చూపించాడు బెర్గ్ మెన్. చావంటే భయం,నాకంటూ ఎవరూ లేరే అన్న భయం,నేనెవరినీ సరిగ్గా అర్థం చేసుకోలేదా అన్న గిల్టీ వల్ల భయం ,కన్న కొడుకు కూడా నన్ను ద్వేషిస్తాడనే నిజం తెచ్చిన భయం,ఈ అవార్డ్ తీసుకోవటానికి అర్హుడిని కానేమో నన్న భయం, ..ఇలా లైఫ్ లో హ్యుమన్ వాల్యూస్ కు విలువనివ్వని వ్యక్తి చివరి దశ లో ఎలాంటి భయాలకు గురయ్యాడో వివరించే కథే ఈ వైల్డ్ స్ట్రా బెరీస్ అని చెప్పొచ్చు.

ప్రొఫెసర్ బోర్గ్ నైట్ మేర్స్ లో ఒకటి ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. నిజంగా ఆయన చనిపోయాడేమో అన్నంత భ్రమను కలిగిస్తుంది. ఓ శవ పేటిక. ఎవరిదో చేయి బయటకు కనిపిస్తుంటుంది. బోర్గ్ ఎవరో చూద్దామని దగ్గరకు వెళతాడు.ఆ శవం బోర్గ్ చేయి ని గట్టిగా పట్టుకుంది. చూస్తే…ఆ డెడ్ బోడీ ఎవరిదో కాదు ప్రొఫెసర్ దే. ఒక్కసారిగా భయం. తన చేయి ని గట్టిగా లాక్కుంటాడు. ఐతే.. ఆ పట్టుకున్న చేయి కూడా లోపలకు లాగుతుంటుంది. శవం తన పేటిక లోకి రమ్మని..ఇదే తన అసలు స్థానమని ప్రొఫెసర్ ను లాగుతోందా? లేదా ప్రొఫెసర్ తనను తాను ఈ శవ పేటిక లోంచి బయటకు తీసుకు రమ్మని ప్రాధేయపడుతున్నాడా ? ఇలా రెండు విధాలా సరిపోయే ఇమేజ్ ను క్రియేట్ చేసాడు బెర్గ్ మెన్. ఇద్దరూ ఒకరినొకరు లాక్కోనీ లాక్కొనీ.. చివరకు ఇద్దరు మొహాలు గుద్దుకుంటాయి. ఆ క్షణమే ఆ ఇమేజ్ బ్లర్ అవుతుంది. ప్రొఫెసర్ సడెన్ గా బెడ్ మీద నుంచి లేస్తాడు.

బోర్గ్ సారా అనే అందమైన అమ్మాయి ని చిన్నతనం లో ప్రేమించాడు. ఐతే..కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి బోర్గ్ అన్నయ్యను పెళ్లాడుతుంది. ఓ డ్రీమ్ లో..సారా తిరిగి యంగ్ గాళ్ గా ప్రత్యక్షమవుతుంది. బోర్గ్ తో మాట్లాడుతూ..నేను నీ అన్నయ్యను పెళ్ళిచేసుకోబోతున్నాను. చూడు.. ఈ అద్దం లో నీ మొహం చూసుకో.. నువ్వు చావుకు దగ్గర్లో వున్నావ్. ఏదీ నవ్వు.. నవ్వటానికి ప్రయత్నించు…అంటుంది. బోర్గ్ నాకు బాధగా వుందంటాడు. వెంటనే ఆ అమ్మాయి..ఓ ప్రొఫెసర్ గా నీకు ఎందుకు బాధ కలుగుతుందో నీకు తెలియాలి కానీ నీకు తెలియదు. ఎందుకంటే నీకెంత నాలెడ్జ్ వున్నా..నీకు ఏమీ తెలియదు అని చెప్పి వెళ్ళిపోతుంది. బోర్గ్ గురించిన ఈ నిజాలు ఆయన్ని మరింతగా బాధపెడతాయి.

ఓ డ్రీమ్ లో…ప్రొఫెసర్ కు ఎగ్జామ్ పెడతారు. ఓ మైక్రోస్కోప్ లో బ్యాక్టీరియా ను కనుక్కోమంటారు. బోర్గ్ మైక్రోస్కోప్ లోకి చూస్తాడు. కేవలం తన కన్ను తప్ప ఏమీ కనిపించదు. ఈ మైక్రోస్కోప్ పాడయిపోయిందంటాడు. మళ్లీ ఆ ఎగ్జామినర్ మైక్రో స్కోప్ చెక్ చేసి బాగానే వుంది అని చెపుతాడు. బోర్గ్ కు తన కన్నే కనిపించటం వెనుక ఓన్ పాయింట్ ఆప్ వ్యూ తప్ప ఇంకోటి లేదు..అన్న లోతైన విషయాన్ని చెపుతున్నాడు బెర్గ్ మెన్.ఆశ్చర్యంగా ఈ ఎగ్జామినర్ ప్రయాణ మధ్య లో కలిసిన ట్రబుల్డ్ కపుల్ లో భర్త అవటం గమనించదగ్గ విషయం.

వైల్డ్ స్ట్రాబెర్రీస్ సినిమా ట్రముల్డ్ మ్యారేజ్ లైఫ్ కు అద్దం పట్టిందని చెప్పాలి. సరైన అవగాహన లేకపోవటం, ప్రేమ వున్నా.. అభిప్రాయాల, ఆలోచనల వైరుధ్యముండటం..ఇలా సాగే సహ జీవనం ఎంత ఘోరంగా వుంటుంది అనేది ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఈ సినిమాలో అడుగడుగునా.. మ్యారేజ్ లైఫ్ ట్రబుల్స్ ను చూపే ప్రయత్నం చేసారు బెర్గ్ మెన్.

వైల్డ్ స్ట్రా బెరీస్ సినిమాలో మనకు మూడు వేరు వేరు ట్రబుల్డ్ మ్యారేజ్ లైఫ్స్ ను చూపిస్తాడు బెర్గ్ మెన్.ఇందులో మొదటిది ప్రొఫెసర్ బొర్గ్ కొడుకూ, కోడలిది. సినిమా ప్రారంభం నాటికే వీళ్ళిద్దరూ విడిపోయి వుంటారు. పిల్లల విషయం లో వీరిద్దరి మధ్యా వేరు వేరు అభిప్రాయాలున్నాయి. బోర్గ్ కొడుకు కు ఈ లోకం లోకి తనలాగా మరో అన్ వాంటెడ్ చైల్డ్ ను తీసుకురాకూడదని మొండితనం ప్రదర్శిస్తాడు. కోడలు మాత్రం పుట్టబోయే చైల్డ్ ను ప్రేమిస్తూ..అబార్షన్ చేయించుకోనని చెపుతుంది.

ఈ సినిమా లో ట్రబుల్డ్ మ్యారేజ్ లైఫ్ అంటే ఇలా వుంటుంది అని చెప్పటానికి సరైన ఉదాహరణ గా ఓ కపుల్ కనిపిస్తారు. ప్రొఫెసర్ బోర్గ్, కోడలు వెళ్తోన్న జర్గీ మధ్య లో వీళ్ళు కొంత దూరం బోర్గ్ కారు లో ప్రయాణిస్తారు. ఉన్న తక్కువ సమయం లోనే వారిరువురి మధ్య ఎంతో దూరం వుందన్న విషయం అర్థ మవుతుంది. ఈ కపుల్ ను చూసాకే.. బోర్గ్ కు తన ఓన్ మ్యారేజ్ లైఫ్ గుర్తుకొస్తుంది.

వైల్డ్ స్ట్రా బెర్రీస్ సినిమా లో ప్రధాన పాత్ర బోర్గ్ ది ట్రబుల్డ్ మ్యారేజ్. ఇలా జరగటానికి గల మెయిన్ రీజన్ ప్రొఫెసర్ వ్యక్తిత్వం, ప్రవర్తనా అని బెర్గ్ మెన్ చాలా క్లియర్ గా చెపుతాడు. ఓ డ్రీమ్ సీక్వెన్స్ లో..బోర్గ్ భార్య స్వార్థంగా ఉండటం, చెప్పే దానికీ చేసే దానికీ ఏ సంబంధం లేకపోవటం, నిర్దయ గా వ్యవహరించటం అనే మూడు అంశాల మీద బోర్గ్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తుంది. క్షమించరాని, సరిదిద్దుకోలేని ఈ నేరాలకు ఒంటరితనం అనే శిక్ష ను బోర్గ్ అనుభవించాల్సిందే అని చెపుతాడు బెర్గ్ మెన్.

ఈ సినిమా దర్శకుడు బెర్గ్ మెన్ స్వీయ అనుభవాలనే వైల్డ్ స్ట్రా బెరీస్ సినిమా గా మలిచారు. బెర్గ్ మెన్ ఈ సినిమా చేసే టైమ్ కు మూడు సార్లు పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకొనున్నారు. బెర్గ్ మెన్ అమ్మా నాన్న లది ఓ ట్రబుల్డ్ మ్యారేజ్. నిరంతరం గొడవలతో, అపార్థాలతో సాగే కుటుంబం లో పుట్టిన బెర్గ్ మెన్ కూడా అన్ వాంటెడ్ చైల్డ్ అవటం గమనించదగ్గ విషయం. తను స్వతహాగా అనుభవించిన, చూసిన సంఘటనలూ, పాత్రలను తనదైన రీతి లో వైల్డ్ స్ట్రా బెరీస్ సినిమా గా రూపొందించారు ఇంగ్మార్ బెర్గ్ మెన్.

బెర్గ్ మెన్ సినిమాల్లో విరుద్ద అంశాల ప్రస్తావన ఎక్కువగా వుంటుంది. దేవుడు ఉన్నాడూ- దేవుడు లేడు, మగవాళ్ళూ- ఆడవాళ్లూ,పెళ్లయిన వాళ్ళూ- పెళ్ళికాని వాళ్లూ,డ్రీమ్- రియాలిటీ..ఇలా పరస్పరం విరుద్దంగా వుండే అంశాల గురించిన చర్చ సాధారణంగా మనం గమనించవచ్చు. వైల్డ్ స్ట్రా బెర్రీస్ సినిమా లో నూ.. స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం గురించీ, గాడ్ వెర్సస్ సైన్స్ గురించీ.. బోలెడన్ని డిస్కషన్స్ వున్నాయి.

ఈ సినిమా లో ఓ చోట… బోర్గ్ కోడలు సిగరెట్ తాగటానికి వెలిగించబోతుంది, వెంటనే ప్రొఫెసర్ నాకు సిగరెట్ స్మోక్ పడదు, అసలు ఆడవాళ్ళు సిగరెట్ తాగకూడదని ఓ చట్టం పెట్టాలి అంటాడు ప్రొఫెసర్. ఇక్కడే ఆడవాళ్ళు ఏడవటానికీ, పిల్లల ను కనటానికీ, పక్కవాళ్ళ గురించి మాట్లాడుకోవటానికే వున్నారని చెపుతాడు. దాంతో పాటు సిగరెట్ తాగటం మగవాడి హక్కు అన్నట్టు మాట్లాడతాడు. ఇలా స్త్రీ పురుష వ్యత్యాసం,..ఈ సినిమాలో కొన్ని చోట్ల సంభాషణ ల్లో మనం గమనించవచ్చు.

ఈ సినిమాలో ఇద్దరు యువకులు, సారా అనే అమ్మాయిని ప్రేమిస్తుంటారు. వీళ్ళిద్దరి లో ఒకరు సైన్స్ నీ, మరొకరు దేవుడు నీ గట్టిగా నమ్ముతుంటారు. వీళ్లిద్దరూ,ఈ సినిమాలో నా వాదం రైట్ అంటే నా వాదం రైట్ అని ఎప్పుడూ తగువులాడుకుంటుంటారు. ఇలా బెర్గ్ మెన్ మార్క్ విరుద్ద అంశాల సంభాషణలు ఈ సినిమాలో మనకు చాలా కనిపిస్తాయి.

వైల్డ్ స్ట్రా బెరీస్ స్క్రీన్ ప్లే ప్రపంచ సినీ చరిత్రలో ఓ గొప్ప స్క్రీన్ ప్లే గా చెప్పాలి. ఓ వ్యక్తి గతం లో కెళ్లటం. అప్పటి సంఘటనలను సునిశితంగా దర్శించటం. చివరకు తన గురించి తాను తెలుసుకోవటం. ఈ కథా వస్తువు ను చాలా పకడ్బందీ కథనం తో డ్రీమ్స్, మెమురీస్, రియాలిటీ ల తో చెప్పారు బెర్గ్ మెన్. డ్రీమ్స్ లో ప్రొఫెసర్ చేసిన తప్పుల ఎఫెక్ట్ ను చూపిస్తూనే..ప్రజెంట్ లో ప్రొఫెసర్ గురించి అందరూ ఏమనుకుంటున్నారనే విషయాన్ని మాటల ద్వారా చెపుతాడు. హౌస్ కీపర్, బోర్గ్ కోడలు, వీళ్ళిద్దరూ ప్రొఫెసర్ ఎంత మొండిగా, స్వార్థపరుడిగా వ్యవహరించేవాడో అక్కడక్కడ చెపుతుంటారు. అలా ప్రొఫెసర్ కు క్రమ క్రమంగా తన గురించి అర్థమవుతుంది.మోరల్ వాల్యూస్ పరంగా ఈ సినిమా లైఫ్ ను ఎలా గడపాలి అన్న సందేశాన్ని ఇస్తోన్నట్టు గా చెప్పుకోవచ్చు.

వైల్డ్ స్ట్రా బెరీస్… ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా..చూసిన ప్రతిసారీ గొప్ప అనుభూతిని మిగిల్చే సినిమా.స్వార్థం, నిర్దయ,మొండితనం..వీటిని వదిలి ఓ హ్యూమన్ లా బ్రతకాలనే మోరల్ ను అంతర్లీనంగా చాటి చెప్పిన సినిమా. మానవ సంబంధాల విలువను గొప్పగా ఆవిష్కరించిన సినిమా. మొత్తానికి స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్ మెన్ ప్రపంచానికి అందించిన ఓ గొప్ప సినిమా వైల్డ్ స్ట్రాబెరీస్.

వైల్డ్ స్ట్రా బెర్రీస్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు
• బెస్ట్ ఫిల్మ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్
• బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిల్మ్ అవార్ద్
• బెస్ట్ స్క్రీన్ ప్లే గా ఆస్కార్ నామినేషన్
• ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు బెర్గ్ మెన్ అస్వస్ఠ త తో హాస్పటల్ లో వున్నారు
• ఈ సినిమా ఆధారంగా వుడీ ఎలెన్ ’అనదర్ వుమెన్’
• తల్లి పాత్ర లో బెర్గ్ మెన్ మొదటి భార్య
• ఈ సినిమా టైమ్ లో హీరోయిన్ బిబీ ఎండర్సన్ తో లవ్ ఎఫైర్ నడుపుతున్నారు బెర్గ్ మెన్.
• ఎడ్వర్డ్ మంచ్ జెలసీ పెయింటింగ్ ఆధారంగా ఓ డ్రీమ్ విజువల్స్
• బెర్గ్ మెన్ ఫేవరెట్ రచయిత ఆగస్ట్ స్ట్రిన్ బర్గ్ “డ్రీమ్ ప్లే” ముందు మాట నుండి ఈ సినిమా కాన్సెప్ట్ ను తీసుకున్నారు బెర్గ్ మెన్.
• ఈ సినిమా లో ప్రధాన పాత్ర పోషించిన దర్శకుడు విక్టొర్ 1920 లో తీసిన సైలెంట్ సినిమా “కరిన్ ఇంగ్మర్స్ డాటర్” విజువల్స్ ఇన్ స్పిరేషన్ తో బెర్గ్ మెన్ వైల్డ్ స్ట్రా బెర్రీస్ లో మొదటి డ్రీమ్ విజువల్స్ ను తీసారు.

— జగన్మోహన్.

2 Comments
  1. shree December 19, 2011 /
  2. Sowmya January 31, 2012 /