Menu

అడూర్ తో ముఖాముఖి- ఎనిమిదవ భాగం

ప్ర: ఇన్స్టిట్యూట్‌నించి బయటికొచ్చాక మీరు తీసిన మొట్టమొదటి ఫిల్మ్ ఏది?

అడూర్: అదొక ఏభై (50) సెకండ్ల లఘుచిత్రం. 1967 లో కెనడాదేశం మాంట్రియాల్ నగరంలో జరిగిన “మనిషి – అతని ప్రపంచం” అనే విషయమ్మీద ఒక ఫిల్మ్ పోటీకి పంపాను. అప్పట్లో నా దగ్గర అస్సలు డబ్బు లేదు. కేమెరా, ఇతర సామాగ్రి అద్దెకి తెచ్చేందుకు కూడా. అదృష్టవశాత్తూ కేటీ జాన్ అని ముంబాయి నించి ఒక స్నేహితుడు ఆ సమయంలో స్వాతితిరునాళ్ మీద డాక్యుమెంటరీ తీసేందుకు కేరళ వచ్చాడు. ఆయన పనిలో అవీ ఇవీ సమకూర్చి పెట్టడానికీ, ప్రొడకషన్లోనూ చాలా సాయం చేశాన్నేను. ఆయన పని పూర్తయ్యాక కొంత ముడి ఫిల్ము మిగిలింది. కెమెరా కూడా ఆయనదే వాడుకోనిచ్చారు. కేవలం దానివల్లనే నేనీ చిన్న ఫిల్ము తియ్యడం సాధ్యపడింది. ఆయన ముంబాయి తిరిగి వెళ్ళినప్పుడు నేనూ ఆయనకూడా వెళ్ళి అక్కడే నా ఫిల్ము డెవలప్ చేసుకుని ఎడిట్ చేసుకోగలిగాను.

తరవాత మాంట్రియాల్ పంపాను. కొంతకాలం తరవాత నాకు వాళ్ళ దగ్గర్నించి టెలిగ్రాం వచ్చింది .. ఈ ఫిల్ము పోటీకి వచ్చిన ఇరవై అత్యుత్తమ ఫిల్ముల్లో ఒకటిగా ఎంపిక చెయ్యబడిందనీ, దీన్ని సినిమాథెక్ ఆఫ్ కెనడా వారు భద్రపరుస్తారనీ. కరమణ జనార్దనన్నాయరు అందులో హీరో.

ప్ర: అది దేన్ని గురించి?

అడూర్: జీవితం, కోరికలు .. ఇలా. డయలాగుల్లేవు. పూర్తిగా క్లోజప్ షాట్ల మాలిక అది .. ఒకమాదిరిగా కొలాజ్ అనుకోవచ్చు.

ప్ర: చిత్రలేఖ తొలి దినాల గురించి ఇంకొంచెం విశదంగా చెప్పండి.

అడూర్: మొదట్లో ప్రభుత్వ శాఖలు ఇచ్చే డాక్యుమెంటరీ కాంట్రాక్టుల కోసం తిప్పలు పడ్డాం. అవి తప్ప, ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి మాకు వేరే దారి లేదు. నేనారోజుల్లో కుటుంబ నియంత్రణ, రాష్ట్ర లాటరీ ఇలాంటి వాటన్నిటికీ డాక్యుమెంటరీలు తీశాను. దాంట్లో దొరికిన కొద్ది డబ్బూ సినిమా సామగ్రి కొనడానికి మదుపు పెట్టాము. దాంతో చివరికి మాకు వస్తు సామగ్రి బాగానే అమరింది కానీ, సినిమాలు తీసేందుకు డబ్బే ఉండేది కాదు.

మాకు దొరికిన అతి పెద్ద ప్రాజెక్టు, ఇడుక్కి హైడల్ ప్రాజెక్టుమీద ..ఆనకట్ట నిర్మాణంలో ప్రతి స్థాయినీ డాక్యుమెంట్ చెయ్యడం. మొత్తం అంతా ఎనిమిదేళ్ళ ప్రాజెక్టు. కానీ మంకాడ రవివర్మని చెన్నై నించి తెప్పించేందుకు డబ్బుల్లేవు. అందుకని నేనే షూట్ చేశాను ఆ ప్రాజెక్టు మొత్తం. ఎనిమిదేళ్ళల్లో పూర్తి చేశాం. ఎం ఎన్ గోవిందన్ నాయర్ అప్పట్లో విద్యుత్ శాఖా మంత్రి. శ్రీమతి ఇందిరాగాధి వచ్చి ఇడుక్కి ఆనకట్టని జాతికి అంకితం చేసే రోజుకి ఈ డాక్యుమెంటరీని కేరళలో అన్ని ముఖ్య సినిమాహాళ్ళలో చూపించేందుకు సిద్ధం చెయ్యాలన్నది వాళ్ళ ధ్యేయం. ఈ లక్ష్యం వల్ల నిధుల విడుదల తొందరగా జరిగింది. మేము కూడా ఈ ప్రాజెక్టు వల్ల బాగానే లాభపడ్డాం.

ఇక మీదట మీ పూర్తి నిడివి చిత్రాల గురించి మాట్లాడదాం.

స్వయంవరం

ప్ర: స్వయంవరం ఎప్పుడు తీశారు?

అడూర్: ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నించి బయటికొచ్చాక సుమారు ఏడేళ్ళు పట్టింది నాకు మొదటి ఫీచర్ ఫిల్మ్ తియ్యడానికి. ఈలోపల కాముకి అనే స్క్రిప్టుని ఫిల్మ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సమర్పించాను. ముదు వాళ్ళు దానికి మదుపు పెట్టేందుకు ఒప్పుకోలేదు. ఆ తరవాతొకసారి వాళ్ళ ఎండీని కలవడం జరిగింది. అప్పుడడిగాను, మా అర్జీ ఎందుకు నిరాకరించారని. ఆయనన్నాడూ, “ఎందుకింకా ఈ రొమాన్సులూ ప్రేమల గురించి సినిమాలు తీస్తామంటారు. ఇప్పుడిది స్వతంత్ర భారతం. నవభారత నిర్మాణంలో చాలా సమస్యలున్నాయి. అలాంటి నిర్మాణాత్మకమైన సినిమాలు తియ్యాలి మీరు.” నాకు తరవాత్తెలిసింది ఈయన ఒక సిమెంటు కంపెనీకి కూడా ఎం డీ అని. నేను చెప్పానాయనకి, బాబూ ఈ దేశ నిర్మాణం పనులన్నీ నా ఒక్కడివల్లా కావు అని.

తరవాత, కొన్ని మారిన పరిస్థితుల్లో మళ్ళీ ఆ స్క్రిప్టు అర్జీ పెట్టుకుంటే ఆమోదించారు. మంజూరైన ఋణం లక్షా యాభై వేలు. మేం అంచనా వేసిన ప్రొడక్షను బడ్జెట్ రెండున్నర లక్షలు. మేం జస్ట్ అంతకు మునుపే కుటుంబ నియంత్రణ గురించి పెద్ద స్టార్లతో భారీ బడ్జెట్ డాక్యుమెంటరీ ఒకటి తీసి ఉన్నాం.అంచేత, మా ఆర్ధిక పరిస్థితి కూడా బలంగానే ఉంది. సినిమా తీశాక పంపిణీ చెయ్యడానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది. చివరికి మేమే పంపిణీ చేసుకున్నాం.

ప్ర: మీరు మొదట వేసుకున్న పథకం ప్రకారం మీరు స్వయంవరాన్ని పూర్తి చెయ్యగలిగారా?

అడూర్: రెండు షెడ్యూళ్ళలో షూటింగ్ చేశాం. శారద (నటి) డేట్లతో సమస్య. ఆ సమయంలో ఆవిడ అనేక సినిమాల్లో చేస్తుండేది. సాధారణంగా నేను సినిమాని ఒకే షెడ్యూల్లో పూర్తి చెయ్యడానికి ఇష్టపడతాను. కానీ ఇక్కడ ఆమె సమయం ప్రకారం చెయ్యాల్సొచ్చింది. ఇలాంటి పని చేసేప్పుడు సంపూర్ణమైన ఏకాగ్రత కావాలి. నా సృజన శక్తి పదునెక్కి ఉన్న సమయంలో ఒక్క దెబ్బని సినిమా పూర్తి చెయ్యాలని నా ఉద్దేశం.

స్వయంవరంలో ఆ జంట పల్లె నించి పట్నానికి రావడం చూపించాం. మిగిలిన కథ పట్నంలో కొనసాగుతుంది. కానీ ఆ తరవాత పట్నాలకీ నగరాలకి నా సినిమాల్లో ముఖ్యపాత్ర ఇవ్వలేదు. కేరళలో నిజంగా నగరం అనేది లేదు. కేవలం టెలిఫోను స్తంభాలూ, కరంటు స్తంభాలు ఉన్నంత మాత్రాన అది సిటీ కాదు. సిటీకిఉండే కొన్ని ప్రాథమిక లక్షణాలు మన ఊళ్ళకి లేవు. కోచిలో కొద్దిగా ఉంది, కానీ అది చాలా చిన్న పరిధిలోనే. ఒక ముంబాయి, ఒక కలకత్తా లాంటి నగరాలు కేరళలో లేవు. పోనీ అలాగని భారద్దేశంలో వేరే చోట్ల ఉన్నట్టు పూర్తి గ్రామీణ వాతావరణమూ ఇక్కడ లేదు. మనదొక సమ్మిశ్రితమైన వాతావరణం. అంచేత, పూర్తిగా పెద్ద సిటీల్లో మాత్రఏ సాధ్యమయ్యే లాంటి కథలు ఇక్కడ సాధ్యం కావు.

సినిమా తియ్యడంలో ఆ నాటి రోజువారీ సమస్యల గురించి పట్టింపు ఉండదు నాకు. మంచి సినిమా అంటే ఆ తీసిన కాలం గడిచి పోయినాక, భవిష్యత్తులో కూడా దానికి విలువుడాలని నా ఉద్దేశం. ఈ లక్షణం గురించి నాకు చాలా పట్టింపు ఉంది.సినిమా కాలానికి కొంతవరకూ అతీతమవ్వాలి, రేపు, ఎల్లుండికూడా దాని విలువ నిలవాలి అంటే. నా సినిమాలు ఎప్పటికీ కాకపోయినా, భవిష్యత్తులో కొంతకాలమైనా వాటి తాజా తనాన్ని నిలుపుకోగలుగుతాయని నా ఆశ. స్వయంవరం మొన్న వేసవిలో పేరిస్ లో చూపించ్నప్పుడు దాన్ని ఎక్కువ ఇష్టపడింది యువతీ యువకులే.

ఇండియన్ న్యూ వేవ్ లో తీసిన సినిమాలు చాలా మట్టుకు పల్లెల కథలతో, అక్కడి కుల, వర్గ, హింస సమస్యలతో తీసారు. కానీ అందుకు భిన్నంగా స్వయంవరం పట్టణంలో జరిగే ప్రేమకథ. కేరళలో ఈ పల్లెల కుల హింస ఇలాంటివన్నీ ఎప్పుడో జరిగినాయి, అది వర్తమాన చరిత్ర కాదిక్కడ. అందుకని అలాంటి కథలు సృష్టించడం ఉన్న సామాజిక నిజాన్ని వక్రీకరించడం అవుతుంది. ఎప్పుడో ముప్ఫయ్యేళ్ళ క్రితం కేరళలో  తీసిన సినిమా ఇవ్వాళ్టి పేరిసియన్ (Parisian) యువతీ యువకులు ఇష్టపడ్డారంటే చూడండి. అందులో కథ విశ్వాత్మకం. అది ప్రధానంగా యువత గురించి .. వాళ్ళ ఆశలూ, ఆశయాలూ, కష్టాలూ. అది ఒక నిజ జీవిత సంఘటన గురించి .. ప్రేక్షకుణ్ణి పట్టుకుని విడవని గుణం ఒకటుంది అలాంటి సన్నివేశంలో.

ప్ర: ఇంకో తమాషా ఏంటంటే అందులో నాయకుడు విశ్వం ఒక వర్ధమాన రచయిత. మీ సినిమాల్లో నాయకుడు రచయిత అవడమో, అవడానికి ప్రయత్నిస్తుండటమో తరచూ కనబడుతుంది. కథా పురుషన్, మతిలుకళ్ .. ఈ రెంటిలోనూ అంతే. అనంతరం ఐతే రచనా ప్రక్రియ గురించి. చిన్నవయసులో ప్రసిద్ధ రచయిత కావాలనే మీ వ్యక్తిగత తపన ఏమన్నా కారణమా దీనికి?

అడూర్: అయ్యుండొచ్చు. మనకుండే అనేక దృక్కోణాలు ఏర్పడి, బలపడేది చిన్నప్పుడే కదా. ఆ సమయం నించీ మనం ప్రపంచాన్ని ఎలా చూశాం, ఎలా అనుభవించాం అనేది కూడా ఈ దృక్కోణాన్ని రూపు దిద్దుతుంది. ఇదంతా మన పనిలో ప్రతిఫలిస్తుంది. అనంతరాంలో ఇదంతా కనిపిస్తుంది. ఆర్టిస్టైన వాడు ఒకపక్కన తన సృష్టితో ఆవిష్కరిస్తుంటాడు. అదే పనిలో తాను కూడా నేర్చుకూంటూ ఉంటాడు. తాని తాను కొత్తగా గుర్తు పడుతుంటాడు.

2 Comments
  1. challa March 30, 2011 /
  2. Sravan Bharadwaja September 11, 2011 /