Menu

అడూర్ తో ముఖాముఖి- ఏడవ భాగం

ప్ర: మీరు డిప్లమా కోసం తీసిన సినిమా దేన్ని గురించి?

అడూర్: దానికి “గొప్ప రోజు” (A Great Day) అని పేరు పెట్టాను. ఒక పరమ బద్ధకస్తుడి గురించి, హాస్యభరితమైన కథ. ఆ రోజున ఈ బద్ధకస్తుడు పెళ్ళిచేసుకుందా మనుకున్న అమ్మాయి తండ్రి (కాబోయే మావగారు) మొదటిసారి అతణ్ణి చూడ్డానికి వస్తారు. వీడెంత బద్ధకస్తుడంటే ఎప్పుడూ ఏదీ సర్దడు, తన గదినైనా శుభ్రంగా ఉంచుకోడు. పొద్దున్నే పక్కలోంచి లేవకుండానే గుమ్మం దగ్గర్నించి పాలసీసా లోపలికి తెచ్చుకోడానికి బ్రహ్మాండమైన పద్ధతి కనిపెట్టిన ఘనుడు. ఆ రోజున పాపం గది సర్దుదామని అనుకుంటాడు గానీ వాడి వల్ల కాదు. ఆ కాబోయే మావగారు రానూ వస్తారు, వెళ్ళనూ వెళ్తారు. మన హీరో ఇంకేవుంది అంతా ఐపోయిందనుకుని గది మధ్యలో దిగాలు పడి కూర్చునుంటాడు. ఇంతలో అమ్మాయి దగ్గర్నించి ఫోనొస్తుంది, “మా నాన్నకి నువ్వు చాలా నచ్చావు, ముఖ్యంగా నీ చిర్నవ్వు. నీ పళ్ళు ఆయనకి చాలా నచ్చేశాయి” .. ఆ అమ్మాయి తండ్రి ఒక దంత వైద్యుడు!

ప్ర: ఆ రోజుల్లో ఆ ఫిల్మ్ కోర్సు ముగిసినాక అందరూ అటు ముంబాయికో ఇటు చెన్నైకో చేరుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరే వారు కదా, మరి మీరెలా కేరళకి తిరిగొచ్చారు?

అడూర్: కోర్సు ముగిశాక నేనేం చెయ్యాలో నాకెప్పుడూ సందేహం లేదు. నా స్వదేశానికి, స్వస్థలానికొచ్చి సినిమాలు తియ్యాలి. ఇన్స్టిట్యూట్లో ఉండగానే, కేరళకి తిరిగి వెళ్ళి ఏమేం చెయ్యాలో ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను. ఇంతలో ఆల్వాయిలో అఖిలభారత రచయితల మహాసభ జరిగింది. ఎం గోవిందన్ గారు నిర్వాహకుల్లో ఒకరు. ఆయనతో మాట్లాడుతుండగా, ఈ సభల్లో భాగంగా ఒక అంతర్జాతీయ చలనచిత్రోత్సవం కూడ పెడితే బాగుంటుందని నిశ్చయించి, దాని నిర్వహణ బాధ్యత నా మీద పెట్టారు. నేను సంతోషంగా ఒప్పుకున్నా. జనవరి 1965 లో, కేరళలో తొమ్మిది నగరాల్లో (జిల్లా కేంద్రాలన్నిటిలో), వారం రోజుల పాటు నిర్వహించాం, అనేక అంతర్జాతీయ చిత్రాల్ని చూపించాం. ఇది కేరళలో జరిగిన మొదటి అంతర్జాతీయ చిత్రోత్సవం. చాలా మంచి రెస్పాన్సొచ్చింది. వివరమైన బ్రోచర్ తయారు చేశాను. ఫిల్మ్ సొసైటీల ఏర్పాటు అనేది ఉత్సవం థీంగా పెట్టాను. భవిష్యత్తులో మంచి క్వాలిటీ సినిమాకి ప్రేక్షక బృందాన్ని తయారు చెయ్యడం నా ముఖ్యోద్దేశం. ఈ చిత్రోత్సవం జరిగిన ప్రతి నగరంలోనూ ఒక ఫిల్మ్ సొసైటీ ఏర్పడలనేది నా లక్ష్యం. తత్ఫలితంగా జూలైలో తిరువనంతపురంలో చిత్రలేఖ ఆవిర్భవించింది. తరవాత మిగతా చోట్ల కూడ సొసైటీలు ఏర్పడ్డాయి. ఒక విధంగా ఇది సినిమా బోధన అన్న మాట.

ప్ర: చిత్రలేక అలా పుట్టిందన్న మాట!

అడూర్: చిత్రలేఖ 1964 లోనే రూపు దిద్దుకుంది, మూడు ముఖ్య లక్ష్యాలతో: ఫిల్మ్ సొసైటీల్ని స్థాపించడం, ఫిల్ముకు సంబంధించిన మంచి రచనల్ని ప్రచురించడం, మంచి సినిమాల్ని నిర్మించి పంపిణీ చెయ్యడం. చిత్రలేఖ ఫిల్మ్ సావనీర్ అనే పుస్తకం మలయాలం భాషలో తదేకంగా సినిమాని గురించిన మొదటి ప్రచురణ. మీడియాలో సినిమాల్ని గురించిన చర్చ, కవరేజికి సంబంధించి ఒక లోతైన వగాహన కలగచెయ్యాలన్నది మా ఉద్దేశం. ఒకపక్కన గొప్ప పాత సినిమాళ్ని చూపించి చర్చించి, వాటిల్ని గురించి విశ్లేషణాల్ని ప్రచురించడం, ఇంకో పక్కన మనమే మంచి సినిమాలు తీసి ప్రజలకి అందించడం. ఈ రెండో దాని కోసం మేమే ఒక స్టూడియో ప్రారంభించాం. మేం మొదట పెట్టుకున్న మూడు లక్ష్యాల్నీ చిత్రలేఖ విజయవంతంగా సాధించింది.

ప్ర: ఫిలం సొసైటీల తొలి రోజుల్లో చూడ్డానికి బాగా జనం వచ్చేవారా?

అడూర్: ప్రేక్షకులు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. సినిమా ప్రదర్శనల్ని ఏర్పాటు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేది, ఆర్ధికంగానూ, సదుపాయాల దృష్ట్యానూ. మాకంటూ సొంత థియెటరు లేదు. అక్కడా ఇక్కడా వెయ్యాల్సి వచ్చేది, ప్రదర్శన స్థలం నిలకడగా ఉండేది కాదు. నానా తిప్పలూ పడి సినిమా వేసినా చూడ్డానికి పట్టుమని పదిమంది వచ్చేవాళ్ళు కాదు. అందరూ మాదొక పిచ్చి అనుకునే వాళ్ళు.అక్కడ నించుని చూస్తుంటే అనిపించేది, లోపల ఒక గొప్ప కళాఖండం ప్రదర్శించబడుతుంటే ఈ మనుషులంతా ఏం పట్టనట్టు ఇలా తిరుగుతున్నారే, ఏంకోల్పోతున్నారో కూడా వీళ్ళకి తెలీదే, అని.

ప్ర: రచయితలు కానీ ఇతర మేధావులు గానీ వచ్చేవారా మీ కార్యక్రమాలకి?

అడూర్: తమాషాగా ఈ కార్యక్రమాల్ని ఆదరించింది రచయితలూ మేధావులూ కాదు. సాధారణ ప్రజలే. ఇంజనీరింగ్ కాలేజి, లాకాలేజి, మెడికల్ కాలేజి, ఇంకా
విశ్వవిద్యాలయ విద్యార్ధులు, స్థానిక ప్రభుత్వాఫీసులు, బేంకుల్లో ఉద్యోగులు, వీళ్ళే.

ప్ర: ఇన్స్టిట్యూట్ నించి వెనక్కి వచ్చాక సినిమాల్లోనే జీవనభృతి సంపాయించుకో గలమనే నమ్మకం కలిగిందా మీకు?

అడూర్: తప్పకుండా. ఎందుకంటే, వేరే ఏ పనీ చెయ్యతలచలేదసలు. UNICEFలంటి సంస్థల నించి మంచి ఉద్యోగాల ఆఫర్లు వచ్చాయి కూడా, ఏవీ పట్టించుకోలేదు. ఒక ఐదేళ్ళ గడువు పెట్టుకున్నాను. ఆ గడువులో విజయం సాధించలేకపోతే అప్పుడు మళ్ళి పునర్విచారం చేసుకుందామని. ఐదేళ్ళు గడిచిపోయాయి .. ఏమీ జరగలేదు. పోనీ ఇంకో ఐదేళ్ళు అనుకున్నా. ఇన్స్టిట్యూట్ వదిలాక ఏడేళ్ళకి నా మొదటి సినిమా తియ్య గలిగాను.

ప్ర: పోనీ వేరే దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచెయ్యక పోయారా? ఆ వరుసలో ఏవైనా ఆఫర్లొచ్చాయా?

అడూర్: నెవర్. అసలా ఆలోచనే రాలేదు. ఆఫర్లూ ఏవీ లేవు. మేమే మదుపు కోసం కొందర్ని అడిగాము కానీ ఏదీ ఫలిచలేదు. మా స్నేహితుల్లోంచి కువైట్లో పని చేసినతను ఒకరు మొదటి సినిమా పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. కాముకి నిర్మాణం మొదలైంది. జి. అరవిందన్ఇ కూడా అందులో భాగం ఉంది. లొకేషన్లు వెదికేందుకు అతని స్కూటర్ మీద బాగా తిరిగే వాళ్ళం. సీ ఎన్ శ్రీకంఠన్నాయరు గారు రాసిన స్క్రిప్టుని నేను మళ్ళీ తిరగ రాసుకున్నాను. మూణ్ణాలుగు రోజుల షూటింగ్ కూడ చేశాను. ఇంతలో మా నిర్మాత, మా డబ్బు అనుకున్నదాన్ని వేరే వేపుకి మళ్ళించాడు. మాకు చెప్పలేదు. పోనీ అప్పటిదాకా తీసింది రషెస్ చూపెడితే డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చి మిగిలిన మదుపు పెడతారేమోనని ఆశ పడి ఆ పని చేశాం. అదీ పని చెయ్యలే. హీరోయిను కొత్తమ్మాయి కానీ ప్రసిద్ధ నటులు, మధు, పీజే ఏంటొనీ, అడూర్ భాసి ఇలా .. చాలా మందే ఉన్నారు తారాగణంలో. ఐనా ఏదీ పని చెయ్యలేదు.

ప్ర: ఆ సినిమా కథేంటి?

అడూర్: కథ సర్వసాధారణం. చాలా సాంప్రదాయకమైన కథ. అందుకని, ట్రీట్మెంట్లో బాగానే మర్పులు చేశాను. షూటింగ్ చూసిన వాళ్ళల్లో ఎవరో వెళ్ళి పెద్దాయనతో మీర్రాసినట్టు తియ్యకుండా అంతా పాడు చేస్తున్నాడు గోపాలకృష్ణన్ అని చెప్పారు. మొత్తానికి ఈ ప్రాజెక్టు మంచి మిత్రుల మధ్య చాలా అభిప్రాయభేదాల్ని అపోహల్ని సృష్టించి వొదిలిపెట్టింది. అప్పటికి నాకూ దాని మీద ఇంక ఆసక్తి పోయింది. చివరికి దాన్నలా వొదిలేశాం.

కానీ దాంతో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాన్నేను .. సినిమా పూర్తయ్యేదాకా అవసరమైన డబ్బుందని కచ్చితంగా తెలిసేదాకా షూటింగ్ మొదలెట్ట కూడదని. ఈ ప్రయత్నంలో .. అనుభవ రాహిత్యం వల్ల జరిగిన తప్పులు కూడా చాలా ఉన్నాయి. వానా కాలంలో ప్రాజెక్టు షెడ్యూలు పెట్టాం. కేమెరా సెటప్ చెయ్యంగానే వాన మొదలయ్యేది. రోజు విడిచి రోజు కుండపోతగా వాన కురిసేది. సూర్యుడసలు కనిపించేవాడు కాదు. అలా ..

-ఇంకా వుంది

3 Comments
  1. రాజశేఖర్ April 28, 2009 /