Menu

అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం

ప్ర: తిరువనంతపురంలోనా?

అడూర్: జోనల్ కార్యాలయం తిరువనంతపురంలోనే కానీ పని కోసం కేరళ అంతా తిరగాల్సి వచ్చేది. పని కూడా ఆసక్తి కరంగానే ఉండేది. ఏమంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాలకి వెళ్ళి, అక్కడక్కడా కొన్నాళ్ళైనా ఉండి వచ్చే అవకాశం అది. ఇలాంటి మారుమూల చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఏదైనా కొట్టు పైన చిన్న గది ఖాళీ ఉంటే అందులో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లోనే నెలకి ఆరొందలంటే, మంచి జీతమే. ఒక కాలేజి లెక్చరరు జీతం సుమారు 120 ఉండేది. కానీ కొంత కాలానికి మెల్లగా ఆ ఉద్యోగం పట్ల చాలా విసుగు, ద్వేషం పేరుకోడం మొదలై, ఎప్పుడు దీన్ని విడిపించుకుంటానురా భగవంతుడా అని ఎదురు చూడ్డం మొదలెట్టాను. ఆ ఉద్యోగంలో మనిషికి బొత్తిగా గౌరవమనేది లేకపోవడం నాకు నచ్చలేదు. నేను ఎంత బాగా చేసినా, నా పై అదికారైన ఇన్స్పెక్టరు ఏదో ఒక వంక పెట్టి చివాట్లేస్తుండేవాడు. అది నాకు చిరాకైంది. ఇహ అదే తరచూ జరగడం మొదలయ్యే సరికి, నా ఆత్మగౌరవం కాపాడుకునేందుకైనా ఆ ఉద్యోగం వొదిలెయ్యా లనుకున్నాను.

దానికి తోడు ఆ ఉద్యోగం నాకెంతో ఇష్టమైన నాటకాల పనికి తరచూ అడ్డు తగుల్తుండేది. నేనేదో నాటకం తయారీ మధ్యలో ఉండగా మలబార్ వెళ్ళమని ఉత్తరువొచ్చింది. సరే, ఇవన్నీ ఇలా ఉండగా మా అమ్మగారికి జబ్బు చేసింది. నేనావిడకి దగ్గర్లో ఉండాలని నిశ్చయించుకున్నా. నన్ను ఎక్కడైనా నియమించి ఉండచ్చు వాళ్ళు, కానీ మలబార్ కి వేశారు. ఆహా, నేనూ ఉద్యోగస్తుణ్ణై కుటుంబంలో బాధ్యత గలవాణ్ణయ్యాను అని అనుభవించిన ఆనందకాస్తా అప్పటికి పూర్తిగా ఆవిరైపోయింది.

ప్ర: ఆ విడుదల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రూపంలో వచ్చిందా?

అడూర్: నిజానికి నేను ఢిల్లీలో ఉన్న జాతీయ నాటక కళాశాలలో చేరాలనుకున్నా. కానీ అక్కడ హిందీలో బోధన జరిగేది. నాకేమో హిందీ అంత బాగా రాదు. హిందీ తెలిసిన వాళ్ళే అక్కడ చేరే వీలు. ఆ సమయంలోనే నేను స్క్రీన్‌ప్లేరచన, దర్శకత్వం కోర్సుకి ప్రకటన చూశాను పేపర్లో. ఆ చూడ్డం చెంగనూరు బస్టాండు ఎదురుగా ఒక టీషాపులో టీ తాగుతుండగా జరిగింది. స్క్రీన్‌ప్లే రచన అంటే ప్లే (నాటక) రచనలాగానే కదా, అదంటే నాకిష్టమే అనుకుని దరఖాస్తు పంపాను. సీటొచ్చింది. ఆరోజుల్లో ఆ ప్రవేశ పరీక్ష రాయడానికి పూణే వెళ్ళాల్సొచ్చేది.

ఇన్స్టిట్యూట్ మొదలెట్టింది 1961 లోనే. నేను చేరింది రెండో బేచి. అప్పుడు కే ఏ అబ్బాస్ సెలెక్షను కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. నేను మొదటి రేంకుతో పాటు అక్కడ విద్యార్ధులకి ఉన్న ఏకైక విద్యార్ధివేతనం (నెలకి 75 రూ.) కూడా సంపాయించాను. ఉద్యోగం వదిలేసినప్పుడు వాళ్ళిచ్చిన గ్రాట్యుయిటీ వంటి డబ్బులన్నీ పెట్టి ముందు ఒక పోర్టబుల్ టైప్ రైటర్ కొనుక్కున్నాను. దాంతోబాటే పిట్మన్ రాసిన టైపింగ్ నేర్చుకోడం ఎలా అనే పుస్తకం కూడా.

అక్కడ ఆరెస్ పృథి అనే ఆచార్యులుండేవారు. చాలా గొప్పగా బోధించేవారు. డ్రమటర్జీలో, స్క్రిప్ట్ రచనలో ఆయన తరగతులు చాలా ఉత్తేజకరంగా ఉండేవి. వారానికో స్క్రీన్ ప్లే రాయమనేవారాయన. నాకదివరకే నాటక రచనలో ఉన్న అనుభవంతో అది పెద్ద కష్టం కాలేదు. టైప్ రైటరు కూడా బాగా పనికొచ్చేది ఈ విషయంలో. ఆ తరవాత చిత్రలేఖ ఫిల్మ్ కోఆపరేటివ్ కి సంబంధించిన కార్యాలయం పనులన్నీ కూడా ఆ టైప్ రైటర్ మీదనే చేశాను. ఉత్తరోత్తరా దాని స్థానంలో ఎలక్ట్రానిక్ టైప్ రైటర్, ఇప్పుడెమో కంప్యూటర్. నాకు ఇంగ్లీషు, మలయాలం రెండు భాషల్లోనూ టైప్ చెయ్యడం వచు. అందుకని అటు ఆఫీసు పనికీ, ఇటు స్క్రిప్టులు రాసే  పనికీ రెండిటికీ పనికి వచ్చింది.

ప్ర: మీ బేచ్ లో ఇంకెవరన్నా మలయాలీ వారున్నారా?

అడూర్: నా తరగతైలోనే జాన్ శంకరమంగలం ఉండేవాడు. తరవాత, దేవదాస్, మరికొందరు సాంకేతిక విభాగాల్లో ఉండేవాళ్ళు. నాతోబాటుగా చేరిన వాళ్ళు కొందరు మాత్రమే చివరి దాకా ఉన్నారు. చాలా మంది ఏవేవో కారణాలవల్ల మధ్యలోనే కోర్సు వొదిలి వెళ్ళిపోయారు. కోర్సు పూర్తి చేసిన వారిలో కూడా బహు కొద్ది మంది మాత్రమే సినిమాలు తియ్యగలిగారు. ఒకతను కెరీర్ మొత్తం ముంబాయిలో మొదటి సహాయకుడిగా గడిపేశాడు. ఏమంటే, మంచి సంపాదన, రిస్కేమీ లేదు. మరి కొందరు ఒకట్రెండు సినిమాలు తీసి మానేశ్శారు. జాన్ శంకరమంగలం అక్కడే ఆచార్యునిగా చేరారు. చాలా ఏళ్ళ తరవాత ఆయన ఇన్స్టిట్యూట్ డైరెక్టరుగా ఉండగా నేను గవర్నింగ్ కౌన్సిలు అధ్యక్షునిగా ఉన్నాను కొన్నాళ్ళు.

అనేక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్ధులు సినిమాలు తియ్యడానికి ఉత్సుకతనే చూపించరు. ఏంటంటే, అక్కడ ఆయా గొప్ప సినిమాలన్నీ చూసి, మొదట్లో ఉన్న ఆత్మవిశ్వాసం కాస్తా కరిగి నీరవుతుంది, మనం సొంతంగా ఏమన్నా తియ్యగలమని. నేను కూడా ఏమన్నా చెప్పాలి, చెప్పగలను అనే విశ్వాసం ఉండాలి. అది లేకపోతే ఇక్కడ కష్టం. ఇంకో తమాషా ఏంటంటే, ఈ సినిమాల్ని చూడ్డానికి ఆసక్తి చూపించేది మనం సాధారణంగా మేధావులు, గొప్ప రచయితలు అనుకునే వ్యక్తులు కాదు. ఇంజనీరింగ్ విద్యార్ధులు, వైద్య విద్యార్ధులు, ఇతర విశ్వవిద్యాలయ విద్యార్ధులు, సాధారణ బేంక్ ఉద్యోగులు, ఇలాంటి వారే ఈ క్లాసిక్ సినిమాలని ఉత్సాహంగా చూసేవాళ్ళు. మేధావుల మనుకునే వాళ్ళకి ఎందుకో సినిమా అంటే బాగా చిన్న చూపుండేది. నాకదొక కనువిప్పు.

ప్ర: పూణేలో జీవితం ఎలాగుండేది?

అడూర్: కష్టంగానే ఉండేది. చాలా పొదుపుగా బతకాల్సొచ్చేది. నాకొచ్చే వేతనం కాక ఇంటినించి మా అన్నయ్య డబ్బు పంపే వారు. ఇన్స్టిట్యూట్ లో గొప్ప గ్రంధాలయముండేది. క్లాసులు ముగిసినాక ఎక్కువ సమయం అక్కడ గడిపేవాణ్ణి. రెండో ఏడాది ఋత్విక్ ఘటక్ ఆచార్యులుగా వచ్చారు. ఆయన రాకతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఐనా నేను టీచర్ల నెవర్నీ క్లాసులకి బయట కలిసేవాణ్ణి కాను. కొంచెం బిడియంగా ఉండి నలుగురితో కలవాలంటే జంకే వాణ్ణి. అంచేత హడావుడిగా స్నేహాలు చేసేసుకోడం నాకొచ్చేది కాదు.

మొదటి ఏడంతా, ఇన్స్టిట్యూట్ దగ్గర్లోనే ఒక ప్రభుత్వ విద్యార్ధి హాస్టల్లో ఉండేవాణ్ణి. గది అద్దె నెలకి 10 రూ. రెండో ఏడాదికి నికుంజం అనే పెద్ద బంగళా ఆవరణలో ఉన్న ఔట్‌హౌసులో కి మారాను. అక్కడ నాతో  బాటు ఒక మరాఠీ అబ్బాయి, విశ్వవిద్యాలయ విద్యార్ధి ఉండేవాడు. మూడో ఏడు గురుకృపకి మారాను, అక్కడ దేవదాసు నా రూమ్మేట్.

ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరిన తరువాతనే నేను మామూలు కేమెరా అయినా పట్టుకోవడం. ప్రాక్టికల్సులో భాగంగా కేమెరా ఇచ్చి ఫొటోలు తియ్యమంటే ఏం తియ్యాలో పాలుపోలేదు నాకు. చాలా ఆలోచించి, తర్జన భర్జనలు చేసి మొత్తనికి ఏవో తీశాను. అంత కిందా మీదా పడినందుకు ఫలితాలు బాగా వచ్చాయి. టీచర్ వాటిల్ని చాలా మెచ్చుకున్నట్టు గుర్తు.

శనాదివారాల్లో నగరం నడిబొడ్డుకి వెళ్ళి అక్కడ పాత హిందీ, ఇంగ్లీషు సినిమాలు బాగా చూసేవాణ్ణి. ఉదయం పూట సగం రేటుకి చూపించేవారు. అట్లా పాత హిందీ, హాలీవుడ్ సినిమాలన్నీ చూడగలిగాను.

ప్ర: ఆ సమయంలో ఇంకేమన్నా ముఖ్యమైన ఘటనలు జరిగాయా?

అడూర్: నేను మొదటి సంవత్సరంలో ఉండగానే మా అమ్మగారు పోయారు. పూణే నించి ఆ రోజుల్లో మా యిల్లు చేరుకోవాలంటే రెండ్రోజులు పట్టేది. నాకు వార్త తెలిసి ఇల్లు చేరుకునేప్పటికి అంతా ఐపోయింది.

ప్ర: మీ చుట్టూ ఉన్న విద్యార్ధి బృందం ఎలాగుండేది?

అడూర్: చాలా మంది నగరాల్నించి వచ్చిన వాళ్ళు. నాలాంటి వాళ్ళం (పల్లెటూరి బైతులు) చాలా భయపడుతుండే వాళ్ళం. అప్పట్లో నాకు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడ్డం వచ్చేది కాదు. మలయాళీలందరికీ అప్పుడూ ఇప్పుడూ ఈ సమస్య కొంత ఉంది. ఇదీ ఒకందుకు మంచిదే ననిపిస్తుంది. బయటి భాష రాకపోవడంతో మనిషి తనలో తానే సమర్ధవంతంగా ఆలోచించి పని చేసుకునేట్టు చేస్తుంది. నీ దగ్గర ఉన్నదొకటీ, నువ్వు చూపించేది ఇంకోటీ .. రెంటికీ చుక్కెదురు. కళాకారుడైనవాడు ఎదగడానికి మాటల్ని (సంభాషణల్ని) మరీ ఆషామాషీగా చూడ్డం మంచిది కాదని నా అభిప్రాయం.

రెండో ఏడాదిలో ఉండగా, అక్కడ నటన క్లాసులో చేరేందుకు వచ్చిన ఇద్దరు విద్యార్ధులు, అస్రానీ, మణి కౌల్ అనేవాళ్ళు నాకిప్పటికీ గుర్తున్నారు. అస్రానీ నటనలో కొనసాగాడు గానీ కౌల్ మధ్యలో దర్శకత్వ శాఖకి మారిపోయాడు.

అదేంటో విచిత్రం మరి, ఇన్స్టిట్యూట్‌లో ఉండగా గొప్ప ప్రతిభ చూపించే విద్యార్ధులు, కోర్సు ముగించి బయటికొచ్చాక దానికి తగిన వ్జయాన్ని సొంతం చేసుకోలేక పోయారు చాలా మంది. తగినంత గట్టి ప్రయత్నం చెయ్యలేదేమోనని నా అనుమానం.

ప్ర: జాన్ అబ్రహాం తరవాతెప్పుడో చేరారు కదూ ఇన్స్టిట్యూట్‌లో?

అడూర్: అవును. ఆయన నాకంటే వయసులో పెద్దవారు కానీ ఇన్స్టిట్యూట్‌లో తరవాత్ చేరారు. పవిత్రన్ అక్కడికి దగ్గర్లోనే ఉన్న న్యాయకళాశాలలో చదివే వారు. మా ఇన్స్టిట్యూట్‌లో జరిగే సినిమా ప్రదర్శన లన్నిటికీ ఈయన తప్పక హాజరయ్యేవారు.

ప్ర: ఇతర టీచర్లెలా ఉండేవారు?

అడూర్: కొందరు టీచర్లు అద్భుతంగా చెప్పేవారు. ఘటక్ ఒకరు. సతీష్ బహాదుర్ అనే ఆయన ఇంకొకరు. ఈయన్ని “మరీ సెటాన్” గుర్తించి పైకి తెచ్చారు.

ప్ర: ఘటక్ ఉండడం ఉత్తేజకరంగా ఉండి ఉంటుంది.

అడూర్: ఘటక్ ఇన్స్టిట్యూట్‌కి సత్యజిత్ రేగారి సిఫార్సు ద్వారా వచ్చారని చాలా మందికి తెలీదు. ఆయన అప్పటికే బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పట్లో సమాచార ప్రసార విభాగపు మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీకి రేగారే సిఫార్సు చేశారు, ఘటక్‌ని ఇన్స్టిట్యూట్‌కి ఆహ్వానించమని. అప్పటికే ఆయన తన గొప్ప చిత్రాలన్నీ తీసి ఉన్నారు. ఆయన జ్ఞానం అపారం. వేదాలు, సంస్కృత గ్రంధాలన్నీ ఆయనకి కరతలామలకంగా ఉండేవి. ఆయన లెక్చర్లెప్పుడూ, ముఖ్యంగా తన సినిమాల్ని విశ్లేషిస్తూ చెప్పిన పాఠాలు, చాలా గొప్పగా ఉండేవి. రే సినిమాల గురించి కూడా ఆయన చెప్పే లోతైన విషయాలు చాలా బాగుండేవి, వాటిని ఆయన చాలా అభిమానించేవారు, అధ్యయనం చేశారు. ఆయన జ్ఞానం ఇంత గొప్పదై ఉండగా, ఆయన తాగిన మత్తులో వాగిన మాటలు మాత్రమే బహుళ ప్రాచుర్యం పొందినై .. అది చాలా దారుణం.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలయాళీ దర్శకుడు ఆడూర్ గోపాల్ కృష్ణన్ తో ’సినిమా ఆఫ్ మలయాళం’ అనే వెబ్ సైట్లో ’డీప్ ఫోకస్’ పేరుతో సి.యస్.వెంకటేశ్వరన్ గారు నిర్వహించిన ముఖాముఖి ని తెలుగులోకి అనువదించి నవతరంగం పాఠకులకు అందచేయాలనే మా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ద్వారా ఆడూర్ తన జీవితం-సినిమా గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. పాతిక పేజీలు పైగా ఉన్న ఈ వ్యాసాన్ని అనువదించి మనందరికీ అందచేసిన కొత్తపాళి గారికి ధన్యవాదాలు

7 Comments
  1. మేడేపల్లి శేషు April 8, 2009 /
  2. మేడేపల్లి శేషు April 8, 2009 /
  3. కొత్తపాళీ April 8, 2009 /
  4. మురళి April 9, 2009 /