Menu

అడూర్ తో ముఖాముఖి- ఐదవ భాగం

ప్ర: కళాశాలలో ఉండగా ఎటువంటి నాటికల్లో ఆసక్తి ఉండేది?

అడూర్: ఎక్కువ సాంఘికాలే. తొప్పిల్ భాసి, ఎస్సెల్ పూరం ప్రభ్రుతుల నాటికలు వేసేవాళ్ళం. అప్పట్లో చాలా బహుమతులు కూడా సంపాయించాను.

గాంధీగ్రాంలో చదువుతుండగా అనియార అని ఒక నాటిక చేశాను. అది ఆ రోజుల్లో నాటికల పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకుంది. అదొక తమాషా ఇతివృత్తం. నాటిక వెయ్యడానికి సిద్ధపడుతున్న ఒక ఎమెచ్యూర్ ట్రూపు కథ .. నాటిక అంతా గ్రీన్ రూములో జరుగుతుంది. నాటికలో నాటిక స్టేజి వెనకాలెక్కడో, అదృశ్యంగా ఉంటుందన్న మాట. చివరికి ఆ ట్రూపు వాళ్ళు నాటిక వెయ్యకుండానే అంతా ముగిసిపోతుంది. ఆ తరవాత అదే విషయంతో చాలా నాటికలొచ్చాయి కానీ అప్పట్లో అది కొత్త కాన్సెప్టు.

ఆ రోజుల్లోనే కొన్ని పూర్తి నిడివి నాటకాలు రాశాను. రెండు అచ్చయినాయి కూడా .. నింతే రాజ్యం వరున్ను, వైకి వన్న వెలియెచం. ఒకటి నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదువుతుండగా ప్రచురితమైంది. జి. శంకర పిళ్ళై దానికి ముందు మాట రాసారు. ఆ తరవాత అనిపించింది, వాటిని ప్రచురించకుండా ఉండాల్సింది అని. కానీ అప్పటి వయసులో సహజమైన కోరిక అది .. మన రచనల్ని ప్రచురించాలి, రచయితగా గుర్తింపు పొందాలి అని.

ఎప్పుడూ థియెటరే నా మొదటి ప్రేయసి. ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరక ముందు తిరువనంతపురంలో ఉండగా కూడా చాలా నాటకాలు ప్రదర్శించాను.

ప్ర: విద్యార్ధి రాజకీయాల్లో పాల్గొన్నారా?

అడూర్: ఆ రోజుల్లో కళాశాలల్లో అంత రాజకీయాలు లేవు.

ప్ర: మీరు కళాశాల విడిచే సమయానికి పరిస్థితులు ఎలా ఉండేవి?

అడూర్: చాలా ఆశ, ముందుచూపుతో నిండి ఉండేది. జాతీయ నిర్మాణం అని చెప్పి. ఎందుకో కచ్చితంగా చెప్పలేను. మొదణ్ణించీ నాకు గాంధీగారంటే ఒక ఆకర్షణ. ఆయన ప్రవచించి ఆచరించి చూపిన విలువల్ని చాలా ఆదరించాను. బహుశా పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉండడం, వార్తాపత్రికలు చదువుతూండడం వల్ల వచ్చింది కావచ్చు. బోసు ఇంకొక హీరో మాకు. ఆయన్ని గురించి అన్నీ ఊహాగానాలు ఉండేవి .. బోసే కనక ఇప్పుడు ఉండి ఉంటే, పరిస్థితులు వేరేగా ఉండేవి .. ఇలా అనుకుంటూ. అప్పట్లో నెహ్రూ అంటే అంత గ్లామర్ ఉండేది కాదు. బహుశా ఆయన అధికారంలో ఉండడం వల్ల కావచ్చు.

ప్ర: కథాపురుషన్ సినిమాలో గాంధీ ప్రస్తావన తరచుగా వస్తూంటుంది. గాంధీ సిద్ధాంతాలు మీ కళాత్మక దృష్టిని ప్రభావితం చేశాయా? కొన్ని కొన్ని చోట్ల మీరు పనిగట్టుకుని ఒక నిరాడంబరతని బలవంతంగా తెచ్చిపెట్టుకున్నారేమో ననిపిస్తుంది .. మీరు సినిమా తీసే పద్ధతుల్లోనూ, దృశ్యరచనలో ఒక నిర్వేదం, ఎటువంటి ఆర్భాటాలు లేకపోవడం ..

అడూర్: ఇది బహుశా నా నాటకాల అనుభవం వల్ల కూడ కావచ్చు. నా సినిమటోగ్రాఫర్ మంకడ రవివర్మ గమనించినట్టు, సెట్ మీద అన్ని పన్లూ నేనే చేసెయ్యడానికి సిద్ధపడీ పోతుంటాను, మిగతా వాళ్ళని పురమాయించడం కంటే. ఇవ్వాళ్టికి కూడా, ఏ పని చెయ్యడానికైనా వెనుదియ్యను నేను. నిజానికి అలా పని చెయ్యడంలో ఆనందం నాకు. గాంధీగారి వల్లనేమో. ఏ పని చెయ్యడంలోనైనా ఒక గౌరవం ఉందని నేర్పింది ఆయనే. ఇంకో బలమైన అంశం ఆత్మగౌరవం. ఒక జాతిగా అది లేని వాళ్ళమయ్యాము మనం. మన భావావేశాల్లోనూ వ్యక్తిత్వాల్లోనూ పేదలుగా మిగిలాం. అవే మురిక్కాలవల్ని అవే కల్వర్టుల్ని రిపేర్లు చేసుకుంటూ కూచుంటాం తప్ప .. ఇది పేదరికానికి చిహ్నం అనిపిస్తుంది

ప్ర: ఆ రోజుల్లో నాటక రంగంలో తొప్పిల్ భాసి వంటి రచయితలు, KPAC వంటి ఉద్యమాలు చెలరేగుతున్న కాలమది. అలాంటి నేపథ్యంలో గాంధీ వల్ల ప్రభావితులయ్యారంటే ఆశ్చర్యంగా ఉంది.

అడూర్: తొప్పిల్ భాసి అప్పటికి తరవాతే పైకి వచ్చారు. ఆయనది మా పక్క ఊరే. ఆ రోజుల్లో ఉద్యమకారుడిగా ఆయనొక పెద్ద హీరో. ఐతే, నా కాలేజి రోజుల్లోనే ఆయన నాటకం మొదటి సారి చూడ్డం జరిగింది .. అది ముడియనయన పుత్రన్ (Prodigal son). సూరనాడు ఉద్యమం జరిగినప్పుడు ఆయన్ని అడూర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఉంచినప్పుడు చూడ్డానికి వెళ్ళాను. ఒక్క ముండు (పంచె) మాత్రం కట్టుకుని, చాలా సీదా సాదాగా, అందర్లాగే ఉన్నాడు, ఏం ప్రత్యేకమైన మనిషనిపించలేదు. ఏదో చిన్న చిన్న నేరాలకి జైలుపాలయ్యే నేరస్తుళ్ళా అనిపించాడు. సమకాలీన రాజకీయగాథల నాయకుళ్ళాగైతే అనిపించలా. తరవాతెప్పుడో ఆయన్ని ముఖాముఖి కలిసినప్పుడు చెప్పాను ఈ విషయం.

ప్ర: కళాశాలలో చదువుతున్నప్పుడే శంకర పిళ్ళై పరిచయమయ్యారా?

అడూర్: నేను పండలం కాలేజిలో బి ఎస్సి చదువుతున్నా. ఇంతలో మదురై గాంధీగ్రాం రూరల్ ఇన్స్టిట్యూట్లో రూరల్ ఎడ్మినిస్ట్రేషన్ చదివేందుకు సీటొచ్చింది. అది మూడేళ్ళ కోర్సు. అప్పుడే శంకర పిళ్ళై అక్కడ అధ్యాపకుడిగా చేరారు. ఆయన ఉండటం నాకు గొప్ప ప్రేరణ. ఆయనకి థియెటరంటే అదొక పిచ్చ. ఆయన జీవితం, కళ పట్ల ఆయన వైఖరి .. మనందరికీ గొప్ప పాఠాలవి, చేసే ఏ పనైనా సగం సగం శ్రద్ధతో చెయ్యకూడదని.

ప్ర: ఆ కోర్సుకి ఎందుకు మారిపోయారు?

అడూర్: ఆ కోర్సు పూర్తవగానే బ్లాక్ డెవలప్మెంటు ఆఫీసరుగా ఉద్యోగం వస్తుందని ఒక ధీమా ఉండేది ఆ రోజుల్లో. ఆ ఆకర్షణని తోసిపుచ్చలేక పోయాను. అది 1957లో అనుకుంటా.

ప్ర: గాంధీగ్రాంలో ఉండగా కూడా నాటకాలు వేశారా?

అడూర్: కాదు గానీ బాగా చదివాను. అక్కడ మంచి గ్రంథాలయం ఉంది. జి. శంకర పిళ్ళైగారే గ్రంథాలయాధికారు. కొనాల్సిన పుస్తకాల ఎంపిక కూడా ఆయనే చేసే వారు. అప్పటిదాకా నా చదువు మలయాళానికే పరిమితమై ఉంది. అక్కడే నేను ఆంగ్ల నాటకాలూ, నాటక రంగాన్ని గురించి ఆంగ్ల పుస్తకాలు మొదటి సారి చదవగలిగాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరే దాకా కూడా నేను విపరీతంగా నాటకాలు చదువుతుండేవాణ్ణి, అదికూడా చాలా పద్ధతిగా. ఆ రోజుల్లో నాటకరంగ పరిజ్ఞానంలో నన్ను మించిన వాళ్ళు లేరన్నట్టు ఫీలవుతుండేవాణ్ణి. అప్పట్లో నాటక రంగం గురించి అక్కడున్న పుస్తకాలు దాదాపు మొత్తం చదివేశాను.

ప్ర: నాటకాలు చూసేవారా?

అడూర్: అదీ లేదు. నాటకాలు చూసే అవకాశం తక్కువ. కాకపోతే శంకర పిళ్ళై గారి నాటకాల ప్రతులు కొన్ని చదివాను. నేను ఫిల్మ్ ఇన్స్టీట్యూట్ లో చేరాక కూడా కొన్నాళ్ళ పాటు నాటకాల మీద ఆసక్తి కొనసాగింది. అక్కడ మొదటి యేడంతా నాటకాలు చదువుతూనే ఉన్నా. వెయిటింగ్ ఫర్ గోడో (Waiting for Godot) ఆ రోజుల్లోనే వచ్చింది.

ప్ర: మీరు మదురైలో ఉండగా సినిమాలు ఎక్కువ చూసేవారా?

అడూర్: చూశాను, కానీ మరీ ఎక్కువ కాదు. ఆరోజుల్లో శివాజీ గణేశన్ సినిమాలు బాగా నచ్చేవి. ఆ రోజుల్లో విడుదలైన ఆయన సినిమాలన్నీ చూశాను. చాలామంది ఆయన్ని అభిమానించేవాళ్ళు. ఆ సమయంలోనే భీంసింగ్ తీసిన “ప” సినిమాలు (పాశమలర్, పావమన్నిప్పు ఇత్యాది) అన్నీ వరసగా విడుదలయ్యాయి.

ప్ర: గాంధీగ్రాం నించి ఉత్తీర్ణులైన తర్వాత?

అడూర్: అది పూర్తైన వెంటనే ఒక రెణ్ణెల్లపాటు భారత్ సేవక సమాజ్ ద్వారా ఒక మురికివాడ ఉద్ధరణ ప్రాజెక్టులో పని చేశాను. అటుపైన నేషనల్ శాంపిల్ సర్వే సంస్థలో పర్మనెంటు ఉద్యోగం వచ్చింది.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలయాళీ దర్శకుడు ఆడూర్ గోపాల్ కృష్ణన్ తో ’సినిమా ఆఫ్ మలయాళం’ అనే వెబ్ సైట్లో ’డీప్ ఫోకస్’ పేరుతో సి.యస్.వెంకటేశ్వరన్ గారు నిర్వహించిన ముఖాముఖి ని తెలుగులోకి అనువదించి నవతరంగం పాఠకులకు అందచేయాలనే మా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ద్వారా ఆడూర్ తన జీవితం-సినిమా గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. పాతిక పేజీలు పైగా ఉన్న ఈ వ్యాసాన్ని అనువదించి మనందరికీ అందచేసిన కొత్తపాళి గారికి ధన్యవాదాలు

One Response