Menu

అడూర్ తో ముఖాముఖి-నాలుగవ భాగం

ప్ర: బహుశా ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కావచ్చు. ఒక సాంస్కృతిక బీజం నించి పుట్టిన మర్రి చెట్టు బలంగా వేళ్ళూనుకుని మిగతా చిన్న చిన్న సంస్కృతిక మొక్కల్ని బతకనీయకుండా చేస్తున్నది.

అడూర్: అవును. ఇవ్వాళ్ళ మనం డబ్బు తెచ్చి పెట్టేవి మాత్రమే ముఖ్యమైనవని అనుకుంటూన్నాం. ఈ క్రమంలో మన ఉనికినే మనం మర్చిపోతున్నాం. అంతే కాకుండా .. ఈ చిన్న సంస్కృతులు తమని తాము తక్కువగా, కించపరుచుకుంటూ చూసుకునే పరిస్థితి తయారవుతున్నది.

వలసవాద పిచ్చి నించి పుట్టుకొచ్చిన జబ్బిది, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు. మలయాళంలో కురోసావా గురించీ బెర్గ్‌మాన్ గురించీ బోలెడు పుస్తకాలూ వ్యాసాలు వెలువడ్డయి, మన (సత్యజిత్) రే గురించి ఆ మాత్రం కూడా లేదు. మన సొంత చిత్రాల్ని తక్కువ చేసి చూడనంత వరకూ ఇది పర్లేదు. కానీ వచ్చిన గొడవేంటంటే మన పిల్లలకి మన మాతృభాష నేర్పించడానిక్కూడా ప్రయత్నించం మనం. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడం, దాంతో లావాదేవీలు జరపడం వల్లకాదు ఈ సమస్య ఉత్పన్న మవుతున్నది, ఆ లావాదేవీల నించి మనం తప్పు పాఠాలు వంటబట్టించుకోడం వల్ల. ఈ (బాహ్యప్రపంచంతో) సంబంధం మనకి కొత్త స్వేఛ్ఛని ఇవ్వకపోగా ఇంకా గట్టిగా కట్టి పడేస్తోంది.

ప్ర: పాశ్చాత్యుల్ని అనుకరించి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళనే గెలవాలని చూడ్డమూ, లేదా మనమేదో చాలా ప్రత్యేకం అన్నట్టు అసలు వాళ్ళని పట్టించుకోకుండా విడిగా ఉండడానికి చూడ్డమూ .. రెండూ మంచివి కావు.

అడూర్: కాలం మార్పుతో సినిమా భాష, సినిమా నుడికారం కూడ మారుతూ వస్తున్నది. ఎప్పటికీ ఇదే పద్ధతి అని నిలకడగా ఉండిపోయే పరిస్థితి కాదు. అలాగని, కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు అంటున్నట్టు “ప్రేక్షకుల అభిరుచే తిరుగులేనిది” అనేసుకుని దానికి తలవొగ్గాలనీ కాదు. వాళ్ళేదో చాలా ఫాస్ట్ స్పీడ్ ప్రపంచంలో ఉన్నట్టు మాట్లాడుతారు. ఎక్కడుందీ ఫాస్టు, స్పీడు? ఒక MTV తెర మీద, బొమ్మలు మహా వెగంగా మారిపోవడంలో, ఉంది ఫాస్టు, అంతే. ఇంకెక్కడ లేదు. అరగంటకోసారి కరంటు పోయే దేశంలో ఎక్కణ్ణించొస్తుంది స్పీడు? వీళ్ళు మాట్లాడే స్పీడు కల్పితం .. మన అభిమాన హీరోలూ విలన్లూ, వాళ్ళేసే వేషాలూ, వాళ్ళు చేసే పనుల్లాగానే ..

ప్ర: పోనీ ఇటువంటి ఊహా జనితమైన అతిశయోక్తులేనేమో మనక్కావల్సింది?

అడూర్: మీరు దాన్ని తీసుకొచ్చి ఇదే నిజం అన్నారంటే, జీవితాన్నే పట్టుకెళ్ళి తుంగలో తొక్కేసినట్టే. మన నిజ జీవితాల్ని ప్రతిబింబిస్తూ మనం నమ్మే విలువలకి అద్దం పడుతూ తీసే సినిమాని చూడ్డానికి ఎక్కువమంది రారు .. అది పెద్ద ఆశ్చర్య కారణం కూడా కాదు. మంచిచెడ్డల్ని బేరీజు వెయ్యగల ప్రేక్షకులే మంచి సినిమాల సృష్టికి కారకులవుతారు. ఉదాహరణకి మన సినిమా విమర్శకుల్ని తీసుకోండి. విమర్శకులు కూడా సినిమాని సీరియస్ గా తీసుకోరు.

ప్ర: మీరు 70లలో సినిమాల్లో ప్రవేశించినప్పుడు అలాంటి పరిస్థితి ఉండేదా?

అడూర్: లేదు .. అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. అప్పట్లో మా ప్రయత్నం అల్లా ఒక మంచి టేస్టున్న ప్రేక్షక సమూహాన్ని తయారు చేసుకోవాలనే, మంచి సినిమాల్ని పట్టుకుని కాలేజీలకీ యూనివర్సిటీలకీ వెళ్ళాం. అలాంటి చోట్లనించే మార్పేదన్నా రావాలి. మన కాలేజి విద్యార్ధులు ఈ చెత్తనే మధురమని ఆస్వాదిస్తూ, మూగగా వినియోగదారులుగా మారిపోతుంటే చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. చెత్తని ఆస్వాదించి ఊరుకోరు, సీరియస్ సినిమాని, మంచి సినిమాని ఎద్దేవా చేస్తారు. దింట్లో మీడియా కూడా చాలా దారుణమైన పాత్ర వహించింది. అసలు మా సినిమాలకి ప్రత్యామ్నాయ సినిమా అని పేరు పెట్టడమే ఒక అవమానం. పోనీ అనుకుంటే, ఇదేదో చాలా బోరు కొట్టేది అన్నట్టు, “ఆర్టు సినిమా హంస నడక” ఇలాంటి పదబంధాల్తో చాలా దారుణమైన ముద్ర వేశారు.

ప్ర: మీ చిన్నప్పుడు సినిమాలంటే ఇష్టం ఉండేదా?

అడూర్: ఎక్కువ లేదు. చూడాలి అనుకునుంటే చూసే అవకాశాలు చాలానే ఉండేవి. మా మావయ్యకి అడూర్, ఏనాత్, పరక్కోడుల్లో సినిమాహాళ్ళుండేవి. కానీ అప్పట్లో ఈ సినిమా పిచ్చి లేదు. అసలు నేను సినిమాల్లో పని చెయ్యాలని కలలు కనలేదు. ఊహించలేదు. మొదణ్ణించీ నా ఆసక్తి నాటక ప్రదర్శన మీదనే.

ప్ర: మీరు కూడా నటించారా?

అడూర్: చేశాను. నా మొదటి వేషం ఎనిమిదేళ్ళ వయసులో .. ఒక బడి కార్యక్రమంలో .. మహారాజా చిత్తిర తిరునాళ్ వారి జన్మదిన వేడుకల సందర్భంగా .. మా అయ్యవారు ఒకాయన ఆ నాటిక రాశారు. నేను బుద్ధుడి పాత్ర వేశాను.

బడికి బయట మాకో స్నేహితుల గుంపుండేది. మేమే నాటికలు రాసి ప్రదర్శించే వాళ్ళం, ఇంటి పెద్దల ముందు. వాళ్ళు కూడా చాలా సీరియస్ గా వచ్చి మా నాటికలు చూసేవాళ్ళు. ఆ ఉమ్మడి కుటుంబం రోజుల్లో పిల్లలకి పెద్దవాళ్ళ దగ్గర్నించి అంత శ్రద్ధ దొరికేది కాదు. ఈ రోజుల్లో పెద్ద వాళ్ళ శ్రద్ధ మరీ ఎక్కువైపోయి గారాబంగా తయారవుతోంది.

బహుశా గాంధీగారికి ఋణపడి ఉన్నానేమో. ఆయనే ..అసలు ఏ పని చెయ్యడంలోనైనా ఒక గౌరవం .. ఒక డిగ్నిటీ ఉందని మనకి నచ్చ చెప్పాడు. ఆత్మగౌరవం ఇంకో కోణం. ఇది బొత్తిగా లేని వాళ్ళముగా తయారయ్యాం మనం. 50లలో జరిగిన జాతీయ పరిణామాల అనుభవం వల్లనేమో బహుశా మన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయింది .. ఆ సమయంలో ప్రపంచం నలుమూలలా బిచ్చమెత్తింది మన దేశం!

ప్ర: మీకు నాటకాల మీద ఆసక్తి ఎలా పుట్టింది?

అడూర్: చిన్నప్పణ్ణించీ సాహిత్యం అంటే అమితాసక్తి. ఆ రోజుల్లో మా వూరి చుట్టుపక్కల ఉన్న గ్రంథాలయాలన్నిటిలో నేను సభ్యుణ్ణి. అన్ని రకాల పుస్తకాలు చదివే వాణ్ణి. మాకు మేమే సొంతంగా ఒక లైబ్రరీ పెట్టుకున్నాము. ఒక ఆర్ట్సు క్లబ్బు కూడా.

ప్ర: బళ్ళో ఎలాంటి నాటికలు వేసేవారు?

అడూర్: చిన్నప్పుడు వేసినవన్నీ మేము చూసిన నాటకాల ప్రదర్శనల అనుకరణలే. ఒకే వయసు పిల్లకాయలం ముగ్గురం ఉండేవాళ్ళం. RNG కంపెనీ అని మా ట్రూపుకి పేరు. ఆర్ అంటె రవీంద్రన్, ఎన్ అంటే నారాయణన్, గీ అంటే నేను. మేము శనాది వారాల్లో జీడిమావిడి తోపుకి వెళ్ళి ఒక్కొక్కడూ ఒక్కో చెట్టక్కి కూర్చునే వాళ్ళం, ఒక పెన్సిలూ నోటుపుస్తకంతో. మధ్యాన్నం భోజనాల టైముకి దిగి వచ్చేవాళ్ళం మా మా రచనల్తో .. అది కథో, కవితో, నాటికో .. వాటిని మళ్ళీ
మాలో మేమే చర్చించుకునే వాళ్ళం.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలయాళీ దర్శకుడు ఆడూర్ గోపాల్ కృష్ణన్ తో ’సినిమా ఆఫ్ మలయాళం’ అనే వెబ్ సైట్లో ’డీప్ ఫోకస్’ పేరుతో సి.యస్.వెంకటేశ్వరన్ గారు నిర్వహించిన ముఖాముఖి ని తెలుగులోకి అనువదించి నవతరంగం పాఠకులకు అందచేయాలనే మా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అనుమతి ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ద్వారా ఆడూర్ తన జీవితం-సినిమా గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. పాతిక పేజీలు పైగా ఉన్న ఈ వ్యాసాన్ని అనువదించి మనందరికీ అందచేసిన కొత్తపాళి గారికి ధన్యవాదాలు

One Response
  1. మురళి March 6, 2009 /