Menu

అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం

ప్ర: సమకాలీన భారతీయ కళ ఈ సంప్రదాయానికి దీటుగా ఎదిగిందా?

అడూర్: అసలు మనం మనదైన, మన స్వంతమైన ఒక సంప్రదాయం అనేదాన్ని ఎరిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇటీవలి కాలాన్ని దాటి చూస్తున్నామా? అసలు మన చుట్టూనే రోజూ జరిగే సంఘటనలనే ఒక తదేక దృష్టితో పట్టించుకుంటున్నామా?

నా సినిమాల్లో కాకులు, కుక్కలు, బల్లులు ఇలాంటి వాటినన్నిటినీ అనేక రకాలుగా ఉపయోగించుకున్నాను. ఇవన్నీ ఎవరన్నా గమనించారో అర్ధం చేసుకున్నారో లేదో తెలీదు. కానీ నేను కథ చెప్పే పద్ధతిలో భాగం ఇది. ఉదాహరణకి, ముఖాముఖంలో ఒక సీనుంది. హెడ్ కానిస్టేబులు ఆ ఇంటివాళ్ళని టీ ఇవ్వమని అడిగే సాహసం చేస్తాడు. అతనక్కడ ఆహ్వానితుడు కాదు, వాంఛనీయుడు కాదు. దాంతో ఇంటో పాలు మిగల్లేదు, దూడ మొత్తం తాగేసింది అని సమాధానం వస్తుంది. అదే క్షణంలో నేపథ్యంలో పెరట్లోంచి దూడ అరుపు వినిపిస్తుంది. పల్లె జీవితం తెలిసిన వారికెవరికైనా .. అక్కడ దూడ కడుపు నిండలేదు. అది తల్లి పాలకోసం అరుస్తోంది. ఇంటాయన దూడ పాలు తాగేసిందని అబద్ధమాడుతున్నాడని ఇట్టే అర్ధమవ్వాలి.

ఉదాహరణకి కాకిని తీసుకోండి. మన జీవితమంతా ఈ పక్షితో ముడిపడుంది. కాకి కనిపించని ముఖ్య సంఘటన మానవ జీవితంలో లేదంటే అతిశయోక్తి కాదు. కాకి అరిస్తే చుట్టాలొస్తారని ఒక నమ్మకం. పుట్టుక, చావు, తద్దినం, నిశ్చితార్థం .. ఇలా మన జీవితంలో ప్రతీ సంఘటనా.

లేకపోతే కొబ్బరి చెట్టుని తీసుకోండి. ఇదీ మన జీవితాల్తో ఎంతో ముడిపడి ఉంది. దీనికి సంబంధించిన ప్రతీ విషయమూ ముఖ్యమే .. అది ఇంటికి ఎటువేపు ఉన్నదీ, దాని కైవారం, ఎత్తు, వాలు, దాని కాండానికున్న రింగులు. అలాగే ఇళ్ళల్లో ఉండే బల్లులు, వాటి గొద్దెల దగ్గర్నించీ, సిక్ సిక్ అని అవి చేసే తమాషా చప్పుడు, అవి ఎక్కణ్ణించి ఎక్కడ ఎలా పడతాయి అని .. వీటన్నిటికీ ఏకంగా ఒక శాస్త్రమే ఉంది. అలాగే ఆవులు, ఇంకా మిగిలిన పెరటి జంతువులు ఇవన్నీ మన జీవితాలతో అవినాభావంగా పెనవేసుకుపోయి ఉన్నయ్యి. అంచేత, సూచనాత్మకంగానూ ప్రతీకలుగానూ ఇవన్నీ మన భావాల్లో, ఆలోచనల్లో సహజంగా ఇమిడిపోయాయి. అలాగే సినిమాల్లోనూ.

గుడ్లగూబ కేక రోజులో ఒకానొక సమయంలోనే వినిపిస్తుంది. అలాగే ఒక సందర్భంలోని మూడ్ ని, అది మృదువా మొరటా అనే టెక్స్చరుని ఇలా కొన్ని జంతువులు పక్షుల కూతలతో సూచించొచ్చు. ఈ విషయంలో కాకి నిజంగా చిత్రమైన పక్షి. మిగతా పిట్టల్లాగా శ్రావ్యంగా కూయాలని ప్రయత్నించే కాకులున్నాయి తెలుసా. నేను విన్నాను వాటి కూతల్ని. విని జాలి పడ్డాననే ఒప్పుకోవాలి. వినగా వినగా వాటి అరుపు కూతలాగా తియ్యగా ఉందని కూడా ఒప్పుకోవాలి. ఒకసారి ఒక పంజరంలో ఉన్న మైనాపిట్ట తనలాగా పాడ్డానికి ప్రయత్నిస్తున్న కాకిని అనుకరిస్తూ మహా వ్యంగ్యంగా కుయ్యడం విన్నాన్నేను.

అవలా ఉండగా వాన, ఎండ లాంటి ప్రకృతి విషయాలున్నాయి. నా సినిమాలన్నిటిలోనూ ఎకడో ఓ చోట వాన పడుతుంది. అసలు వాన లేకుండా సినిమా అసంపూర్ణం అని నా ఉద్దేశం. ఏదన్నా మూడ్ సృష్టించేందుకు, లేదా ఏదో సూచించేందుకో. ఈ ప్రకృతి పరిణామాలు మనలో సహజంగా రేపే ప్రకంపనల్ని తిరిగి ప్రతిబింబించే ప్రయత్నమే ఇదంతా.

ప్ర: జాగా .. స్థలం ని ఎలా ఉపయోగిస్తారు?

అడూర్: ఒక షాట్ లో జాగా ఎలా చూపిస్తున్నాం .. మొత్తమ్మీద సినిమాలో ఎలా చూపిస్తున్నాం .. ఇవి రెండూ కూడా మన గృహనిర్మాణ పద్ధతి మీద ఆధారపడి జరగాలి. ఒక షాట్ ని కంపోజ్ చెయ్యడం అంటే అది ఆషామాషీ నిర్ణయం కాదు. అది ఆ జాగాలో నివసించే వారి జీవనానికి బలంగా ముడిపడి ఉంటుంది. మన కమర్షియల్ సినిమాల్లో సాధారణంగా చూస్తుంటాం .. పరమ విరోధులైన పాత్రలు ఇద్దరు బాగా దగ్గరగా ఉన్నట్టు చూపించడం .. ఎందుకంటే ఇద్దర్నీ ఒకే ఫ్రేం లో కవర్ చెయ్యాలని. ఇది ఒక జాగాకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, దానిలో అంతర్గతంగా ఉన్న సదుపాయాన్ని ఉపయోగించుకోక పోవడం. అంత విరోధులైన వారు ఎప్పుడూ ఒకరికొకరు అంత దగ్గరగా రారు. అట్లాగే ఒక జాగాలోని ఎత్తుపల్లాల్ని ఉపయోగించుకోవడం. విషయమేంటంటే అక్కడ దృశ్యంలో ఉన్నదాన్ని, ఆ భావాన్ని నీ ప్రేక్షకుడి అనుభవంలోకి తీసుకురావాలి. ఏం చూశావు, విన్నావు అని కాదు, నీకు ఎట్లా, దేని ద్వారా చూపబడినాయి, వినపించ బడినాయి అనేది ముఖ్యం. ఇటువంటి దృశ్యాలు శబ్దాల కలయిక ద్వారా కల్పించబడే భావ స్పందన ఆ అంశాలన్నీ విడివిడిగా కలిగించే దానికంటే చాలా హెచ్చుగా ఉంటుంది. కానీ, చాలా దురదృష్ట మేమంటే మన సినిమాల పట్ల ఆశలు చాలా నేలబారుగా ఉంటున్నాయి, చాలా పరిణతి చెందిన ప్రేక్షకులకి కూడా. ఇదెందుకంటే, వాళ్ళు అస్తమానూ తెరమీద సారం లేని పిప్పిని చూడ్డానికి అలవాటు పడిపోతున్నారు.

ప్ర: హాలీవుడ్, పాశ్చాత్య పద్ధతికి భిన్నంగా కథ చెప్పాలి అని మీరెప్పుడన్నా ప్రయత్న పూర్వకంగా బుద్ధెరిగి అదొక సవాలుగా అనుకున్నారా? కొడియెట్టంలో గాలిపటాల సీక్వెన్సు, చాలాసేపు నడుస్తుంది, దాని వెనకాతలే గీటుగీసినట్టు విభజన రేఖ ఏదీ లేకపోయినా. అందులో ఏదో సహజమైన మలయాలీతనం ఉన్నట్టు కూడ అనిపిస్తుంది.

అడూర్: అదొక సంపూర్ణమైన స్వేఛ్ఛ, హద్దులు, ఎల్లలు లేకుండా .. ఒక అనంతమైన తీరికని అభివ్యక్తించడం. అలాగే చుక్కాని లేని నావలాంటి శంకరన్ కుట్టి జీవితానికి సూచన కూడాను. ఆ సినిమా కొన్ని సంఘటనల సముదాయంలాగా ఉంటుంది. ఆ కథని ఇంకోలా చెప్పలేం. చెబితే అసహజంగా, బయట్నించి ఎవరో నిర్దేశించినట్టుగా ఉంటుంది గాని సహజంగా ఉండదు. చూడ్డానికి ఏమీ పెద్ద డ్రామా ఉన్నట్టుండదు, ఏమీ అంతర్యుద్ధాలు ఉండవు. కథా గమనం కూడ తాపీగా ఉంటుంది. నేఫథ్య సంగీతం కూడా వాడలేదు. చాలా మంది ప్రేక్షకులు ఆ సంగతి గమనించను కూడా లేదు. దృశ్యానికి తగినట్టు, కేరళ జీవితంలో సాధారణంగా ఎదురయ్యే పక్షులు జంతువులు .. కాకి, గుడ్లగూబ, ఆవు, కుక్క, ఏనుగు, వీటి అరుపులు చప్పుళ్ళు మాత్రమే ఉపయోగించాను.

మీరన్న సాంస్కృతిక ప్రత్యేకతల ప్రశ్నకి తిరిగి వస్తే, ఒకే శబ్దం వేర్వేరు సంస్కృతుల వారికి వేర్వేరుగా అర్ధమవ్వచ్చు. అంచేత ఒక సినిమాలో ఇటువంటి పద్ధతుల ద్వారా ఏమేమి సూచించ బడుతున్నాయో పూర్తిగా సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే కొంత ఆ జీవితాన్ని జీవించిన అనుభవం అవసరం.

మనం జపనీయులతో కొంత చేరువైన సంస్కృతిని కలిగుండటం వల్ల జపనీస్ సినిమాల్ని బానే అర్ధం చేసుకోగలం. అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా మనకి బానే అర్ధమవుతాయి ఎందుకంటే ఈ బ్రిటీష్ సామ్రాజ్య పాలన, ఈ పాశ్చాత్య నాగరిక విద్య, ఇక్కడ క్రిస్టియను మతవ్యాప్తి, పాశ్చాత్య పరిశ్రమల వ్యాప్తి మనల్ని దానికి తయారు చేశాయి. కానీ, నిజాయితీగా చూస్తే, పాశ్చాత్య దేశాల్లో విమర్శకులము అని చెప్పుకునే వారు కూడా మన సినిమాల్ని అర్ధం చేసుకోడానికి తమని తాము ఏ మాత్రం కష్టపెట్టుకున్నట్టు కనబడదు. పిసరంత ప్రయత్నం కూడ వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళ దృష్టిలో మన సినిమాలు మూడో ప్రపంచం నించి వచ్చిన సినిమాలు .. అంతే. భారద్దేశానికి కనీసం ఒక్కసారైనా వచ్చి వెళ్ళిన విమర్శకులకీ, అసలు అలాంటి అనుభవమే లేని వారికీ, వాళ్ళు మన సినిమాల్ని ఎలా చూశ్తారనేదాంట్లో చాలా తేడా ఉంటుంది.

ఏట్లాగొట్లా అత్యాధునికమైనవన్నీ, పాశ్చాత్యమైనవన్నీ మనమూ పొందెయ్యాలనే మన తాపత్రయంలో, మన కళల్ని సమదృష్టితో చూసే ఆడియెన్సుని మనం కోల్పోయాం. పాతరోజుల్లో కథకళీ కూడియాట్టం ఎందుకు వర్ధిల్లాయంటే వాటీలోని సొగసుల్ని గుర్తించి అనుభవించి ప్రశంసించే రసికులు ఎల్లవేళలా ఉన్నారు వాటికి. కొంచెమైనా అర్ధవంతంగా ఉండే మన సినిమాలకి ఎప్పుడైతే అలాంటి రసికులైన ఆడియెన్సు లేకుండా పోతారో, అది నిజంగా ఆందోళన పడాల్సిన సందర్భం.

2 Comments
  1. మేడేపల్లి శేషు February 26, 2009 /
  2. హర్ష February 27, 2009 /