Menu

అడూర్ తో ముఖాముఖి-రెండవ భాగం

ప్ర: మీరు సినిమా తీసే పద్ధతి మీద కథకళి ప్రభావం ఉండనిపిస్తుంది .. దాని మూలాంశాలు, ఒక రంగ దృశ్య రచన (mise-en-scene), స్టేజిమీద పాత్రలు స్పష్టమైన విభజనతో గుర్తించబడుతూనే, అందులోనే తాత్కాలిక సృజనకి అవకాశం ఇవ్వడం. అంటే, ఒకే సారి వంగగలిగేలా ఉండటమూ దృఢంగా ఉండటమూ కనిపిస్తాయి. ఈ లక్షణం మీ సినిమాలకి కూడా వర్తిస్తుంది .. పాత్రల పరిచయంలో, దృశ్యాల అమరికలో.

అడూర్: కావచ్చు. ఒక డొంక తిరుగుడు పద్దహ్తిలో అలాంటి ప్రభావం ఏవన్నా ఉందేమో.

ప్ర: ఉదాహరణకి ఒక పచ్చ పాత్ర (సాత్త్విక గుణాలతో ఉదాత్తమైన పాత్ర) రంగప్రవేశం చెయ్యగానే అదెటువంటి పాత్రో స్పష్టంగా నిర్వచింపబదే ఉంటుంది. కానీ ప్రదర్శనలో కథా సందర్భాన్ని బట్టి ముఖ భంగిమలు మారుతుంటాయి. దాంతో తాత్కాలికంగా సందర్భోచితంగా నటించే అవకాశాలు అనంతంగా ఉంటాయి. ఇదేమాదిరి స్పష్టత మీ సినిమాల్లోనూ ఉన్నది అంటున్నాను.

అడూర్: కావచ్చు. అసలు పాత్ర అంటే ఏంటి? ఒక పాత్ర ఈ మూడింటి వల్ల నిర్వచించ బడుతుంది .. క్రియ, ప్రతిక్రియ, ఇతర పాత్రలతో సహకారం (action, reaction and interaction). దీన్ని ఇంకో విధంగా ఆవిష్కరించే పద్ధతే లేదేమో. మనుషులు ఉండే పరిస్థితులన్నీ నాటకీయమైనవే. ఆ పరిస్థితిని అనుభవిస్తున్న మనిషి ఒక చెక్కపడి మనిషైతే, ఏమాత్రం మానసిక మార్పుకి లొంగని వాడైతే, ఇక ఆ కథలో ఆసక్తి కరమైన మార్పులు మలుపులు ఏమి జరిగేటట్టు? పాత్రకి గతంలో జరిగిన అనుభవాలు, ప్రస్తుతంలో జరుగుతున్న అనుభవాలతో కలిసి జీవితంలో ఆ పాత్ర స్థానాన్ని నిర్దేశిస్తాయి. ఈ విషయాలు ఎప్పుడూ ముందే తయారైపోయిన చట్రంలో ఇమడవు.

సాంప్రదాయకమైన కథకళి లాంటి ప్రదర్శనల్లో నిజంగా ఆసక్తి కరమైన పాత్రలెప్పుడూ, రావణ, బలి లాంటి ప్రతినాయక పాత్రలే. రాముడి లాంటి సాత్త్విక పాత్రలు కాదు. సాత్త్విక పాత్రల్లో డ్రామా లేదు. వాటిలోపల అంతర్మథనం లేదు, అంచేత నటనలో కూడా అవి అలా నిశ్చలంగా ఉండిపోతాయి. అలాగే స్టేజిమీద నిజంగా మెరిసేవి కూడా అలాంటి (ప్రతినాయక) పాత్రలే. ఎప్పుడైనా (సాత్త్వికమైన) పచ్చ పాత్ర కంటే, ఎర్రగా ఉండే కత్తి (రావణుడి లాంటి) పాత్రే స్టేజిమీద ఉజ్జ్వలంగా మెరుస్తుంది. కానీ దీన్ని పూర్వపక్షం చేస్తూ, పచ్చపాత్రల్ని పోషించే నటులే ఎప్పుడూ గొప్ప స్టార్లుగా ఎదిగేది. కథకళిలో రాక్షసులు ఇత్యాది దుష్టపాత్రలు స్టేజిమీద అద్భుతంగా కళ్ళు మిరుమిట్లు గొలిపేట్టుగా ఉన్నా, ఒక రామన్‌కుట్టినాయర్ (దుష్ట పాత్రధారి) కంటే ప్రజలు ఒక గోపి (సాత్త్విక పాత్రధారి) నే బాగా ఇష్టపదతారు.

జపనీసు కబుకి లాంటి ప్రదర్శన కాదు కథకళి, అంత జగజ్జేయమానంగా ప్రదర్శన ఇచ్చేందుకు. కథకళికి అవసరమైన సెట్లు కానీ ఇతర సరంజామా కానీ చాలా తక్కువ. ఎక్కడపడితే అక్కడే, అతి తక్కువ తయారీతో, వెయ్యొచ్చు.

ఈ మధ్యన యునెస్కో (UNESCO) వారి కోసం కూడియాట్టం మీద ఒక డాక్యుమెంటరీ తీశాను. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రదర్శన కళల్లో ఒకటి. మరుగున పడుతున్న ఒక ప్రాచీన కళని డాక్యుమెంట్ చేసుకునే ప్రయత్నం ఇది. నేను తియ్యడం ఒక పది గంటల నిడివి ఉన్నది తీశాను కానీ అది చివరికి మూడా గంటలకి కుదించబడింది. దాంట్లోనించి వాళ్ళు 15 నిమిషాల నిడివితో కావాలన్నారు. నేను కుదరదు అన్నాను. దాన్ని ఇంకా కుదించడం సాధ్యం కాదు అనేశాను. సాధ్యమా అసాధ్యమా అన్నది కాదు పాయింటు. ఇంకా కుదిస్తే ఆ కళకి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. మీకు 15 నిమిషాలే కావాలి అంటే ఆ మూడు గంటల్లోనించీ ఏ పదిహేను నిమిషాలైనా చూపించండి. ఒక్క అంకాన్ని ప్రదర్శించడానికి కొన్ని వారాలు తీసుకునే ప్రక్రియ ఇది .. అట్లాంటి దానికి .. అదే సరిపోతుంది.

ప్ర: ఇలా తాత్కాలిక నటనా వైదుష్యానికి పెద్దపీట వేసి, స్థలకాలాల్ని ఒక స్థిరమైన చట్రంగా కాక ఒక అస్థిరతతో ఉపయోగించే కూడియాట్టం, కథకళి లాంటీ కళల్లోనించి మలయాలం సినిమా తనదైన సినీ జాతీయాల్ని, భాషనీ తయారు చేసుకుందా?

అడూర్: నేను నా సినిమాల్ని ఆ దృష్టితో విశ్లేషించలేదు. కానీ అటువంటి ఆలోచనాధార ఒకటి అంతస్స్రవంతిలా నా సినిమాల కింద ప్రవహిస్తూనే ఉన్నదనుకుంటాను.

కథకళి నన్ను పూర్తిగా పొదువుకుంటుంది. కథకళి ప్రదర్శన చూస్తుండగా ఇంకేదీ గుర్తుకి రాదు నాకు, బయటి ప్రపంచం, నా సొంత గొడవలూ ఏదీ. ఆ ప్రదర్శనలో ప్రస్తుతానికి సంబంధించినదేదీ ఉండదు. ఎక్కడా వాస్తవికంగా కనబడే ప్రయత్నమూ ఉండదు. ఆ మద్దెల దరువులు, ఆ వాతావరణం మొత్తం ప్రేక్షకుల్ని వేరే ఏదో లోకానికి తీసుకెళ్ళిపోతాయి. అదెప్పుడూ నా సృజనకి ఆదిబిందువుగా, చైతన్య పరిచేదిగా ఉపయోగపడుతూనే ఉంది. ప్రదర్శన జరిగిన ప్రతి సారీ .. ఆ పాత పాత్రలే .. ప్రతిసారీ సరికొత్తగా రూపు దిద్దుకుంటూన్నాయి. ఇవ్వాళ్ళ ఒక గోపీ నలమహారాజెలా ఉంటాడో రూపిస్తున్నాడు. అంతకు ముందు క్రిష్ణన్ నాయర్. రేపింకొకరు. ఇలా మారుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూంటుంది.

ప్ర: అన్ని ప్రదర్శనలకీ ప్రాతినిధ్యం వహించే ప్రదర్శన ఎప్పటికీ ఉండదు, రికార్డు చేసుకోడమనేది అర్థరహితంగా.

అడూర్: నిజం. అదే ఆ కళయొక్క గొప్పతనం. ఒకసారి రికార్డు చేసామంటే అటుపైన ఇహ అదే ప్రమాణం అనుకుంటారు జనాలు. మన సంప్రదాయంలో ఉన్న గొప్పతనమే అది .. ఏ ప్రదర్శన కూడ ఇది రికార్డు చేసి దాచుకోవాలి అనే దృష్టితో జరగదు. ఆవేళటి ప్రదర్శన ఆ సాయంత్రానికే. మరుసటి రోజుకి మళ్ళీ సృష్టించబడుతుంది.

ఒకసారి పడయని చూడ్డానికి కదమ్మనిట్ట అనే చోటికి వెళ్ళాను. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా వాళ్ళంతా ఆ ముఖపత్రాలు, వేషాలు, ఆ అద్భుతమైన శిరస్త్రాణాల తయారీలో మునిగి ఉన్నారు. అవన్నీ కూడా అప్పుడే కోసి తెచ్చిన పోక దొప్పల మీదనో లేత కొబ్బరాకులతో అల్లిన తడికల మీదనో చేస్తున్నారు, ఆ ప్రదర్శన అంతటికీ ఒక స్థానిక జాతీయతనాపాదిస్తూ. అవి ఆ రాత్రి నూనె కాగడాల వెలుతురులో ఒక ప్రత్యేక రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ రాత్రి ప్రదర్శన ముగిశాక ఆ శిరస్త్రాణాలూ, ఇంకా ఆ వడలిపోయే అలంకారాలన్నీ అలాగే పారేసి వెళ్ళిపోయారు. నేణు మనసూరుకోక కొన్ని ముఖపత్రాల్ని నాతో తెచ్చుకున్నా. కానీ ఏం లాభం, రెండ్రోజుల తరవాత అవి వడలి పోయి పాడైపోయాయి. పడయని కళాకారుడు దాచి ఉంచుకోడానికి ఏమీ తయారు చెయ్యనక్కర్లేదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అక్కడికక్కడే కొత్తగా తాజాగా తయారు చేసుకోగలననే ధీమా అతనిది. ఆ కాన్సెప్టు చాలా గొప్పది. మన కలమెళుత్తు తీసుకోండి.  పంచ రంగులతో నిండి అద్భుతమైన సంక్లిష్టమైన రూపాన్ని దిద్దుతారు. ఆ పూజ సంస్కారం ముగియగానే దాన్ని చెరిపేస్తారు. దాచి ఉంచుకోవాలి అనేది పూర్తిగా పాశ్చాత్య ఆలోచన. దేన్నైనా దాని సహజమైన వాతావరణంలోంచి తుంచి, ఎక్కడికో తీసుకెళ్ళి భద్రపరచడం. మన పద్ధతేమో .. అంతా ఒక సజీవ స్రవంతిలో భాగం. కేరళలో మన వాతావరణం కూడా ఏదీ దాచి ఉంచడానికి పనికొచ్చేది కాదు. ఈ కుండపోత వర్షాలు, ఈ చిత్తడి వేసవి ఎండలూ దేన్నీ మిగలనివ్వవు. అన్నిటినీ నాశనం చేసేస్తుంటాయి. మళ్ళీ అవే తిరిగి పుట్టిస్తూ కూడా ఉంటాయి. వేసవి ఎండకి అంతా ఎండి పోతుంది. మళ్ళీ తొలకరికి అంతటా తిరిగి ప్రానం పోసుకుంటుంది.

2 Comments