Menu

A Separation – ఓ విడతీత

రాత్రి 12 గంటలు.
ఫేస్బుక్కుతో విసిగి..ఇహ పడుకుందాం అనుకుంటున్నా.. కానీ నిద్ర రావటం లేదు. ఏం చేయాలబ్బా.. సరే సినిమా చూద్దం కాసేపు..నిద్ర వచ్చేవరకు..  ఏదైనా..
దించుకున్న సినిమాల లిస్ట్ వెతుకుతుంటే కనిపించింది.
ఈ సినిమా ‘ దించుకొని’  చాలా రోజులైంది. ఒకటో రెండు సార్లు అలా  ముందుకీ వెనక్కీ తిప్పి చూసాను. ఎక్కడా చూడు ఓ ఇద్దరు ముగ్గురు మనుషు, ఓ ముసలాడూ  ఏవో మాటలూ ….సర్లే ఏదో ఓపికతో చూడాల్సిన  సినిమాలాగా ఉన్నది అని అనుకున్నాను. కానీ ఇది ఇంత గాఢత + సం క్లిష్టత + అర్థవంతం ఉన్న సినిమా అని  అప్పుడు తెలియలేదు.
నిజానికి కొన్ని సినిమాలు అలా ఉంటాయి. మొదలు పెట్టలేము..పెట్టి ఒక్క అయిదు నిముషాలు చూడగలిగితే ఇహ ఆపము..ఆసాతం చూడాల్సిందే ! అలాంటిదే ఈ సినిమా.. ప్రపంచంలో ప్రతిచోటా  పెళ్ళిళ్లవుతున్నాయ్ అంగరంగవైభవంగా.. అలాగే  విడాకులూ అవుతున్నాయి.
లోకంలో  ఎన్ని జంటలు విడిపోవటంలేదు రోజుకి ? అందులోని ఒక విడాకుల కథే  అయినా  ఇది విడాకుల కథ కాదు. దానివెనక ఉన్నజీవితాల కథ.

సమస్య అనేది ఓ సమస్య గా మొదలయినా కొన్ని సార్లు  అది తన స్వరూపం మార్చుకుంటూ ఉంటుంది. నిన్నటి సమస్య తీరింది అనుకుంటే  అది కొత్తసమస్యని తెచ్చిపెట్టవచ్చు. అది మొదటిదానికంటే బలమైనది ఉండవచ్చు. తీరిపోయిందిలే అనుకున్న సమస్య మరో రూపంలో ఎదురుపడవచ్చు. అన్నీ మన అంచనాలకీ..ఆక్షన్స్ కీ అందకుండా ఉంటాయి. ఎందుకంటే..మనమే కాదు సమస్యకి అవతలి వైపు కూడా మనుషులున్నప్పుడు  ఆ  ఉమ్మడి సమస్యకి ఇరువైపులా  ఉండే  ఆక్షన్ ..రియాక్షన్ ల వలన ఈ సమస్య చావదు.. అన్నింటినీ మించి టైం ఒకటుంది..దాన్నిమించి మన వ్యక్తిత్వం అనేది ఒకటుంటుంది కదా  వీటివల్లే సమస్య సమసిపోక కొత్తసమస్యలు తెస్తుంది.

 

నాదర్, సిమన్ ఓ జంట..పద్నాలుగేళ్ళ సంసారం.. వాళ్ళకో పదకొండేళ్ళ కూతురు తెర్మా . సిమన్ విడాకులకి దరఖాస్తు చేసుకుంటుంది. జడ్జ్ ప్రశ్నిస్తాడు .. 

ఏకారణాల వల్ల విడిపోవాలనుకుంటున్నారు ?

అంటే ఎలాంటివి. ??

అదే మిమ్మల్ని కొట్టటం కానీ ..మత్తుకి బానిస అవటంగానీ .. మిమ్మల్ని సరిగ్గా చూసుకోక పోవటం లాంటివి  ??

అదేం లేదు..అయన చాల మంచివారు.

మరి..ఎందుకు.. ?

కూతురి భవిష్యత్తుకోసం విదేశాలకి వెళ్లాలి.. వీసా వచ్చి ఆరునెల్లయింది.  మిగిలిన గడువు  నలభై రోజులే. రమ్మంటే రానుఅంటున్నాడు. అందుకే విడాకులు కావలని ఈ అర్జీ. ??

మీరు మీ ఆవిడ తో ఎందుకు వెళ్ళటం లేదు ??

మా నాన్నని విడిచి ఎక్కడీకీ వెళ్ళను. కావాలంటే ఆవిడని వెళ్లమనండి.

వాళ్లనాన్న ఇతన్ని గుర్తుపట్టడు. అయినా కూతురి భవిష్యత్తు ముఖ్యం కాదా.. !!

నేను ఆయన కొడుకుని, .నాన్నని వదలి ఎక్కడికీ వెళ్ళను. కావలంటే ఆవిడని వెళ్లమనండి.

మీ కూతురికి మంచి భవిష్యత్తు ఇక్కడ లేదంటారా ??  మీకూతురి వయసుని బట్టీ అమె మీతో రావలంటే..తండ్రి సమ్మతి అవసరం..

కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో నాకూతురి బవిష్యత్తు..??

ఏం ఇక్కడ పరిస్థితులకేమయ్యిందీ?? మీఇద్దరూ కలిసుంటేనే మీ కూతురికి భవిష్యత్తు. ఇహనించీ చిన్న విషయాలకి విడాకులకి రాకండి. ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళండి. కేసుకొట్టెసి పక్కన పడేసాడు జడ్జీ.!

( పాజ్…… అబ్బా ఏదో సోది వ్యవహారం లా ఉందే..అప్పుడేప్పుడో శోభన్ బాబు సినిమా చూస్తున్నానా..సరే  సినిమాటొగ్రఫీ  బావుంది కదా .. నిద్రవచ్చేదాకా చూద్దాం.. …..   ప్లే )

కేసు కొట్టేసినా అమెకి అతనితో కలిసి ఉండటం ఇష్టంలేదు..అందుకే  తన సామానుసర్ధుకుంది. ఏదేమైనా విడిగా ఉండటానికి.. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతోటానికి నిశ్చయించుకుంది.  కూతురు చదువుకుంటోంది. వాళ్లాయన తన పనిలో తానున్నాడు. సర్దుకొని మామగారి దగ్గరికి వచ్చింది. ఆయన ముదుసలి. అల్జీమర్స్  రోగగ్రస్తుడు. అతి కష్టంగా కదులుతాడు. మతిమరుపు.మాటలూ అంతంత మాత్రమే.అతన్ని చూసుకోటానికి ఒక మనిషికావలసిందే.దగ్గరకూరొచి వెళ్ళొస్తా అన్నది. శరీరం వడలిపోయినా.. మాటలు రాకున్నా.. మనసుకి తెలుసుకదా . కోడలు ఇల్లొదిలి వెళ్ళిపోతోందని. అందుకే చెయ్యి పట్టుకున్నాడు వెళ్లవద్దు అన్నట్టూ.  కానీ  ‘ మనసు విరిగెనేని మరియంట నేర్చునా ‘ ..  ఆమె నిర్ణయించుకున్నాక ఎవరి తరం ఆపటం ???

వెళ్ళేముందు మామ గారిని చూసుకోటానికి తెలిసినావిడకి తెలిసినావిడని పిలిపించింది. వాళ్లాయన అమెతో బేరం కుదిర్చాడు.  కూతురుని తనతో వస్తావా అని అడిగింది. సమాధానం లేదు. సరే బై అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక్కడ సమస్య మనస్పర్థలూ..విడాకులూ.. అనుకుంటాము. కానీ……..

తెల్లారి ఆ పనావిడ తన కూతురితో పాటు వస్తుంది..ముసలాయన్ని చూసుకోటానికి. ఇహ అప్పటి నించీ కథ రసపట్టులోకి మారుతుంది. ముసలాయన సేవ చేసిన మొదటిరోజే.. నావల్ల కాదు ఈ పని అనుకుంది. ఇహ రానని చెప్పింది. కానీ డబ్బు చాలా అవసరం. అదీ కాక వాళ్ళాయన పనీ పాట లేక ఊరునిండా అప్పులు చేసున్నాడు. అవి తీర్చకుంటే జైలే గతి. అందుకే ఆయనకి తెలియకుండా  ఈ పనికి ఒప్పుకున్నది.  ముందు తన భర్తని పనిలో పెట్టుకోండి అన్నది.. సరే ఆయన్ని కలవమని చెప్పు అంటే.. సరే నేనయితే రోపొస్తాను.. వేరేవాళ్లని మాత్రం పెట్టుకోకండి అని వెళ్ళిపోయింది. అదేంటో… డబ్బుల్లేనోడికే ఆత్మాభిమానం మెండుగా ఉంటుంది కానీ  దాన్ని చంపుకుంటే తప్ప డబ్బులు రావు.

రెండో రోజు  తానింటిపనిలో కూతురు ముసలాయన ఆక్సీజన్ సిలిండరో ఆడుకుంటుంది.. పెంచుతోంది తగ్గిస్తోంది. దానికి తగ్గట్టు ముసలాయన.. ఊపిరి పీలుస్తున్నాడు..తగ్గిస్తున్నాడు. టెన్షన్…చస్తాడా పాపం ముసలాయాన.. (ఈ పిచ్చిపిల్ల దాంతో ఆటలేమిటి. వాళ్లమ్మ రాదేం ఒక్కటి పీకదేం) ..  ఆక్సీజన్ పూర్తిగా తగ్గించింది… ముసలాయన కళ్ళు పెద్దగా తెరిచి ఏదో అన్నాడు . పిల్ల కంగారుపడి మామూలుగా పెట్టి హాయ్ అని వెళ్ళింది. తెరమీద సీన్ మారింది.వాళ్లమ్మ ఏదో పనిలో బిజీగా ఉన్నది.
(ముసలాయన బతికున్నాడా..  చనిపోయాడా అర్థం కావటంలేదు ) . తనపనిలో తానున్న అమ్మతో  ” అమ్మా ముసలాయన కనిపించటం లేదు ‘  బాత్రూంలో చూడూ…..ఉండడు.  వెతికితే రోడ్డుపక్కన న్యూస్ పేపర్ షాప్ ముందు ఉన్నాడు. విపరీతమైన ట్రాఫిక్.. మసలాయన రోడ్డు దాటుతున్నాడు. ఇటువైపు పనిమనిషి..అటూ ఇటూ వేగంగా వెళ్తున్న కార్లూ..ఎక్కడ కారు డీకొడుతుందో ముసలాయన్ని అనే కంగారు పనిమనిషిది..

( ఆమె కన్నా ముందు మనది..  టెన్షన్.. టెన్షన్.. టెన్షన్…………………….నెక్శ్ట్ సీన్ ప్లీజ్.. చూపించు..ముసలాయన బతికే ఉన్నాడన్న విషయంచూపించు..అయ్యా చూపించయ్య.. ఆ చూపించావా..కూల్…హమ్మయ్య బతికే ఉన్నాడు ముసలాయన.. )

 అసలు ఏ క్షణానికి మనం ఏం చేస్తామో మనకి తెలుసా ?? తెలుస్తుందా ??  తెలిసినా అది తరవాత గుర్తుంటూందా ? మనం చేసే ఆక్షన్లన్నీ మన చేతిలో ఉంటాయా ?? ఉంటాయనుకొనే చేస్తామా.. ఒకటనుకొని ఒకటి చేయొచ్చు. అసలేం అనుకోకుండా కూడా చేయొచ్చు. ఒక నిర్ణయం ఎందుకుతీసుకున్నామో కారణాలు సరిగ్గా మనకి తెలియవు కదా !!

మూడోనాడు నాదర్ ఇంటికొచ్చేసరికి  తలుపు తాళం వేసుంది … తండ్రీకూతుళ్ళు పిలిచి పిలిచీ విసిగి మారు తాళం చెవితో తలుపు తీసి లోపలికెళ్తే ఏముంది..  ముసలాయన మంచంమీదనించి కిందపడిపోయి ఉన్నాడు. చేతి మంచానికి  కట్టివేయబడి ఉన్నది.. మంచం దిగటానికి వీలులేనట్టుగా.. పోయాడనే అనుకుంటారు. కానీ మెల్లిగా కళ్లు తెరుస్తాడు. ఇదీ పనావిడ నిర్వాకం. తండ్రిని చూసుకో అని జీతమిచ్చి పెట్టుకుంటే.. మంచానికి కట్టేసి  ఎటో వెళ్ళిపోయింది.. అదీగాక రూంలో పెట్టిన  డబ్బులు కూడా లేవు. ఆమె రోజువారీ జీతానికి సరిపడా మొత్తం మాయం అయ్యింది.

పనిమనిషికాదు దొంగమనిషి అని మనం అనుకునే లోపే  ఆ పనిమనిషి , కూతురూ  వస్తుంది. తండ్రికోసమే కదా దేశం విడిచి పోనిది. పెళ్లానికి దూరం అయ్యింది.. పనిమనిషిని పెట్టుకున్నది. మరి కాసేపు ఆలస్యం అయ్యుంటే తండ్రితనకి దక్కేవాడుకాదుగా.. అందుకే ఆకోపం లో పనిమనిషిని తిట్టాడు. అత్యవసర పనిమీద వెళ్లాను అంటుంది. నిన్ను అత్యవసరంగా పెట్టుకున్నది మేము. మా పని వదిలేసి అత్యవసరపనులకి వెళ్లావా.. అదీకాక డబ్బుకూడా దొంగతనం చేశావ్. ఇహ దయచేయ్ అని నాదర్ విరుచుకు పడతాడు ఆమెమీద..

నిన్న ఇల్లొదిలి రోడ్డుమీదకెళ్లాడు ముసలాయన. అందుకే కట్టేసింసుంటుంది అని మనకి తెలుసు. కానీ ఆ విషయం చెప్పదు. ఎందుకూ అంటే.. ఏమో ఆమెకి అది చెప్పాల్సిన విషయంకాదు. చెప్పినా దానికి విలువలేదు. ఎందుకంటే..ముసయాలన్ని వదిలి వెళ్ళొద్దు..   కట్టేసి వెళ్లటం అనేది పరమ తప్పు అంతే!   తనకి అర్జంట్ పని ఉన్నది అందికే ఓ పదినిముషాల్లో వెల్లొస్తా అనుకున్నది. కానీ వచ్చేసరికి ఇలా వీళ్లొస్తారని అనుకోలేదు. అదిగాక దొంగతనం అంటగట్టారు. అసలు  తను ఎంతటి  పాపభీతితో వ్యవహరిస్తుంది ?? అలాంటిది తనని దొంగతనం అంటగట్టాడు.  దొంగతనంచేశావు  అనే మాట ఆమె హృదయానికి పెద్ద దెబ్బ.

నేను వెళ్లినమాట వాస్తవం..మీ తండ్రి పడుకునే సమయం అని వెళ్లాను. కానీ దొంగతనం మాత్రం చేయలేదు. ఖరాఖండిగా .. బాధగా..దీనంగా చెపుతోంది..  ఆ వాగ్వివాదంలో…ఆమెని  బయటికి గెంటేసి తలుపేశాడు.
అంతా బానే ఉన్నది.  ఇప్పుడు సమస్య ఏమిటీ అంటె తండ్రిని చూసుకోటానికి ఒక మనిషికావాలి అంతే కదా!   కానీ సమస్య అది కాదు.. సమస్య తన  రూపం మార్చుకున్నది.

ముసలాయిన్ని ఎక్కడ వదలాలో తెలియక వెంటతీసుకొని బయలుదేరుతాడు. కూతురిని అమ్మమ్మ ఇంట్ళో వదులుదామని వెళ్ళగానే.. అమ్మనిన్నుకూడా రమ్మంటోంది. ఏదో ముఖ్యవిషయమట అంటుంది కూతురు తెర్మా.

వెళ్ళగానే ……. నిన్న పనిమనిషిగో గొడవయ్యిందట ?

అవును.. ఎవరుచెప్పారు.

ఆమెని తీసుకొచ్చినావిడ, వాళ్ళ వదిన

ఆ పనినిషి సిగ్గులేనిది.

గొడవఎందుకయ్యింది.

ముసలాయన్ని కట్టేసి బయటికివెళ్ళింది.. మంచం మీది నించి పడ్డాడు..కొంచంలేటయితే నాన్న దక్కేవాడు కాదు ..

ఎక్కడికెళ్ళింది ?

నాకేం తెలుసు..

నీవు కొట్టావని చెప్పింది..

నేనా.. నేను బయటికి గెంటేశానంతే..

ఏమో కానీ ఆమె హాస్పిటల్లోఉన్నదిట..చస్తే కారణం మీరే అని తిట్టిపోసోంది వాళ్లవదిన.

ఏ హాస్పిటల్ ??

సమస్య రూపం మారుతోంది..తీవ్రమవుతోంది..ఒక గోప్యత మొదలైంది.. చూసేవాళ్లకి ఉత్సుకత కలగకుండా ఉంటూందా ??

హాస్పిటల్లో పరామర్శించటానికి వెళ్తే..
అతను ఇదివరకు నాదర్నికలిసినవాడే  పనికోసం. ఆ పనిమనిషేగా తన భర్త పనిచేస్తాడు మిమ్మల్ని కలుస్తాడు అని పంపించింది.  అప్పుడు నాదర్ ఈతని భార్య తనింట్లో పనిచేస్తున్నట్టు చెప్పడు. చెప్పకూడదని కాదు..అవసరం లేదు. కానీ ఇప్పుడు..
నాభార్య మీకెలా తెలుసు??
మా ఇంట్లోనే పనిచేస్తోంది..
నా భార్యమీ ఇంట్ళో పనిచేస్తోందని నేను మీ దగ్గర పనికోసం వచ్చినపుడు ఎందుకు చెప్పలేదు ??
మీ భార్య మీకు చెప్పుంటుందని అనుకున్నా.. ఇతను నా భార్యనితోసేసాడు కదా.. అని వదిన్ని అడుగుతాడు.
మనం బయటికివెళ్ళి మాట్లాడుకుందాం.. అని అతన్ని తీసుకొని పోతోంటే..  ప్రస్త్రేషన్ కోపం కలిసి నాదర్ మీద చేయి చేసుకో చూస్తాడు. అతనెందుకంత ఆవేశ పడుతున్నాడో నాదర్ కి అర్థం కాదు..మధలో అడ్డొచ్చిన సిమిన్ కి కొద్దిగా తగులుతుంది..

 

ఇక్కడ  అసలు విషయం ఏంటంటే  గెంటేసిన కారణంగా పనిమనిషికి గర్బంపోయి పసిగుడ్డు మరణించింది.

  ( సమస్య మరోకోణంలోకి వెళ్తోంది కదూ ..)

కేసుపైలయ్యింది.. జడ్జ్ పిలిచాడు ఇరువైపులనీ..

నీమీద కేసుపెట్టాడు తెలుసుగా.. ఎందుకో ?

తెలిసాక బాధపడ్డాను.హాస్పిటల్ కి వెళ్ళాను.

అంటే గెంటేసావని ఒప్పుకున్నట్టేగా. హాస్పిటల్ కి వెళ్ళాక తెలిసింది అసలు విషయం.

కడుపులో ఉన్నది నాలుగున్నర నెలలు నిండిన పిల్లాడు..అంటే ఇది మర్డర్ కేసు……..

కొంచం రఫ్ గా వ్యవహరించిన మాటనిజమే కానీ..అమెని గెంటాలనీ .. ఇలా అవుతుందని అనుకోలేదు.బయటికి వెళ్లమని చెప్పాను..వెళ్లకపోతే లాక్కెళ్ళి బయటికి తోసి తలుపేశాను.

నీవు తోసేస్తేనే కదా నేను మెట్లమీద పడింది.

అమె గర్బవతి అని తెలిస్తే అసలు తోసేవాడిని కాదు..

తెలీదా.. మనిషిని చూస్తే గర్బవతి అని తెలిదా ?

నేను అంతపరీక్షగా చూసిందెక్కడ ?? ముసుగులో కనపడితే ఎలాతెలుస్తుంది..

నేను వాళ్ల కూతురు ట్యూటర్తో  నేను గర్బవతిని అని చెపుతుండగా ఈయనా ..ఈయన కూతురు విన్నారు.

మీరేదో మాట్లాడుకుంటుంటే..నేనెందుకు వింటాను..నేను పట్టించుకొలేదు..

నన్ను జబ్బపట్టుకొని బయటికి ఈడ్చాడు.

అర్రే.. ముసలాయన్ని చూసుకోవటానికి పెట్టుకుంటే .. వచ్చేసరికి మంచానికి కట్టెసి ఎటో వెళ్ళి పోయింది. ముసలాయన మంచం మీదనుండీ కిందపడీ చావుబతుకుల మధ్య ఉన్నాడు. నేను కొద్దిసేపు ఆలస్యం అయితే ఏమయ్యేదో.. డబ్బుకూడా మాయం అయ్యైంది. అందుకే ఆకోపంలో వేళ్లూ వెళ్ళూ అంటే ఎంతకీ వెళ్ళకపోతే  బటికి నెట్టాను. కిందపడేట్టూగా మాత్రం కాదు.

ఏమ్మా  ముసలాయన్ని కట్టేసావా ???

ఇప్పుడు ‘తప్పు’  ఇటువైపు వచ్చేసింది.. సమస్య ఒకటే..తప్పెవరిదీ..ఇదే దోబూచులాట…కథ  రసపట్టుకోకి వెళ్తుంది.
( పాజ్ …….కాఫీ కావాలి.  బటన్నొక్కి కాఫీకలుపుకొని వచ్చాను.  సమయం ఉదయం 1 గంటలు
కాఫీచప్పరిస్తూ..అప్పుడప్పుడు  చప్పరించటం ఆపేసి…తెగ ఆసక్తి తో చూసాను సినిమా……రెండుకప్పులకాఫీ తోడుగా.. )

ఇద్దరు వ్యక్తులు గొడవపడీతే  నీది తప్పు అంటే నీది అని అనుకుంటూ ఉంటారు.  నిజానికి అక్కడ ఒకరిదే తప్పుండొచ్చు.లేదా  ఇద్దరిదీ తప్పు ఉండవచ్చు. ఇద్దరిదీ ఉండకపోవచ్చు.యాదృచ్చికంగా ఏదో జరిగింది. కానీ ఇద్దరిలో ఏవరిదో ఒకరిది తప్పు కాక తప్పదు.   కానీ వాళ్ళు తమ తప్పు కాదని వాదించుకుంటారు.  వాళ్లు తప్పు చేయకపోయుండవచ్చు..కానీ చేసింది తప్పవుతుంది. ……..సర్లే కాఫీ తాగావుతా మిగతా కథచెప్పు అంటారా..

నిజానికి చెప్పాలనే ఉన్నది. కానీ చెప్పలేక పోతున్నా.. నేను చాలా  కష్టపడుతున్నా.. కథ రాద్దామని. మీకు చెపుదామని. కానీ ఇది రాయటానికి రాదు. రాయలేకపోతున్నాను. నా చాతకావటంలేదు.. ఎందుకంటే.. ప్రతి చిన్న విషయం అవసర విషయం. అదే డిటైల్.  సినిమా చూస్తంటే ప్రతి షాటూ ఏదో కాజువల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. దానికో అర్థం ఉన్నట్టు తోచదు. మాటలూ అతి సాదారణంగా అనిపిస్తాయి. ఏదీ   పెద్దవిషయం కాదన్నట్టు  అనిపించినా ఆ డిటైల్లో కథకి కావలసిన ఇన్పర్మేశన్ ఉంటుంది. అది చెప్పకుంటే మీకర్థం కాదు. చెపితే స్క్రీన్ప్లే అవుతుంది. పోనీ మొత్తం స్క్ర్ణీన్ప్లే రాసినా..  ఆ నటనలో..పాత్రల భావ వ్యక్తీకరణలో కొంత విషయం మిగిలి పోతుంది. అది ఇక్కడ రాయటానికి రాదు. మీరూహించలేరు.  కనక సినిమా చూస్తేనే తెలుస్తుంది.

చిన్నప్పుడు బడిలో వినేవాళ్ళం పొల్లుపోకుండా రాయి అనో.. పొల్లుపోకుండా చెప్పు అనో.. ఇదిగో పొల్లు పోకుండా తీసిన సినిమా ఇది !!  అందుకే బెస్ట్ పారిన్ ఫారిన్ సినిమాగా ఆస్కార్ ఇవ్వక తప్పలేదు.!! అదొక్కటే కాదు.. చాల సినిమాపండగల్లో చాలా అవార్డులు వచ్చాయి. నటీ నటులకీ, స్క్రీన్ ప్ల్రే కీ, దర్శకత్వానికీ,ఎడిటింగ్ కీ, సినిమాటొగ్రఫీకీ. … లిస్ట్ పెద్దది !

చివరి సన్నివేశం…

ఫామిలీ కోర్టు.. బయట కూతురు తెర్మా   కూర్చొని ఉంది. పెద్దయింది మునపటికంటే..  తండ్రి  నాదర్ వచ్చాడు లోపల్నించి. జడ్జ్ తీసుకొని రమ్మన్నాడు. తెర్మా లోపలికి వెళ్ళింది.

నీనిర్ణయం ఏమిటి ?  మీ తల్లిదండ్రులిద్దరూ నీవు ఎవరితో ఉండదలచుకున్నావో ఆ నిర్ణయం నీకే వదిలేసారు.  తండ్రితో ఉంటావో  తల్లితో ఉంటావో నిర్ణయించుకున్నవా ??

అవును..

నిర్ణయించుకున్నావా ?

అవును..నిర్ణయించుకున్నాను.

అయితే చెప్పు..

ఇప్పుడే చెప్పాలా ?

నీవు నిర్ణయించుకోకపోతే…

లేదు నిర్ణయించుకున్నా…

…….

మరి చెప్పు..

నిర్ణయించుకోలేదా.. ఇంకా..

నిర్ణయించుకున్నా..

ఒకే ..మీతల్లిదండ్రులని బయటకి వెళ్లమంటావా  ??

ఆ అవకాశం ఉందా ?
దయచేసి మీ ఇద్దరూ బయట వేచి ఉండండి. ఇద్దరూ బయటికి వచ్చారు…ఒకరికొకరు దూరంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు…
ఏం నిర్ణయించుకుని ఉంటుంది ??????????????????????????????????????????????????? 

                                                                                          ——————XXXXXXXXXXXXXXXXX——————–
( అర్రె ఏమిటి మీ కళ్లెంట నీళ్ళొస్తున్నాయ్.. ఆ చివరి సన్నివేషంలో ఆ  కూతురిని చూసా… సరే ఇది సినిమా… కళ్ళుతుడుచుకుంటా ..!! 😛 )
2 Comments
  1. Ramkumar Bharatam December 24, 2013 /
  2. Pavan K December 28, 2013 /